Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

అశ్లీలతపై కత్తెర్లుండవా?

‘‘చూడాల్సినవే చూడండి! చూడాలనిపిస్తే మళ్లీ మళ్లీ చూడండి!’’ అని ఆస్కార్‌ అవార్డు అందుకోవడానికి ముందో, వెనుకో గానీ భారతీయ ప్రముఖ దర్శకుడు సత్యజిత్‌రే కొన్ని దశాబ్దాల క్రితం సినిమాలపై ప్రేక్షకులకు ఇచ్చిన సలహా ఇది. తాజాగా ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) ప్రభంజనం ప్రపంచాన్ని తాకిన తర్వాత వినోదప్రియులు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు వినోదాన్ని అనుభవించే అవకాశం వచ్చింది. ఓటీటీ వేదికలు వినోదాన్ని విస్తృతపరిచినంత వేగంగానే, విచ్చలవిడిగా అశ్లీల దృశ్యాలు, సంభాషణలకు (కంటెంట్‌) ఇంటింటికీ పంచిపెట్టే పనిలో పడ్డాయి. ప్రభుత్వాలతోపాటు విజ్ఞులు విస్మరించినప్పటికీ, తక్షణమే దృష్టిపెట్టాల్సిన అంశాల్లో ఇదొకటి. లేకుంటే ఓటీటీల ముప్పేట దాడి దేశాన్ని ఏ దశకైనా చేర్చవచ్చు. కరోనా నేపథ్యంలో సినిమా ధియేటర్లను మూసివేసిన తర్వాత ప్రజలు టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్‌ను ఆశ్రయించాక…పదేళ్లలో అభివృద్ధి చెందాల్సిన ఓటీటీలు కేవలం ఏడాదిలో వంద రెట్ల వృద్ధిని, మార్కెట్‌ను, లాభాలను గడిరచాయి. భారత్‌లో 2019 నాటికి 3.2 కోట్ల మంది వీక్షకులు కలిగివున్న ఓటీటీ ప్రపంచం కేవలం ఏడాదిలో 2020 ఆఖరికి 6.2 కోట్లకు, ప్రస్తుతం 10 కోట్లకు చేరుకుంది.
సినిమా ధియేటర్లలో చూడటం, రేడియోల్లో వినడం ఒక్కటే ఒకప్పుడు మన ముందున్న వినోద వేదిక. ఆ తర్వాతి కాలంలో టీవీలు వచ్చి వినోదానికి ఒక్కసారిగా సొబగులు, సోయగాలు దిద్దాయి. అనంతరం అరచేతిలోకి అంతర్జాలం వచ్చి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకోవడమేగాక, వినోదాన్ని కొత్త పుంతలు తొక్కించింది. అంతర్జాల ఆధారంగా నడిచే వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ వంటి చానల్స్‌ను దాటి, ‘అంతకుమించి (ఓటీటీఓవర్‌ ద టాప్‌)’ అనే భావనతో వచ్చిన వినోద వేదికలు ఇప్పుడు ప్రపంచ వినోద రంగాన్ని ఏలుతున్నాయి. ఇది ఒకందుకు మంచిదే కావచ్చు. కానీ విజ్ఞానం తెచ్చిన విపరీత బుద్ధి ఓటీటీలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ప్రస్తుతం మనకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌, సన్‌నెక్ట్స్‌, జీ5, ఆహా, వూట్‌, సోనీ లివ్‌ వంటి వందలాది ఓటీటీ వేదికలు అందుబాటులో వున్నాయి. ఇవన్నీ కొత్తగా విడుదలైన సినిమాలతోపాటు పాతసినిమాలు, ఒరిజినల్స్‌, లఘుచిత్రాలు, రియాలిటీషోలు తదితర వినోద కార్యక్రమాలను వీడియోల రూపంలో అపరిమితంగా మన ముందుంచుతున్నాయి. అయితే ఏ చట్ట పరిధిలోకీ రాకుండా, అడ్డూఅదుపు లేకుండా వినోదాన్ని అందించే వేదికలు ఏవైనా వున్నాయా అంటే అవి ఓటీటీలు మాత్రమే. దీంతో దాదాపు అన్ని ఓటీటీలు ప్రజలు మాట్లాడే భాషను, యాసను, దృశ్యాలను ఉన్నదిఉన్నట్టుగా చూపించడం మొదలుపెట్టాయి. టీవీ చానల్స్‌లో ఏళ్ల తరబడి ‘సాగే’ ధారావాహికలను కేవలం 15 ఎపిసోడ్ల లోపు ముగించే విధంగా ఉండే వెబ్‌సిరీస్‌లలో చూపుతున్నాయి. వీటిలో మాటలు, స్వరాలు అన్నీ బూతుపురాణాలే. ఇండియాలో ఇంటిల్లిపాదీ బ్లూఫిల్మ్‌లు చూడటమనేది అసాధ్యమనుకున్నాం. కానీ ఓటీటీల పుణ్యమా అని ఆ సంప్రదాయం కూడా గాలికెగిరిపోయింది. అసభ్యకర పదజాలం, అశ్లీల వీడియోలకు వేదికలుగా ఓటీటీలు తెగబడుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే, కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న బీజేపీ తన మనువాదాన్ని వ్యాప్తిచేసేందుకు, నియంత్రణ లేని ఓటీటీలను సరికొత్త వేదికగా