Monday, December 5, 2022
Monday, December 5, 2022

ఆర్‌.ఎస్‌.ఎస్‌. నోట ప్రతిపక్షాల మాట

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే తాజాగా దేశంలోని పేదరికం, నిరుద్యోగం, పోషకాహార లోపం తదితర అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాతృ సంస్థ అగ్రనాయకుడు ఈ కీలకాంశాలను బహిరంగంగా లేవనెత్తడం ఆశ్చర్యకరమే కాదు. అది మోదీ సర్కారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై ఎక్కుపెట్టిన తీవ్ర విమర్శ కూడా. ఇంతకాలంగా ప్రతిపక్ష నాయకులు ఏ అంశాలనైతే లేవనెత్తుతూ వచ్చారో ఇప్పుడు హోసబలే అవే విషయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే మోదీ ఆర్థిక విధానాల మీద బీజేపీకి గురుపీఠమైన ఆర్‌.ఎస్‌.ఎస్‌. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టే. ఎనిమిదేళ్ల అధికారం తరవాత మోదీ ఆర్‌.ఎస్‌. ఎస్‌.ను ఖాతరు చేయడం లేదన్న గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. హోసబలే విమర్శతో ఆర్‌.ఎస్‌.ఎస్‌. మోదీ సర్కారు నడవడికను మెచ్చడం లేదని తేలిపోయింది. 20 కోట్ల మంది ప్రజలు ఇంకా నిరుపేదలుగానే ఉన్నారని హోసబలే చెప్పారు. అనేక దశాబ్దాలుగా అనుసరించిన ఆర్థిక విధానాలవల్లే ఆర్థిక పరిస్థితి దుర్భరంగా తయారైందని ఒక వేపు ఆయన చెప్తూనే ఉన్నా ఆయన విమర్శల ఆంతర్యం మోదీ సర్కారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల మీద ఆర్‌.ఎస్‌.ఎస్‌. అసంతృప్తితో ఉందని అంగీకరించవలసిందే. అయితే బీజేపీ సర్కారును బహిరంగా దుయ్యబట్టినట్టు కనిపించకూడదనుకుని ఆయన గత కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక విధానాలను మెరుగుపరచడానికి చర్యలు తీసు కున్నారని అన్నారు. ఈ మాటనే ఆయన నమ్ముతున్నట్టయితే లేదా మోదీ సర్కారు ఆర్థిక విధానాలు సవ్యంగా ఉన్నాయని భావిస్తున్నట్టు అయితే పేదరికం, నిరుద్యోగం, పోషకాహార లోపం గురించి ఆయన ప్రస్తావించ వలసిన అవసరం ఏముటుందిగనక. కాంగ్రెస్‌ అరవై ఏళ్లు పాలించింది నాకు అరవై నెలలు ఇవ్వండి అన్న అభ్యర్థనతోనే మోదీ అధికారంలోకి వచ్చారు. అరవై నెలల కాలం గడిచి మరో రెండేళ్లు గడిచినా హోసబలే నిరసన వ్యక్తం చేయడం అంటే ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు బీజేపీకి మధ్య ఎక్కడో పొసగడం లేదని అనుకోవాలి. దేశంలో నాలుగు కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారనీ నిరుద్యోగం 7.6 శాతం ఉందని హోసబలే అందరికీ తెలిసిన లెక్కలే ఉటంకిస్తున్నారు. అంటే అత్యధిక సంఖ్యాకులను వేధిస్తున్న సమస్యే ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను కూడా కలవర పెడ్తోందని భావించక తప్పదు. ఉపాధి అవకాశాలు, సముచిత విద్యావకాశాలు, పోషకాహార లోపం, అనేక గ్రామాలకు పరిశుభ్రమైన మంచి నీరు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పేదరికం బ్రహ్మ రాక్షసిలా తయారైందని హోసబలే అంటున్నారు. ఈ రాక్షసిని సంహరించవలసిందేనన్న హోసబలే మాటతో ఎవరికీ భిన్నాభి ప్రాయం ఉండనవసరం లేదు. దేశ జనాభాలో 23 కోట్ల మందికి రోజువారీ ఆదాయం రూ. 375 కన్నా తక్కువే ఉందని ఆర్‌.ఎస్‌.ఎస్‌.కు అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హోసబలే అనేక సమస్యలను ప్రస్తావించారు. ఈ సంస్థ స్వావలంబి భారత్‌ పథకం అమలు చేస్తోంది. మామూలు భాషలో చెప్పాలంటే ఇది మన కాళ్ల మీద మనం నిలబడడం లేదా స్వయం సమృద్ధంగా ఉండడం. దీనినే మోదీ తన భాషలో ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటున్నారు. హోసబలే మాటలను బట్టి చూస్తే ఈ ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఎక్కడా కనిపించడం లేదని స్పష్టం అవుతోంది. ఆర్థిక అసమానతలు అంతకంతకూ పెరిగిపోవడం మీద కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకుడు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నా ప్రస్తుత పరిస్థితి అందుకు అనుగుణంగా లేదని ఆయన నిర్మొహమాటంగానే చెప్పారు. ఒక్క శాతం మంది గుప్పెట్లో దేశ సంపదలోని 20 శాతం ఉంటే, 50 శాతం మంది దగ్గర కేవలం 13 శాతం సంపదే ఉందని హోసబలే గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. ఐక్య రాజ్యసమితి విడుదల చేసిన గణాంకాలను కూడా హోసబలే ప్రస్తావిం చారు. కానీ ఇలాంటి సందర్భాలలో గౌరవ ప్రతిష్ఠలు గల అంతర్జాతీయ వేదికలు వెల్లడిరచే గణాంకాలను మోదీ సర్కారు తోసిపుచ్చుతోంది. విదేశీ కొలమానాలు మనకు సరిపడవని వాదిస్తోంది. హోసబలే అవే గణాంకాల ఆధారంగా మాట్లాడుతున్నారంటే ఆయన ఆవేదనను మోదీ సర్కారు కొట్టి పారేస్తుందనుకోవాలా! శీతోష్ణ స్థితిలో మార్పులు, సమాజంలోని భిన్న వర్గాల మధ్య వైషమ్యాల కారణంగా కూడా పేదరికం తాండవిస్తోందని హోసబలే అంటున్నారు. ఈ వైషమ్యాలు ఆర్‌.ఎస్‌.ఎస్‌. వ్యాపింపజేసే విచ్ఛిన్నకర భావజాల ఫలితమేనని ఆయనకు తెలియక కాదు. తమను ఖాతరు చేయకుండా వ్యవహరిస్తున్న మోదీని ఒక్క పొడుపు పొడవడానికే హోసబలే ఈ విమర్శలకు దిగి ఉంటారు. పట్టణాలు పెరిగితే ఉద్యోగావకా శాలు పెరుగుతాయన్న ఆలోచనా ధోరణి వమ్ము అయిందని కూడా హోస బలే చెప్పారు. పట్టణాల పెరుగుదలను ప్రోత్సహించినందువల్ల నగర జీవనం నరకప్రాయం అయింది. కరోనా మహమ్మారి చెలరేగిన సమ యంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెంచాలనుకున్నామనీ అందుకోసమే స్వావలంబి భారత్‌ పథకం చేపట్టామని హోసబలే గుర్తు చేశారు. అదీ సాకారం కాకపోవడమే ఆయన ఆందోళనకు ప్రధాన కారణం. దేశవ్యాప్త పథకాలకన్నా స్థానిక అవసరాల ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించవలసిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఉద్యోగార్థులకు ఉపాధి కల్పించడం మీద కాకుండా వారే ఇతరులకు ఉద్యోగాలిచ్చే పరిస్థితి కల్పించడమే తమ లక్ష్యం అని మోదీ ఎప్పటి నుంచో ఊదరగొడ్తున్నారు. హోస బలే నోట కూడా అదే మాట వెలువడుతోంది. మరి తేడా ఎక్కడు న్నట్టు! హోసబలే వ్యాకులతకు కారణం ఏమిటి? ఆయుర్వేద ఔషధాల తయారీ కోసం గ్రామాలలో అవకాశాలు పెంచాలని ఆయన సూచిస్తున్నారు. బాబా రాం దేవ్‌ ఆయుర్వేద ప్రచారం బాగానే చేస్తున్నారు. దానివల్ల కలిగిన పరిణామం ఏమిటంటే ఆయన ఆయుర్వేద వ్యాపారం కొండంతలై పోవడం మాత్రమే. ప్రతికూల ప్రభావం ఏమిటంటే ఇతర వైద్య విధానాలను రాందేవ్‌ బాబా తూలనాడి జనాన్ని గందరగోళం లోకి నెట్టేయడం. విద్యార్హత సాధించిన వారు అందరికీ ఉద్యోగాలు కల్పిం చడం సాధ్యం కాదని ఆర్‌.ఎస్‌.ఎస్‌. నాయకుడు దాపరికం లేకుండానే అంగీకరించారు. పరిశ్రమల వ్యవస్థాపకులను ప్రోత్సహించాలన్నది ఆయన వాదన. ఆ ఆలోచన మంచి చెడ్డలు ఎలా ఉన్నా కుంటి నడక నడుస్తున్న ఆర్థిక వ్యవస్థలో అది పగటి కలగానే మిగిలిపోక తప్పదు. ప్రభుత్వం ఆర్థిక విధానాలను పునస్సమీక్షించుకోవాలని, స్వదేశీ ఉత్పత్తులు పెరగాలనీ, దిగు మతులు తగ్గించాలని, స్థానిక ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలని ఆర్‌.ఎస్‌. ఎస్‌. దాని అనుబంధ సంస్థలు అంటున్నాయి. మోదీ సైతం ఇవే మాటలు వల్లిస్తున్నా ఆచరణలో అతికొద్దిమందికి సర్వ సంపదలూ దోచిపెట్టే ప్రక్రియే కొనసాగుతోంది. దీని గురించి హోసబలే ప్రస్తా వించకపోవడం గమనించా ల్సిన అంశమే. దసరాకు సరిగ్గా ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి ప్రబలమైన కారణం ఉండే ఉంటుంది. దసరా రోజు ఆర్‌.ఎస్‌.ఎస్‌. అధినేత మోహన్‌ భగవత్‌ సందేశం ఏ ధోరణిలో ఉంటుందో గమనించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img