Friday, September 30, 2022
Friday, September 30, 2022

అందరి చూపూ ధన్కర్‌ మీదే

అనుకున్నట్టే భారత ఉపరాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి, బెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్కర్‌ సునాయాసంగా విజయం సాధించారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు మాత్రమే ఉప రాష్ట్రపతిని ఎన్ను కోవడానికి అర్హులు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 34 మంది ఎంపీలు ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. మొత్తం 725 మంది ఎంపీలు ఓటు వేశారు. ఇద్దరు బీజేపీ ఎంపీలు సన్నీ డయాల్‌, సంజయ్‌ ధోటే అనారోగ్య కారణంగా ఓటు వేయలేదు. వీరిద్దరూ రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఓటు వేయలేదు. పార్లమెంటు ఉభయ సభల్లో కలిసి ఎన్‌.డి.ఎ.కు 441 మంది మద్దతు ఉంది. అయిదుగురు నామినేటెడ్‌ సభ్యులు కూడా ఎన్‌.డి.ఎ. అభ్యర్థి జగదీప్‌ ధన్కర్‌కు మద్దతిచ్చారు. బీజేయేతర పక్షాలైన బిజూ జనతాదళ్‌, వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌, బహుజన సమాజ్‌ వాది పార్టీ, తెలుగు దేశం, అకాలీదళ్‌, శివసేనలోని ఏక్‌నాథ్‌ షిండే వర్గ సభ్యుల మద్దతు కూడా కలిపితే ఎన్‌.డి.ఎ.కు అదనంగా మరో 81 మంది సభ్యుల దన్ను ఉంది. ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వాకు కాంగ్రెస్‌, డి.ఎం.కె., ఆర్‌.జె.డి., ఎన్‌.సి.పి., సమాజ్‌వాది పార్టీ మద్దతు ఉంది. జార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆల్వాకు మద్దతు ఇచ్చాయి. మనం అనుసరిస్తున్న విధానం ప్రకారం రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమైందే. కానీ ఉప రాష్ట్రపతి రాజ్యసభ ఉపాధ్యక్షులుగా కూడా ఉంటారు. అందువల్ల రాజ్యసభ నిర్వహణలో ఉపరాష్ట్రపతిగా ఉండే వారు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పుడు ఉపరాష్ట్రపతి సభా నిర్వహణ బాధ్యతతో పాటు సభలో అధికార ప్రతిపక్షాలకు మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించ వలసి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఏ పార్టీ అభ్యర్థి అయినా రాజ్యసభ అధ్యక్షుడిగా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మోదీ సర్కారు రాజ్యసభలో కూడా బిల్లులను గట్టెక్కించవలసి ఉంటుంది కనక రాజ్యసభ అధ్యక్షుడి పాత్ర కీలకమైందే అవుతుంది. రాజ్యసభ అధ్యక్షుడిగా వ్యవహరించేటప్పుడు తనను గెలిపించిన పక్షం అభిప్రాయాలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించరాదు. ఏ పక్షం వైపూ మొగ్గు చూపరాదు. రాజ్యసభను ఎగువసభ అంటాం కనక దాని గౌరవ మర్యాదలను పరిరక్షించవలసిన అవసరం కూడా ఉంటుంది. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌, జాకీర్‌ హుస్సేన్‌, వి.వి.గిరి, ఆర్‌.వెంకట్రామన్‌, కె.ఆర్‌. నారాయణన్‌, భైరాన్‌ సింగ్‌ షెఖావత్‌, హమీద్‌ అన్సారీ లాంటి దిగ్గజాలు రాజ్యసభ నిర్వహణలో చాలా హుందాగా వ్యవహరించారు. పదవీ విరమణ చేస్తున్న ఎం.వెంకయ్య నాయుడు కూడా అపవాదులు రాకుండా చాలావరకు జాగ్రత్త పడ్డారు. బీజేపీ అభ్యర్థులుగా బైరాన్‌ సింగ్‌ షెఖావత్‌, వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతులుగా వ్యవహరించారు. రాజ్యసభ నిర్వహణలో భైరాన్‌ సింగ్‌ షెఖావత్‌ ఎన్నదగిన పాత్ర పోషించారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో తమ మాటే నెగ్గాలన్న రీతిలో ప్రవర్తించిన సందర్భాల్లో తాను తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులోనూ ఆదర్శప్రాయంగా ఉండేట్టు వ్యవహరి స్తానని చెప్పేవారు. అలాగే ఉన్నారు కూడా. ఒకసారి అధికార, ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైనప్పుడు తాను ఏ పక్షం వేపు మొగ్గనని ప్రకటించడమే కాక అలాగే మసలుకున్నారు. షెఖావత్‌ బీజేపీ అభ్యర్థే అయినప్పటికీ ఒకసారి