Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

అరాచక పాలనకు అడ్డుకట్ట

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గత కొన్ని రోజులుగా మనశ్శాంతి లేకుండా పోయింది. రాజధాని లేని రాజ్యాన్ని పాలించినా, హంతకులను అదేపనిగా వెనుకేసుకు వచ్చినా, కుటిల రాజనీతితో రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా మారినా, భావస్వేచ్ఛపై దమనకాండకు పూనుకున్నా, గడిచిన నాలుగేళ్లూ సీఎంకు మాత్రం కాలం కలిసొచ్చిందనే చెప్పవచ్చు. కానీ వారం పదిరోజులుగా వైసీపీ అధినేతకు తగులుతున్న ఎదురుదెబ్బలు చూస్తుంటే ప్రతికూల సంకేతాలు విస్పష్టంగా కన్పిస్తున్నాయి. మూడు నెల్లకోసారి మోదీకి మొక్కే జగన్‌ ఈసారి వారానికి రెండుసార్లు దిల్లీకి పరుగులు పెట్టాల్సి వస్తోంది. తరచూ దిల్లీ పర్యటనల ఆవశ్యకత వెనుక పరమోద్దేశం జనానికి తెలియనిదికాదు. కొన్ని పరిణామాలు ముఖ్యమంత్రికి మానసిక ప్రశాంతతను దూరం చేశాయి. వీటిని సరిచేసే క్రమంలో పాపం పదేపదే దేశ రాజధాని చుట్టూ చెక్కర్లు కొట్టే పరిస్థితికి దారితీసి వుండవచ్చు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రధానంగా నాలుగైదు అంశాలు అనూహ్యంగా వేధించడం మొదలుపెట్టాయి. ఇందులో మొదటిది, జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వివేకా నాందరెడ్డి హత్య కేసు అత్యధికంగా తలనొప్పులు తీసుకువస్తోంది. ఇటీవలనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఆయనకు వేదన కలిగించే అంశమే. ఈ కేసులో దర్యాప్తు ఇంకెన్నాళ్లు ‘సాగదీస్తా’రని సర్వోన్నత న్యాయస్థానం అక్షింతలు వేసింది. సీబీఐ దాఖలు చేసిన దర్యాప్తు స్థాయీ నివేదికలో పాత విషయాలే తప్ప కొత్త విషయాలేమీ లేవని అసహనం వ్యక్తం చేయడం మోదీ జేబుసంస్థగా మారిపోయిన కేంద్ర దర్యాప్తు విభాగానికి అజీర్తిని కలిగిస్తోంది. ఈ కేసు నిర్వీర్యం కావడానికి నిందితులు శాయశక్తులా ‘కృషి’ చేస్తున్నారు. దర్యాప్తు అధికారిని మార్చాలని ఒక ప్రధాన నిందితుడు శివశంకర్‌రెడ్డి తరపున రిట్‌ పిటిషన్‌ దాఖలు కావడం, అలా చేస్తే కేసు మరింత నత్తనడక నడుస్తుందని వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది కోరడం, పాత అధికారిని కొనసాగిస్తూనే, కొత్త అధికారిని నియమించాలంటూ సుప్రీంకోర్టు తొలుత నిర్దేశించడం..ఆ తర్వాత బుధవారంనాడు దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై వేటువేసి, ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం కొత్త అంశమే. ఏప్రిల్‌ 30లోగా దర్యాప్తు పూర్తికావాలని సుప్రీంకోర్టు కాలపరిమితిని విధించడం జగన్‌ వర్గీయులకు మింగుడుపడటం లేదు. ఈ కేసులో రాజకీయ శత్రుత్వం ఒకటే కారణం కాదు. విస్తృత కుట్రకోణం దాగి వుందని సీబీఐకి తప్ప అందరికీ తెలుసు. అదే పనిగా కేసులు వేస్తూ, కౌంటర్లు దాఖలు చేస్తూ దర్యాప్తును ఓవైపు నీరుగారుస్తున్న వైనం కోర్టు అభిప్రాయంలో స్పష్టంగా గోచరిస్తున్నది. ‘తమ్ముడి’ని కాపాడుకోవడానికి వేయాల్సిన పాచికలు, ఎక్కాల్సిన ఎత్తులన్నీ నిందితులు వేస్తున్నారని, దాని వెనుక జగన్‌ మోహన్‌ రెడ్డి హస్తం వుందని ప్రధానంగా విన్పిస్తున్న ఆరోపణ. అది ఆరోపణా, లేక నిజమా అన్నది పక్కనబెడితే, ఈ అంశం నుంచి సీఎం ‘దిల్లీ’ దాటి పారిపోలేరని అర్థమవుతోంది. అంతలోనే పులివెందులలో నడిరోడ్డుపై జరిగిన కాల్పులు ఈ కేసులో పర్యవసానాలు ఎలా వుంటాయో భయోత్పాతాన్ని కలిగిస్తోంది. ఈ కేసు ఫలితం సుప్రీంకోర్టు చేతిలో వుందా? సీబీఐ దర్యాప్తు చేసే విధానంలో వుందా? మోదీ తీసుకోబోయే నిర్ణయంలో వుందా? అన్నది తెలియకపోయినా, సుప్రీంకోర్టు తాజాగా నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం పనితీరైనా ఈ కేసు వెనుక కుట్రను వెలికితీస్తుందని ఆశిద్దాం!