మలచుకుంటున్నది. మతోన్మాదాన్ని, హింసోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు వీటిని వాడుకుంటున్నది. సోషల్‌మీడియా నియంత్రణకు చట్టాలు తీసుకువచ్చినప్పటికీ, అవింకా ఓటీటీ దాకా వెళ్లలేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ కంటెంట్‌ ఎలక్ట్రానిక్స్‌ సమాచార సాంకేతిక శాఖ, సమాచార సాంకేతిక చట్టం2000కి లోబడి ఉండాలి. ఈ పరిధిలో పనిచేయడం తప్ప ఓటీటీ వేదికల నియంత్రణకు ఈనాటివరకు ఎలాంటి ఇతర చట్టాలు గానీ, చట్టబద్ధమైన సంస్థలు గానీ లేవు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు అంతర్జాల మీడిమా నైతికతల కోడ్‌) రూల్స్‌`2021 పేరుతో సరికొత్త నియమావళిని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అదింకా బాల్యావస్థలోనే ఉండిపోయింది. పైగా కేవలం మీడియా, సోషల్‌మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధంగా ప్రభుత్వ చర్యలు వుండటంతో అది తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతర్జాల వార్తా మీడియా, ఓటీటీ వీడియో స్ట్రీమింగ్‌ వేదికలను గట్టిగా నియంత్రించడమే ఈ నియమావళి ఉద్దేశమని ప్రభుత్వం చెపుతోంది. మూడంచెల స్వయం నియంత్రిత నిర్మాణ విధానం ఈ చట్ట లక్ష్యం. తొలి రెండు అంచెల్లో ఓటీటీలు నియంత్రణ పాటించకపోతే, మూడో అంచెలో కేంద్ర ప్రభుత్వం రంగప్రవేశం చేస్తుంది. కాకపోతే బీజేపీ సర్కారు ‘అంతకుమించి’ నియంత్రణలు, నిఘాలు పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు.
ఓటీటీ కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ విధించడానికి కేంద్ర ఇఐటీ శాఖ మొదట్లో తిరస్కరించింది. ఆ తర్వాతనే ఈ మూడంచెల విధానానికి రూపకల్పన చేయడం ప్రారంభించింది. ఈ మార్గదర్శకాలు ఎప్పటికల్లా అమలవుతాయో, అవి ఓటీటీల అశ్లీల వీడియోలను ఎలా అడ్డుకుంటాయో ఇప్పుడే చెప్పలేం. పైగా ‘మధ్యవర్తిత్వం’ అనే పదప్రయోగం వివాదా స్పదమవుతున్నది. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లు ఈ పదం పరిధిలో వున్నట్టా? లేనట్టా? ఈ ప్రయోగాల నడుమ జాప్యం జరుగు తోంది. ఈలోగా చేయాల్సినదంతా ఓటీటీలు చేసేస్తున్నాయి. అశ్లీల దృశ్యాలు, సంభాషణలపై సెన్సార్‌షిప్‌ లేకపోవడంతో ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ‘కుటుంబసహిత బూతుచిత్రం’ తిలకించే దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయి.
భారత్‌లో ఓటీటీ మార్కెట్‌ సొమ్ములు కురిపిస్తోంది. కరోనా గోలలో ప్రపంచ మార్కెట్‌ అంతా ఓవైపు వుంటే, కేవలం ఓటీటీ మార్కెట్‌ మాత్రమే ఇంకోవైపు నిలిచింది. కొవిడ్‌కాలంలో చిల్లిగవ్వ నష్టపోకుండా రాజసంతో మీసం మెలేసిన ఏకైక మార్కెట్‌ ఓటీటీ మాత్రమే. ఆర్‌బిఎస్‌ఎ అడ్వయిజర్స్‌ నివేదికప్రకారం, 2021లో 1.5 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌తో అలరారుతున్న భారత ఓటీటీ 2030నాటికి 12.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ 41 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకొని అగ్రస్థానంలో నిలవగా, ఎరోస్‌ నౌ 24%, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో 9%, నెట్‌ఫ్లిక్స్‌ 7%, జీ5 4%, ఆల్ట్‌బాలాజీ 4%, సోనీలివ్‌ 3%, యాపిల్‌టీవీ 1%లతో తదుపరి స్థానాల్లో నిలిచాయి. ఎంత మార్కెట్‌ సాధించినా, ఎంతసొమ్ముచేసుకున్నా…ఆక్షేపణలు ఉండవచ్చు, ఉండక పోవచ్చు. అశ్లీల, అసభ్యకరఅంశాలతో ఓటీటీలు విశృంఖలంగా వ్యవహరిస్తే మాత్రం వాటికి కళ్లెం వేయాల్సిందే! అలాంటి వాటికి కత్తెర పడాల్సిందే!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img