Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

అదానీపై పవార్‌ ప్రేమలో ఆంతర్యం ఏమిటో!

రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉండడం పరిపాటే. కానీ కళంకితుడైన గౌతం అదానీని శరద్‌ పవార్‌ సమర్థించడం కేవలం ఆయన వ్యక్తిగత వ్యవహారమో లేదా కేవలం ఆయన నాయకత్వంలోని నేషనలిస్టు పార్టీకి పరిమితమైన విషయమో కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శరద్‌ పవార్‌ హఠాత్తుగా అదానీ మీద ఉద్దేశ పూర్వకంగా దాడి చేస్తున్నారని ఆరోపించడం వైపరీత్యమే. అయితే పవార్‌ కు ఇలా హఠాత్తుగా దారి మార్చే అలవాటు ఇప్పటిది కాదు. ఇది ఆయన రాజకీయ చతురతలో భాగం. 2004లో సోనియా గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకున్నప్పుడు ఆమె విదేశీ మహిళ కనక భారత ప్రధానమంత్రి పదవికి అర్హురాలు కాదు అన్న దుమారం రేగింది. ఆ కారణంగానే శరద్‌ పవార్‌, పి.ఎ.సంగ్మ లాంటి వారు కాంగ్రెస్‌ కు రాజీనామా చేసి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేశారు. అయినా కొంత కాలానికే పవార్‌ కాంగ్రెస్‌ కు సన్నిహితంగా మెదలడం ప్రారంభించారు. కాంగ్రెస్‌ తో కలిసి పని చేయడం ఆయనకు అప్పుడు ఏ రకంగానూ అభ్యంతరకరం కాలేదు. అదానీకి మోసపూరిత వ్యాపార పద్ధతులను గట్టిగా వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలలో పవార్‌ నాయకత్వంలోని ఎన్‌.సి.పి. భాగస్వామ్యం కూడా ఉంది. కానీ అదానీ మీద దాడి చేయడం ఆపాలని మిగతా ప్రతిపక్షాలను ఆయన కోరారు. ప్రతిపక్షాలు పార్లమెంటులోనూ, వెలుపలా అదానీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే ఉన్నాయి. హిండెన్‌ బర్గ్‌ గురించి తెలియదంటూనే ఆ సంస్థ వెలువరించిన నివేదిక అదానీని అపఖ్యాతిపాలు చేయడానికే ఉద్దేశించిందని పవార్‌ ఎలా చెప్పగలరో! శరద్‌ పవార్‌ అదానీని వెనకేసుకు రావడంవల్ల బడా వ్యాపార వేత్తలతో ఆయన స్నేహం ఒక్కటే కారణం అనీ చెప్పలేం. 2024 ఎన్నికలలో ప్రతిపక్షాలన్నీ ఏకమై మోదీని గద్దె దించాలన్న ప్రయత్నాలకు పవార్‌ వైఖరి కచ్చితంగా అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇటీవల కొన్ని ప్రతిపక్ష కార్యకలాపాలకు పవార్‌ పార్టీ దూరంగా ఉండడం గమనించే వారికి పవార్‌ అడుగులు ఎటు పడ్తున్నాయో అవగాహన అయ్యే ఉంటుంది.
అదానీ వ్యవహారంపై అవసరానికి మించి ప్రతిపక్షాలు యాగీ చేశాయని ఎన్‌.డి.టి.వీ.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన చానల్‌ అదానీ అధ్వర్యంలోనే నడుస్తోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన రోజే పవార్‌ ఇంటర్వ్యూ ప్రసారం కావడమూ అనుమానాలకు తావిస్తోంది. పార్లమెంటులో ప్రతిపక్షాలు అదానీకి వ్యతిరేకంగా పట్టువిడుపులు లేని వైఖరి అనుసరించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. అదానీ గురించి ఆందోళన చేయడమూ ఆయనకు నచ్చినట్టు లేదు. ప్రతిపక్షాలు అవసరానికి మించి అదానీ మీద దాడి చేశాయని ఆయన అభిప్రాయం. పార్లమెంటు కార్యకలాపాలకు ఇదివరకు కూడా అంతరాయం కలిగింది కానీ ఈ సారి అది శ్రుతి మించిందని పవార్‌ అంటున్నారు. అంటే అదానీ అడ్డగోలు వ్యాపార పద్ధతులపై, అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించడానికి ప్రధానమంత్రితో ఉన్న సంబంధమే కారణం అన్న వాదనను కూడా పవార్‌ ఇప్పుడు అంగీకరిస్తున్నట్టు లేదు. అదానీ బండారం బయట పెట్టిన హిం డెన్‌ బర్గ్‌ సంస్థకు ఉన్న విశ్వసనీయతపై కూడా పవార్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక వేళ అదానీ పొరపాటు చేస్తే దర్యాప్తు