Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

అదానీ కోసం మీడియాను తొక్కేస్తారా?

మోదీ మిత్రుడు ‘అదానీ ఆర్థిక చట్రం’లో తలెత్తిన తుఫాను ఇప్పట్లో తీరాన్ని దాటే పరిస్థితి గోచరించడం లేదు. ఈ ‘గాలిబుడగ కార్పొరేట్‌ అధినేత’కు దెబ్బమీద దెబ్బ పడు తోంది. తాజాగా అదానీహిండెన్‌బర్గ్‌ కేసుపై ఎలాంటి వార్తలు ప్రసారంచేయడం లేదా ప్రచురించకుండా మీడియాను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. విచిత్రమేమిటంటే, అదానీ కుంభకోణం వార్త వెలువడిన క్షణం నుంచి అదానీ గ్రూపు ఏకంగా 136 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ పెట్టుబడిని కోల్పోయింది. అంటే భారత మారకద్రవ్యంలో 11.26 లక్షల కోట్ల రూపాయల అదానీ ఆస్తి ఆవిరైందన్నమాట! అదానీ గ్రూపు స్టాక్‌ మార్కెట్‌ను మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై ఇటీవలకాలంలో మీడియా విపరీతంగా కవరేజ్‌ ఇస్తోంది. ఈ దేశానికీ, ఈ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం కంటే మీడియావార్తల వల్లనే అధికనష్టం వాటిల్లుతోందని మోదీ అదానీ మిత్రబృందం భావిస్తోంది. మాధ్యమాల భావస్వేచ్ఛపై మరో సారి కత్తి రaుళిపించడానికి చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు గండికొట్టినట్లే కన్పిస్తోంది. ఈ తరహా న్యాయవ్యవస్థ క్రియాశీలత ఆహ్వానించ దగినదే. ఎట్టిపరిస్థితుల్లోనూ కోర్టు వెనక్కి తగ్గదని భావించాలి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఎదుట ప్రముఖ న్యాయవాది ఎంఎల్‌ శర్మ ఈ పిటిషన్‌ గురించి చేసిన ప్రస్తావన వృథాప్రయాసగా మారింది. ‘మీడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఇంజక్షన్‌ను జారీ చేయడం లేదు’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ తనదైన శైలిలో స్పష్టంగా చెప్పారు. మోదీ, ఆయన కార్పొరేట్‌ మిత్ర బృందానికి ఇది మరో చెప్పదెబ్బ. షేర్లకు అతివిలువను అతికించి, భారీగా రుణాలను సేకరించి, లేనిది ఉన్నట్లుగా చూపించి, సరికొత్త హవాలాకు తెరతీసిన అదానీ గ్రూపు అక్రమాలు, అతని వ్యాపార సామ్రాజ్య డొల్లతనాన్ని 106 పేజీల నివేదికను హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నాటి నుంచి ఈనాటి వరకు ఆ సామ్రాజ్యపాలకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ విషయంలో మీడియా ఏ కోశాన అత్యుత్సాహం ప్రదర్శించడం లేదు. అమెరికాకు చెందిన పెట్టుబడుల సంస్థ హిండెన్‌బర్గ్‌ పరిశోధన పత్రాలను లోతుగా పరిశీలించిన మీదట రోజుకో కథనాన్ని మాత్రమే ప్రచురిస్తూ (లేదా ప్రసారం చేస్తూ) వున్నాయి. ప్రజాస్వామ్యంలో ఇదేమీ నేరం కాదు!
మీడియాను అడ్డుకోవడం, హిండెన్‌బర్గ్‌ తాటతీయడం…ఈ రెండే మోదీ`అదానీల ముందున్న ప్రస్తుత ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి ఒక పిటిషన్‌ను శర్మ, ఇంకో పిటిషన్‌ను మరో న్యాయవాది విశాల్‌ తివారీ దాఖలు చేశారు. మీడియాను అడ్డుకోవా లన్న వాదనతోపాటు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వ్యవస్థాపకులు నాథన్‌ ఆండర్సన్‌పైన, భారత్‌లోని అతని అనుయాయులపైన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టడానికి కేంద్ర హోంశాఖ, సెబీలను ఆదేశించాల్సిందిగా శర్మ తన పిటిషన్‌లో కోరడం అసహేతుకమే. అదే సమయంలో, హిండెన్‌బర్గ్‌ నివేదికపై విచారణకు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తివారీ తన పిటిషన్‌లో కోరారు. అయితే కమిటీ ఏర్పాటు విషయాన్ని వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం సమీప భవిష్యత్‌లో పరిస్థితులను బట్టి వ్యవహరించే అవకాశం లేకపోలేదు.
