Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

ఉమర్‌ ఖాలిద్‌ విషయంలో వివక్ష

షరా మామూలుగా దిల్లీ హైకోర్టు జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో (జె.ఎన్‌.యు.) పరిశోధక విద్యార్థి ఉమర్‌ ఖాలిద్‌ కు మంగళవారం దిల్లీ హైకోర్టు బెయిలు నిరాకరించింది. 2020 ఈశాన్య దిల్లీలో జరిగిన కలహాలకు ఆయన కుట్రదారు అనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనీ అందువల్ల బెయిలు ఇవ్వడం సాధ్యం కాదన్న కారణం చూపి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు సిద్ధార్థ మృదుల్‌, రజనీశ్‌ భట్నాగర్‌ తో కూడిన బెంచి బెయిలు నిరాకరించింది. బెయిలు కోసం పెట్టుకున్న దరఖాస్తులో పస లేదని న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్య ప్రత్యేకంగా గమనించవలసిన అంశం. అంతకు ముందూ ఉమర్‌ ఖాలీద్‌ కింది కోర్టుల్లో ఎన్నో అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో గత మార్చి 24న పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. ఉమర్‌ ఖాలిద్‌ మీద 1967నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (యు.ఎ.పి.ఎ.), 1984 నాటి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టం, ఆయుధాల చట్టం ప్రకారం ఆరోపణలు మోపారు. ఒక వేపు సుప్రీంకోర్టు ఆరోపణలు ఎదుర్కుంటున్న వారందరినీ జైలులో ఉంచవలసిన అవసరం లేదని, బెయిలు నిందుతుల హక్కు అని చెప్తోంది. బెయిలు కోసం ప్రత్యేక చట్టం చేయవలసిన అవసరం ఉందని ప్రభుత్వానికీ సూచించింది. ఒక నేరారోపణ జరిగినప్పుడు వారిని నెలలు, సంవత్సరాల తరబడి జైలులో నిర్బంధించడం సుప్రీంకోర్టు అభిప్రాయం ప్రకారమే అనవసరం అయినప్పుడు ఈ సూత్రం అన్ని వేళలా ఎందుకు అమలు కాదో అంతు చిక్కదు. ఇంతకీ ఉమర్‌ ఖాలీద్‌ మీద కేసుమోపి, నేరాలకు పాల్పడ్డందుకు అరెస్టు చేయలేదు. ఆయన ప్రసంగాలు ఉద్రేకాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని మాత్రం తమకు కనిపించాయంటున్న ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయమూర్తులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఉంది. ఇంతకీ ఉమర్‌ ఖాలిద్‌ ప్రసంగాల్లో అభ్యంతరకరమైన మాటలు ఏమిటంటే ‘‘ఇన్క్వ్‌లాబ్‌ సలాం’’ (విప్లవ వందనం), ‘‘క్రాంతికారీ ఇస్తిక్బాల్‌’’ (విప్లవకర స్వాగతం). ఇవి జనంలో విప్లవ స్ఫూర్తి కలిగించే నినాదాలే తప్ప విప్లవించమని రెచ్చగొట్టినవీ కావు. వాటిని విని విప్లవంలోకి దూకిన వారూ లేరు. పౌరసత్వ సవరణ చట్టం (సి.ఎ.ఎ.), జాతీయ పౌరుల చిట్థాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన సందర్భంలో ఖాలిద్‌ ఉపన్యాసంలో ఈ మాటలు వాడారు. ఆ సందర్భంలో ఈ నినాదాలు ఇచ్చింది ఖాలిద్‌ ఒక్కడే కారు. ఇన్క్వ్‌లాబ్‌, విప్లవకర అన్న మాటలు నేరపూరితమైనవనడానికి అసలు ఆస్కారమే లేదు. గతంలో ఈ మాటలు వాడిన వారిని, అసలు ఇన్క్వ్‌లాబ్‌ జిందాబాద్‌ అన్న నినాదాన్ని రూపొందించిన కమ్యూనిస్టు నాయకుడు హస్రత్‌ మోహానీని కీర్తిస్తున్నాం. స్ఫూర్తినిచ్చినందుకు గౌరవిస్తున్నాం. అవే మాటలు ఖాలిద్‌ విషయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపం కింద ఎందుకు పరిగణిస్తున్నారో అర్థం కాదు. పైగా ఖాలిద్‌ ఈ నినాదాలు ఇచ్చిన తరవాత విప్లవకర కార్యకలాపాలు జరిగిన దాఖలాలూ లేవు. పౌరసత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలు జరిగిన సమయంలో ఖాలిద్‌ తో పాటు సామాజిక కార్యకర్త ఖాలిద్‌ సైఫీని, జె.ఎన్‌.