Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

అసత్యమే శరణ్యం

అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉండాలి అంటారు. ఈ విద్య ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు అబ్బి నంతగా మరే రాజకీయ నాయకుడికీ ఒంటబట్టి ఉండదు. ఎన్నికల ప్రచార సభల్లో రాజకీయ నాయకుల ఉపన్యాసాలలో అతిశయోక్తు లకు కొదవ ఉండదు. బూటకపు వాగ్దానాలకు అంతే ఉండదు. ఓట్లు రాబట్టడంకోసం వాగ్దానాల జడివాన కురిపిస్తుంటారు కనక శుష్క వాగ్దానాలకు అసత్యాలు కూడా తోడు కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ సత్యాసత్యాల నిగ్గు తేల్చడానికి వీలున్న సందర్భాలలో కూడా అబద్ధం చెప్పాలంటే చాలా సాహసం కావాలి. అసత్యాన్ని సత్యంగా చెలామణి చేయడంలో బీజేపీ నాయకులు రాటుదేరి పోయారు. కర్నాటక శాసన సభ ఎన్నికలకు మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ పడరాని పాట్లు పడ్తోంది. అయితే ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణలన్నీ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని కచ్చితంగా చెప్పకపోయినా బీజేపీ ఓటమి అనివార్యం అనే చెప్తున్నాయి. ముఖ్యమంత్రి బసవ రాజ్‌ బొమ్మై పని తీరు మీద బోలెడు ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత సర్వవ్యాప్తంగా కనిపిస్తోంది. బీజేపీకి మొట్టమొదట అధికారం రుచిచూపించిన కర్నాటకలోనే బీజేపీకి చుక్కెదురయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నికల గోదాలో విజయాలు సాధించడంలో ఆరితేరిన వారికైనా భయం పుట్టక మానదు. మంగళ, బుధవారాల్లో కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కర్నాటకలో మత కలహాలు చెల రేగుతాయని హెచ్చరించారు.
2002లో గుజరాత్‌లో తగిన గుణపాఠం చెప్పినందువల్లే అక్కడ మతకలహాలు జరగడం లేదని అమిత్‌ షా చెప్పుకున్నారు. ఎవరికి గుణపాఠం చెప్పినందువల్ల గుజరాత్‌లో మత కలహాలు జరగడం లేదని అమిత్‌ షా అంటున్నారో విప్పి చెప్పనవసరం లేదు. కానీ కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే మతకలహాలు చెలరేగుతాయని అమిత్‌ షా చెప్పడం ఎంత బూటకమో గణాంకాలను పరిశీలిస్తే తేలిపోతుంది. 2019 నుంచి కర్నాటకలో బీజేపీయే అధికారంలో ఉంది. కర్నాటకలో 31 జిల్లాలు ఉంటే 18 జిల్లాల్లో ఈ అయిదేళ్ల కాలంలో 163 సార్లు మతకలహాలు జరిగాయి. ఈ విషయం తెలియజేసింది మరెవరో కాదు. సాక్షాత్తు కర్నాటక హోం మంత్రే. అదీ శాసన మండలి సమావేశంలో చెప్పారు. నిండు సభలో చెప్పిన మాటను నమ్మకుండా ఉండలేం కదా! 2019 నుంచి ఇప్పటి వరకు 163 సార్లు మతకలహాలు జరిగితే అందులో అయిదింట మూడు వంతులు మల్నాడు జిల్లాలోని శివమొగ్గలోనే జరిగాయి. కర్నాటక హోం మంత్రి ఈ జిల్లానుంచే వచ్చారు. ఈ జిల్లా మత వైషమ్యాలకు చాలా కాలంగా నెలవుగా ఉంది. ఈ 163 సందర్భాలలో జరిగిన మతకలహాలలో 300 మంది పోలీసులు గాయపడ్డారు. మంగళూరు నగరం, దక్షిణ కన్నడ, గడగ్‌, శివమొగ్గలో మతకలహాలు చెలరేగాయని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర శాసన మండలిలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