పార్లమెంటు సెంట్రల్‌ హాలులో మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరచిన సెక్యులర్‌ విధాన విశిష్టతను చాటి చెప్పారు. సెక్యులర్‌ వాదిగానే ప్రవర్తించారు. షెఖావత్‌ మరో అడుగు ముందుకు వేసి రాజ్యసభ పిటిషన్ల కమిటీకి ప్రజలు తమ అభ్యర్థనలను పంపిస్తే సభలో ఆ అంశాలు చర్చించడానికి అనువుగా ఉంటుందని చెప్పారు. అక్కడితో ఆగకుండా ఈ విజ్ఞప్తిని అన్ని ప్రధాన పత్రికలలో వ్యాపార ప్రకటన రూపంలో విడుదల చేయించి చరిత్ర సృష్టిం చారు. అంటే పార్లమెంటును ప్రజలకు చేరువ చేయడానికి షెఖావత్‌ ప్రయత్నిం చారు. పార్లమెంటరీ కమిటీల సభ్యులు ఇతర చోట్లకు విధి నిర్వహణలో భాగంగా పర్యటనలకు వెళ్తే లోకసభ, రాజ్యసభే వారి ప్రయాణ, వసతి ఖర్చులు భరించాలని కూడా షెఖావత్‌ ఆదేశించారు. ఆ సమయంలో లోకసభ స్పీకర్‌గా ఉన్న సోమనాథ్‌ చటర్జీ కూడా ఈ ప్రతిపాదనను ఆమోదించారు. పార్లమెంటు కార్యకలాపాలలో ప్రశ్నోత్తరాల సమయం చాలా విలువైంది. ఆ సందర్భంలోనే ప్రజా సమస్యలు పార్లమెంటు దృష్టికి వస్తాయి. మౌఖికంగా ప్రశ్న అడిగదలచిన సభ్యులు కనక ఆ సమయంలో సభలో లేకపోతే ఇతర సభ్యులు ఎవరైనా మూడు అనుబంధ ప్రశ్నలు అడగడానికి కూడా షెఖావత్‌ అవకాశం కల్పించారు. తదనుగుణంగా రాజ్యసభ నిబంధనలు మార్పించారు. ఈ నిర్ణయానికి సానుకూల ప్రభావం కనిపించింది. తరవాత లోకసభ కూడా ఇదే విధానాన్ని అనుసరించింది.
ధన్కర్‌ పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయనకు పార్లమెంటరీ కార్యకలాపాల గురించి క్షుణ్ణంగా తెలుసు కనక సభను దేశాభివృద్ధి సాధించడానికి అనువుగా నిర్వహించగలరన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి మోదీ వ్యక్తం చేశారు. అయితే ధన్కర్‌ బెంగాల్‌ గవర్నరుగా ఉన్న సమయంలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు కల్పించి వివాదాస్పదంగా తయార య్యారు. ధన్కర్‌ సంయమనం పాటించే వ్యక్తి కాదన్న విమర్శలు వచ్చాయి. గవర్నరుగా ఆయన ఉన్న రాజ్యాంగ పదవికి న్యాయం చేయలేదన్న విమర్శలకూ గురయ్యారు. బెంగాల్‌ ‘‘ఓ గ్యాస్‌ చేంబర్‌’’ అని ధన్కర్‌ చేసిన వ్యాఖ్య తీవ్ర అలజడి రేపింది. బెంగాల్‌ గవర్నర్‌కు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య మర్యాదపూర్వకమైన పలకరింపులు లేకుండా పోయాయి. దీనికి ధన్కర్‌ వ్యవహార సరళే ప్రధాన కారణం. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా కనిపించిన సందర్భాలూ ఉన్నాయి. ధన్కర్‌ స్వీకరించబోయే పదవిలో ఇప్పటిదాకా ఉన్న వెంకయ్య నాయుడుకు పార్లమెంటు సభ్యుడిగానూ విశేష అనుభవం ఉంది అయినా వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలు ఆమోదించేటప్పుడు ఓటింగుకు అనుమతించకపోవడం ఆయన పక్షపాత దృష్టికే నిదర్శనంగా నిలుస్తుంది. ఒక అంశంపై ఓటింగ్‌ జరగాలని సభ్యులు కోరితే సభాధ్యక్ష స్థానంలో ఉన్నవారు అంగీకరించవలసిందే. కానీ సభ గందరగోళంగా ఉన్నప్పుడూ ఆ రణగొణ ధ్వనుల మధ్యే మూజువాణి ఓటు పేరుతో బిల్లులను ఆమోదించేట్టు చేయడం రాజ్యసభ అధ్యక్షుడు అధికార పక్షానికి వంతపాడినట్టే లెక్క. ఓటింగుకు అనుమతించకపోవడంవల్ల కొందరు సభ్యులు వెంకయ్య నాయుడు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు.
హమీద్‌ అన్సారీ అయితే గందరగోళంగా ఉన్నప్పుడు బిల్లులను ఆమోదించ డానికి అనుమతించే వారు కాదు. వ్యవసాయ చట్టాలను ఆమోదింప చేసేటప్పుడు మోదీ సర్కారు చర్చలు, సంప్రదింపులు అన్న సూత్రాన్ని పాటించలేదు. అందుకే ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు ఉద్యమం చేశారు. ఆ తరవాత మోదీ ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించ వలసి వచ్చింది. సభలో సమగ్రమైన చర్చ లేకుండానే ఆమోదించేస్తున్నారని ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించవలసి వచ్చింది. ధన్కర్‌ ఎలాంటి వైఖరి అనుసరిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img