జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రశాంతమైన వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ మా లక్ష్యము అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుత నవంబర్ 1వ తేదీ ఆదివారం ధర్మవరం మున్సిపాలిటీల పరిధిలో జరగనున్న పోలింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల భద్రతా విధుల కోసం సుమారు 1,500 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ గారు వివరించారు. పోలింగ్ కేంద్రాలను సాధారణ, సమస్యాత్మక (సెన్సిటివ్), అత్యంత సమస్యాత్మక (హైపర్ సెన్సిటివ్) కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సివిల్ పోలీసులతో పాటు ఏఆర్, స్పెషల్ పార్టీలు, ఏపీఎస్పీ బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక పోలీసు బృందాలు, రూట్ మొబైల్స్, 61 స్ట్రైకింగ్ ఫోర్సులతో నిరంతర గస్తీ, పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులను సైతం సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
ఎన్నికల నియమావళి అమలులో సెక్షన్ 163 పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్న నిబంధనలతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించినట్లు తెలిపారు.సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను మోహరించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని అరికట్టడంతో పాటు అక్రమ నగదు, మద్యం రవాణాను నియంత్రించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.అల్లర్లు సృష్టించినా, ఎన్నికలకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు..ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ఘర్షణలు లేదా అల్లర్లకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.ప్రజలు, ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు లేదా ఎన్నికల అక్రమాలు ఏవైనా దృష్టికి వస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లా పోలీసులకు సహకరించాలని ఎస్పీ గారు కోరారు.
ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం
- Advertisement -
RELATED ARTICLES


