Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

అఖండ భారత్‌ కల

మన ఇరుగుపొరుగున ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, టిబెట్‌, మైన్మార్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌, భూటాన్‌, ఇండియాలను కలిపి అఖండ భారత్‌ లేదా అఖండ హిందుస్థాన్‌ ఏర్పాటు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించిననాటి నుంచి కలలుకంటున్నారు. ఆ తర్వాత హిందుస్థాన్‌, హిందు రాష్ట్రగా ఇండియాను మార్చివేయాలని దాదాపు శతాబ్దికాలంగా కలవరిస్తున్నారు. కొందరు వ్యక్తులుగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు గానీ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు బ్రిటీష్‌ వలసపాలకులకు అనుగుణంగా నడచుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగంగా జనసంఫ్‌ును ఏర్పాటుచేశారు. ఇది ఒక రాజకీయపార్టీగా ఎదగలేదు. హిందూమత భావజాలాన్ని విస్తరించడంపై కేంద్రీకరించారు. గాంధీ సోషలిజం తమ భావజాలం అంటూ కొంతకాలం ప్రచారం చేసుకున్నారు. అనంతరం బీజేపీగా అవతరించి, క్రమంగా మిత, మత భావజాలంతో హిందువులను ఆకట్టుకొని, పరిపాలనకు సంబంధించి వాస్తవ విరుద్ధమైన విషయాలను ఏనాడు లేని స్థాయిలో ప్రచారం చేయడం ద్వారా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టడానికి ముందు ఏబీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిరది. అప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌ వాజ్‌పేయి ద్వారా తమ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు దుందుడుకుగా వ్యవహరించలేకపోయింది. మోదీ తొమ్మిదేళ్ల పాలనాకాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ విజృంభించింది. ఆ కాలంలో మత విభజనకు అన్నిరకాల చర్యలను మోదీ ప్రభుత్వ చేపట్టి ఆర్‌ఎస్‌ఎస్‌ ‘లక్ష్యాలను’ నెరవేర్చడానికి అనేక వ్యూహాలు పన్ని అమలు చేస్తున్నారు. మోదీ పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఏర్పడిరది. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు పూనుకున్న తరుణంలో 28 ప్రతిపక్షాలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడి లోకసభకు 2024లో జరగనున్న ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడిరచి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ దశలో అఖండ భారత్‌ను ఏర్పాటు చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌భగవత్‌ ప్రకటించారు. ప్రస్తుత యువతరం వృద్ధులయ్యేనాటికి అఖండ భారత్‌ ఏర్పాటు అవుతుందని అన్నారు. 1947లో వేరుగా వెళ్లిన వారంతా ఆనాడు తాము తప్పుచేశామని అనుకుంటున్నారని చెప్పారు. అంతేకాదు… ఇండియాను భారత్‌గానే గుర్తించాలని, ఇండియా పదాన్ని తాను ఇష్టపడనని కూడా అన్నారు. రాజ్యాంగంలోనూ ‘ఇండియా దటీజ్‌ భారత్‌’ అని ఉంది. భారత్‌ అనే పదం చాలకాలంగా వాడుకలోనే ఉంది. అంతర్జాతీయంగా భారత్‌కు గుర్తింపు ఉంది. 2023 చివరి నాటికి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన నాటినుంచి ఆందోళన చెందుతున్న మోదీ ప్రజల దృష్టి మళ్లించేందుకు అనేక అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అయితే ఇండియాను భారత్‌గా మార్చినప్పటికీ బీజేపీకి పెద్దగా ప్రయోజనం కలిగే అవకాశాలు లేవని పరిశీలకుల అంచనా. అత్యధిక రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి. జాత్యహంకార భావజాలం గల ఆర్‌ఎస్‌ఎస్‌…ఇండియా పదాన్ని సహించే పరిస్థితిలో లేదు. ఇండియాను భారత్‌గా మారిస్తే ‘మోదీ కీర్తి’ శాశ్వతంగా ఉంటుందని సంఫ్‌ుపరివార్‌ రెచ్చగొడుతోంది.
ఇండియాను భారత్‌గా మార్చేందుకుగాను గతంలో రెండుసార్లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దిల్లీలో నివసిస్తున్న వాణిజ్యవేత్త 2020లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌`1ని సవరించాలని పిటిషన్‌లో కోరారు. ఈ ఆర్టికల్‌లో ‘ఇండియా దటీజ్‌ భారత్‌ షల్‌ బి యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అని ఉంటుంది. గ్రీకు పదం ఇండిక నుంచి ఇండియా పదం వచ్చిందని, ఇండియా పదం మనదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించడం లేదని పిటిషన్‌దారు వాదించారు. పిటిషన్‌దారు బహుశా ఆర్‌ఎస్‌ఎస్‌ సంబంధంకలిగి ఉండవచ్చు. స్వాతంత్య్రం, రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్నవాళ్లు ఇలాంటి పిటిషన్‌ దాఖలుచేసే అవకాశం లేదు. ఈ పిటిషన్‌ను నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్‌బోబ్డే తిరస్కరించారు. రాజ్యాంగంలో ‘భారత్‌, ఇండియా అనే రెండుపేర్లు ఉన్నాయి. ఇప్పటికీ భారత్‌ అని పిలుస్తున్నారు కదా’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు 2016లో టిఎస్‌ ఠాకూర్‌ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ధర్మాసనం తమ ముందుకువచ్చిన పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాదు, పౌరుడు తనదేశాన్ని ఎలా పిలవాలన్న విషయాన్ని ఈ ధర్మాసనం నిర్ణయించలేదని స్పష్టంచేసింది. అయితే కనీసం లోకసభలో చర్చించి అందరి ఆమోదం పొందకుండానే నిరంకుశంగా నిర్ణయం తీసుకుని ప్రపంచదేశాలకు భారత్‌గా గుర్తించాలని సమాచారం పంపారు. 20 దేశాల శిఖరాగ్ర సభ దిల్లీలో జరగనున్న సందర్భంగా విదేశాల నేతలకు పంపిన ఆహ్వానంలో భారత్‌ ఆహ్వానిస్తున్నట్లు మోదీ ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని ఆకస్మికంగా ప్రకటించారు. కనీసం అజెండాను తెలియజేయలేదు. బహుశా ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా’ను తొలగించడానికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టవచ్చు. మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ నిర్ణయమైనా ఏకపక్షంగా తీసుకుంటూనే ఉన్నారు. అతి ముఖ్యమైన పెద్దనోట్ల రద్దు, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌, జీఎస్టీ అమలు, ప్రభుత్వరంగ సంస్థలను, ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం లాంటివి ఎవరితోనూ చర్చించకుండా ప్రకటించి నిరంకుశత్వబాటలో పయనిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత ‘అఖండ భారత్‌’ ఏర్పాటు ప్రకటన చేయడం మతవాదులను సంతృప్తి పరిచేందుకే కావచ్చు. ఎప్పుడో అనేక దేశాలు అఖండ భారత్‌గా ఉన్నాయన్న మాట నిజమేకావచ్చు. లేదా పుక్కిటి పురాణం కావచ్చు. ప్రపంచం ఎంతో మారిపోయింది. నేటి యువతరం అంతర్వుద్ధ వాతావరణాన్ని కోరుకోవడం లేదు. హిందూత్వం వేరు. హిందువులు వేరు అని తెలుసుకుంటున్నారు. అందువల్ల భగవత్‌గానీ, మోదీ, అమిత్‌షా గానీ అఖండ భారత్‌ ఏర్పాటును కలగనవలసిందే. వాస్తవవిరుద్ధమైన ఆలోచనను దేశప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img