యు. విద్యార్థి నాయకురాలు నటాషా నర్వాల్‌, పర్యావరణ పరిరక్షణకు పాటు పడే దేవాంగన కలితాను, జామియా సమన్వయ సంఘం సమన్వయకర్త సఫూరా జర్గర్‌ నూ అరెస్టు చేశారు. దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కౌన్సిలర్‌ తాహిర్‌ హుసేన్‌ను కూడా అరెస్టు చేశారు. వీరందరికీ కాలక్రమంలో బెయిలు మంజూరైంది. అలాంటప్పుడు ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం వర్తింపచేస్తున్నారనుకోవాలా లేక ఒక కోర్టు ఒక రకమైన తీర్పు ఇస్తే అదే అంశంలో అవే ఆరోపణలు ఎదుర్కుంటున్న వారి విషయంలో మరో కోర్టు మరో రకంగా నడుచుకుంటోందనుకోవాలా! ఖాలిద్‌ను అరెస్టు చేయకముందూ ఆయన మీద నిరాధార ఆరోపణలు ఎన్నో చేశారు. రెండు సార్లు పాకిస్తాన్‌ వెళ్లి వచ్చాడనీ, పాకిస్తానీ తీవ్రవాదులతో ఆయనకు సంబంధాలున్నాయన్న నిందలూ మోపారు. కానీ ఖాలిద్‌ దగ్గర కనీసం పాస్‌ పోర్టు కూడా లేదు. నటాషా నర్వాల్‌ విషయంలోనూ న్యాయస్థానం 2020 మే 24 బెయిలు మంజూరు చేస్తే ఆమె విడుదల కాకుండా చేయడం కోసం మరి కొన్ని ఆరోపణలు మోపి వెంటనే అరెస్టు చేశారు. ఇలాంటి చర్యలవల్ల ప్రభుత్వం కొంతమంది మీద కత్తిగట్టినట్టు వ్యవహరిస్తోందని తేలిపోతోంది. ఇలాంటి అరెస్టులు ప్రజలను భయభ్రాంతుల్ని చేయడానికీ, ప్రభుత్వం మీద విమర్శలను సహించేది లేదని తెలియజేయడానికేనని 2020 జూన్‌ 26న ఐక్యరాజ్య సమితికి చెందిన అనేకమంది నిపుణులు అన్నారు. నటాషా తండ్రి కరోనాకు గురై మరణిస్తే 2021 మే 11న అంత్యక్రియలు చేయడానికి తాత్కాలిక బెయిలు మంజూరు చేశారు. మే 30న ఆమె మళ్లీ జైలుకెళ్లారు. 2021 జూన్‌ 15న దిల్లీ హైకోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. రెండు రోజుల తరవాత విడుదలయ్యారు. అదే తీరులో పింజ్రా తోడ్‌ (పంజరం బద్దలు కొట్టడం) సంస్థకు చెందిన దేవాంగనా కలితాకు, జామియా విద్యార్థి ఆసిఫ్‌ ఇఖ్బాలుకు బెయిలు మంజూరు అయింది. వారినీ దిల్లీ అల్లర్ల నేపథ్యంలో యు.ఎ.పి.ఎ. కిందే అరెస్టు చేశారు. మరి ఇదే సూత్రం ఉమర్‌ ఖాలిద్‌కు ఎందుకు వర్తించదో! బెయిలు రాకుండా చేసి విచారణ ఊసే లేకుండా జైలులో మగ్గబెట్టడానికి మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎడాపెడా దుర్వినియోగం చేస్తోంది. ప్రభుత్వ విధానాలను ఎదిరించే వారందరి మీదా ఇదే అస్త్రం ప్రయోగిస్తున్నారు. ఇది నేరారోపణ నిరూపణ అయ్యే దాకా ఎవరైనా నిర్దోషులేనన్న సూత్రానికి పూర్తిగా విరుద్ధమైంది. అలాగే దిల్లీ అల్లర్ల సందర్భంగా గర్భిణీ అయిన సఫూరా జర్గర్‌ను జైలులోకి నెట్టారు. చివరకు 2020 జూన్‌లో మానవతావాద దృష్టితో, ఆరోగ్య కారణాలవల్ల ఆమెకు బెయిలు మంజూరైంది. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి అయిన జర్గర్‌ యు.ఎ.పి.ఎ. కింద అరెస్టయ్యారు కనక ఆమెను ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అడుగు పెట్టనివ్వలేదు.
ఎవరి మీదైనా ఆరోపణలు వస్తే వారిని అరెస్టు చేయొచ్చు. విచారణ జరిపించవచ్చు. న్యాయస్థానాలు శిక్ష విధిస్తే దాన్ని అమలు చేయవచ్చు. కానీ నియంతృత్వ ప్రభుత్వాలే కాదు, ప్రజాస్వామ్యం ముసుగులో నిరంకుశంగా ఉండే ప్రభుత్వాలు ఎలాంటి విచారణా జరగకుండా కావాలని విచారణా ప్రక్రియే చేపట్టకుండా ఏళ్ల తరబడి జైళ్లలో పెడ్తుంటారు. మోదీ సర్కారు సరిగ్గా ఇదే పద్ధతిలో వ్యవహరిస్తోంది. బీమా కోరేగావ్‌ కేసులో నాలుగేళ్ల కింద అరెస్టయిన అనేక మంది ప్రముఖులు, మానవ హక్కుల కార్యకర్తలు ఇప్పటికీ జైళ్లల్లో మగ్గుతూనే ఉన్నారు. గిరిజన సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాడిన స్టాన్‌స్వామి జైలులో కాకున్నా నిర్బంధంలో ఉండగానే మరణించారు. అనేక సార్లు కోర్టు మెట్లెక్కి దిగితే తప్ప ప్రసిద్ధ కవి వరవరరావుకు శాశ్వత బెయిలు లభించలేదు. సుధా భరద్వాజ్‌కు సుదీర్ఘ పోరాటం తరవాతే బెయిలు మంజూరు అయింది. మిగతా వారికి ఇప్పటికీ ఆ సదుపాయం దక్కలేదు. బెయిలు పొందడం హక్కు, జైలు అరుదైన సందర్భాలలో మాత్రమే అన్న మౌలిక న్యాయ సూత్రాన్ని మోదీ ప్రభుత్వం ఏ మాత్రం ఖాతరుచేయదు. అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తే జడ్జీలతో పాటు హైకోర్టుల, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం బెయిలు మంజూరు చేయాలంటే అధికార పీఠాల మీద ఉన్న వారి వేపు మోరసాచి చూస్తూ ఉంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img