Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

అఫ్గాన్‌ విషయంలో జాతీయ ఏకాభిప్రాయమే శరణ్యం

దేశం స్వతంత్రమైనప్పటి నుంచి ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా విదేశాంగ విధానం విషయంలో జాతీయ ఏకాభిప్రాయం అనేక దశాబ్దాలపాటు కొనసాగింది. జనతా పార్టీ హయాంలోనూ, ఆ తరవాత వాజపేయి నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ. ఆరేళ్ల పాలనలోనూ విదేశాంగవిధానంలో మౌలికమైన మార్పులు అంతగా రాలేదు. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ప్రతిపక్షాలను సంప్రదించడం లాంటి సంప్రదాయాలన్నీ కనుమరుగైనాయి. 2014 మే 26వ తేదీన మోదీ ప్రధానిగా మొట్టమొదటి సారి ప్రధాన మంత్రిగా ప్రమాణం స్వీకరించినప్పుడు దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్‌) దేశాల నాయకులందరినీ ఆహ్వానించారు. ఇది మేలైన ముందడుగు అనుకున్నాం. కానీ ఇప్పుడు సార్క్‌ దేశాలలో ఒక్క దానితో కూడా మనకు సఖ్యత ఉందని చెప్పలేం. అన్ని పొరుగు దేశాలతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దేశ విభజనకు ముందు అఫ్గానిస్థాన్‌ సైతం మన పొరుగు దేశమే. అఫ్గానిస్థాన్‌తో సుదీర్ఘ కాలం మనకు సత్సంబంధాలు కొనసాగాయి. మన దేశం ఇప్పటికీ అక్కడ 500 పై చిలుకు పథకాలు అమలు చేస్తోంది. తాలిబన్ల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దశాబ్దాలపాటు అఫ్గానిస్థాన్‌లో తిష్ఠ వేసిన అమెరికా సేనలు అల్లకల్లోలం మిగిల్చి నిష్క్రమించాయి. పశ్చిమ దేశాల దౌత్య కార్యాలయాలతో పాటు కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం, మరో మూడు దౌత్య కార్యాలయాలు ఖాళీ అయిపోయాయి. అఫ్గానిస్థాన్‌లో ఉన్న విదేశీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. ఈ భయాందోళనలకు అక్కడున్న మన దేశస్థులూ అతీతులు కారు. అందుకే వారిని వీలైనంత త్వరగా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను పిలిచి అఫ్గానిస్థాన్‌ పరిస్థితిని వివరించింది. ఈ సమావేశంలో ఏం జరిగిందో పూర్తి వివరాలు అందలేదు కానీ అక్కడ బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్న భారతీయులను, ఇతరులను వెనక్కు తీసుకు రావడానికి ప్రాధాన్యమిస్తామని విదేశాంగ మంత్రి ఎస్‌. జై శంకర్‌ అఖిలపక్ష సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం చెప్పదలచుకున్నది విదేశాంగ మంత్రి వివరించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మనవాళ్లను అక్కడినుంచి తీసుకొస్తున్నామని కూడా అన్నారు. యుద్ధరంగంలో ప్రశాంతత ఉంటుందని అనుకోలేంగదా! అక్కడ పని చేస్తున్నది కాబూల్‌ లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే. దొరికిన విమానం ఎక్కేసి అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడడానికి ఒక్కుమ్మడిగా ప్రయత్నిస్తున్నందువల్ల తొక్కిసలాట జరుగుతోంది. అడగడుగునా తాలిబన్లు విమానాశ్రయానికి వచ్చే వారిని నిలువరిస్తున్నారు. కొన్ని సందర్భాలలో వెనక్కు పంపుతున్నారు. విదేశాంగ మంత్రి చెప్పిన లెక్క ప్రకారం 565 మందిని తీసుకురాగలిగాం. జనాన్ని తరలించే పనిలో కూడా భారత్‌ చాలా వెనుకబడి ఉంది. రోజుకు రెండు భారత విమానాలను నడపడానికి మాత్రమే అనుమతి ఉంది. రాయబార కార్యాలయానికి చెందిన 175 మందిని, ఇతర దేశస్థులను 263 మందిని, 112 మంది అఫ్గాన్‌ జాతీయులను, ఇతర దేశాలకు చెందిన 15 మందిని వెనక్కు తీసుకు రాగలిగాం. అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడడానికి కనీసం 15, 000 మంది భారత ప్రభుత్వ సహాయం అర్థిస్తున్నారు. వీరందరినీ వెనక్కు తీసుకురావడం ఎప్పటికి పూర్తవుతుందో విదేశాంగ మంత్రి చెప్పలేదు. అఫ్గానిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి కాబూల్‌ చేరిన వారు తమ పేర్లు నమోదు చేయించుకోనందువల్ల వారిని గుర్తించడం కష్టమవుతోందని విదేశాంగ మంత్రి అంటున్నారు. నిజమే. అది స్వయంకృతాపరాధమే. అనేకమంది విదేశాంగ నిపుణులు కాబూల్‌ రాయబార కార్యాలయంలో కొద్ది మంది సిబ్బందినైనా ఉంచాలని చెప్పినా మోదీ ప్రభుత్వం వినిపించుకోలేదు. హడావుడిగా రాయబార కార్యాలయం మూసేసి మొత్తం సిబ్బందిని తీసుకొచ్చారు. అంటే పౌరుల భద్రతకన్నా సిబ్బంది భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు. అఫ్గాన్‌లో చిక్కుకుపోయి ఉన్న వారికి సమాధానం చెప్పేవారు, సమాచారం ఇచ్చేవారు లేరు. మన భద్రతా సిబ్బంది కూడా వచ్చేశారు.
