Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

ఇదీ మన న్యాయం

న్యాయం అందరికీ ఒకటేనంటారు. చట్టం ముందు అందరూ సమానులే అంటారు. బెయిలు హక్కు, జైలు అరుదుగా అమలు చేయాలి అని అత్యున్నత న్యాయస్థానంలో ఆసీనులైన వారు హితవు పలుకుతారు. అయితే బీమా కోరేగావ్‌ కేసులో నాలుగేళ్లుగా నిర్బంధంలో ఉన్న మానవ హక్కుల కోసం పోరాడే వారికి, న్యాయవాదులకు, రచయితలకు, మేధావులకు, విద్యావేత్తలకు బెయిలు మంజూరు చేయడానికి మాత్రం ఎక్కడలేని అడ్డంకులు ఎదురవుతాయి. బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయిన స్టాన్‌స్వామి చివరకు నిర్బంధంలో ఉండగానే మరణించారు. ఆయన మృతి కస్టడీ మరణం కింద లెక్కకు రాలేదు. బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయిన 16 మందిలో ఒకరైన మానవ హక్కుల కార్యకర్త గౌతం నవలఖాను తలోజా జైలులో కాకుండా గృహ నిర్బంధంలో ఉంచడానికి సుప్రీంకోర్టు గురువారం అంగీకరించడం కూడా ఆనందించదగిన స్థితికి చేరుకున్నాం. న్యాయం, చట్టం అందరికీ ఒకటే అయినప్పుడు న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు భిన్నంగా ఎందుకుంటాయో అంతు పట్టదు. మరో వేపు హత్య, అత్యాచార ఆరోపణల కింద జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చాబాబా గుర్మీత్‌ రాం రహీంసింగ్‌కు సునాయాసంగా పెరోల్‌ వస్తుంది. బెయిలూ ఇస్తారు. 2022 నాటి గుజరాత్‌ మారణకాండ సమయంలో బిల్కిస్‌ బానో, ఆమె తల్లిపై, కిరాతకంగా అత్యాచారం చేసి, ఆమె మూడేళ్ల కూతురిని బండకేసి బాది చంపినందుకు దోషులుగా తేలిన 11 మందిని ‘‘అమృత కాలం’’లో జైలు నుంచి విడుదల చేస్తారు. విడుదలైన తరవాత వారికి సన్మానాలు చేస్తారు. మహమ్మద్‌ ప్రవక్తను తూలనాడినందుకు అరెస్టయిన తెలంగాణాలో బీజేపీ శాసనసభ్యుడు రాజాసింగ్‌కు బెయిలు మంజూరు అవుతుంది. మతోద్రిక్తతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదన్న షరతు మాత్రమే విధించి బెయిలు మంజూరు చేస్తారు. విద్వేష ప్రసంగాలకు పేరుమోసిన యతి నరసింగానంద బెయిలు షరతులను ఎన్నిసార్లు ఉల్లంఘించినా పోలీసులు పట్టించుకోరు. ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లరు. అందువల్ల ఆయన నిరంతరం విద్వేష ప్రచారం కొనసాగిస్తూనే ఉంటారు. అక్రమ డబ్బు చెలామణి కేసులో శివసేన (ఉద్ధవ్‌ వర్గం) నాయకుడు సంజయ్‌ రౌత్‌కు బుధవారమే బెయిలు మంజూరు అయింది. అసలు ఆయన మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ కేసు పెట్టడమే చెల్లదని న్యాయమూర్తులు బాహాటంగా ప్రకటిస్తారు. అలాంటప్పుడు నిర్దోషిగా తేల్చకుండా బెయిలుమాత్రం మంజూరు చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. మన న్యాయవిధానం ప్రకారం నిజంగానే బెయిలు హక్కు. కానీ నాలుగేళ్లకుపై నుంచి బీమా కోరేగావ్‌ కేసులో తలోజా జైలులో నిర్బంధంలో ఉన్నవారికి బెయిలు ఎందుకు మంజూరు కాదో తెలియదు. సుదీర్ఘ న్యాయపోరాటం తరవాత ఈకేసులో న్యాయవాది, గిరిజనుల సంక్షేమంకోసం పనిచేసే సుధాభరద్వాజ్‌కు మూడేళ్ల మూడు నెలలు ఎలాంటి విచారణాలేకుండా జైలులో మగ్గిన తరవాత 2022 జనవరిలో బెయిలు మంజూరైంది. కానీ దానికి బోలెడు షరతులు. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది. కానీ బెయిలు వచ్చినా ఆమె తన పని తాను చేసుకోవడానికి న్యాయస్థానం అనుమతించదు. ఆమె బొంబాయిలోనే ఉండాలి. ప్రసిద్ధ కవి వరవరరావు పరిస్థితీ అదే. ఎనిమిదిపదులు దాటిన వరవరరావుకు ఆరోగ్య కారణాలవల్ల బెయిలు మంజూరు కావడానికి చాలా పోరాడవలసివచ్చింది. 2021లో ఆయనకు ఆరోగ్యకారణాలవల్ల బెయిలు మంజూరు చేశారు. గత సెప్టెంబర్‌లో మామూలు బెయిలు వచ్చింది. ఆయనా బొంబాయి వదిలి వెళ్లడానికి వీలులేదు.
