Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

అఫ్గాన్‌ మంత్రివర్గంపై ఐ.ఎస్‌.ఐ. ముద్ర

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించి అయిదారు రోజులైంది. అధికారం హస్త గతం చేసుకుని మూడు వారాలు దాటింది. చివరకు మంగళ వారంనాడు ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వం తాలిబన్లు ఇచ్చిన హామీలకు, చేసిన వాగ్దానాలకు బహుదూరంగా ఉంది. కరడుగట్టిన తీవ్రవాదులకు ప్రభుత్వంలో చోటు కల్పించారు. 2020లో దోహాలో చర్చలలో పాల్గొన్న వారికి ఈ ప్రభుత్వంలో చోటు దక్కలేదు. మహిళలెవరికీ ప్రాతినిధ్యం లేదు. మత రాజ్యాన్ని నడపడానికి కావలసిన అర్హతలు ఉన్న వారికి మాత్రం స్థానం దక్కింది. అన్నింటి కన్నా కొట్టొచ్చినట్టు కనిపించేది ఈ మంత్రివర్గంపై పాకిస్తాన్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. అఫ్గాన్‌ మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి ప్రయ త్నాలు ఆరంభం కాగానే పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐ.ఎస్‌.ఐ. అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫైజ్‌ హమీద్‌ కాబూల్‌లో గత మూడు రోజుల నుంచి బస చేశారు. మంత్రివర్గంలో ఉన్న వారందరూ పాకిస్తాన్‌కు అనుకూలమైన వారే. తాలిబన్లలో ఎక్కువ మంది పష్తూన్‌ జాతీయులే. అఫ్గానిస్థాన్‌ భిన్న జాతుల సమాహారం. వారిలో మంత్రివర్గంలో స్థానం దక్కిన వారి సంఖ్య చాలా స్వల్పం. ఈ మంత్రివర్గం ఏర్పాటు అమెరికాను కూడా విస్తుపోయేలా చేసింది. భారత్‌ దౌత్యవేత్తలతో తాలిబన్‌ నాయకులు ఇటీవల జరిపిన చర్చల ప్రభావం మంత్రివర్గ ఏర్పాటులో ఏ కోశానా కనిపించలేదు. తాలిబన్‌ అధికార ప్రతినిధి ప్రకటించిన వివరాలనుబట్టి చూస్తే ముల్లా మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ ఈ ప్రభుత్వానికి అధినేతగా ఉంటాడు. మత ప్రాతిపదికన ప్రభుత్వ కార్యకలాపాలను నడపడానికి ఆయన సమర్థుడు. అఫ్గాన్లు అధికారం హస్తగతం చేసుకున్న తరవాత ఇస్లామిక్‌ సూత్రాల ప్రకారం, షరియాకు అనుకూలంగా ప్రభుత్వ నిర్వహణ కోసం షూరా ఏర్పాటు చేశారు. అఖుంద్‌్‌ ఆ షూరాలో ప్రముఖుడే. భారత్‌ దృక్కోణం నుంచి చూస్తే ఆయన 2001లో బమియాన్‌లో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేయమని ఆదేశించిన వ్యక్తి. తాలిబన్లు చెప్తున్న దాని ప్రకారం ఇది తాత్కా లిక ప్రభుత్వమే. ఎప్పుడో ఒకప్పుడు నికరమైన ప్రభుత్వం ఏర్పడినా పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఉండే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు. ఖతర్‌లోని దోహాలో తాలిబన్ల కార్యాలయ నిర్వాహకుడు ముల్లా అబ్దుల్‌ ఘని బరాదర్‌ ప్రభుత్వానికి నాయకత్వం వహించవచ్చునని ముందు ఊహాగానాలు కొనసాగాయి. కాని ఇప్పుడు ఆయన ఉప ప్రధానమంత్రి పదవికి పరిమితం అయ్యారు. భారత్‌ దృష్టితో చూస్తే ఆందోళన పడవలసిన మరో అంశమూ ఉంది. అఫ్గాన్‌ మంత్రివర్గంలో కందహార్‌ కేంద్రంగా పని చేసే హక్కానీ నెట్వర్క్‌కు చెందిన చాలా మందికి మంత్రివర్గంలో స్థానం దక్కింది. అంతర్జాతీయ సమాజంతో సంబంధాల కోసం కృషి చేసిన దోహా బృందానికి, భారత్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించిన వారికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మంత్రివర్గంలో 33 మంది ఉంటే అందులో కనీసం 20 మంది కందహార్‌ కేంద్రంగా పని చేసే తాలిబన్‌ వర్గానికి చెందిన వారే. సిరాజుద్దీన్‌ హక్కానీని దేశీయాంగ మంత్రి (హోం మంత్రి)గా నియమించడం వల్ల పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో గ్రహించవచ్చు. సిరాజుద్దీన్‌ హక్కాని 2008లో కాబూల్‌ లోని భారత రాయబార కార్యాలయం మీద దాడికి, 2009, 2010లో భారత సంస్థలపై దాడికి బాధ్యుడు. సిరాజుద్దీన్‌ హక్కానీని అమెరికా విదేశాంగ శాఖ అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించింది. ఆయన ఆచూకీ తెలియజేసిన వారికి అయిదు మిలియన్‌ డాలర్ల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించింది. కాబూల్‌లో ఒక హోటల్‌పై దాడిలో కూడా ఆయన పాత్ర ఉంది. అఫ్గానిస్థాన్‌ సరిహద్దు ఆవలి నుంచి అఫ్గాన్‌లోని అమెరికా దళాల మీద, సంకీర్ణ వర్గాలవారి మీద దాడులకు ఆయనదే బాధ్యత. 2008లో అఫ్గాన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయ్‌ని హతమార్చడానికి జరిగిన ప్రయత్నం కూడా ఆయన వ్యూహమే.
