Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

అలుపెరుగని ఏ.ఐ.టి.యు.సి

నూటా మూడవ ఏట ప్రవేశించిన ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏ.ఐ.టి.యు.సి) చరిత్ర అంతా పోరాటాల మయమే. మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ, కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ కార్మికులు సుదీర్ఘకాలం పోరాటాలుచేసి సాధించుకున్న హక్కులను అడుగడుగునా కాలరాస్తూ ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యంచేస్తూ, లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను తమకు సన్నిహితులైన ప్రైవేటురంగ గుత్త సంస్థలకు అప్పగిస్తూ పెట్టుబడుల ఉపసంహరణపేర ప్రైవేటు రంగసంస్థలకు కట్టబెడుతూ ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ఈ సంక్షుభిత దశలో ఏ.ఐ.టి.యు.సి మరింత భీకర పోరాటాలకు సన్నద్ధం కావలసిన దశలో కేరళలోని అళప్పుళలో ఈ నెల 16 నుంచి 20 దాకా 42వ మహాసభ నిర్వహించు కుంది. ఈ మహాసభలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపితే తప్ప నిష్కృతి లేదన్న నిర్ధారణకు ఏ.ఐ.టి.యు.సి రావడంలో ఆశ్చర్యం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్మిక సంఘాలన్నింటినీ కలిపి సమాఖ్యగా ఏర్పాటు చేయాలనీ, అలాగే రాష్ట్రప్రభుత్వ అధీనంలోని సంస్థల కార్మికసంఘాలతో మరో సమాఖ్య ఏర్పడాలని ఈ మహాసభలో అభిప్రాయానికి వచ్చారు. 1920లో ఏర్పడిన ఏ.ఐ.టి.యు.సి దేశంలోకెల్లా మొట్టమొదటి కార్మికసంస్థ. అప్పుడు వివిధ రాజకీయ సిద్ధాంతాలకు ప్రాతినిధ్యం వహించేవారు ఈ కార్మిక సంస్థలోనే ఉండేవారు. లాలాలజ్‌పత్‌ రాయ్‌ మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ తరవాత జవహర్‌లాల్‌ నెహ్రూ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, సరోజిని నాయుడు, వి.వి.గిరి లాంటి ఉద్దండులు ఏ.ఐ.టి.యు.సి అధ్యక్షులుగా పనిచేసిన వారే. 1945లో కాంగ్రెస్‌, సోషలిస్టు, ప్రస్తుత బీజేపీ సిద్ధాంతానికి ప్రాతినిధ్యం వహించేవారు ఈ మహాసంస్థ నుంచి విడిపోయారు. దాదాపు 30లక్షల సభ్యత్వంఉన్న ఈ సంస్థలో జౌళి, విద్యుత్తు, బొగ్గు, ఇంజినీరింగ్‌, ఉక్కు, రోడ్డు, రవాణా లాంటి వ్యవస్థీకృత రంగాలవారితో పాటు అవ్యవస్థీకృత రంగంలోని బీడీ కార్మికులు, భవన నిర్మాణరంగంలో పనిచేసేవారు, ముఠా కార్మికులు, అంగన్వాడీ, ఆశావర్కర్లు, చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఇటీవలి కాలంలో అనేక వ్యవసాయ కార్మికసంఘాలు కూడా ఏ.ఐ.టి.యు.సి.కి అనుబంధమైనాయి. ఏ.ఐ.టి.యు.సి.కి అనేక అవకాశాలున్నాయి. బలాలు ఉన్నాయి. దీనితో పాటు సవాళ్లూ ఉన్నాయి. బలహీనతలూ ఉన్నాయి. ఈ సవాళ్లను అవకాశంగా మార్చుకోవాలి. పెట్టుబడి విశ్వవ్యాప్తం అవుతున్నదశలో భారత కార్మికరంగం మరింత వ్యవస్థీకృతం కావలసిన అవసరంఉంది. విశ్వవ్యాప్తమైన పెట్టుబడికి ఆర్థికదన్ను, రాజకీయవత్తాసు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి భారత కార్మికవర్గం ఇతర దేశాల్లోని కార్మికులతో, కార్మికసంఘాలతో సంబంధాలు కొనసాగించ వలసిన అవసరంఉంది. సమాజ సంక్షేమానికి వివిధ రంగాలవారు సంఘాలు ఏర్పరచుకుని సంఘటితం కావడం అనివార్యం. మనదేశంలో కార్మిక సంఘాలకోసం ప్రత్యేకంగా చట్టాలున్నాయి. పనిగంటలకు పరిమితేలేని దశలో మొదట పదిగంటల పనిదినాలు, తరవాత ఎనిమిదిగంటల పనిదినాలు సాధించడంలో ఏ.ఐ.టి.యు.సి ప్రధానపాత్ర నిర్వహించింది. 1929లో కాంగ్రెస్‌ సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని తీర్మానం చేయకముందు, హస్రత్‌ మోహానీ మొదటిసారి ఆ మాట అనక ముందు సంపూర్ణ స్వరాజ్యం కావాలన్న నినాదం ఇచ్చింది ఏ.ఐ.టి.యు.సినే. రెండో ప్రపంచయుద్ధం తరవాత ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య అవతరించడంలో ఏ.ఐ.టి.యు.సి కీలకపాత్ర పోషించింది. అందుకే అళప్పుళలో జరిగిన ఏ.ఐ.టి.యు.సి 42వ మహాసభకు ప్రపంచ కార్మికసంఘాల ప్రధాన కార్యదర్శి పాంబీస్‌ కిరిస్ట్రిన్‌ హాజరు కావడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు కార్మిక నిబంధనావళిని తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం బరితెగించి ప్రవర్తిస్తోంది. అంతర్జాతీయ ఒప్పందాలను, సుప్రీంకోర్టు తీర్పులను, కడకు రాజ్యాంగాన్ని కూడా మోదీ ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు.
