Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

అదానీ నొక్కేసింది ఒక్క గొంతుకే

నాలుగైదు నెలలనుంచి అనుకుంటున్నట్టుగానే ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌ నడుపుతున్న ఎన్‌.డి.టీ.వీ. దేశంలోకెల్లా అత్యంత సంపన్నుడైన గౌతం అదానీ హస్తగతమైపోయింది. గౌతం అదానీ గణనీయమైన వాటాలు దొడ్డి దారిన కొని దొంగ దెబ్బ తీశారని ప్రణయ రాయ్‌ మొదలైన వారు చేసిన వాదనలన్నీ వీగిపోయాయి. గుత్త వ్యాపార సంస్థలు పత్రికల్లో పెట్టుబడిపెట్టి పెత్తనం చెలాయించడం కొత్తేమీ కాదు. స్వాతంత్య్రానంతరం త్వరలోనే ఈ ప్రక్రియ మొదలై పోయింది. అయితే రాంనాథ్‌ గోయెంకా నాయకత్వంలోని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థానం ఇంగ్లీషులోనే కాక అనేక భాషల్లో దినపత్రికలు, వారపత్రికలు నడిపింది. అయితే గోయెంకా మొదటి నుంచీ కాంగ్రెస్‌కు విరోధి కనక ఆయన నడిపే పత్రికలు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను అనునిత్యం నిలదీసేవి. ఈ క్రమంలో అంతూలే కుంభ కోణం, కమల అనే మహిళను అంగట్లో అమ్మడం, కువో చమురు వ్యాపారం మొదలైన వాటిని నిలదీసి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందనీ, ప్రజలవాణిగా కొనసాగుతోందని అనుకోవడానికి అవకాశం ఉండేది. టీవీ చానళ్ల యుగం ప్రారంభం అయిన తరవాత ప్రణయ్‌ రాయ్‌ ఆదర్శప్రాయంగా ఆ టీవీని నడిపారు. ఎన్‌.డి.టీ.వీ. ఇండియా అనే హిందీ టీవీతో పాటు మొత్తం మూడు టీవీ చానళ్లు సమర్థంగా నిర్వహించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత పెద్ద మీడియా సంస్థలన్నీ ప్రభుత్వానికి దాసోహం అన్నా ఎన్‌.డి.టీ.వీ. లాంటి గుప్పెడు మీడియా సంస్థలు మాత్రం నిటారుగా నిలబడగలిగాయి. అడుగడుగునా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగాయి. ముఖ్యంగా ఎన్‌.డి.టీ.వీ. ఇండియా హిందీచానల్‌ లో రవీశ్‌ కుమార్‌ హిందీ మాట్లాడే ప్రాంతాలలోని ప్రగతిశీల భావాలుగల వారిని ఆకట్టుకోగలిగారు. ఆయన వ్యవహారసరళి సహజంగానే మోదీకి ఊపిరాడనివ్వలేదు. అనేక సందర్భాలలో ఎన్‌.డి.టీ.వీ.లో పనిచేసే సిబ్బంది ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిజాన్ని నిరపేక్షంగా చాటడానికి ప్రయత్నించారు. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి ప్రభుత్వ వ్యతిరేక సమాచారం ప్రజలకు అందకుండా కట్టుదిట్టం చేసినప్పుడే పత్రికావ్యవస్థ గొంతు నొక్కేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమైంది. బిహార్‌ప్రెస్‌బిల్లు లాంటివి మీడియా గొంతు నులమడానికి ప్రయత్నించినవే. ఎలక్ట్రానిక్‌ మీడియా రంగప్రవేశం చేసిన తరవాత దాని శక్తి సామర్థ్యాలను సరిగ్గా అంచనా వేసి ప్రజానుకూల వ్యవస్థగా నడపడంలో ప్రణయ్‌ రాయ్‌ ఆయన సహచరులు నిరంతరం శ్రమించారు. ఇప్పటికీ అనేక టీవీ చానళ్లలో పని చేస్తున్న వారు మొదట ఎన్‌.డి.టీ.వీలో పనిచేసి మెళకువలు తెలుసుకున్న వారే. వారిలో కొందరు ప్లేటు మార్చి ప్రభుత్వానికి బాకాలుగా మారి ఇబ్బంది లేకుండా కాలం గడుపుతున్నవారూ ఉన్నారు. ప్రణయ్‌రాయ్‌లో లేని దూకుడు రవీశ్‌ కుమార్‌ ఎన్‌.డి.టీ.వీ. హిందీ చానల్‌ లో కనబర్చారు. కానీ ఎన్‌.డి.టీ.వీ. నిజాన్ని నిర్భయంగా చెప్పడాన్ని ఓ కళగా రూపొందించింది. రవీశ్‌కుమార్‌కు రామన్‌ మెగసెసే అవార్డు ఊరికే దక్కలేదు. ఇంత జరుగుతుంటే మోదీని ఆశ్రయించి లక్షల కోట్లు పోగేసుకున్న అంబానీ, అదానీ లాంటి కుబేరులు మిన్నకుంటారనుకోవడం అమాయకత్వమే అవుతుంది. అదానీ ఎన్‌.డి.టీ.వీ.ని స్వాధీనం చేసుకోవడంలో పరోక్షంగానైనా సరే అంబానీ పాత్ర ఉంది.
