విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలోని అనాటమీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కళాశాల డిసెక్షన్ హాల్లో కాడవెరిక్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా, గౌరవప్రదమైన వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్. శంకర్, ప్రొఫెసర్ మరియు ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి, ఇన్చార్జి ప్రిన్సిపాల్, ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైద్య విద్యలో మృతదేహాల ప్రాధాన్యత ఎంతో గొప్పదని, మృతదేహాలే వైద్య విద్యార్థులకు తొలి గురువులని పేర్కొన్నారు. తమ దేహాలను వైద్య విద్య కోసం దానం చేసిన దాతల నిస్వార్థ సేవ, త్యాగం వెలకట్టలేనివని అన్నారు. ప్రతి వైద్య విద్యార్థి దాతలను జీవితాంతం గౌరవంతో స్మరించుకోవాలని, వారి త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు.అనంతరం అనాటమీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మరియు ఇన్చార్జి విభాగాధిపతి డాక్టర్ పద్మజ ఆధ్వర్యంలో అధ్యాపకులు డాక్టర్ నరేంద్ర నాయక్, డాక్టర్ షగీర్, డాక్టర్ ఆంజనేయబాబు నాయక్, డాక్టర్ భాను, డాక్టర్ భావన , పీజీ విద్యార్థులు కలిసి మృతదేహ దాతలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.