ఏ.ఐ.టి.యు.సి ఏర్పడిరది 1920లో కావచ్చు కానీ అంతకు ముందు నుంచే కార్మికవర్గం అనేక పోరాటాలు చేసింది. 1905 తరవాత కార్మికోద్యమం క్రమంగా ముందడుగు వేయడం ప్రారంభమైంది. పనిగంటలు పెంచినందుకు బొంబాయిలో ఆ సమయంలోనే కార్మికులు సమ్మె కట్టారు. 1908లో బొంబాయిలో పారిశ్రామిక కార్మికులు 1908 జులై 24 నుంచి 28వరకు చేసిన సమ్మే ఒక రకంగా ఏ.ఐ.టి.యు.సి అవతరణకు బీజం వేసింది. ఈ సమ్మె స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య బాల గంగాధర్‌కు ఆరేళ్ల జైలుశిక్ష విధించినందుకు నిరసనగా జరిగిన అంశాన్ని పరిశీలిస్తే కార్మికవర్గ జీవితాలు రాజకీయాలకు అతీతంకావని రుజువవు తోంది. అసంఘటిత కార్మికులకోసం సంక్షేమ చట్టాలు, బోర్డులు ఏర్పాటు కావడంలో ఈ మహా సంస్థదే కీలక పాత్ర. 1969లో ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేయడానికి ప్రేరణగా నిలిచింది కూడా కార్మిక వర్గాల పోరాటమే. అయితే ఈ పోరాటాలవల్ల కార్మికులకు అనేక సదుపాయాలు సమకూరాయి. బోనస్‌, గ్రాట్యుటీ, భవిష్యనిధి వంటివి కార్మికులు పోరాడి సాధించుకున్న సదుపాయాలే. వేతనాలు చాలావరకు క్రమబద్ధమైనాయి. వీటివల్ల కార్మికవర్గ జీవనం కచ్చితంగా మెరుగుపడిరది. ఈ వెసులుబాట్లు అందుబాటులోకి రావడంతోపాటు ఆర్థికపోరాటాల ఆవశ్యకత తగ్గినందువల్ల కూడా కార్మిక సంఘాలకు ఆదరణ తగ్గుతూ రావడం కాదనలేని వాస్తవం. అలాగని శ్రమజీవుల బతుకు సాఫీగా సాగి పోతోందని కాదు. మౌలిక సమస్యలు సాకారమైనాయి కనక ఇక కార్మిక సంఘాలతో పనిఏముంది అనుకునే మధ్యతరగతి జీవులు పెరిగారు. అంతమాత్రంచేత వారికి సమస్యలు లేవని కాదు. ప్రభుత్వంతో, యాజమాన్యాలతో సంప్రదింపులద్వారా సమస్యలు పరిష్కరించుకోవలసిన అవసరంలేదనీ కాదు. కానీ బతుకు దుర్భరమైన దశలో ఉన్నస్థితిలో ఇప్పుడు సంఘటిత కార్మికులు లేరు. అందువల్ల వారు కార్మిక సంఘాలవేపు ఆకర్షితులు కావడంలేదు.
కంప్యూటరీకరణ ఇప్పుడు వివిధ రంగాలలో సిబ్బంది పనివిధానాన్ని సమూలంగా మార్చేసింది. శారీరకశ్రమ తగ్గింది. ఇదీ కార్మికసంఘాల పాత్ర సన్నగిల్లడానికి మరోకారణం. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేసే వారందరికీ భారీ వేతనాలు ఉన్నాయని కాదు, కాని ఆ రంగంలో పనిచేసే వారి బతుకు సాఫీగా సాగిపోతోంది కనక వారికి కార్మికోద్యమాలపై శ్రద్ధ కనిపించడం లేదు. అయితే 42వ మహాసభలు ఐక్యపోరాటాల ఆవశ్యకత మరింత పెరిగిందని గుర్తించింది. ఈ మధ్య కేంద్ర కార్మికసంఘాల ఐక్యవేదికకు దూరంగా ఉంటున్న బి.ఎం.ఎస్‌ హాజరుకావడం గమనించదగిన పరిణామం. శ్రామికుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నందువల్లే బి.ఎం.ఎస్‌. తన పంథా మార్చుకోక తప్పినట్టు లేదు. త్వరలో సి.ఐ.టి.యు., హెచ్‌.ఎం.ఎస్‌. మహాసభలు జరగనున్నాయి. ఏ.ఐ.టి.యు.సి మహాసభలలో తీసుకున్న నిర్ణయాలు ఇతర కార్మిక సంఘాలకు కూడా దిక్సూచిగా పనిచేస్తాయి. జనవరి 30వ తేదీన జాతీయ కార్మిక మహాసదస్సు జరపాలన్న కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఏ.ఐ.టి.యు.సి.కి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img