ఇనుగంటివారిపేట జనసేన అభ్యర్థిని చలంచర్ల ధన రాజ్యలక్ష్మి ఆవేదన
విశాలాంధ్ర – సీతానగరం: రాజానగరం నియోజకవర్గంలో కూటమి పార్టీ పొత్తు ధర్మం పక్కనపెట్టి ఎన్నికల బరిలో దింపడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని సీతానగరం మండలం ఇనుగంటి వారి పేట జనసేన అభ్యర్థిని చలంచర్ల ధన రాజ్యలక్ష్మి సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరఫున తనకు బీఫార్మ్ ఇచ్చి ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంచారన్నారు. అయితే ఇనుగంటివారిపేటలోనే బిజెపి పార్టీ తరఫున బి ఫారం ఇచ్చి పోటీలో ఉంచారన్నారు. గ్రామంలో వైయస్సార్ పార్టీ తరఫున అభ్యర్థిపై కూటమి తరుపున జనసేన, బిజెపి అభ్యర్థులను ఉంచినా నాయకత్వం జోక్యం చేసుకోకుండా వదిలివేయటం శోచనీయమని ధన రాజ్యలక్ష్మి వాపోయారు. పైగా బిజెపి నాయకులు ఇనుగంటివారిపేట వచ్చి ప్రచారం చేస్తున్నా నాయకత్వం పట్టించుకోవడం లేదన్నారు. కూటమి నుంచి జనసేన, బిజెపి అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించడం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ పై గాజు గ్లాసు, కమలం పువ్వు రెండు గుర్తులతో ఒకే ఎంపీటీసీ స్థానానికి పోటీ పడటం గందరగోళానికి దారితీస్తుందన్నారు. నామినేషన్ సమయంలో కూటమి తరుపున జనసేన అభ్యర్థిగా ప్రకటించడంతోనే తాను ఎన్నికల బరిలో ఉన్నానని, బిజెపికి బీఫారం ఇచ్చి మరో అభ్యర్థిని ఎన్నికల బరిలో ఉంచినా ఎవరు పట్టించుకోకుండా వదిలివేయటమే కాకుండా బిజెపి నాయకులు ప్రచారం చేయటం తగదన్నారు. ఈ సమస్యను పరిష్కరించి కూటమి పార్టీ నాయకులు న్యాయం చేయాలని జనసేన ఎంపీటీసీ అభ్యర్థిని చలంచర్ల ధన రాజ్యలక్ష్మి కోరారు.