ఎన్‌.డి.టీ.వీ.ని సైతం గోదీ మీడియాలో భాగం చేయడానికి అదానీ రంగంలోకి దిగారు. మీడియా వ్యాపారంలో లాభాపేక్ష లేదని కూడా అదానీ నమ్మబలుకుతున్నారు. ఈ వ్యవహారం అంతా చూస్తే అసలైన పత్రికా రచనకు అవసానదశ వచ్చిందా అన్న సంశయాలు కలగడం సహజమే. మీడియా సంస్థలను పారిశ్రామికవేత్తలు స్వాధీనం చేసుకోవ డానికి ఎంత ప్రయత్నించినా ప్రజానుకూల పత్రికా రచనకు కాలం చెల్లిందని నిరాశపడవలసిన అగత్యం లేదు. గోదీ మీడియా వీర విహారం చేస్తున్న సమయంలోనూ వృత్తి ప్రమాణాలను కాపాడడానికి ప్రయత్నిస్తున్న వారు ఇంకా అనేక మంది మిగిలే ఉన్నారు. ఆ టీవీ చానళ్లు, ఇటీవలి కాలంలోనైతే సామాజిక మాధ్యమాల ద్వారా పత్రికా రచన విలువలను కాపాడే కలాలు, గళాలు మిగిలే ఉన్నాయి. మీడియా సంస్థలు బడా పెట్టుబడిదార్ల చేతిలో ఉన్నా సాహసించి ప్రజల గొంతును వినిపించిన చరిత్ర ఉన్న పత్రికా రచయితలు ఎప్పుడూ ఉన్నారు. సంపాదక వ్యవస్థ ధ్వంసం అయిన తరవాత కూడా తలెత్తి నిలబడడానికి ప్రయత్నించిన వారు, పోరుబాట వదలని వారు హిందీ, ఇంగ్లీషు మీడియాలోనే కాదు ప్రాంతీయ భాషల్లో కూడా అపారంగా ఉన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో కూరుకుపోతున్నస్థితిలో ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న ఆకాంక్ష ఉన్న వారు సంఖ్యాపరంగా తక్కువే కావొచ్చు. వారికి వచ్చే అవకాశాలూ అంతకన్నా తక్కువే అయిఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి అధికారంలో ఉన్న వారు యుద్ధం కొనసాగిస్తున్నప్పుడు ప్రజల తరఫున నిలబడాలన్న సంకల్పం ఉన్న పత్రికా రచయితలు చేతులు ముడుచుకుని కూర్చోరు. గతంలోనూ ఇది అనేక సార్లు రుజువు అయింది. ఈ యుద్ధంలో తమ కలాలను కరవాలాలుగా మార్చవలసిన అవసరాన్ని నిబద్ధ పత్రికా రచయితలు వదులుకోరు. తమ గొంతు మరింత బిగ్గరగా వినిపించడానికి ఎన్ని త్యాగాలైనా చేయడానికి సిద్ధపడతారు. పత్రికా స్వాతంత్య్రాన్ని పరిరక్షించడానికి ప్రజలగోడు వినిపించడానికి ఎప్పుడూ పత్రికా రచయితలే పోరాడారు తప్ప యాజమాన్యాలు పత్రికా స్వేచ్ఛ కోసం పాటుపడిన దాఖలాలు దుర్భిణీ వేసి వెతకితే తప్ప కనిపించవు. ఎన్‌.డి.టీ.వీ.ని ధనబలంతో అదానీ కొన్నప్పటికీ ఇందులో ఒక సానుకూలాంశం కూడా ఉంది. అందులో పని చేస్తున్న నిబద్ధ పత్రికా రచయితలకు ఒక రకంగా స్వేచ్ఛ లభించింది. వారు తలుచుకుంటే ఇక ముందు కూడా స్వేచ్ఛగా తమ వృత్తి కొనసాగించే అవకాశాలు ఉండకుండా పోవు. అయితే జనం పక్షాన నిలబడిన ఎన్‌.డి.టీ.వీ. లాంటి దుర్గాలు అదానీ దెబ్బకు కూలిపోయిన దశలో కొంత నిరాశకరమైన వాతావరణం ఏర్పడి ఉండొచ్చు.
స్వాతంత్య్రంకోసం జరిగిన పోరాటం పొడవునా పత్రికా రచయితలు విశిష్టమైన పాత్ర నిర్వహించారు. ఆ సంప్రదాయాన్ని పుణికి పుచ్చుకున్న వారికి ఇప్పటికీ కొదవలేదు. కారు చీకటిలో కూడా కాంతిపుంజాలుగా వెలిగిన పత్రికా రచయితలు ఇదివరకూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. అయితే నిరంకుశత్వాన్ని ఎదిరించడానికి పాటుపడే ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండాలనుకునే పత్రికా రచయితలు ఇక ముందు మరింత జాగరూకంగా ఉండక తప్పదు. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, షోయబుల్లా ఖాన్‌ లాంటి వారి త్యాగాలు గాలికి కొట్టుకుపోవు. ప్రత్యామ్నాయ పత్రికా రచనకు ఊపిరులూదే వారు ఉన్నారు. ఉంటారు. గుత్త పెట్టుబడిదార్లు ఒక్కో దీపాన్ని ఆర్పేస్తూ ఉంటే చిరు దివ్వెలు వెలిగించే వారు అంతకన్నా ఎక్కువ సంఖ్యలో పుట్టుకొస్తారనుకోవడం అత్యాశ కానక్కర్లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img