Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ఆశాదీపం

దేశ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలంగా తయారైన కీలక దశలో భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో శుక్రవారం నుంచి మంగళవారం దాకా అయిదు రోజుల పాటు జరుగుతున్నాయి. 2018లో కేరళలోని కొల్లాంలో జరిగిన 23వ మహాసభల నుంచి చూస్తే దేశ రాజకీయాలు పెనం మీంచి పొయ్యిలోపడ్డట్టు అత్యంత మితవాద దిశగా సాగుతున్నాయి. ఈ దశలో 24వ మహాసభల్లో తాజా రాజకీయ, ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగాచర్చించి బీజేపీ పురోగమనాన్ని అడ్డుకోవ డానికి అత్యవసరమైన, నిర్దిష్టమైన కార్యచరణ ప్రణాళికను నిర్దేశించ వలసిన ఆవశ్యకత ఉంది. అంటే విశాల ప్రాతిపదికన ప్రజాస్వామ్య, సెక్యులర్‌ శక్తులను పటిష్ఠంచేసి, ఐక్యం చేసి పోరాట పథాన్ని రూపొందించు కోవడానికి ఈ మహాసభలో సముచిత నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 2019లో మోదీ నాయకత్వంలోని బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమాజాన్ని మతాల వారీగా చీల్చడానికి, ముస్లింలను జనజీవన స్రవంతి నుంచి దూరం చేయడానికి ప్రయత్నపూర్వకంగా ముస్లింల మీద ద్వేషాన్ని పెంచి పోషించడానికి భారీ ఎత్తున కుటిల పన్నాగాలు పన్నడంలో హిందుత్వ శక్తులు నిమగ్నమై ఉన్నాయి. ఈ క్రమంలో సకల రాజ్యాంగ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌/మే నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో అధికారం నిలబెట్టు కోవడానికి బీజేపీ అన్ని రకాలుగా వనరులు సమీకరించుకుంటోంది. ఆ ఎన్నికలలో కూడా మోదీ మూడో సారి అధికారంలోకి వస్తే సంఫ్‌ు పరివార్‌ కచ్చితంగా 2025 నాటికి ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడానికి సమాయత్తమవుతుంది. 2025 నాటికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. అవతరించి వందేళ్లు అవుతుంది. బీజేపీ వ్యతిరేక శక్తులనూ, భావ సారూప్యతగల రాజకీయ పార్టీలను ఐక్యం చేసి ప్రజా ప్రయోజనాలను కాపాడవలసిన బాధ్యత తమ మీద ఉందని సీపీఐ గ్రహించింది. ఈ లక్ష్య సాధన విస్తృత ప్రాతిపదికన ఎజెండా రూపొందించడం వల్లే సాధించగలమన్న స్పష్టమైన అవగాహన సీపీఐకి ఉంది. అందుకే 24వ మహాసభలో ఆమోదించే రాజకీయ తీర్మానంలో ఈ విషయాలన్నీ విపులంగానే ప్రస్తావించారు. ఇది సాధ్యం కావాలంటే మూడు కర్తవ్యాలు నిర్వర్తించవలసి ఉందని సీపీఐ గుర్తించింది. అందులో మొదటిది సీపీఐని బలోపేతం చేయడం. రెండవది వామపక్ష శక్తులను సంఘటితం చేయడం. మూడవది బీజేపీ నాయకత్వంలోని సంఫ్‌ు పరివార్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ప్రగతిశీల, సెక్యులర్‌ శక్తులను ఐక్యం చేయడానికి తీవ్రంగా కృషి చేయడం. ఈ లక్ష్యాలు నెరవేరడానికి మౌలికమైన ప్రాతిపదిక బీజేపీ-ఆర్‌.ఎస్‌.ఎస్‌. ను వ్యతిరేకించే రాజకీయ శక్తులను, పార్టీలను సమీకృతం చేయవలసిందే. ఈ విస్తృత సంఘటన ఏర్పాడాలంటే కాంగ్రెస్‌ తో సహా, తృణమూల్‌ కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతా దళ్‌, డి.ఎం.కె., నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య మరింత పటిష్ఠమైన అవగాహన కుదరాల్సి ఉంటుంది. అప్పుడే బలమైన ప్రతిపక్షం ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలబడగలుగుతుంది. ప్రజలు ఎదురు చూస్తున్నది ఈ ప్రత్యామ్నాయం కోసమే. వచ్చే లోకసభ ఎన్నికలలో బీజేపీని గద్దె దించడానికి కాంగ్రెస్‌ ఈ వేదికలో క్రియాశీల పాత్ర పోషించేట్టు ఉండాలి. 2019 ఎన్నికలు జరగడానికి ముందూ మోదీ సర్కారు మీద అపారమైన వ్యతిరేకత ఉండేది. కానీ ప్రతిపక్షాలు ఒక్క తాటి మీదకు రాకపోవడంతో బీజేపీ విజయావకాశాలు పెరిగాయి. అందుకే బీజేపీ 2014 కన్నా మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించగలిగింది. ఈ దృష్టితో చూస్తే 2024 ఎన్నికలు బీజేపీ వ్యతిరేక, సెక్యులర్‌ శక్తులు కలిసి ఉమ్మడి లక్ష్యసాధనా మార్గాన్ని అనుసరించవలసిందే. ఇది జీవన్మరణ పోరాటం లాంటిది. లేకపోతే బీజేపీ మరో సారి అజేయంగా నిలుస్తుంది. అందుకే బీజేపీ వ్యతిరేక కూటమి అత్యంత శక్తిమంతంగా పని చేయవలసి ఉంటుంది. ప్రతిపక్షాలు వేసే ప్రతి అడుగూ ఆచి తూచి వేయాల్సిందే.
విశాలమైనరీతిలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టడంలో రాష్ట్రాలలో సమస్యలు ఉండక తప్పదు. చాలా రాష్ట్రాలలో బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ రాష్ట్రస్థాయికి వచ్చే సరికి బీజేపీని వ్యతిరేకించే పార్టీలలోనే అంతర్విరోధాలు ఉన్నాయి. అందుకే దేశమంతటా ఒకే రకమైన ఎన్నికల ఎత్తుగడలు అనుసరించడం సాధ్యంకాదన్న నికరమైన అవగాహనా సీపీఐకి ఉంది. అయితే ఉమ్మడి లక్ష్య సాధనకు రాష్ట్రాలలో కనిపించే వైరుధ్యాలు ఆటంకం కాకూడదని సీపీఐ భావిస్తుంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే పరమావధి అన్న అవగాహన బలంగా ఉంటే రాష్ట్రాలలో విభేదాలను అధిగమించడం అసాధ్యమైతే కాదు. రాష్ట్రాల దగ్గరకొచ్చే సరికి బీజేపీని వ్యతిరేకించే పక్షాలలో కూడా అనేక అంశాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అందువల్ల ప్రతిపక్షాలు ఎక్కడికక్కడ అంతిమ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఐక్యంగా మెలగడం సాధ్యమే. వామపక్ష ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేయాలన్న పట్టుదలతో సీపీఐ దశాబ్దాలుగా కృషి చేస్తూనే ఉంది. ఈ కాంక్ష నెరవేరాలంటే ముందు సీపీఐ మరింత బలోపేతం కావడం అనివార్యం. ముందు వామపక్ష శక్తుల మధ్య ఐక్యత సాధిస్తే మిగతా ప్రతిపక్షాలను కూడా ఒకే వేదిక మీదకు, అవి కచ్చితమైన దిశా నిర్దేశంతో పని చేసేట్టు చూడడం సులువు అవుతుంది. చట్ట సభల్లో ఈ మధ్య వామపక్షాల ప్రాతినిధ్యం తగ్గింది. ఇది వామపక్ష ప్రభావం తగ్గిందనడానికి సూచిక కాదు. చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకోవడానికి ప్రయత్నించేక్రమంలో అనువుగానిచోట పోటీచేయకుండా విజయావ కాశాలు ఉన్న ప్రాంతాల్లోనే దృష్టి సారించాలని సీపీఐ సముచిత సంకల్పంతో ఉంది. చట్టసభల్లో ప్రాతినిధ్యంతో సంబంధం లేకుండానే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌ లో కమ్యూనిస్టు పార్టీ అస్తిత్వం మాయమై పోలేదు. ఒకప్పుడు బిహార్‌ సీపీఐకి బలమైన కేంద్రం. బిహార్‌ మహాగట్బంధన్‌ ప్రభుత్వంతోసీపీఐకి సాన్నిహిత్యంఉంది కనక ఆ అవకాశాన్ని వినియోగించు కుంటే మునుపటి ప్రాభవం పునరుద్ధరించడం సాధ్యం అవుతుంది. ఎన్నికల ఫలితాలు మెరుగుపడాలంటే క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను మరింత శక్తిమంతంగా ప్రస్తావించి ఉద్యమాలు నిర్మించవలసిన అగత్యం ఉందన్న అవగాహన సీపీఐకి ఉంది. ప్రజలతో నిత్య సంబంధాలు ఇందుకు కీలకం. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అవసరం గురించి ఎప్పటి నుంచో సీపీఐకి సమగ్రమైన అవగాహన ఉంది. ఈ విషయంలో సీపీఐ దీక్షాబద్ధంగానే వ్యవహరిస్తోంది. సీపీఐతోపాటు వామపక్షాలు బలం పుంజు కోవడం ప్రస్తుత తక్షణావసరం. వామ పక్షాలు బలోపేతం కావాలన్నది నిజానికి ప్రజల ఆకాంక్ష. వామపక్షాలు బలంగా ఉన్నప్పుడే విచ్ఛిన్నకర, మతతత్వ శక్తులను నిలవరించడం సాధ్యం అని ప్రజలు ఎప్పుడో గ్రహించారు. వామపక్షాలు కుంగిపోవడంవల్ల తమకే నష్టమని సవ్యంగా ఆలోచించే వారందరూ భావిస్తున్నారు. వారిలో ఉన్న ఈ ఆశాదీపాన్ని మరింత జ్వాజ్వల్యమానం చేయడానికి 24వ మహాసభ దిటవైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img