విశాలాంధ్ర, హైదరాబాద్ : శ్రీలంకలోని కొలంబోలో అక్టోబర్ 28-29 తేదీల్లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ నిర్వహించిన “దక్షిణాసియాలో జనాభా మార్పు అనే అంశంపై ప్రతిష్టాత్మక సదస్సు జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య సంచాలకుల కార్యాలయానికి చెందిన జాతీయ వాహక జన్య వ్యాధుల నియంత్రణ కార్యక్రమం అదనపు సంచాలకులు (అడిషనల్ డైరెక్టర్) డాక్టర్ పద్మజ పాల్గొన్నారు. దక్షిణాసియాలో చోటుచేసుకుంటున్న జనాభా మార్పులు, వాటి ఆధారంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, సామాజిక భద్రతపై పడే ప్రభావాలపై చర్చించేందుకు ఈ సదస్సులో వివిధ దేశాల సీనియర్ ప్రభుత్వ అధికారులు, విధానకర్తలు, విద్యావేత్తలు, భాగస్వామ్య సంస్థలు, అంతర్జాతీయ నిపుణులు హాజరయ్యారు. ఈ రెండు రోజుల సదస్సులో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల వచ్చే ఆర్థిక సవాళ్లు, వయోధికుల ఆరోగ్య సంరక్షణకు వైద్య వ్యవస్థల సంసిద్ధత, కేర్ ఎకానమీ (సంరక్షణ రంగం), జనాభా పరిణామ క్రమంలో తీసుకోవాల్సిన ప్రాధాన్యతా విధానాలపై సమగ్రంగా చర్చించారు. డాక్టర్ పద్మజ భాగస్వామ్యం ద్వారా వైద్య ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, మారుతున్న జనాభా సవాళ్లను ఎదుర్కోవడంపై అంతర్జాతీయ అనుభవాలు, విధానపరమైన దృక్పథాలను పంచుకునే అవకాశం లభించింది. మారుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించేందుకు ఆధారాల ఆధారిత విధాన నిర్ణయం, అంతర్-విభాగాల సమన్వయం, సుదృఢమైన ఆరోగ్య వ్యవస్థలలో పెట్టుబడుల ప్రాముఖ్యతను ఈ చర్చలు స్పష్టం చేయనున్నాయి. జనాభా మార్పుల ద్వారా లభించే అవకాశాలను వినియోగించుకోవడంతో పాటు, వృద్ధాప్య జనాభా సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా జ్ఞాన మార్పిడిని ప్రోత్సహించడం, సమర్థవంతమైన విధానాల రూపకల్పనకు మద్దతు ఇవ్వడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం.
దక్షిణాసియా జనాభా మార్పు సదస్సులో పాల్గొన్న తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారిణి డా.పద్మజ
- Advertisement -
RELATED ARTICLES


