Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

అఫ్గాన్‌ సంక్షోభానికీ మోదీ హిందుత్వ లంకె

సకల వ్యవహారాలను హిందుత్వ దృష్టితో చూడడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనితర సాధ్యమైన నైపుణ్యం సంపాదించారు. ఒక వేపు అఫ్గానిస్థాన్‌ లో తాలిబన్ల ఆధిపత్యం భారత్‌ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే స్థితిలో ఉంది. కాబూల్‌ లోని భారత రాయబార కార్యాలయంతో సహా మిగిలిన దౌత్య కార్యాలయాల సిబ్బందిని కూడా భారత్‌ వెనక్కు తీసుకొచ్చింది. అఫ్గానిస్థాన్‌ లో ఇంజనీర్లు, డాక్టర్లు మొదలైన వృత్తుల్లో పని చేస్తున్న వారు వీలైనంత త్వరగా అక్కడినుంచి బయటపడాలని తాపత్రయ పడ్తున్నారు. వీరు ఆ దేశం నుంచి బయటపడాలంటే వారి పాస్‌ పోర్టులు, వీసాలు మొదలైన వాటిని జారీ చేయడానికో, సరి చూడడానికో కావలసిన భారత సిబ్బంది కూడా అక్కడ మిగల లేదు. భారత రాయబార కార్యాలయ సిబ్బంది హఠాత్తుగా వెళ్లిపోవడంతో వారి పాస్‌ పోర్టులు అక్కడ చిక్కుకు పోయాయని అఫ్గాన్‌ పౌరులే బాధతో చెప్తున్నారు. అఫ్గాన్‌ కు చెందిన వారే దేశం విడిచి బయటపడడానికి విమానాశ్రయాలకు పరుగులు పెడ్తున్నారు. కానీ తాలిబన్లు ఇప్పుడు విమానాశ్రయాల మీద ఆధిపత్యం సంపాదించారు. అందువల్ల అక్కడి నుంచి తరలి రావడం కూడా అంత సులభం కాదు. పరిస్థితి ఇంత భీకరంగా ఉన్న సమయంలో తీవ్రవాద సామ్రాజ్యాలు నిర్మించే వారు ఎక్కువ కాలం మనలేరనీ, వారు శాశ్వతం కాదనీ, ఎల్లకాలం మానవాళిని అణచి ఉంచలేరని మోదీ ధర్మ పన్నాలు వల్లిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌ లో చిక్కుకుపోయి స్వదేశం రావాలనుకుంటున్న వారిని ఎలా తీసుకురావాలి, లేదా ఎలా తీసుకొస్తాము అన్న విషయంలో మోదీ నోట ఒక్క మాట కూడా వెలువడలేదు. ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేయడం లేదని చెప్పలేం. దీనికోసం చేసే అన్ని పనులను బహిరంగంగా వ్యక్తం చేయనవసరం లేదు అన్న విషయాన్ని అంగీకరించవచ్చు. కానీ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అఫ్గాన్‌ పర్యవసానాల గురించి మాట్లాడు తున్నప్పుడు ధర్మ పన్నాలు కాకుండా భీతావహులైన వారికి భరోసా కలిగించాలిగా. గుజరాత్‌ లోని సోమనాథ దేవాలయంలో కొన్ని పథకాలను ఆన్‌ లైన్లో ప్రారంభించిన సమయంలో మోదీ మాటలు ప్రవచనాల్లాగే ఉన్నాయి కాని కార్యాచరణకు ఉపకరించేలా లేవు. ఇవన్నీ సోమనాథ్‌ దేవాలయానికి పరిమితమైన మాటలు కావనీ, పరోక్షంగా అఫ్గాన్‌ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ఇలా మాట్లాడుతున్నారని సులభంగానే అర్థం అవుతుంది. అయితే అందులోనూ హిందుత్వ కోణాన్ని జోడిరచడమే మోదీ ప్రత్యేకత. సోమనాథ్‌ దేవాలయం పూర్వ వైభవం సాధించడం ఆత్మ విశ్వాసం పెంపొందిస్తుందని కూడా మోదీ అన్నారు. ఈ ఆత్మ విశ్వాసం ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌ లో ప్రాణాలు అరచేత పెట్టుకుని ఎప్పుడు అక్కడినుంచి బయటపడగలమా అనుకుంటున్న వ్యథాభరిత జీవుల ఆత్మ విశ్వాసాన్ని పెంచలేదు. ఈ వారం మొదట్లో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ‘‘ప్రత్యేక అఫ్గానిస్థాన్‌ విభాగం’’ ఏర్పాటు చేసింది. ఆ విభాగానికి వందలాది మంది ఫోన్లు చేసి తాము అఫ్గాన్‌ నుంచి బయటపడడానికి సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. తాలిబన్లు కాబూల్‌ లోని భారత రాయబార కార్యాలయం తలుపులు బద్దలు కొట్టి భారీ ఎత్తున సోదాలు చేస్తున్నారు. ఇతర దౌత్య కార్యాలయాల్లోనూ తాలిబన్లు చేస్తున్న పని ఇదే. ప్రతి రాయబార కార్యాలయంలోనూ సోదాలు జరుగుతున్నాయి. వాస్తవం ఏమిటంటే తమ ‘‘దండ యాత్ర’’ ముగిసే దాకా దౌత్య కార్యాలయాలను కాపాడతామని భారత దౌత్య సిబ్బందికి ఇచ్చిన మాటను తాలిబన్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజా సోదాలన్నీ ఈ విషయాన్నే నిరూపిస్తున్నాయి. కాంధహార్‌, మజార్‌-ఎ-షరీఫ్‌, హెరాత్‌ లోని భారత దౌత్య కార్యాలయాలలో కూడా బుధ, గురువారాల్లో ముమ్మరమైన సోదాలు జరిగాయి. నిజానికి హెరాత్‌ లోని దౌత్య కార్యాలయాన్ని భారత ప్రభుత్వం గత సంవత్సరమే మూసి వేసింది.
హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సిబ్బందిని తాలిబన్లు బయటకు పంపించారు. కనక అక్కడి నుంచి బాధితులను తరలించే అవకాశం ఏర్‌ ఇండియాకు లేకుండా పోయింది. ఇక మిగిలిన మార్గమల్లా సైనిక విమానాల్లో తరలించడమే. ఎందుకంటే సైనిక విమానాలు ప్రధాన విమానాశ్రయాల నుంచి కాక సాంకేతిక ప్రాంతం నుంచి నడుపుతారు. అయితే ప్రయాణికులు తాలిబన్లను దాటుకుని అక్కడికి చేరుకోవడం సులభం కాదు. మొత్తం ఆవరణ అంతా తాలిబన్ల అధీనంలోనే ఉంది. నిరంతరం తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు వెయ్యి మంది భారతీయులు ఇంకా అఫ్గానిస్థాన్‌ లో చిక్కుకుపోయి ఉన్నారంటున్నారు. సి-17 విమానంలో భారత్‌ 300 మందిని వెనక్కు తీసుకు రాగలదు. అదీ ప్రధాన విమానాశ్రయాల నుంచి కాకుండా సాంకేతిక ప్రాతం నుంచే. ఈ సాంకేతిక ప్రాంతాలు ఇప్పటికీ అమెరికా బలగాల అధీనంలోనే ఉన్నాయి. అమెరికా బలగాల సహకారం ఉంటే తప్ప భారత విమానాలు అఫ్గానిస్థాన్‌లో దిగడానికి వీలుండదు. తాలిబన్ల ఆగ్రహం అమెరికా మీద కనక అమెరికాకు ఈ భోగం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పలేం. అల్‌ కాయదాను తుద ముట్టించామని అందువల్ల అఫ్గానిస్థాన్‌ లో తమ పని ముగిసిందని బూటకపు మాటలు చెప్పి అమెరికా సేనలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాయి. కానీ అరేబియన్‌ ద్వీపకల్పం లోని అల్‌ కాయదా తాలిబన్ల ‘‘విజయా’’న్ని కీర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. సిరియాలోని హయాత్‌ తహ్రీర్‌ అల్‌-షాం కూడా తాలిబన్లను అభినందించింది. తర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ పార్టీ సైతం అదే పని చేసింది. ఈ పార్టీ పశ్చిమ చైనాలోని స్థావరం నుంచి పని చేస్తుంది. గూఢచార సమాచారం కోసం భారత ప్రభుత్వం జో బైడెన్‌ ప్రభుత్వం మీదే ఆధారపడక తప్పడం లేదు. నిషేధంలో ఉన్న హక్కాని నెట్వర్క్‌ కార్యకలాపాలు మళ్లీ పెరిగాయి. అఫ్గానిస్థాన్‌లో కానీ భారత్‌లో కానీ లష్కర్‌-ఎ-తయ్యబా, జైష్‌-ఎ-మహమ్మద్‌ కార్యకలాపాల నుంచి భారత్‌కు ఎటూ ముప్పు ఉండనే ఉంది. ఇంకో వేపు అఫ్గాన్‌ పరిణామాలను చర్చించడానికి ఐక్య రాజ్య సమితి అత్యవసర సమావేశాల్లో పాల్గొన్న భారత విదేశాంగ మంత్రి ఈ అంశాల గురించే ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రాంతమూ ఈ తీవ్రవాద ముఠాలకు నెలవులుగా మారకూడదనీ, వారికి నిధులు సేకరించే అవకాశం ఇవ్వకూడదనీ విదేశాంగ మంత్రి ఎస్‌. జై శంకర్‌ హెచ్చరించారు. ఈ పరిణామాలన్నింటి మీద ప్రధానమంత్రి వైఖరి ఏమిటో, అఫ్గానిస్థాన్‌ సమస్యను భారత్‌ ఎలా ఎదుర్కోబోతోందో, మన ప్రయోజనాలను ఎలాపరిరక్షిస్తారో మోదీ ఒక్కమాట కూడా మాట్లాడకుండా నర్మగర్భంగా హిందుత్వ విధానాలను ప్రోత్సహించడం దేశ ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img