Homeఆంధ్రప్రదేశ్చక్రపాణి మృతి ప్రజాస్వామ్య రంగానికి తీరని లోటు..

చక్రపాణి మృతి ప్రజాస్వామ్య రంగానికి తీరని లోటు..

- Advertisement -

ఆయన చమత్కారాన్ని గుర్తుచేసుకుంటూ సీపీఐ నేత కె. నారాయణ సంతాపం

మాజీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి మరణం పట్ల జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా డాక్ట‌ర్ కె. నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చక్రపాణి గారు అత్యంత గౌరవనీయులైన వ్యక్తి అని, రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన అందరి అభిమానాన్ని, గౌరవాన్ని పొందిన మహనీయులని ఆయన కొనియాడారు. చక్రపాణి గారికి తనపట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేదని నారాయణ గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా చక్రపాణి ఆప్యాయతను, చమత్కారాన్ని గుర్తుచేసే ఒక మధురమైన సంఘటనను నారాయణ మీడియాకు వివరించారు.”ఒకరోజు మధ్యాహ్నం చక్రపాణి గారు మా ఇంటి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేశారు. మా ఆవిడ వసుమతి ఫోన్ తీసి, నారాయణ ఉన్నాడా అని అడిగితే… ఉన్నారు, నిద్రపోతున్నారు, లేపుతానని చెప్పింది. దానికి ఆయన వెంటనే స్పందిస్తూ.. ‘వద్దమ్మా, వద్దు! కనీసం ఈ ఒక్క గంటైనా సమాజాన్ని ప్రశాంతంగా ఉండనీయమ్మా!’ అని చమత్కరించారట. నేను నిద్రలేచిన తర్వాత వ‌సుమ‌తి ఈ విషయం చెబుతూ, పెద్దాయన కూడా నీ నిరంతర సామాజిక కార్యకలాపాలపై సరదాగా వ్యాఖ్యానించారంటూ నన్ను ఆటపట్టించింది” అని నారాయణ పేర్కొన్నారు.
అంతేకాకుండా, మరుసటి రోజు ఒక కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డితో పాటు పలువురు మంత్రుల సమక్షంలో తామంతా కలిసినప్పుడు, చక్రపాణి గారే స్వయంగా ఈ చమత్కార సంఘటనను అందరికీ వివరించారని, దాంతో వైఎస్సార్‌తో సహా అక్కడున్న వారందరూ హాయిగా నవ్వుకున్నారని నారాయణ ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
సుమారు ఆరు నెలల క్రితం కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి తో కలిసి చక్రపాణి గారి నివాసానికి వెళ్లి పరామర్శించే అవకాశం కూడా తనకు లభించిందని ఆయన తెలిపారు. చక్రపాణి మరణం ప్రజాస్వామిక, ప్రజాజీవన రంగాలకు తీరని లోటని.. ఆయన తనపట్ల చూపిన ఆప్యాయతను, గౌరవాన్ని, హుందాతనాన్ని, చమత్కారాన్ని ఎప్పటికీ మరచిపోలేనని నారాయణ భావోద్వేగానికి లోనయ్యారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నారాయణ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు