Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

ఇదీ మన న్యాయం!

ఒకే విధమైన కేసులో భిన్న న్యాయస్థానాలే కాదు… భిన్న న్యాయమూర్తులు సైతం పరస్పర విరుద్ధమైన తీర్పులు చెప్పడం పరిపాటి అయిన తరుణంలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వ విద్యాలయంలో పరిశోధక విద్యార్థి ఉమర్‌ఖాలిద్‌, యునైటెడ్‌ అగెనెస్ట్టు హేట్‌ సభ్యుడు ఖాలిద్‌ సైఫీలపై గల కేసును శనివారం కోర్టు కొట్టేసి నిర్దోషిగా ప్రకటించడం సంతోషించదగ్గ పరిణామమే. 2020లో ఈశాన్య దిల్లీలో మత కలహాలతో సంబంధం ఉందన్న కేసులో దిల్లీ కోర్టు వీరిద్దరినీ నిర్దోషులుగా ప్రకటించింది. అయితే వీరిద్దరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యు.ఎ.పి.ఎ.) కేసులు కూడా మోపారు. దిల్లీ మతకలహాల కేసులో ఉమర్‌ ఖాలిద్‌కు శిక్ష విధించవలసి వస్తే ఆ శిక్ష ఎంతకాలం ఉండేదో పక్కన పెడితే ఇప్పటికే ఆయనను రెండేళ్ల రెండునెలల పైగా ఎలాంటి విచారణలేకుండా జైలులో మగ్గేట్టు చేశారు. యు.ఎ.పి.ఎ. కింద ఎవరిమీదైనా తీవ్ర ఆరోపణలు మోపి నిరవధికంగా జైలులో ఉంచేయడమే లక్ష్యం అన్న అభిప్రాయం బలంగా నాటుకుని ఉంది. చాలామంది న్యాయమూర్తులు యు.ఎ.పి.ఎ. కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిలు మంజూరు చేయడానికి కూడా జడుస్తున్నారు. కొన్నిసార్లు బెయిలు మంజూరు చేసిన జడ్జీలూ ఉన్నారు. అందువల్ల ఉమర్‌ ఖాలిద్‌కు యు.ఎ.పి.ఎ. కేసులో బెయిలు వస్తుందో లేదో, ఒక వేళ వచ్చినా ఎన్నాళ్లకు వస్తుందో తెలియదన్న అభిప్రాయం బలంగా ఉంది. బెయిలు హక్కు, జైలులో ఉంచడం అరుదుగా మాత్రమే జరగాలని సుప్రీంకోర్టు పదే పదే చెప్పినా కింది స్థాయి న్యాయస్థానాల్లో బెయిలు మంజూరు చేయడానికి జడ్జీలు వెనుకాముందాడుతున్నారు. ఆ మాట ఇటీవల సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్ర చూడే చెప్పారు. ఈ పరిస్థితుల్లో దిల్లీలోని అదనపు సెషన్స్‌ జడ్జి పులస్త్య ప్రమచలా…ఉమర్‌ ఖాలిద్‌, సైఫీలను నిర్దోషులుగా ప్రకటించడం మంచి పరిణామం. అసలు ఈ కేసు నమోదైన తీరే విచిత్రమైంది. ఈశాన్య దిల్లీలోని చాంద్‌బాగ్‌ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు జవాను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు నమోదైంది. అల్లర్లు జరుగుతున్నప్పుడు ఆ పోలీసు జవాన్‌ ఒక చోట తలదాచుకున్నాడట. అప్పుడు అల్లరి మూకలు ఆ ప్రాంతంలో రాళ్లు విసిరారట. కొన్ని వాహనాలను దగ్ధం చేశారట. పోలీసుజవాను తల దాచుకున్న భవనం ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్‌ తాహిర్‌ హుసేన్‌కు చెందిందట. ఆ భవనంనుంచే రాళ్లు విసిరారట. పోలీసు జవాను ఇచ్చిన ఈ వాంగ్మూలం ఆధారంగానే ఉమర్‌ ఖాలిద్‌, సైఫీ మీద కేసు నమోదైంది. ఇదంతా పెద్ద కుట్రలో భాగమని పోలీసులు వాదించారు. ఇంత కాలం ఉమర్‌ ఖాలిద్‌కు బెయిలు మంజూరు చేయడానికి నిరాకరించిన న్యాయస్థానాలు పోలీసుల కథనాన్నే నమ్మాయి. ఏలినవారికి గిట్టని వారిని నిరవధికంగా, బెయిలు కూడా ఇవ్వకుండా ఏళ్ల తరబడి జైలులో ఉంచడానికి సదుపాయం ఉంది. కానీ బెయిలుహక్కు అని అత్యున్నత న్యాయస్థానం చెప్పినా బెయిలు రావడానికి భూమ్యాకాశాలను ఏకం చేయాల్సిందే.
ఉమర్‌ఖాలిద్‌కు ఇంతకుముందు కూడా ఒకసారి బెయిలు మంజూరు అయింది. కానీ యు.ఎ.పి.ఎ. కింద తీవ్ర ఆరోపణలున్న మరోకేసులో బెయిలు రాలేదు కనక విడుదల కాలేదు. వేర్వేరు న్యాయస్థానాలు ఒకేరకమైన కేసుల్లో భిన్నమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యు.ఎ.పి.ఎ. కేసుల్లో న్యాయం జడ్జీనిబట్టి ఉంటోంది. అంటే వ్యక్తులకు స్వేచ్ఛ లభించడం లేదా నిరాకరించడం ఓ లాటరీ లాంటిదన్న మాట. ముంబై, దిల్లీ హైకోర్టులు వేర్వేరు సందర్భాలలో వ్యవహరించిన విధానమే దీనికి నిదర్శనం. ఒకే కోర్టులో ఒకే న్యాయమూర్తి ఒకే రకమైన వేర్వేరు కేసుల్లో భిన్నమైన నిర్ణయం ప్రకటించిన ఉదంతాలూ ఉన్నాయి. ఇలా జడ్జీల వ్యవహార సరళినిబట్టి బెయిలు మంజూరు కాకపోతే వారాలు, నెలలే కాదు… సంవత్సరాల తరబడి జైలులో మగ్గిపోవాల్సిందే. ఉమర్‌ ఖాలిద్‌ కేసులో జరిగింది అదే. బీమా కోరేగావ్‌ కేసులోను బెయిలుమీద విడుదలైన కొద్దిమందిని మినహాయిస్తే మిగతా వారి పరిస్థితీ అదే. యు.ఎ.పి.ఎ. కేసుల్లో న్యాయ నిర్ణయం ఒకేరకంగా జరగడం లేదు. ఎల్గార్‌ పరిషత్‌ కేసులో అరెస్టయిన కబీర్‌కళామంచ్‌కు చెందిన జ్యోతీ జగ్తాప్‌ ఇప్పటికీ బెయిలురాక జైలులోనే మగ్గిపోతున్నారు. జ్యోతి జగ్తాప్‌ బీమా కోరేగావ్‌ సంఘటన జరగడానికి ముందు పాటలుపాడి, ఉపన్యాసాలిచ్చి జనాన్ని రెచ్చగొట్టారట. తీరా ఆమె మీద కేసుమోపినప్పుడు మాత్రం బీమా కోరేగావ్‌ సంఘటన జరగక ముందు ఆమె పాటలుపాడి, ఉపన్యాసాలు ఇచ్చి రెచ్చగొట్టారన్న వివరమే ఎఫ్‌.ఐ.ఆర్‌.లో లేదు. ఆ తరవాత జరిగిన సంఘటనలను మాత్రమే ఎఫ్‌.ఐ.ఆర్‌.లో ప్రస్తావించారు. నిందితులు పెద్దకుట్రలో భాగస్వాములని ప్రాసిక్యూషన్‌ వాదిస్తుంది. న్యాయస్థానాలు ఆ మాటను నమ్మేస్తున్నాయి. బెయిలు నిరాకరిస్తున్నాయి. జ్యోతీ జగ్తాప్‌ కేసులో ఈ వైపరీత్యానిదే ప్రధాన పాత్ర. ఆమె నిషేధంలో ఉన్న సీపీఐ (మావోయిస్టు)లో క్రియాశీల సభ్యురాలన్న ఆరోపణ ఉంది. బొంబాయి హైకోర్టు ఈ వాదనను నమ్మేసింది.
జ్యోతీ జగ్తాప్‌ ‘అచ్ఛేదిన్‌’ అన్న మాటను హేళన చేశారట. ఆధునిక భారత్‌లో దళితులమీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారట. పోలీసులు అల్లే ఈ కథలే వ్యక్తుల స్వేచ్ఛకు సంకెళ్లు కావడం వైపరీత్యమే. నిషేధిత సంస్థతో సంబంధం అంటే క్రియాశీల సభ్యత్వం ఉండాలని, హింసను రెచ్చగొట్టిన దాఖలాలు ఉండాలనీ కేవలం ఆ నిషేధిత సంస్థ సమావేశాలకు హాజరైతే వారు తీవ్రవాదులో, మావోయిస్టులో కాదని సుప్రీంకోర్టు ఆరూప్‌ భూయాన్‌ కేసులో స్పష్టం చేసింది. అయితే ఈ మాటను పట్టించుకునే జడ్జీలను కాగడావేసి వెతికి పట్టించుకోవలసిందే. 2022 మార్చిలో ఉమర్‌ ఖాలిద్‌ బెయిలు వ్యవహారం సెషన్స్‌కోర్టులో ప్రస్తావనకు వచ్చినప్పుడు జడ్జీలు బెయిలు నిరాకరించడానికి హేతుబద్ధమైన కారణం కన్నా ప్రభుత్వ అనుకూలవైఖరి అనుసరించే ధోరణే ప్రధానమైందిగా కనిపిస్తోంది. ఎందుకంటే దిల్లీలో మతకలహాలు జరిగినప్పుడు ఉమర్‌ఖాలీద్‌ కనీసం దిల్లీలో లేరు. యు.ఎ.పి.ఎ. ప్రకారం అయితే దేశ సమైక్యతకు ముప్పు ఏర్పడవలసిన అగత్యమే లేదు. అలాంటి ప్రమాదం ఉందని ఏలినవారు భావిస్తే కేసులు దాఖలై పోతున్నాయి. అలాగే తీవ్రవాదానికి పాల్పడనక్కర్లేదు. పాల్పడే అవకాశం ఉందని ఏలినవారు అనుకున్నా ఎవరినైనా కటకటాల వెనక్కు తోసేయొచ్చు. ఇదీ మన న్యాయం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img