Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

ఆందోళనకరమైన సుప్రీంకోర్టు
న్యాయమూర్తుల వ్యాఖ్యలు

బలవంతంతో మత మార్పిడులు దేశ భద్రతకే ముప్పు తెస్తాయని, వీటివల్ల చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయని, ఇలాంటి వాటిని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు తెలియజేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బలవంతంగా మతం మార్పిడులు కొనసాగితే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయని న్యాయమూర్తులు ఎం.ఆర్‌.షా, హిమ కోహ్లీతో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు అక్కడితో ఆగలేదు. ప్రలోభాలకులోను చేసి మతంమార్పించే సంఘటనలను నివారించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో నివేదించాలని ఈ న్యాయమూర్తులు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరారు. బలవంతపు మత మార్పిడులవల్ల మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, జనం చేతనకు విఘాతం కలుగు తుందని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయదాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే సందర్భంలో సుప్రీంకోర్టు ఈ హితవచనాలు పలకింది. ‘‘బెదిరించి, హెచ్చరించి, మోసగించి, కానుకలలాంటి ఎరలువేసి, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని నమ్మబలికి మతం మార్పించడాన్ని నిరోధించాలని కోరుతూ అశ్వినీ కుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అశ్వినీ కుమార్‌ కేవలం న్యాయవాది మాత్రమే కాదు. ఆయన బీజేపీకి గట్టి మద్దతు దారు. బీజేపీ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి ఉపకరించే అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలుచేయడం ఆయన పనిగా పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌ దాఖలు చేయడం వెనక ఉన్న ఉద్దేశాలను ప్రత్యేకంగా గమనిస్తేతప్ప అసలు విషయం బయట పడదు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి మతస్వేచ్ఛకు అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ స్వేచ్ఛ పుట్టుకతోనే సంక్రమించదు. ఎందుకంటే ఈ దేశంలోపుట్టే ప్రతివ్యక్తి అనివార్యంగా ఏదో ఒక మతంలోనే పుడతాడు. పుట్టుకతోపాటే ప్రతి పౌరుడికి ఏదో ఒక మతంతో విడదీయరాని సంబంధం ఏర్పడుతోంది. సాధారణంగా తల్లిదండ్రులది ఏ మతమో వారి సంతానానిదీ అదే మతం అవుతుంది. ఒక వేళ తల్లిదండ్రులు భిన్న మతాలవారైతే వారి ఇంట్లో ఏ మత సంప్రదాయాలు కొనసాగుతాయో ఆ మతమే వారి సంతానానిది కూడా అవుతుంది. అప్పుడూ పుట్టుకవల్లే ఎవరిది ఏ మతమో నిర్ణయమై పోతోంది. మతస్వేచ్ఛ ప్రసాదించిన రాజ్యాంగమే మత మార్పిడికీ అవకాశం కల్పించింది. అయితే ఇది బలవంతంగా జరగకూడదు. అలా జరిగితే అది చట్టవిరుద్ధమైందిగానే లెక్క. మతమార్పిడులకు అనేక కారణాలు ఉండవచ్చు. తమకు పుట్టుకతో వచ్చిన మతంమీద విశ్వాసం సడలితే, మరో మతం అంతకన్నా మెరుగైంది అనిపిస్తే, లేదా ఆరాధనా పద్ధతుల విషయంలో వ్యక్తుల అభిప్రాయాలు సడలితే లేదా మారితే మతం మార్చుకోవడానికి అవకాశం ఉంది. డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ మొదలు అలా మార్చుకున్న వారి ప్రముఖుల జాబితానే అనంతంగా ఉంది. ఒక మతంలోని ఆచారాలు, కట్టుబాట్లు నచ్చక మతం మారిన వారూ ఉంటారు. ఉన్నారు. కొన్నాళ్ల కిందటివరకు ఈ మతమార్పిడుల వివాదం కేరళలో ఎక్కువగా వినిపించేది. అదీ జనాన్ని బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్పిస్తున్నారన్న ఆరోపణలే ఎక్కువగా వినిపించేవి. ఈ మధ్య కాలంలో అనేక రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరవాత హిందువులను బలవంతంగా క్రైస్తవం, ఇస్లాం మతాల్లోకి మార్పిస్తున్నారన్న ఆరోపణలు మితిమీరాయి. లవ్‌ జిహాద్‌ లాంటి మాటలు సంఫ్‌ుపరివార్‌ అనుసరించే ముస్లిం వ్యతిరేక విధానాల నేపథ్యంలో చెలామణిలోకి వచ్చినవే. ఇతర మతాలనుంచి హిందూ మతంలోకి మారిన సందర్భాలు తక్కువే కావచ్చు. అయినా అలాంటివి ఉన్నప్పుడు చిన్న నిరసన స్వరం వినిపించిన దాఖలా కూడా లేదు. బీజేపీకి కేంద్రంలోనే కాక వివిధ రాష్ట్రాలలో అధికారం దక్కిన తరవాత ఒక వేపు ముస్లింల మీద విద్వేషం విరజిమ్మడం, మరో వేపు హిందూమతానికి ప్రమాదం ముంచుకొచ్చిందని నమ్మించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బలవంతపు మత మార్పిడులు అన్న యాగీ మొదలైంది.
