విశాలాంధ్ర, అనంతపురం సిటీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను సమీక్షించే ప్రక్రియపై అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదా ప్రకారం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించబడ్డాయని ఆరోపించారు. బీహార్లో సుమారు 67 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 94 లక్షలు, తమిళనాడులో 74 లక్షలు, కేరళలో 9 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 48 లక్షల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. మరో 42 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.ఓటర్ల జాబితా సవరణపై ఎన్నికల సంఘం పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగించకుండా చర్యలు తీసుకోవాలని, రాజకీయ జోక్యానికి తావులేకుండా స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. వలస కార్మికులు, మైనారిటీలు సహా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి ఎన్నికల ప్రక్రియపై పూర్తి విశ్వాసం కల్పించేందుకు బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటరు వేసిన ఓటు తాను ఎంచుకున్న అభ్యర్థికే చేరిందనే నమ్మకం ప్రతి ఓటరులో ఉండాలని, ఓటు గోప్యతతో పాటు ఓట్ల లెక్కింపులోనూ పారదర్శకత అవసరమని అన్నారు.ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి ఓటర్ల జాబితాల సవరణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూ ప్రజల మధ్య విభజనకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పారిశ్రామికవేత్తల నుంచి భారీగా నిధులు సమీకరించి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు.
కరువుపై ప్రభుత్వం స్పందించాలి
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని రామకృష్ణ గుర్తుచేశారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో అనేక అంశాలపై చర్చించినప్పటికీ పేదలకు స్థలాల హామీపై చర్చించకపోవడం బాధాకరమన్నారు.రాష్ట్రంలోని దాదాపు 300 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని రామకృష్ణ అన్నారు. పశుగ్రాసం, తాగునీరు అందక ప్రజలు వలసలు వెళ్తున్నారని, అయినప్పటికీ ప్రజల సమస్యలపై కలెక్టర్ల సమావేశంలో చర్చించకపోవడం విచారకరమన్నారు. కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులను పరిశీలించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకమై పోరాడాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం సీపీఐ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ నెల 15న విజయవాడలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మేధావులు, రాజకీయ నిపుణులతో సీపీఐ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాతంత్రవాదులు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.జాఫర్, జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, కార్యదర్శివర్గ సభ్యులు కేశవరెడ్డి, పద్మావతి, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగామయ్య, నగర సహాయ కార్యదర్శి వి.కృష్ణుడు, జిల్లా సమితి సభ్యులు చాంద్భాష, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గాప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్నాయక్, నగర కార్యదర్శి సమీర్, నగర సహాయ కార్యదర్శి ఆఫన్, సీపీఐ నాయకులు ఖాజా, హరి తదితరులు పాల్గొన్నారు.