జరగాల్సిందేనని అదే నోటితో పవార్‌ అన్నారు. అదానీ వ్యవహారం బయటపడ్డప్పటి నుంచి ప్రతిపక్షాలు ముక్త కంఠంతో కోరుతున్నది అదానీ కార్యకలాపాలపై దర్యాప్తు జరగాలనేగా. అంటే ఈ అంశంపై కూడా పవార్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టుంది. అదానీ వ్యవహారాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిన తరవాత సం యుక్త పార్లమెంటరీ కమిటీ అవసరం ఏమిటి అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందు టాటా, బిర్లా మీద దాడులు జరిగేవనీ ఇప్పుడు అదానీ, అంబానీ మీద ప్రతిపక్షాలు గురి పెట్టాయన్నది ఆయన భావన. ఎన్‌.డి.టీ.వీ.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్‌ పేరుగానీ, మరే రాజకీయ పార్టీ పేరుగానీ ఎత్తలేదు. పవార్‌ ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వవలసిన అగత్యం ఉందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అదానీ వ్యవహారంలో పవార్‌ అభిప్రాయం భిన్నమైంది కావచ్చు కానీ దీనివల్ల ప్రతిపక్ష ఐక్యతా యత్నాలకు విఘాతం ఏమీ ఉండకపోవచ్చు అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జై రాం రమేశ్‌ అన్నారు. ఒక వేళ భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడమే పవార్‌ లక్ష్యం అయి ఉంటే అదానీకి చెందిన ఎన్‌.డి.టీ.వీ. కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి ఉండే వారు కాదు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు జరుగుతున్న దర్యాప్తు బ్రహ్మాండం బద్దలయ్యే అంశాలు బయట పెడ్తుందన్న ఆశ ఎవరికీ లేదు. ఇలాంటి విషయాలలో ప్రభుత్వ సహకారం నామ మాత్రంగా కూడా ఉండదు. పెగాసస్‌ విషయంలో ఇలాగే జరిగింది. ప్రభుత్వం ఎంత మాత్రం సహకరించలేదని సాక్షాత్తు సుప్రీంకోర్టే తెలియజేసింది.
విచిత్రం ఏమిటంటే చట్టసభల సభ్యుడిగా 66 ఏళ్ల అనుభవం ఉన్న శరద్‌ పవార్‌ సంయుక్త పార్లమెంటరీ కమిటీ ప్రయోజనాన్నే తోసిపుచ్చేట్టు మాట్లాడుతున్నారు. అదానీ వ్యవహారం సామాన్య మానవులకు పట్టదని కూడా ఆయన అంటున్నారు. ఇదే మాట ప్రతిపక్షాల సమావేశాల్లో పాల్గొన్నప్పుడు పవార్‌ చెప్పి ఉండొచ్చు. బహిరంగంగా ఇంటర్వ్యూలో చెప్పడం ఆయన అసలు ఉద్దేశాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. పవార్‌ వైఖరి ప్రతిపక్షాలు లేవనెత్తిన అసలు సమస్యను తుస్సుమనిపించేదిగా ఉంది. ఇదీ ఆయన ఉద్దేశంపై ప్రశ్నలు లేవనెత్తక తప్పదు. పవార్‌ రాజకీయ వైఖరిలో మార్పు వస్తుందా లేదా ఇప్పుడే చెప్పలేక పోవచ్చు. జె.పి.సి. దర్యాప్తువల్ల ఉపయోగం పరిమితమైందే అయినా, ఆ దర్యాప్తు తరవాత ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎవరినీ శిక్షించే అవకాశం లేకపోయినా ఎవరినైనా పిలిపించి ప్రశ్నించే హక్కు, ఏ దస్తావేజునైనా పరిశీలించే హక్కు జె.పి.సి.కి ఉంటుందని పవార్‌ కు తెలియక కాదు. సుప్రీంకోర్టు ఆదేశించిన దర్యాప్తు అదానీ వ్యవహారంలో కీలకాంశం అయిన అదానీ-మోదీ-మధ్య సంబంధాలను బయట పెట్టలేదు. ఆ విషయం బయట పెట్టే అవకాశం జె.పి.సి. దర్యాప్తుకు ఉండేది. పవార్‌కు పారిశ్రామిక వేత్తలతో సాన్నిహిత్యం ఉండొచ్చు. కానీ ఆయన మాటలు ప్రతిపక్షాలు ఉమ్మడిగా లేవనెత్తుతున్న అదానీ వ్యవహారాన్ని నీరుగార్చేలా ఉన్నాయి. అంతిమంగా పవార్‌ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మసలు కుంటారని చెప్పలేం. కానీ తనకు సాన్నిహిత్యం ఉన్న పారిశ్రామిక వేత్తలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం అవుతూనే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img