Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

అణచివేత పరిష్కారం కాదు

ఇచ్చిన హామీని, చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే అలవాటు లేని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మార్గంలోనే ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి ప్రభుత్వం నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో అనేక అలవిమాలిన వాగ్దానాలు గుప్పించి వాటిని అమలు చేయలేక చతికల బడి వాగ్దానాన్ని అమలు చేయాలని ఆందోళన బాట పట్టిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఉక్కు పాదం మోపి, ఉద్యమాన్ని అణచివేస్తే సమస్య ఎంత మాత్రం పరిష్కారం కాదు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని (సిపిఎస్‌) రద్దు చేస్తానని జగన్‌ తన పాద యాత్ర సందర్భంగా వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని నెరవేరుస్తారని దాదాపు మూడేళ్లుగా ఎదురుచూసిన ఉద్యోగులు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి, సెప్టెంబరు 1న ఛలో విజయవాడ మిలియన్‌ మార్చ్‌ని చేపట్టడానికి  తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం తీవ్ర అణచివేత చర్యలు చేపట్టింది. ఉద్యోగ సంఘాల నాయకులను, ఉద్యోగులను వెతికి వెతికి పట్టుకొని పోలీసులు పోలీసు స్టేషన్లకు తరలించారు. బస్సులో ప్రయాణించే వారి కోసం తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఇళ్లకు వెళ్లి వందలాది మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి వారిని నిలువరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్‌ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడి ఉద్యోగులను అక్కడే కట్టడి చేసి రాష్ట్రమంతటా వందల మందిని అరెస్టు చేశారు. ఇదొక కొత్త వ్యూహం. ఇళ్లకు వెళ్లి రెండు, మూడుసార్లు నోటీసులు ఇవ్వటం, నిర్బంధాలు విధించడం అధికారం ఉంది కదా అని  నిరంకుశంగా వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడుతుంది. తమది ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రభుత్వమని ముఖ్యమంత్రి పదేపదే చెప్తున్న మాటలకు ఆచరణకు ఏమాత్రం పొంతనలేని వ్యవహారం ఇది. 
నిర్బంధకాండతో ఉద్యోగులను కట్టడి చేయడం, అరెస్టులు, బెదిరింపులు సాగిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు మిలియన్‌ మార్చ్‌ని సెప్టెంబరు 11 కు వాయిదా వేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఇంటి ముట్టడిని విరమించుకుంటున్నామని పిలుపిచ్చిన ఉద్యోగ సంఘాలు ప్రకటించడం పరిస్థితులు ఉద్రిక్తంగా మారకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు.  అంత మాత్రం చేత ఆందోళనను విరమించుకున్నట్లు కాదు. ఆందోళన చేపట్టడానికి ముందు ఆర్థిక మంత్రి, ఇతర మంత్రులు మూడుసార్లు చర్చలు జరిగినప్పటికీ సిపిఎస్‌ రద్దు సమస్య ఎటూ తేలకుండా ప్రతిష్ఠంభన నెలకొంది. 

సిపిఎస్‌ రద్దుచేసి పాత పెన్షన్‌పథకాన్ని (ఒపిఎస్‌) పునరుద్ధరిం చాలన్నది ఉద్యోగుల డిమాండ్‌. 2004 లో కొత్త పధకం నాటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాటినుండి ఉద్యోగులు కోరుతున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా పరిస్థితి కొనసాగుతోంది. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు పాలనలోనూ ఈ సమస్య ఆపరిష్కృతంగానే ఉన్నది. పిఆర్‌సి విషయంలోనూ సుదీర్ఘ కాలం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అప్పుడూ దమనకాండ సాగింది. అయినప్పటికీ చర్చల ద్వారానే సమస్య పరిష్కారమైంది. అప్పుడు ఉద్యోగుల సంఘాలతో ముఖ్యమంత్రి జగన్‌ చర్చించినట్టుగా ఇప్పుడు కూడా ఆయా సంఘాల నాయకులను చర్చలకు పిలిచి పరిష్కరించాలి. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట సమయంలోనూ ఏదో విధమైన పరిష్కారం పాలకులు చూపించాలి. ఉద్యోగుల ఒత్తిడి కారణంగా ఛత్తీస్‌ఘర్‌లోనూ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను అమలు చేస్తోంది. ఒపిఎస్‌కు బదులుగా గ్యారంటీ పెన్షన్‌ పథకాన్ని (జిపిఎస్‌) అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పే మాటలు ఉద్యోగులను ఎంత మాత్రం సంతృప్తిపరిచేవి కాదు. జీవితంలో అత్యధికభాగం ప్రభుత్వసర్వీసులో పనిచేసి పదవీ విరమణ తర్వాత భద్రమైన జీవనంకోసమే మొదటపెన్షన్‌ ప్రవేశపెట్టారు.
అయితే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వ పాలన ప్రారంభమైన నాటి నుండి ఉద్యోగుల, ప్రజల వ్యతిరేక విధానాలను దూకుడుగా అమలు చేస్తోంది. ఉదార విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు, అపార సంపన్నులకు అనుకూలంగా పని చేస్తోంది. తాను అమలు చేయడమేగాక రాష్ట్రాల మెడపై మోదీ కత్తిపెట్టి దేశమంతటా అమలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే విద్యుత్‌, విద్య, వైద్య సంస్కరణలు అమలు చేస్తూ ప్రజల జీవితాలలో కల్లోలం రేపుతున్నారు. ఈ విషయాలన్నీ సామాన్యులకు తెలియకపోయినా తెలిసిన రాష్ట్ర పాలకులు కేంద్రం నిర్ణయాలను నిలువరించడానికి గట్టిగా ప్రయత్నించాలి. కేంద్రాన్ని నిలదీసి అయినా ప్రజలకు, ఉద్యోగులకు హాని జరగకుండా చూడాలి. అప్పుడే అది ప్రజా రంజక పాలన అనిపించుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల సంస్థలను ప్రైవేటుపరం చేసి క్రమంగా ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేయడానికి అన్ని చర్యలూ చేపడుతున్నది. అదే దారి పడుతున్న రాష్ట్రాలు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటాయి. ప్రజా పోరాటాల పైన, ఉద్యోగుల ఆందోళనల పైన దమనకాండ సాగించి సమాజంలో కల్లోల పరిస్థితులను సృష్టిస్తే అంతిమంగా అలాంటి ప్రభుత్వాలకు ముప్పు తప్పదు. ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ పునరుద్ధరించాలి. తప్పనిసరిగా అమలు చేయవలసిన అవసరమున్న పథకాల రద్దు కూడని పని. ఉచితాల రద్దు పేరుతో ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే పాలకులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పకుండా ఉండరు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img