నూతన ప్రధానమంత్రి ముల్లా మహమ్మద్‌ హసన్‌ కూడా ఐక్యరాజ్య సమితి రూపొందించిన తీవ్రవాదుల జాబితాలో ఉన్నారు. ఆయన తాలిబన్ల ప్రధాన కేంద్రమైన కందహార్‌కు చెందినవారే కాక తాలిబన్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన ప్రస్తుతం అఫ్గాన్‌ ప్రభుత్వానికి నాయకుడైన ముల్లా హబీబుల్లా అఖుంద్‌ జాదాకు సన్నిహితుడు. 1996 నుంచి 2001 వరకు తాలిబన్లు అధికారం చెలాయించినప్పుడు ఆయన ఉపప్రధానిగా, విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అఖుంద్‌కు పశ్చిమదేశాలన్నా, ముజాహిదీన్లన్నా గిట్టదు. ఆయన సాయుధ దళాల కమాండర్‌గా ప్రసిద్ధుడు. పాకిస్తాన్‌ లోని వివిధ మదర్సాలలో చదువుకున్నారు. ముల్లా బరాదర్‌ ప్రథమ ప్రధాన మంత్రి అయితే ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అబ్దుల్‌ సలాం హనాఫీ ద్వితీయ ప్రధాన మంత్రిగా ఉంటారు. ముల్లా బరాదర్‌కు మునుపటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో నేరుగా సంబంధాలు ఉండేవి. దోహా ఒప్పందం మీద సంతకం చేసింది కూడా ఆయనే. బరాదరే ప్రభుత్వాధినేత అవుతారను కున్నారు కాని పాక్‌ గూఢచారసంస్థ ఐ.ఎస్‌.ఐ.కి ఆయన మీద నమ్మకం తక్కువ. అందుకే ఆయన రెండవ శ్రేణి నాయకుడిగా మిగిలిపోయారు. తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్‌ ఒమర్‌ కుమారుడు ముల్లా యాకుబ్‌ను రక్షణ శాఖమంత్రిగా నియమించారు. విదేశాంగ మంత్రిగా నియమితుడైన అమీర్‌ ఖాన్‌ ముత్తాఖి కూడా మొదటి తాలిబన్‌ ప్రభుత్వంలో సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితిలో తాలిబన్‌ ప్రతినిధిగా కూడా ఉన్నారు. ఆయన కూడా ఐక్యరాజ్యసమితి రూపొందించిన తీవ్రవాదుల జాబితాలో ఉన్నారు.
ఖలీల్‌ హక్కానీ శరణార్థుల శాఖ మంత్రి. ఆయనా అంతర్జాతీయ తీవ్రవాదే. ఆయనకు అల్‌ కాయదాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అల్‌ కాయదా సాయుధ దళాలతో ఆయనకు దగ్గరి సంబంధాలున్నాయి. వెరసి కొత్త మంత్రివర్గంలో ఉన్న వారిలో ఎక్కువ మంది 1996 నుంచి 2001 మధ్య తాలిబన్‌ ప్రభుత్వంలో భాగస్వాములే. వీరందరూ ఐ.ఎస్‌.ఐ. కనుసన్నల్లో మెలగిన వారే. ఈ మంత్రివర్గంలో పష్తూన్లు కాని వారు ముగ్గురే. వారు మైనారిటీ జాతులకు చెందిన వారు. వీరిలో అబ్దుల్‌ సలాం హనాఫీ ఉజ్బెక్‌కు, సైనిక దళాధిపతి ఖాజీ ఫసిహుద్దీన్‌, ఆర్థిక శాఖ మంత్రి ఖాజీ దీన్‌ హనీఫ్‌ తజక్‌ జాతీయులు. కొత్త మంత్రివర్గంలో కొందరు గతంలో గౌంటనామో బేలో ఖైదీలుగా ఉన్న వారు. ప్రభుత్వాధినేత అఖుంద్‌ జాదా తమ పరిపాలన షరియాకు అనుకూలంగా సాగుతుందని ప్రకటించారు. అంటే తాలిబన్ల ప్రభుత్వం ఎలా సాగుతుందో సులభంగానే ఊహించవచ్చు. భారత్‌కు అనుకూలమైన వాతావరణం అఫ్గానిస్థాన్‌లో లేకపోవడం ప్రత్యేకంగా గమనించదగిన అంశం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img