30 రోజుల్లో కోటీశ్వరుడిగా మారడమెలా? అనే పుస్తకాన్ని తలపించేలా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సంపన్నవంతుడు.. అదానీ గ్రూప్‌ పేరుతో అతితక్కువ కాలంలో ఎలా ‘అతిపెద్దమనిషి’ అయ్యాడో తెలియజేస్తూ జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన నాటినుంచి అత్యంత వేగవంతంగా అదానీ గ్రూప్‌ మార్కెట్‌ పతనమవుతూ వచ్చింది. అప్పటికి రూ.19.18 లక్షల కోట్ల మార్కెట్‌ పెట్టుబడిని కలిగివున్న గౌతమ్‌ అదానీ, ఫిబ్రవరి 24 నాటికి అంటే నెల రోజుల వ్యవధిలో రూ.7.15 లక్షల కోట్ల మార్కెట్‌కు పడి పోయారు. 7 కీలక లిస్టెడ్‌ కంపెనీలకు చెందిన 85శాతం పెట్టుబడి మార్కెట్‌ గాల్లో కలిసిపోయింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌లు 70శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 60శాతం, అదానీ విద్యుత్తు 46శాతం, అదానీ పోర్ట్స్‌, అదానీ విల్మార్‌, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ 25శాతంపైగా మార్కెట్‌ను కోల్పోయాయి. మొత్తంగా రూ.12.02 లక్షల కోట్ల మార్కెట్‌ పెట్టుబడులను కోల్పోయిన అదానీ ఆ నివేదికను గానీ, మీడియాను గానీ తప్పుపట్టి ఉండవచ్చు. కానీ ఆ నివేదిక నిజమని అదానీ పతనంతో నిగ్గుతేలిన మాట వాస్తవమే కదా! ఈ స్థాయి పతనమూ భారతదేశంలో ఒక రికార్డే! పైగా కొత్త ప్రాజెక్టుల్లో 90శాతం చేజారాయి. తోటి పెట్టుబడిదారులకు అదానీ ప్రతిరాత్రీ వేధించే ఓ పీడకలగా మారిపోయారు.
అదానీ ఈ దేశానికే పెనుముప్పు అని వామపక్షాలతోపాటు లౌకిక, ప్రజాస్వామ్య హితైషులు హితబోధ చేస్తూనే వున్నారు. అయినా ప్రభుత్వమూ, 90 శాతం రాజకీయ పార్టీలూ పట్టించుకోలేదు.. కార్పొరేట్‌ మీడియా కూడా పట్టించుకోలేదు. ఫలితాన్ని దేశ ప్రజలంతా అనుభవిస్తున్నారు. మోదీ అవినీతి, ఆశ్రితపక్షపాతం, పరమచెత్త ఆర్థిక విధానాల దుష్ఫలితమిది. అదానీ చెడిరది గాక ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ లాంటి సంస్థలనూ ముంచేశారు. 1955లో ప్రైవేటు బీమారంగంలో జరిగిన అక్రమాలను ప్రముఖ పార్లమెంటు సభ్యుడు, జర్నలిస్టు ఫిరోజ్‌ గాంధీ బయటపెట్టిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. దీన్ని సరిచేసుకోవడానికి ఆనాడు నెహ్రూ ప్రభుత్వం 250 ప్రైవేటు బీమా కంపెనీలను జాతీయం చేసి, ఎల్‌ఐసీగా ఏర్పాటుచేసే చట్టాన్ని తీసుకువచ్చారు. 1990లో దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన ఆర్థిక కుంభకోణాన్ని సీపీఐ పార్లమెంటు సభ్యుడు గురుదాస్‌ దాస్‌ గుప్తా వెలుగులోకి తీసుకువచ్చారు. స్టాక్‌మార్కెట్‌ను ముంచేసిన స్టాక్‌బ్రోకర్‌ హర్షద్‌ మెహతాపై విచారణ జరిపించడమే కాకుండా, మార్కెట్‌ నియమ నిబంధనలు సరిచేసి, జవాబుదారీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి నాటి ప్రధాని పీవీ నరసింహారావు చర్యలు చేపట్టారు. నెహ్రూ, పీవీలు ఎక్కడ? నేటి నరేంద్ర మోదీ ఎక్కడ? వీళ్ల మధ్య ఎంత తేడా? తప్పులను సరిచేయడానికి నాటి ప్రధానులు ప్రయత్నం చేయగా, నేటి ప్రధాని ఒక దగాకోరును వెనకేసుకువచ్చి, దేశ ప్రజలను నిలువెల్లా ముంచేశారు. పైగా మీడియా వాణిని తొక్కేయడానికి కుయుక్తిపన్నారు. సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించబట్టి పెనుముప్పు తప్పింది. లేకుంటే అదానీ ‘మంచి’పనులు మాధ్యమాల్లో వ్యక్తీకరించడానికి అవకాశం ఉండేదికాదు. మహోన్నత న్యాయస్థానం ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆశిద్దాం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img