Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

ఆర్థిక వ్యవస్థపై భ్రమలు చెల్లవు

భారత స్థూల జాతీయ ఉత్పత్తి (జి.డి.పి.) 20.1 శాతం పెరిగిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌.ఎస్‌.ఓ.) తెలియజేసింది. దీని ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ పుంజు కుంటోందని నమ్మించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మొదటి త్రైమాసిక జి.డి.పి.ని గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చెప్పిన సంఖ్య ఇది. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య అత్యవసర కార్యకలాపాలను మినహాయిస్తే మిగతా ఆర్థిక కార్యకలాపాలన్ని మూతబడేఉన్నాయి. కరోనాకారణంగా ఆర్థిక కార్యకలాపాలు చాలా వరకు స్తంభించిపోయాయి. అది కరోనా మహమ్మారి ఆవహించిన మొదటి దశ. కరోనా కారణంగా ఆర్థికవ్యవస్థ కుదేలైపోయిన కాలంతో ఈ సంవత్సరం అదేకాలంతో పోల్చిచూస్తే కొద్దోగొప్పో మెరుగుదల కని పించడం సహజమే. ఎందుకంటే జూన్‌ ఒకటి నుంచి ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పట్టాలెక్కడం మొదలైంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించి నందువల్ల ఆర్థిక కార్యకలాపాలన్ని స్తంభించిపోయిన గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది అదేకాలంలో జి.డి.పి.వృద్ధి చెందినట్టు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను ఈ రకంగా పోల్చి చూడడం భ్రమ కల్పించడానికి తప్ప ఎందుకూ కొరగాదు. కరోనా కల్లోలం లేక ముందు ఆర్థిక వ్యవస్థతో ప్రస్తుత స్థితిని పోల్చి చూసినప్పుడు మెరుగ్గా కనిపిస్తే అది వృద్ధికి సంకేతం అవుతుంది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో లాక్‌డౌన్‌ గత ఏడాది ఇదే సమయంలో ఉన్నంత కఠినంగా లేదు. ఎంతో కొంత ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం వచ్చింది. ఆ దృష్టితో చూస్తే స్వల్పంగా ఎదుగుదల కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న కాలంతో పోల్చి చూసినప్పుడు కనిపించే వృద్ధి నికరమైంది కాదు. పైగా ఎదుగుదల కనిపించిందన్న సమయంలో వాస్తవ పరిస్థితి భయానకంగానే ఉంది. రెండో దశ కరోనా విలయ తాండవం కొనసాగిన సమయం అది. ఈ కాలంలో ఆర్థిక కార్యకలాపాలు ఎంతో కొంత కొనసాగిన మాట నిజమే అయినా జన జీవనం దయనీయంగా ఉంది. రెండో దశలో జన సంచారం మీద ఆంక్షలు ఉన్నప్పటికీ ఆర్థిక కార్య కలాపాలను అనుమతించారు. సరఫరా, ఉత్పత్తిపై ఆంక్షలు నామ మాత్రంగానే ఉన్నాయి. 2021 జనవరి-మార్చి నాటి పరిస్థితులతో పోలిస్తే సాధించామనుకుంటున్న మెరుగుదల కేవలం 1.6 శాతం మాత్రమే. మొదటి విడత కరోనా విజృంభించిన సమయంలో ఆర్థిక వ్యవస్థ 23.4 శాతం కుంచించుకు పోయింది. కనిపించిందంటున్న స్వల్ప ఎదుగుదల కూడా 2021 జూన్‌లో రిజర్వు బ్యాంకు అంచనా వేసిన 21.4 శాతం కన్నా తక్కువే ఉంది. అందువల్ల కరోనా లేక ముందు 2019-20 మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే అసలు వ్యవహారం బయటపడేది. ఆ రకంగా వృద్ధి పది శాతం తక్కువే ఉంది. నిజానికి 2019-20 మొదటి త్రైమాసికంలో కనిపించిన వృద్ధి రేటు కూడా అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువే. నికరంగా చెప్పాలంటే 2019-20 మొదటి త్రైమాసికంలో జి.డి.పి. 2011-12 నాటి ధరలతో పోల్చి చూస్తే 35.7 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 2020-21 లో ఇది రూ. 27 లక్షల కోట్లు మాత్రమే. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జి.డి.పి. రూ.32.4 లక్షల కోట్లు అంటే రూ.35.7 లక్షల కోట్లతో పోల్చి చూస్తే రూ.3.3 లక్షల కోట్లు తక్కువే. పెరుగుదల కనిపించక పోయినా పెరుగుదల ఉన్నట్టు భ్రమ కల్పించడంవల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు.