మత కలహాల సంఖ్య ఎక్కువగా నమోదు కావడానికి జ్ఞానేంద్ర ఒక సాకు కూడా వెతుక్కున్నారు. ఇంతకు ముందు మతకలహాలు జరిగితే చాలా వరకు అవి నమోదయ్యేవి కావని, ఇప్పుడు పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చినందువల్ల నమోదు పెరగడంతో మతకలహాల సంఖ్య పెరిగినట్టు కనిపిస్తోందని ఆయన తెలియజేశారు. పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే క్రమంగా మతకలహాలు తగ్గి ఉండాలిగా! అదీ లేదు. 2019లో 16 సార్లు, 2020లో 19 సార్లు, 2021లో 32 సార్లు, 2022లో 96 సార్లు మత కలహాలు జరిగాయి. అంటే నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. శివమొగ్గ లో 57 సందర్భాలలో, బాగల్‌ కోట్‌ లో 22 దఫాలు, దావణగేరేలో 18 సార్లు, కొడగులో 10 సార్లు, దక్షిణ కర్నాటకలో పదిసార్లు మతచిచ్చు చెలరేగింది. ఈ వివరాలన్ని గత ఏడాది సెప్టెంబర్‌ 15న హోం మంత్రి జ్ఞానేంద్ర సభా ముఖంగా తెలియజేసినవే. ముస్లింల మీద వ్యతిరేకత రెచ్చగొట్టడానికి బీజేపీ ఎన్ని ఎత్తులెత్తిందో స్పష్టంగానే కనిపిస్తోంది. హిజాబ్‌ గొడవకు కేంద్రం కర్నాటకేనని ఎలా మరిచిపోగలం. సభా ముఖంగా కూడా అసత్యం చెప్పడానికి భయపడని నాయకులు దండిగానే ఉన్నారు. మతోద్రిక్తతలను రెచ్చగొట్టే పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాను (పి.ఎఫ్‌.ఐ.) నిషేధించామని సదరు మంత్రి గొప్పగా చెప్పుకున్నారు. నిషేధం సవ్యంగా అమలుకావడం లేదనుకోవాలేమో. శివమొగ్గలో మత చిచ్చు ఆరని జ్వాలా గానే కొనసాగుతోందని మాజీ పోలీసు డైరెక్టర్‌ ఎస్‌.టి. రమేశ్‌ అంటున్నారు. ఆ ప్రాంతంలో మతకలహాలు పరిపాటేనట. కోస్తా ప్రాంతం, హుబ్బలి, బాగల్‌ కోట్‌, కల్బుర్గి లో హిందుత్వ కార్యకలాపాలు చాలా చురుకుగా సాగుతాయంటున్నారు ఆయన. మతకలహాలను ప్రేరేపించేది రాజకీయ నాయకులే. వాటివల్ల లబ్ధి పొందేదీ రాజకీయ పార్టీలే.
కర్నాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే 385 క్రిమినల్‌ కేసులను ఉపసంహరించింది. ఇందులో 182 కేసులు విద్వేష ప్రసంగాలకు సంబంధించినవే అంటే ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో అర్థం చేసుకోవచ్చు. అమిత్‌ షా కర్నాటకలో ఎన్నికల ప్రచారసభలో మాట్లాడడానికి సరిగ్గా రెండురోజుల ముందు ఓ ప్రముఖ దినపత్రిక ఈ గణాంకాలు వెల్లడిరచింది. ఈ క్రిమినల్‌ కేసులను వెనక్కు తీసుకోవడంవల్ల వెయ్యిమంది కేసుల జంరaాటం నుంచి బయటపడ్డారు. మాఫీ చేసిన కేసుల్లో మళ్లీ 182 కేసులు మతకలహాలకు సంబంధించినవే. మాఫీ అయిన కేసులు ఏ మతానికి చెందిన వారివో పరిశోధించి తేల్చుకోవలసిన అంశం ఏమీ కాదు. కేసుల మాఫీవల్ల లబ్ధి పొందిన వారిలో బీజేపీ ఎంపీ ప్రతాప్‌ సింహ, ఎమ్మెల్యే రేణుకాచార్య కూడా ఉన్నారు. మాఫీ చేసిన 182 మత చిచ్చు సంబంధ కేసుల్లో 45 మితవాద వర్గం హింసకు పాల్పడిన సమయంలో మోపినవే. ఇవన్నీ 2017లో నమోదైన కేసులే. ఈ ఉదంతంలో 300 మంది మీద కేసులు మోపారు. ఉపసం హరించారు కనక అందరూ నిర్దోషులై పోయారు. చిక్‌ మగళూరులో గో సంరక్షకులకు సంబంధించిన కేసులు, కొడగు, మైసూరులో టిప్పుసుల్తాన్‌ జయంతి, శ్రీరామ నవమి, గణేశ్‌ ఉత్సవాలు, హనుమజ్జయంతి సందర్భంలో నమోదు చేసిన కేసులూ రద్దయి పోయాయి. ఈ సమయంలో కేసులు ఏ మతం వారిమీద నమోదై ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇందులో మతాంతర వివాహాలు, మత మార్పిడులకు సంబంధించిన కేసులూ ఉన్నాయి. యుద్ధంలో మొదట బలయ్యేది సత్యమేనంటారు. ఎన్నికలయుద్ధంలో కూడా సత్యమే బలవు తోంది. ఎన్నికల్లో విజయం సాధించడానికి అసత్యాలో, అర్ధ సత్యాలో చెప్పడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అమిత్‌ షా తరహా అసత్య ప్రచార ప్రభావం దీర్ఘ కాలంగా ఉంటుంది. విద్వేషం రెచ్చగొడ్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img