Friday, August 12, 2022
Friday, August 12, 2022

గట్టి మేలు తలపెట్టని సుప్రీంకోర్టు

న్యాయమూర్తులు తీర్పులు చెప్పేటప్పుడు రాసే మాటలకన్నా విచారణా ప్రక్రియా క్రమంలో పలికే మాటలు చాలా వాడిగా, రసవత్తరంగా, ఆశాజనకంగా ఉంటున్నాయి. మహమ్మద్‌ ప్రవక్తను అవమానించేలా టీవీ తెరపై వ్యాఖ్యల బాణాలు వదిలిన నూపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలను తప్పుబడ్తూ న్యాయమూర్తులు సూర్యకాంత్‌, ఎన్‌.వి.పార్దీవాలా అన్న మాటలు వరహాల మూటలే. హిందుత్వం తలకెక్కిన నూపుర్‌ శర్మ మాటలు దేశంలో చిచ్చు రేపాయి అని ఆ న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కింద నూపుర్‌ శర్మ ఓ టీవీ చర్చ సందర్భంగా అన్న మాటలు మతోన్మాద కార్యకలాపాలను రెచ్చగొట్టాయి. దీనితో నూపుర్‌ శర్మ మీద సామాజిక మాధ్యమాలలో విపరీతమైన దాడి జరుగుతోంది. ఆమె మీద వివిధ ప్రాంతాలలో అనేక కేసులు దాఖలైనాయి. ఈ కేసులన్నింటికీ తాను హాజరు కావడం లేదా కేసులను ఎదుర్కోవడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవడం కష్టం కనక ఆ కేసులన్నింటినీ దిల్లీకి బదిలీ చేయాలని నూపుర్‌ శర్మ సుప్రీం కోర్టులో అర్జీ పెట్టుకున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆమె అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించుకున్నారు. ‘‘ముప్పు ఆమెకు ఉందా లేదా ఆమె వల్ల ఇతరులకు ఉందా? ఆమె దేశంలో భావోద్రేకాలను రెచ్చ గొట్టారు. దేశంలో ఇప్పుడు జరుగున్న వికృత చేష్టలకు, హత్యాకాండకు ఆమె మాటలే కారణం’’ అని న్యాయమూర్తి సూర్యకాంత్‌ అన్నారు. అక్కడితో ఆగకుండా న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశంపై టీవీ చానళ్లు, నూపుర్‌ శర్మ ఎలా చర్చిస్తారు అని కూడా ప్రశ్నించారు. ఇది హిందుత్వ ఎజెండాను ప్రచారం చేయడమే అని ఆగ్రహించారు. ఆమె అధికార పార్టీ ప్రతినిధి అయినంత మాత్రాన చట్టాన్ని ఉల్లంఘిస్తారా అని కూడా ఆ న్యాయమూర్తి నిలదీశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు నూపుర్‌ శర్మను ఇప్పటికీ అరెస్టు చేయనందుకు దిల్లీ పోలీసుల మీద కూడా న్యాయ మూర్తులు విరుచుకుపడ్డారు. అంటే నూపుర్‌ శర్మకు అధికార వర్గాల్లో ఎంత పలుకుబడి ఉందో అర్థం అవుతోందని అన్నారు. నూపుర్‌ శర్మ వ్యాఖ్యల కారణంగానే ఉదయ్‌ పూర్‌లో దర్జీ కన్‌హయా లాల్‌ను హత్య చేశారన్నారు. న్యాయం కోసం పాటుబడే వారికి, మానవ హక్కులను పరిరక్షించే వారికి, న్యాయస్థానాలు తమ కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వర్తించాలని కోరుకునే వారికి సంతృప్తి కలగజేసే విధంగానే కాక ఆశలు రేకెత్తేట్టుగా న్యాయమూర్తులు సూర్యకాంత్‌, పార్దీవాలా విమర్శనాత్మకంగా మాట్లాడారు. ఇవన్నీ విన సొంపుగా ఉంటాయి. రేపో మాపో న్యాయం అందరి ముంగిట్లోకి వస్తుం దన్న భరోసా కల్పించేలా ఉన్నాయి. కానీ న్యాయమూర్తుల ఇలాంటి పలుకు లన్నీ తీర్పుల పేరిట రాసే వందలాది పేజీలలో ఎక్కడా కనిపించవు. తీర్పులు రాసేటప్పుడు న్యాయమూర్తుల ధర్మాగ్రహం నిద్రాణ స్థితిలోకి వెళ్లి పోతుందేమో అన్న అనుమానం కల్గుతుంది. దేశద్రోహ చట్టంలాంటివి ఎంత కిరాతకమైనవో, ప్రాథమిక హక్కులు ఎంత పవిత్రమైనవో న్యాయ మూర్తులు అనేక సందర్భాలలో విడమర్చి చెప్పారు. అయినా ఆ కిరాతక చట్టాలను రద్దు చేయడానికి న్యాయస్థానాలు ఏ మాత్రం చొరవ తీసుకోవు. దేశద్రోహ చట్టంలాంటి వాటిని కొట్టేయవు. ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించి, దేశ భవిష్యత్తుకు సంబంధించి, మౌలిక రాజ్యాంగ అంశాలకు సంబంధించి దాఖలైన అనేకానేక పిటిషన్లను ఏళ్ల తరబడి అత్యున్నత న్యాయస్థానం కనీసం చర్చకైనా చేపట్టదు. ఏళ్లు గడిచినా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై విచారణ మొదలే కాదు. ప్రజా వ్యతిరేక, కిరాతక చట్టాలు ఈ లోగా అమలైపోతూనే ఉంటాయి. అమాయకులు ఏళ్ల తరబడి నిష్కార ణంగా జైళ్లలో మగ్గుతూనే ఉంటారు. దాదాపు మూడేళ్ల నుంచి కశ్మీర్‌ స్వయంప్రతిపత్తిని మింగేసిన 370వ అధికరణం రద్దును సవాలు చేస్తూ ఉన్న కేసు సుప్రీంకోర్టు విచారణకు నోచుకోనే లేదు. భీమా కోరే గావ్‌ కేసులో డజను మందికి పైగా మేధావులు, ప్రజాస్వామ్యం కోసం, పౌర హక్కుల కోసం పాటు పడేవారు, సామాజిక కార్యకర్తలు, దేశం ఆదరించే మేధావులు, ప్రజాభిమానాన్ని సంపాదించిన పేరుపొందిన రచయితలు నాలుగేళ్లుగా జైలులో మగ్గుతూనే ఉన్నారు. అందులో ఒకరైన ఎనిమిది పదులు దాటిన గిరిజన హక్కుల పరిరక్షకుడు స్టాన్‌ స్వామి నిర్బంధంలో ఉండగానే మరణించారు. 83 ఏళ్ల వయసులో అనేక అనారోగ్య సమస్య లతో సతమతమవుతున్న ప్రసిద్ధ కవి, పౌరహక్కుల కార్యకర్త వరవర రావు ఇప్పటికీ అనారోగ్య కారణాలపై శాశ్వత బెయిలు కోసం అనునిత్యం కోర్టుల గుమ్మం ఎక్కుతూనే ఉన్నారు. దిగుతూనే ఉన్నారు. అయినా ఈ కేసు విచా రణ దశకు ఎందుకు రాదు అని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసిన సంద ర్భమే లేదు. ఈ కేసులో నిందితులు బెయిలు కోసం పెట్టుకున్న అర్జీలను మాత్రం వివిధ న్యాయస్థానాలు విచారిస్తూనే ఉన్నాయి. ఈ తతంగం ఎన్నాళ్లు కొనసాగుతుంది అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించదు. రిపబ్లిక్‌ టీవీ అధినేత, గోదీ మీడియా నడుపుతున్న వారిలో ప్రథమగణ్యు డైన అర్నాబ్‌ గోస్వామికి బెయిలు మంజూరు చేయడానికి ఇవే న్యాయ స్థానాలు అర్ధ రాత్రి, అపరాత్రి కూడా విచారణ చేపడ్తాయి. ఈ వైరుధ్యం ఎన్నటికీ అర్థం కాదు.
సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిణామాలను, భిన్న వర్గాల ప్రజల మధ్య విద్వేషం నింపే మతతత్వవాదుల ప్రేలాపనలు ఎన్నడూ సుప్రీంకోర్టు న్యాయ మూర్తులకు వినిపించవు. ఒక ఎజెండా ప్రకారమే విద్వేష ప్రచారం కొన సాగుతోందనీ, దీని కారణంగా ఇప్పటికే అనేక మంది కిరాతకంగా హత్యకు గురైనారని సుప్రీంకోర్టుకో, హైకోర్టులకో తెలియదని అనుకోలేం. అయినా ఒక్కసారి కూడా న్యాయమూర్తులు ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం విచిత్రం. ఈ భయంకర నిశ్శబ్దం భరించడం కష్టం. చట్ట వ్యతిరేక కార్య కలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ.) వ్యక్తి స్వేచ్ఛకు తావే లేకుండా చేస్తోంది. ఏ పాపమూ ఎరుగని వారు ఈ చట్టం కింద ఏళ్ల తరబడి దిక్కూ మొక్కూ లేకుండా జైళ్లలో మగ్గుతున్నా అత్యున్నత న్యాయస్థానం కిమ్మనదు. వారు ‘‘అపరాధం చేసి ఉంటారు’’ అన్న ఒకే ఒక్క వాదన కారణంగా అనేక మంది జీవితాలు జైళ్లల్లోనే తెల్లారి పోతున్నాయి. వారి జీవితాల్లోని ఫల ప్రదమైన కాలం వృథా అవుతోంది. అయినా అత్యున్నత న్యాయస్థానం చలించదు. ఇది భయంకరమైన పరిస్థితి. న్యాయవ్యవస్థ, చట్టసభలు, కార్య నిర్వాహకవర్గం దేనికది నిర్వర్తించవలసిన బాధ్యత ఇంతవరకు అమలు కానే లేదు. ఈ మూడు రాజ్యవ్యవస్థల మధ్య సమాతూకం ఎన్నడూ సంపూ ర్ణంగా కుదరనే లేదు. చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం మీద ప్రజలకు బొత్తిగా విశ్వాసం లేదు. అంతో ఇంతో న్యాయవ్యవస్థ మీదే జనం ఆశలు పెట్టుకున్నారు. ఆ న్యాయవ్యవస్థ అప్పుడప్పుడూ ఆవేశపూరితంగా చెప్పే మాటలు బోలెడు భరోసా కల్పిస్తాయి. ఆచరణ దగ్గరికి వచ్చేసరికి ఆ ఆవేశం ఆవిరైపోతోంది. వలసవాదుల చట్టాలు ఇప్పటికీ అమలవుతోంటే, ప్రాథమిక హక్కులు అడుగడుగుడునా నిరంకుశ పాలకుల పదఘట్టనల కింద నలిగిపోతూ ఉంటే న్యాయవ్యవస్థ నివారించిన దాఖలాలే లేవు. అప్పుడప్పుడూ చెప్పే సుభాషితాలు, పలికే చిలకపలుకులవల్ల ఒరుగుతున్నది ఏమీ లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img