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పెత్తనం కొనసాగుతున్న మాట నిజమే కానీ తాలిబన్లను వ్యతిరేకించే వారి ప్రతిఘటన కూడా తీవ్రంగానే ఉంది. ‘‘దాడి చేసే హక్కు తాలిబన్లకు ఉంటే ప్రతిఘటించే హక్కు ప్రజలకు ఉంటుంది’’ అని అహమద్‌ వలీ మసూద్‌ అంటున్నారు. మసూద్‌ గతంలో ముజాహిదీన్ల నాయకుడైన అహమద్‌ షా మసూద్‌కు దగ్గరి బంధువు. అహమద్‌ షా మసూద్‌ కుమారుడు కూడా ప్రతిఘటనోద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిఘటిస్తున్నవారిలో మహిళలు, యువకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అఫ్గాన్‌ జనాభాలో యువతరమే 70 శాతం ఉంటుంది. పంజ్‌ షీర్‌ లోయలో ప్రతిఘటన ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతం 1979లో సోవియట్‌ దళాల వశమూ కాలేదు, 1996-2001 మధ్య తాలిబన్ల ఏలుబడిలోకీ రాలేదు. వలీ మసూద్‌ చెప్తున్న విషయం ప్రకారం ప్రతిఘటనకు దిగుతున్న వారు దీర్ఘకాలిక గెరిల్లా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. గెరిల్లా పోరాటం, సాయుధ పొరాటంతో పాటు రాజకీయ పోరాటానికి కూడా సిద్ధపడ్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల దూకుడు ఎంత ఉన్నప్పటికీ భయ వాతావరణం అలుము కోకుండా మోదీ ప్రభుత్వం శ్రద్ధచూపాలి. అన్ని పక్షాలతో సంప్రదించి ఏకాభిప్రాయం సాధించి నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలి. ఇవాళ జై శంకర్‌ వ్యవహార ధోరణి చూస్తే ఆ ఆశే కనిపించడం లేదు. అఫ్గాన్‌ పరిణామాలు భారత భద్రతకు ప్రమాదకరం. అందుకే ప్రభుత్వ ఆలోచన ఏమిటో ప్రతిపక్షాలకు తెలియజెప్పాలి. ప్రతిపక్షాల సలహాలు కూడా విని ఏకాభిప్రాయం సాధించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే తాలిబన్ల దూకుడును ఆసరాగా చేసుకుని భారత్‌లో కూడా రెచ్చగొట్టే ధోరణి ప్రబలే అవకాశం ఉంటుంది. తాలిబన్‌ ప్రభుత్వం ఏర్పడితే ఎలా వ్యవహరించాలో స్పష్టమైన విధానం ఉండాలి. తాలిబన్ల ఆలోచనా ధోరణిని వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తూనే మన దేశంలో తీవ్రవాదం మళ్లీ పెరగకుండా జాగ్రత్త పడాలి. జైష్‌-ఎ-మహమ్మద్‌ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌ కంధహార్‌లో తాలిబన్‌ నాయకులను కలుసుకున్నారంటున్నారు. అదే నిజమైతే మన దేశంపై ప్రభావం గురించి తీవ్రంగా ఆలోచించవలసిందే. తాలిబన్ల విజయాన్ని ముస్లింలకు వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడానికి వినియోగించకూడదు. ముస్లింలపై ద్వేషం పెంచే అలవాటు మోదీ ప్రభుత్వానికి ఉంది కనక ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఈ ధోరణిని నివారించగలగాలి. ఒకప్పుడు అఫ్గాన్‌ లో లక్ష మంది దాకా హిందువులు, సిక్కులు ఉండేవారు. 1992లో ముజాహిదీన్లది పై చేయి అయినప్పుడు చాలా మంది అక్కడి నుంచి వచ్చేశారు. అఫ్గానిస్థాన్‌ నుంచి భారతీయులను తీసుకు వస్తున్న సందర్భంలో హిందువులను, సిక్కులను తీసుకొస్తున్నామని ప్రభుత్వం నొక్కి చెప్పడం ప్రమాద సంకేతం. ఈ పరిణామాలన్నీ విదేశాంగ విధానంలో జాతీయ ఏకాభిప్రాయ ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img