Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

అవినీతి హార్మా ్యలు

దిల్లీ పరిసరాల్లో ఉత్తరప్రదేశ్‌లో భాగమైన నోయిడాలో సూపర్‌టెక్‌ అనే భవన నిర్మాణ సంస్థ నిర్మించిన జంట హార్మ్యాలు ఆదివారం పది పన్నెండు సెకన్లలో నేలమట్టమైనాయి. వీటి కూల్చివేతకు అత్యాధునిక అంత:విస్ఫోటన పద్ధతి అనుసరించారు. ఈ దృశ్యమంతా టీవీ చానళ్లు, యూ ట్యూబ్‌ చానళ్లలో ప్రత్యక్షంగా ప్రసారమైంది. ఉపగ్రహలు ప్రయోగించేటప్పుడు కౌంట్‌ డౌన్‌ అన్న మాట వాడతారు. ఈ జంట హార్మ్యాల కూల్చివేత సమయంలో కూడా దృశ్య మాధ్యమాలు అలాగే తమ తెరల మీద కౌంట్‌ డౌన్‌ విధానాన్నే అనుసరించాయి. జనం ఆసక్తితో తిలకించారు. ఉత్కంఠభరితులయ్యారు. పరిసరాలకు ఏ మాత్రం ప్రమాదం లేకుండా ఈ ఆకాశ సౌధాలు కనురెప్ప పాటులో కూలిపోతూ ఉంటే జనం ఉద్విగ్న భరితులయ్యారు. న్యాయ దృక్కోణంతో చూసినా సుప్రీంకోర్టు పౌరుల తరఫున నిలబడినందుకు అభినందనలు వెల్లువెత్తాయి. న్యాయమార్గ పాలన ఇంకా పరమపదించలేదని సంతృప్తి పడ్డారు. ఇదంతా ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే పౌరులు కోర్టులకెక్కి, ఏళ్ల తరబడి నిరంతర న్యాయ పోరాటం చేసి సాధించిన విజయంగా భావిస్తున్నారు. నోయిడా పాలనా విభాగం కిందకు వచ్చే సెక్టర్‌ 93ఎ లోని ఎమరాల్డ్‌ కోర్టు గృహనిర్మాణ పథకంలో భాగంగా ఈ జంట హార్మ్యాల కథ 2004లో ప్రారంభమైంది. ఈ 18 ఏళ్ల కాలంలో ఒక్కో అంతస్తు లేచి కుతుబ్‌ మినార్‌ ను మించిపోయిన 103 మీటర్ల ఎత్తుకు ఎదిగినట్టే వీటి నిర్మాణంలో అవినీతి అదే మోతాదులో అంతకన్నా అత్యంత సహజంగా పెరిగిపోయింది. మొదట సూపర్‌ టెక్‌ సంస్థ పదేసి అంతస్తుల 14 గృహ సముదాయాలను నిర్మించాలనుకుంది. 2006 నాటికి నోయిడా పరిపాలనా విభాగం నుంచి సూపర్‌ టెక్‌ మరింత భూమి సంపాదించి 15 అంతస్తులు నిర్మించడానికి అనుమతి సంపాదించింది. మరో మూడేళ్లలో మరో రెండు హార్మ్యాలు 24 అంతస్తులుగా నిర్మించడానికి అనుమతి సంపాదించింది. అక్కడ ఉంటున్న కొంత మంది ఇది భవన నిర్మాణ నియమాలకు విరుద్ధమని గగ్గోలు పెట్టారు. ఆ సమయానికి ఎమెరాల్డ్‌ కోర్టు భవన సముదాయంలో 40-50 కుటుంబాలు మాత్రమే నివసిస్తూ ఉండేవి. 2012 నాటికి భవన నిర్మాణ కంపెనీ 40 అంతస్తులు నిర్మించడానికి అనుమతి సాధించింది. 2012 డిసెంబర్‌ లో ఎమరాల్డ్‌ కోర్టు సముదాయంలో నివసిస్తున్న వారు తమ అనుమతి లేకుండా నిర్మిస్తూనే ఉన్నారని అలహాబాద్‌ హైకోర్టుకెక్కారు. రెండు సముదాయాల మధ్య 16 మీటర్ల దూరం ఉండాలన్న నిబంధననూ పాటించడం లేదని ఫిర్యాదు చేశారు. 2014లో అలహాబాద్‌ హైకోర్టు ఈ జంట హార్మ్యాలను కూల్చేయాలని తీర్పు చెప్పింది. నోయిడా పరిపాలనా వ్యవస్థ భవన నిర్మాణ సంస్థతో కుమ్మక్కు అయిందని తీవ్ర వ్యాఖ్యానాలే చేసింది. 2014 మేలో సూపెర్‌ టెక్‌ సంస్థ సుప్రీంకోర్టుకెళ్లి తమ దగ్గర సకల అనుమతులూ ఉన్నాయని నివేదించింది. సుప్రీంకోర్టు ఈ వాదనను నమ్మలేదు. మూడు నెలల్లో వీటిని కూల్చేయాలని ఆదేశించింది. మే 22న కూల్చి వేస్తామని నోయిడా పాలనా వ్యవస్థ గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. కూల్చివేత గడువును సుప్రీంకోర్టు మే 17 నుంచి ఆగస్టు 28 వరకు పొడిగించింది. ఆ గడువుకే కూల్చేశారు. ఈ లోగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ గత మార్చి 25న సూపర్‌ టెక్‌ సంస్థను దివాలా తీసిన సంస్థగా ప్రకటించింది. ఈ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 12000 కోట్ల రుణం చెల్లించడంలో విఫలమైంది. ఈ కంపెనీని దివాలా తీసినట్టుగా ప్రకటించినందువల్ల దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో ఇళ్లు కొనుక్కోవాలనుకున్న 25000 మంది మీద ప్రభావం పడిరది. దాదాపు డజను గృహ సముదాయాలను సూపర్‌ టెక్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆదివారం కూల్చిన వేసిన జంట హార్మ్యాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవేనని సుప్రీంకోర్టు 2021 ఆగస్టు 31 ననే నిర్థారించింది. సూపర్‌ టెక్‌ సంస్థ జంట నిర్మాణాల పొడవునా నియమ నిబంధనల ఉల్లంఘనే కనిపిస్తోంది. ఒక వేపు కోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉండగానే ఈ సంస్థ నిర్మాణం కొనసాగించడం కేవలం సాహసం అని భావించలేం. ఆ సంస్థ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించిందంటే అందులో అవినీతి ఈ హార్మ్యాల ఎత్తును మించిపోయిందనుకోవలసిందే. ఈ అవినీతి ఆనవాళ్లు భవన నిర్మాణ కథ మొదలైనప్పటినుంచే కనిపిస్తూనే ఉన్నాయి. అది బయటపడకుండా మరింత అవినీతి పద్ధతులను ఆశ్రయించారు. అక్కడ నివసిస్తున్న వారు పట్టుబట్టి కోర్టులను ఆశ్రయించకుండా ఉంటే కూల్చివేతా సాధ్యమయ్యేది కాదు. ఆ ప్రాంతంలోని నివాసులు తమను తాము ప్రజలు అనుకోకుండా పౌరులుగా వ్యవహరించినందువల్లే కూల్చివేత సాధ్యమైంది.
సుప్రీంకోర్టు ఈ హార్మ్యాలను సూపర్‌ టెక్‌ సంస్థ తమ సొంత ఖర్చుతో కూల్చి వేయాలని ఆదేశింది. కూల్చివేతకు రూ. 20 కోట్లు ఖర్చయింది. కానీ సూపర్‌ ఆ సంస్థ అయిదు కోట్లే భరిస్తుందట. మిగతా పదిహేను కోట్లు భవన శిథిలాలను అమ్మి పూడుస్తారట. ఈ శిథిలాలు 80000 టన్నుల మేర ఉంటాయంటున్నారు. ఈ భవనాలను కూల్చి వేయడానికి అధికారులు సకల జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమరాల్డ్‌ కోర్టు, ఎ.టి.ఎస్‌. విలేజ్‌ సొసైటీల్లో ఉండే అయిదు వేల మందిని అధికారులు ఇతర ప్రాంతాలకు తరలిచారు. కానీ ఆ పరిసరాల్లోని జేపీ ఫ్లై ఓవర్‌ దరిదాపుల్లో ఇంకా అనేక వేలమంది నివసిస్తున్నారు. ఈ భవనాలను కూల్చి వేస్తున్నామని మాట వరసకు పోలీసులు దయతో సమాచారం అందించారు. ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎలాంటి సంబంధమూ లేదు. అయితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. ప్రత్యామ్నాయ వసతి కల్పించలేదు. చుట్టుపక్కల ఘరానా అపార్ట్మెంట్లలో నివసించే వారిని మాత్రం క్షేమంగా తరలించారు. అయినా ఆ పేదలు హఠాత్తుగా ఎక్కడికెళ్లాలి? ఫ్లై ఓవర్‌ సురక్షితంగానే ఉంటుందనుకున్నామని నోయిడా పాలనా విభాగం అధికారి సెలవిచ్చారు. అయితే కూల్చి వేసినప్పుడు ఆ ధూళి వల్ల ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పి ఔదార్యం ఒలకబోశారు. చాలా మంది శనివారం రాత్రి గుడిసెలు ఖాళీ చేసి వెళ్లారట. వారి బాగోగులు పట్టించుకున్న వారు మాత్రం లేరు. 2జి కుంభకోణం నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మోదీ నాయకత్వంలోని బీజేపీ, సచ్ఛీలతకు ప్రతిరూపం అని టముకు వేసుకునే దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నానా యాగీ చేశారు. కానీ ఉత్తరప్రదేశ్‌ లో గత ఆరేళ్ల నుంచి అధికారంలో ఉన్న యోగీ ప్రభుత్వం కంటికి ఈ భవనాల పునాదుల్లో దాగిన, ఆకాశానికి ఎగిసిన అవినీతి కనిపించనే లేదు. అవినీతిలోనూ స్వ పర భేదాలు ఉంటాయిగా! కూల్చివేత వేత మాత్రమే పరిష్కారం కాదు. ఉపహార్‌ సినిమాహాలు దగ్ధమైనప్పుడు దాని యజమానులను జైలులో పెట్టారు. అలాంటి చర్యే సూపర్‌ టెక్‌ సంస్థ యజమానుల మీద తీసుకున్నప్పుడే అసలైన పరిష్కారం జరిగినట్టు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img