దేశంలో ప్రజాస్వామ్యం మంటగలుస్తోంది అని లండన్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దేశాన్ని అవ మానించడమే కనక ఆయనను లోకసభ నుంచి బహిష్కరిం చాలన్న అధికార పక్షమైన బీజేపీ సంకల్పం ఇంకా నెరవేర లేదు. అలాగే తాను లండన్‌లో చేసిన వ్యాఖ్యల మీద పార్లమెంటులోనే సమాధానం చెప్పాలన్న రాహుల్ ప్రయత్నమూ ఫలించలేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ 50 గంటలు ప్రశ్నించినా ఆ అంశంలో రాహుల్ పై ఇప్పటికీ ఏ కేసు దాఖలు కాలేదు. ఆయన ఇంటి దగ్గర రెండు రోజుల కిందే పోలీసులు మోహరించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కొంతమంది మహిళలు చేసిన ఫిర్యాదు గురించి రాహుల్ మాట్లాడినందుకు పోలీసులు మోహరించారు. తాజాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోదీ పేరుగల వారి మీద రాహుల్ గాంధీ 2019వ్యాఖ్యలు చేసినందుకు సూరత్ లోని ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు రెండేళ్ల శిక్ష విధించింది. అయితే ఆయన పైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా నెల రోజుల గడువిచ్చింది. ఆయనకు బెయిలు కూడా మంజూరు చేసింది. రాహుల్ గాంధీ పై కోర్టుకు వెళ్లి, ఆ కోర్టు విచారణ పూర్తి అయి ఆ కోర్టులోనూ ఇలాంటి తీర్పేవస్తే న్యాయపరంగా ఉన్న అవకాశాలు మూసుకుపోతే రాహుల్ గాంధీ జైలుకెళ్లాల్సి రావచ్చు. ఒక వేళ ఈ శిక్ష అనుభవించవలసివస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దు అవుతుంది. ఆరేళ్ల పాటు ఆయన పోటీ చేయడానికి వీలుండదు. అయితే అత్యుత్సాహపరుడు, సామాజిక కార్యకర్త, సుప్రీంకోర్టు న్యాయవాది అయిన వినీత్ జిందాల్ రాహుల్‌ను అనర్హుడిగా ప్రకటించాలని లోకసభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసేశారు. 2019 ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్ లో రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి గురించి మాట్లాడుతూ ‘‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ – ఇలా మోదీ ఇంటిపేరున్న వారందరూ దొంగలుగా ఎందుకుంటారని నా అనుమానం’’ అని రాహుల్ అన్నారు. ఈ విషయంలో ఆయన మీద గుజరాత్ లోని సూరత్ లో కేసు దాఖలైంది. సూరత్ ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్. హెచ్. వర్మ నాలుగు రోజుల కింద ఈ కేసులో విచారణ ముగించి గురువారం రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. రాహుల్‌కు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన సమయంలో మేజిస్ట్రేట్ హెచ్.హెచ్. వర్మ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. ఆయన ప్రధానంగా మూడు వ్యాఖ్యలు చేశారు. ఒకటి: సుప్రీంకోర్టు హితవు చెప్పినప్పటికీ రాహుల్ ప్రవర్తనలో మార్పు లేదు. రెండు: నిందితుడు పార్లమెంటు సభ్యుడు కనక ఆయన ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆ హోదాలోనే మాట్లాడతారు కనక ఆ ప్రభావం ప్రజల మీద ఉంటుంది. అందువల్ల ఆయన ఇతరులను అవమానించేలా మాట్లాడితే ఆ ప్రభావం నిశ్చితంగా ఉంటుంది. మూడు: ఇలాంటి పలుకుబడి గల వ్యక్తులకు తక్కువ మోతాదు శిక్ష విధిస్తే సమాజానికి తప్పుడు సందేశం అందుతుంది అన్నారు. ఆ కేసులో చాలా కాలం విచారణ ఆగిపోయింది. తరవాత హై కోర్టు నుంచి విచారణకు అనుమతి లభించింది.