73 ఏళ్ల గౌతం నవలఖా కాన్సర్‌ వ్యాధితో బాధ పడ్తున్నారు. స్టాన్‌ స్వామికి పట్టిన గతే తనకూ పట్టగూడదనుకున్నారు. అందుకే తనను కనీసం గృహనిర్బంధంలో ఉంచండి అని మొరపెట్టుకుంటే బుధవారం సుప్రీంకోర్టు కరుణించింది. కానీ విధించిన షరతులు పరిశీలిస్తే అవి ఎంత కఠినమైనవో అర్థం అవుతుంది. జైలులో ఉన్నప్పుడు ఆయన చదువుకోవడానికి హాస్యరచయిత ఉడ్‌హౌజ్‌ పుస్తకం ఆయన కుటుంబం పంపిస్తే జైలు అధికారులకు అది అత్యంత ప్రమాదకరంగా కనిపించి ఆయనకు అందజేయలేదు. ఇది హాస్యాస్పదంగా ఉంది అని న్యాయ మూర్తులు వ్యాఖ్యానించారు. దానివల్ల ఆయనకు కలిగిన ప్రయోజనం ఏమీలేదు. నవలఖా తీవ్రమైన నొప్పితో బాధపడ్తున్నా కనీసం ఆయన కూర్చోవడానికి జైలు అధికారులు ఓ కుర్చీ అయినా ఏర్పాటు చేయలేదు. ఆయన కళ్లజోడు ఎవరో దొంగిలిస్తే ఆయన కుటుంబం మరో కళ్లజోడు పంపితే జైలు అధికారులు వాటిని తీసుకుని ఆయనకు అందించడానికి కూడా అంగీకరించలేదు. నిందితులు జైలులో ఉన్నప్పుడు కనీస వసతులైనా ఉండేట్టు చేయడం ఈ కేసును కొనసాగిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ బాధ్యత అని న్యాయమూర్తి శుక్రే అన్నారు. తలోజా జైలులో పరిస్థితి దారుణంగా ఉంటుందని అందరికీ తెలుసు. అయినా జైలులో అవసరమైన మార్పులు చేయరు. జైళ్లు నివాస యోగ్యంగా ఉన్నాయో లేవో జ్యుడీషియల్‌ కస్టడీకి పంపే న్యాయ మూర్తులు పట్టించుకోరు. నవలఖాను ఇంతకు ముందు కూడా గృహ నిర్బంధంలో ఉంచిన సందర్భాలున్నాయి. అయితే ఆయన మళ్లీ జైలుకెళ్లక తప్పలేదు. ఇప్పుడు 48గంటలలోగా ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కె.ఎం.జోసఫ్‌, హృషీకేశ్‌ రాయ్‌ బుధవారం ఆదేశించారు. అయితే ఆయనను గృహనిర్బంధంలో ఉంచడానికి విధించిన షరతులు జైలుశిక్ష కన్నా తీవ్రంగా ఉన్నాయి. ఆయన ఇంటి ముందు పోలీసుల కాపలా ఉంటుంది. పోలీసులను నియమించడానికి అయ్యే ఖర్చు ఆయనే భరించాలట. ఆయన జైలునుంచి గృహనిర్బంధంలోకి వెళ్లాలంటే శుక్రవారంలోగా 2,40,000 రూపాయలు చెల్లించాలి. ఆయన ఇంటి చుట్టూ సి.సి.కెమెరాలు బిగిస్తారు. ఆయన తిరిగే గదుల్లోనూ ఈ కెమెరాలు ఉంటాయి. నవలఖా ఇంటి నుంచి వాహ్యాళికి తప్ప బయటకు అడుగుపెట్టకూడదు. అప్పుడూ పోలీసులు వెంట ఉంటారు. అలా బయట నడిచేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇంటర్నెట్‌, ఫోన్‌ లాంటివి ఆయనకు అందుబాటులో ఉండవు. అయితే రోజుకు ఒకసారి పదినిమిషాలసేపు ఫొన్లో మాట్లాడవచ్చు. అదీ పోలీసులు అందించే ఫోన్లో మాత్రమే. ఆయన కుటుంబసభ్యులు ఇద్దరు మాత్రమే వారానికి ఒకసారి మూడుగంటల పాటు ఆయనను కలుసుకోవచ్చు. ఆయన కేబుల్‌ టీవీ చూడొచ్చు. పత్రికలు చదవొచ్చు. ఇన్ని షరతులు జైలులో కూడా ఉండవేమో! ఈ షరతులు విధించిన న్యాయమూర్తులు నాలుగేళ్లైనా బీమా కోరేగావ్‌ నిందుతుల విచారణ ఎందుకు ప్రారంభంకాలేదు అని ఒక్కమాట కూడా అడగలేదు. ఇదీ మన న్యాయం.!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img