వస్తూత్పత్తి, నిర్మాణ రంగాలలో కూడా వృద్ధి సాధించామని చెప్తున్న లెక్కలు కూడా గతేడాది ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనంగా ఉన్న సమయంతో పోల్చి చెప్పినవే. కిందటేడాదీ వర్షాలు బాగా కురిసినందువల్ల వ్యవసాయ రంగ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఈ ఏడాది కూడా వర్షాలు సంతృప్తికరంగానే ఉన్నందువల్ల వ్యవసాయ రంగ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని ఊహించడంలో తప్పులేదు. కరోనా ప్రభావం గత సంవత్సరం కానీ ఈ ఏడాది కానీ వ్యవసాయ రంగం మీద మిగతా రంగాల మీద ఉన్నంత ఎక్కువగా లేదు. కరోనా వ్యాపించక ముందు ఉన్న కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీనంగానే ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే సరైన విధాన నిర్ణయాలు తీసుకోవడం కష్టం. ఈ లోపం భవిష్యత్‌ ఆర్థిక స్థితిని కూడా దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. ఇంకా గమ్యం చాలా దూరం ఉంది. కరోనా ప్రభావం వల్ల కీలకమైన సేవా రంగం బాగా నీరసించిపోయింది. ఈ రంగం పుంజుకున్న ఛాయలు ఎక్కడా కనిపించడం లేదు. అయినా మోదీ ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం 20.1శాతం వృద్ధిరేటు కనిపించిందని నమ్మబలుకు తున్నారు. ఇది వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఆర్థిక వ్యవస్థ విఫలం కావడంలో మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని మసి పూసి మారేడు కాయ చేయడానికి ఈ గణాంకాల సాము గరిడీలు ఉపకరించవచ్చునేమో కాని దేశ ఆర్థిక స్థితికి ఒరిగేది ఏమీ ఉండదు. మన ఆర్థిక వ్యవస్థ పునాది లేదా మౌలికాంశాలన్నీ పటిష్ఠంగా ఉన్నాయని ఆర్థిక సలహాదారు అంటున్నారు. ఆ పునాది పదిలంగా ఉందనుకున్నా అది మోదీ సర్కారు ఘనత కానే కాదు. పునాది పదిల పడిరది అంతకుముందున్న ప్రభుత్వాలు అనుసరించిన విధానాలవల్ల. 2020-21 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడైనా 16.9 శాతం వృద్ధి రేటు తక్కువగానే ఉంది. అంటే కరోనా మహమ్మారి విజృంభించక ముదున్న ఆర్థిక వ్యవస్థ దశను చేరుకోవడం సాధ్యం కాలేదనే. ప్రపంచంలో ఇంత ఆర్థిక అభివృద్ధి ఏ దేశంలోనూ సాధించలేదని మోదీ సర్కారు టముకు వేసు కుంటోంది. అదీ వాస్తవం కాదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మనకన్నా మెరుగైన ఆర్థికాభివృద్ధి నమోదు చేసిందన్న విషయాన్ని అంగీకరించాలి. కరోనా సోకక ముందున్న ఆర్థిక ఎదుగుదల కూడా బ్రహ్మాండమైంది ఏమీ కాదు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుంగి పోవడమే తప్ప ఎదుగుదల ఏనాడూ లేదు. గణాంకాల మాయలో పడేసి ప్రజల మెప్పు పొందాలని ప్రయత్నించడం అసలుకే మోసం తెస్తుంది. కరోనా సోకక ముందున్న స్థితికి మన ఆర్థిక వ్యవస్థ చేరడానికి కనీసం మరో రెండేళ్లు పట్టవచ్చు. ఇది వాస్తవం. విధానాలరూపకల్పన వాస్తవాధారితమై ఉండాలి తప్ప కల్పనలపై, ఊహాగానాలపై, జనాన్ని మభ్యపెట్టేరీతిలో ఉండకూడదు. అంతర్జాతీయంగా కూడా మన ఆర్థిక వ్యవస్థ పని తీరును పరిశీలించి, లెక్కలు కట్టి బేరీజు వేసే సంస్థలు అనేకం ఉన్నాయి. వాటన్నింటినీ అసత్య ప్రచారం వల్ల నమ్మించ లేమని గుర్తుంచుకోవాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img