సదరు కోర్టు కేవలం 20 నిమిషాలలోనే విచారణ పూర్తి చేసి రాహుల్ కు రెండేళ్ల శిక్ష విధించేసింది. సత్వర న్యాయం అంటే ఇదే కాబోలు. ఇది పరువునష్టం కేసు. ఇలాంటి కేసుల్లో అత్యధికంగా రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించవచ్చు. విచారణ జరిపిన న్యాయమూర్తి అత్యధిక శిక్ష విధించారు. అంతకన్నా ఎక్కువ శిక్ష విధించడానికి ఆయనకు అవకాశం లేదు మరి! అప్పీలు చేసుకోవడానికి శిక్ష విధించిన కోర్టు గడువు ఇచ్చింది కనక ఆ లోగా లోకసభ సభ్యుడిగా అనర్హుడయ్యే ప్రమాదం రాహుల్ గాంధీకి ఏమీ లేదు. ఈ అంశం మీద పై కోర్టుకు వెళ్లి పోరాడతామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. 2019లో కర్నాటకలో మాట్లాడుతూ మోదీ అన్న పేరు ఉన్న వారందరూ దొంగలే అని రాహుల్ గాంధీ అనడంపై సూరత్ శాసన సభ్యుడు పూర్ణేశ్ మోదీ కేసు దాఖలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు మోదీ వర్గం అంతటినీ అవమానించేలా ఉన్నాయని ఆయన వాదించారు. పూర్ణేశ్ ఒకప్పుడు గుజరాత్ లో మంత్రిగా కూడా ఉన్నారు. గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలోనూ ఆయన సూరత్ నుంచి మళ్లీ ఎన్నికయ్యారు.
ఈ కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తుతానికి తప్పు పట్టలేం. ఆ తీర్పులోని ఉచితానుచితాలపై కోర్టులో మాత్రమే తేలాలి. రాహుల్ గాంధీని ఏదో ఒక రకంగా భయపెట్టి, బెదిరించి తమదే పై చేయి అని నిరూపించుకోవడానికి బీజేపీ అగ్ర నాయకత్వం సకల ప్రయత్నాలూ చేస్తోంది. రాహుల్ గాంధీని చూస్తే పాలకపక్షానికి ఒక రకమైన భయం ఆవహించిందేమోనన్న అనుమానం కలుగుతోంది. మరోకోణం నుంచి చూస్తే ఏ రకమైన విమర్శలను సహించే లక్షణం అధికార పక్షానికి లేదు అని అడుగడుగునా రుజువు అవుతూనే ఉంది. మేజిస్ట్రేట్ వర్మ ఇచ్చిన తీర్పులో లోపాలు ఎన్నడం ఉన్నత న్యాయస్థానం మాత్రమే చేయగలిగిన పని. అయితే రెండేళ్ల అత్యధిక శిక్ష విధించడం మాత్రం ఆ మేజిస్ట్రేట్ విచక్షణకు సంబంధించిందే. ఈ కేసులో తీర్పు రావడమే ఆలస్యం బీజేపీ నాయకులు, భక్తులు చాలా క్రియాశీలురు అయిపోయారు. రాహుల్ గాంధీ మీద ఏదో ఓ చర్య తీసుకోవాలని ఆక్రోశిస్తున్నారు. ఈ ధోరణి దేశంలో నానాటికీ ఇతరుల మాటను వినిపించుకునే తత్వం తగ్గుతున్న వాస్తవానికి సంకేతం. గత కొన్నేళ్లుగా పెంచి పోషిస్తున్న విద్వేష ప్రచార ఫలితం ఇలాగే ఉండక తప్పదు. విద్వేషం అన్నమాట కేవలం ముస్లింలకు మాత్రమే వర్తించేది కాదు. అధికార పక్షాన్ని, ఆ పక్షం నాయకుడిని పల్లెత్తు మాట అన్నా సహించే స్వభావం బీజేపీ భక్తుల్లో మాయమై పోతోంది. ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉంటారనిపిస్తోంది. అంటే ప్రధాన ప్రత్యర్థి లేనందువల్ల అధికార పక్షం సంతృప్తి పడుతుందేమో చూడాలి. రాహుల్ గాంధీ లేవనెత్తుతున్న ఏ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండానే ఈ పార్లమెంటు సమావేశాలు ముగించాలన్న అధికారపక్ష వ్యూహానికి రాహుల్‌పై కోర్టు తీర్పు కూడా పరోక్షంగానైనా ఉపకరిస్తుందేమో! కొసమెరుపు ఏమిటంటే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ ప్రసంగంపై కేసు నమోదు చేయాలని ఓ బీజేపీ నాయకుడు పెట్టుకున్న అర్జీని వారణాసి కోర్టు తోసిపుచ్చింది.