Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సి.ఎం. చేతులమీదుగా రాజారావుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు


విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్‌ : పెదతాడేపల్లి డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ బి. రాజారావుకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ఈ అవార్డును రాజారావు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాజారావు మాట్లాడుతూ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి డిజిటలైజ్‌డ్‌ క్లాస్‌ రూమ్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక విద్యలో పాఠశాలను, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడం, చైనాలో జరిగిన వరల్డ్‌ మెమోరీ ఛాంపియన్‌షిప్‌లో పాఠశాలకు చెందిన మధుకర్‌ 4వ ర్యాంకు సాధించడం, అబుదాబిలో జరిగిన ఇంటర్‌నేషనల్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌లో పాఠశాలకు చెందిన విద్యార్ధి శ్యామ్‌ దీపక్‌ భారత దేశానికి గోల్డ్‌ మెడల్‌ అందించడంతోపాటు 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడం, విద్యార్థులను సాంస్కృతిక క్రీడా రంగాల్లో ప్రోత్సహించడం ఫలితంగా తనకు ఈ అవార్డు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం తనకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎంపిక చేయడంతో తనపై ఇంకా మరింత బాధ్యత పెరిగిందన్నారు. తాను ఈ అవార్డు సాధించడంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. ఈ అవార్డు రావడానికి కృషి చేసిన అంబేద్కర్‌ గురుకుల పాఠశాల రాష్ట్ర సెక్రటరీ పవన్‌ మూర్తి, జిల్లా కోఆర్డినేటర్‌ వాసవి, జిల్లా విద్యాశాఖ అధికారి రమణ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.

సి.ఎం. చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకుంటున్నా అంబేద్కర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ బి. రాజారావు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img