అశ్వినీ కుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడానికన్నా ముందే కనీసం 11 రాష్ట్రాలు బలవంతపు మతమార్పిడులను నిరోధించ డానికి ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చాయి. ఇలాంటి మత మార్పిడులను శిక్షార్హమైన నేరంగా పరిగణించడం మొదలైంది. ఇలాంటి చట్టాలకూ సుదీర్ఘమైన చరిత్రే ఉంది. 1967లోనే ఒరిస్సాలో బలవంతపు మత మార్పిడుల చట్టం తీసుకొచ్చారు. ఇలాంటి చట్టాలలో అదే మొదటిది. మతాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం వినియోగించుకోవడం బీజేపీ రంగం మీదకు వచ్చిన తరవాత మాత్రమే జరిగిన పరిణామం కాదు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఒరిస్సా, అరుణాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, హర్యానాలో ఇలాంటి చట్టాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. ప్రలోభ పెట్టి బలవంతంగా మతం మార్పిస్తే చట్ట రీత్యా శిక్షించడానికి జరిమానాలు, జైలు శిక్షలు ఈ చట్టాల ప్రకారం నిర్ధారణ అయిపోయాయి. ఈ జరిమానాలు రూ.5,000 నుంచి లక్ష రూపాయల దాకా ఒక్కో రాష్ట్రంలో ఒకోలా ఉన్నాయి. అలాగే జైలు శిక్షలు కూడా ఏడాది నుంచి అయిదేళ్ల దాకా ఉన్నాయి. ఈ చట్టాలు అమలులోకి రావడం అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దృష్టిలోకి రాలేదు అనుకోలేం. అయినా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి బలవంతపు మత మార్పిడులను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించడం న్యాయమూర్తుల వైఖరిలో భిన్నత్వం ఉంటుందని సరిపెట్టుకోదగిన విషయంగా మాత్రమే పరిగణించి ఊరుకోగలమా? న్యాయమూర్తుల భావజాలం ప్రమేయం ఇందులో లేశ మాత్రంగా కూడా లేదనిచెప్పే అవకాశమూ లేదు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు వ్యక్తంచేసిన ఆందోళన కేసు విచారణ సంపూర్ణంగా మొదలుకాక ముందేనన్న విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి. అశ్వినీ కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేయడంలోని ఆంతర్యాన్ని న్యాయమూర్తులు గమనించ లేదని అనుకోవడానికీ వీలులేదు. ఈ వ్యాఖ్యలు చేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర బలవంతపు మత మార్పిడులకు సంబంధించిన గణాంకాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించడం అనౌచిత్యం ఏమీకాదు. కేవలం పెళ్లికోసమే మతంమార్పిడి చెల్లదన్న అంశం వివిధరాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాలన్నింటిలో కనిపిస్తుంది. కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించాలన్న సూత్రం ఏమై పోయిందో తెలియదు. కులమత విభేదాలను రూపుమాపడానికి కులాంతర మతాంతర వివాహాలు తోడ్పడతాయని మొన్న మొన్నటిదాకా ప్రచారం అమాంతం మాయమైపోయినట్టుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ పరిశీలనలో లేని అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. ఏ మతంతోనూ సంబంధం లేకుండా కూడా ఉండొచ్చునని రాజ్యాంగం చెప్పిన విషయాన్ని న్యాయమూర్తులు పరిగణించనట్టు లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img