రాష్ట్ర రాజధాని కేసు కూడా జగన్‌ తలకు బొప్పి కట్టిస్తున్నది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిపై చట్టం చేసే అధికారం ప్రస్తుత ఏపీ శాసనసభకు లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏడాది క్రితం ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పైగా ఆ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లంటిపైనా విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేసింది. అంతకన్నా ముందే విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తినీ తోసిపుచ్చింది. మూడు రాజధానుల పేరుతో ఏదో ఒక ప్రకటన చేస్తూ ఒంటికాలిపై ఎగురుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇదీ ఒక ఎదురుదెబ్బే. సుప్రీం తాజా నిర్ణయంతో.. రాజధానులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా జగన్‌ సర్కారు చేతులు కట్టిపడేసినట్లయింది. రాజధాని విషయంలో రాష్ట్ర యావత్తూ ఆందోళనలో వున్న మాట వాస్తవమే. కానీ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించినట్లుగా మూడు రాజధానులపై అత్యుత్సాహమంటూ ఎవరికీ లేదు. జగన్‌ అనుయాయులకూ, విశాఖలో వేలాది ఎకరాలపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలుపెట్టిన వారికీ తప్ప. రాజధాని లేని రాష్ట్రంలో బతుకీడుస్తున్న ఏడు కోట్ల మంది ప్రజల బాధను అర్థం చేసుకోవడంలో మోదీ ప్రభుత్వ అలసత్వాన్నీ విస్మరించలేం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, చాలా విషయాల్లో జగన్‌, మోదీ, అమిత్‌షాలు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు నిజమేనన్న తలంపు రాకమానదు.
జగన్‌ను ఇబ్బంది పెట్టడంలో రాజధాని కేసు, వివేకా హత్యకేసు ఒక ఎత్తయితే, పోలవరం ప్రాజెక్టు ఎత్తు సమస్య మరో ఎత్తుగా మారింది. పోలవరం ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట చెపుతూ ఏపీ ప్రజలను దగా చేస్తోంది. దీనిపై జగన్‌ మౌనం రాష్ట్ర ప్రయోజనాలను మరింత దెబ్బతీస్తున్నది. ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లంటూ జలశక్తి శాఖ గతవారం పార్లమెంటులో ప్రకటించింది. అంతలోనే మాటమారుస్తూ, గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్లను తగ్గించే ప్రతిపాదనేదీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని మళ్లీ ప్రకటించింది. చివరకు జగన్‌ సర్కారు చేసే పనులు పోలవరంను జాతీయ ప్రాజెక్టు స్థాయి నుంచి మినీ రిజర్వాయర్‌ స్థాయికి దిగజారుస్తుందన్న అనుమానాలొస్తున్నాయి. అటుచేసి ఇటుచేసి పోలవరం ఎత్తులు జగన్‌ రాజకీయ ఎత్తుగడలకు వేదికగా మారింది. జలశక్తి శాఖ సాంకేతిక సలహా కమిటీ గణాంకాల ప్రకారం, పోలవరం ప్రాజెక్టుకు రూ.55,548.47 కోట్ల అంచనాలకు నాలుగేళ్ల క్రితమే ఆమోదం లభించింది. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ దానిని రూ.47,725.61 కోట్లకు సవరించిందని ఆ శాఖామంత్రి పార్లమెంటులో ప్రకటించారు. ఏ ప్రాతిపదికన సవరించారన్న ప్రశ్నకు గానీ, ఈ రెండు అంచనా వ్యయాల్లో దేనిని కేంద్రం ఆమోదించిందన్న విషయానికి గానీ సమాధానం కేంద్ర మంత్రి నోటి నుంచి రాలేదు. రూ.10 వేల కోట్లు ముందుగా ఇవ్వాలన్న జగన్‌ వినతినీ కేంద్రం పక్కకు పెట్టేసింది.
ఎన్నోసార్లు మోదీ దర్శనాలు జగన్‌కు దక్కినా, ఆయన కలిసిన ప్రతిసారీ మోదీ ఏ వరం ఇస్తున్నారో, ఈయన ఏ వరం అడుగుతున్నారో ప్రజలకు తెలియజెప్పాలి. రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు సరికదా, మోదీ స్పందించిన సందర్భమూ లేదు. వివేకా కేసు, రాజధాని కేసు, పోలవరంపై తగిలిన ఎదురుదెబ్బలు కాకుండా ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు జగన్‌కు వ్యతిరేకంగా వచ్చిన మరో బోనస్‌ అంశం. ఇవన్నీ ఏపీలో అరాచక పాలనకు ఒక విధంగా అడ్డుకట్టలే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరగకముందే, జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాలు సైతం వస్తున్నాయి. అత్యంత సమీప భవిష్యత్‌లో, రాష్ట్ర రాజకీయ భవితను మార్చే అనుకోని ఉదంతాలు మరికొన్ని సంభవించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img