Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

ఎన్నికల బడ్జెట్‌ అవుతుందా

పార్లమెంట్‌ ఎన్నికలు జరగడానికి ముందు తుదిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ఎలా ఉండబోతున్నది చర్చనీయాంశం. ఆర్థిక అసమానతలు అపారంగా పెరగడం, పేదరికం, నిరుద్యోగం రోజురోజుకీ అధికమవుతున్న దశలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ఇంతకాలం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల విధానాలు మారతాయా అన్నది పరిశీలించవలసి ఉంది. ఈసారి అధికార కేంద్రీకరణ దిశగా మోదీ ప్రభుత్వ బడ్జెట్‌ విధానాలు ఉండవచ్చునన్న సంకేతాలున్నాయి. 9 అసెంబ్లీలకు ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలున్నందున ఇది ఎన్నికల బడ్జెట్‌ కావచ్చు. అలాగే మధ్యతరగతి ప్రజల అనుకూల బడ్జెట్‌ ఉండవచ్చునని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఇటీవల మాట్లాడిన తీరు అనిపిస్తోంది. మధ్యతరగతి వారి కష్టాలు తనకు తెలుసునని తాను కూడా మధ్యతరగతికి చెందిన వ్యక్తినని అన్నారు. అంటే మధ్యతరగతి పట్ల శ్రద్ధ వహిస్తారా? అలాగే ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం, ప్రైవేటీకరణ వేగవంతం లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకుంటే మోదీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా అనుసరిస్తోన్న విధానాలే ఇవి గనుక. బీజేపీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లను స్ఫూర్తిగా తీసుకొని ఈసారి బడ్జెట్‌ను రూపొందించనున్నారని ఆర్థికమంత్రి ఇప్పటికే పరోక్షంగా సూచించారు. ఈ విధానాలు అణగారిన వర్గాల, దిగువ మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను తగ్గించి సంపన్నుల ఆదాయాలను అపారంగా పెంచాయి. ఫలితంగా పేదరికం గత 25 ఏళ్లలో ఏనాడు లేనంతగా మిక్కుటమైంది. ప్రస్తుతం 35కోట్లమంది పేదరికంలో మగ్గు తున్నారని దావోస్‌ సదస్సులో విడుదల చేసిన ఆక్స్‌ఫామ్‌ అధ్యయన నివేదిక వెల్లడిరచింది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా పేదరికం, నిరుద్యోగం పెరుగుతోందని ఆ నివేదిక స్పష్టం చేసింది.
మోదీ ప్రభుత్వం గత మూడేళ్ల బడ్జెట్లు సూత్రబద్దంగా చూస్తే కోవిడ్‌ మహమ్మారి బడ్జెట్లు. ఈ మూడేళ్లలో కోవిడ్‌ వైరస్‌ నుండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆరోగ్యరంగంపైన అణగారిన ప్రజలు, సామాన్యులు, దిగువ స్థాయిలో జీవిస్తున్న వారిని కాపాడేందుకు అధిక నిధులు ఖర్చు చేయవలసి ఉండిరదని, అయితే అభివృద్ధి సాధన పేరుతో ప్రభుత్వ నిధులను ఖర్చు చేసిందని, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ స్టడీస్‌ (ఆర్థికరంగ అధ్యయన కేంద్రం) విభాగం ఇన్ఫోస్పియర్‌బృందం తన అధ్యయనంలో తెలిపింది. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రైవేటురంగం చాలా తక్కువగా పెట్టుబడులు పెట్టడం, ఖర్చు చేయడం అందరికీ తెలిసిందే. 2016 నుండి భారతదేశ వృద్ధి మందగమనంగా ఉంది. ఆకస్మికంగా పెద్దనోట్ల రద్దు, కరోనా మహమ్మారి విజృంభణ లాంటి షాక్‌లను దేశ ప్రజలు అనుభవించారు. ఆర్థికరంగం కుదేలైంది. దీంతో వృద్ధి మాంద్యం ఏర్పడిరది. వీటికి తోడు అధిక నిరుద్యోగం, అసంఘటితరంగం దిగజారిపోవడం, మహిళలకు, పిల్లలకు అమలుచేస్తున్న, అలాగే పౌష్టికాహారం లోపాలున్న వారికి సహాయం లాంటి పథకాలకు కేటాయింపులు దారుణంగా తగ్గిపోయాయి. సామాజిక సంక్షేమ పథకాలను నిర్లక్ష్యం చేసింది మోదీ ప్రభుత్వం. ప్రైవేటు రంగం తగినన్ని నిధులను పెట్టుబడులు పెట్టి అన్ని రంగాలలో మంచి ఉద్యోగాలను సృష్టించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అటు సంక్షేమం, ఇటు వృద్ధి చతికిలపడ్డాయి. ప్రైవేటు రంగం ఆస్తులను పెంచుకొనేందుకు బీజేపీ ప్రభుత్వం తోడ్పడిరది. ఇదే సమయంలో ప్రణాళికాబద్దమైన, ప్రణాళికరహిత వ్యయాలమధ్య అపారమైనతేడాలు చోటు చేసుకున్నాయి.
ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి భారతదేశంలో ఆర్థిక అసమానతల నివేదికను 2022 విడుదల చేసింది. ఆరోగ్యం, విద్య, ఇంటి పరిస్థితులు, కార్మిక మార్కెట్‌ తదితర రంగాలలో అసమానతలు అధికంగా ఉన్నాయని, దీని ఫలితంగానే బహువిధ పేదరికం వివిధ తరగతుల ప్రజల జీవనాన్ని కల్లోలపరుస్తున్నదని నివేదికలో ప్రధానమంత్రి మోదీని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రధానమంత్రి ప్రకృతి విధ్వంసక, ఉద్యోగాల సృష్టిలేని అభివృద్ధిబాటను నేటికీ విడిచిపెట్టలేదు. అత్యధిక పేదరికాన్ని సృష్టించడంలో మోదీ నాయకత్వంలోని బీజేపిప్రభుత్వం ‘‘ఎంతో పురో గతిని’’ సాధించింది. ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం 2021లో సగటున రోజుకి 115మంది దినసరికూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా మహమ్మారికాలంలో ఆర్థికమాంద్యం, అధిక ద్రవ్యోల్బణం కారణంగా కోట్లాది కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ఆనాటి సంక్షోభ పరిస్థితుల నుండి ఇంకా సామాన్య ప్రజలు కోలుకోలేదు. 2022 జూన్‌ చివరి నాటికి కుటుంబాల అప్పు రూ.35.2 ట్రిలియన్లకు చేరిందని ఆర్‌బిఐ నివేదిక స్పష్టం చేసింది. అధిక వడ్డీరేట్లు, పెరుగుతూనే ఉన్న ద్రవ్యోల్బణంతో పేదల దుస్థితి మరింత ఆగాధంలో పడిపోయింది. మరోవైపు కుబేరులు, ధనికులు మరింతగా సంపదపరులయ్యారు. పేదరికాన్ని మోదీ ప్రభుత్వం అసలు అంగీకరించకపోవడం మరింత విషాదం. గత రెండేళ్ల కాలంలో కొత్తగా అనుసరిస్తున్న పన్ను విధానం వల్ల రూ.1.84 లక్షల కోట్లు నష్టం వచ్చింది. సంపన్నులకు పన్ను తగ్గించడం, వ్యక్తులపై పన్నుభారం మోపడం జరిగింది. కార్పొరేట్‌ పన్నుల వసూళ్లు దాదాపు 16శాతం తగ్గిపోయి నష్టాలువచ్చాయి. క్రమంగా పన్నులభారం సామాన్యుల పైకి మళ్లింది. కార్పొరేట్లకు అపార లాభాలు సమకూరాయి. ద్రవ్యోల్బణం పెరుగుదల సంపన్నుల కంటే పేదలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది.
ఈ నేపథ్యంలో సామాన్యులకు, పేదలకు ఆదాయాన్ని పెంచినట్లయితే కొనుగోలు శక్తి పెరిగి ప్రభుత్వానికి ఆదాయం అధికమవుతుంది. పేదరికం తగ్గుతుంది. తద్వారా అసమానతలూ తగ్గుతాయి. అలాగే సంపన్నులు, కుబేరులపైన పన్నులు పెంచడం ప్రభుత్వానికి ఆదాయం పెరిగి సామాజిక కార్యక్రమాలను అధికంగా అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది. ఎన్నికలే తమ లక్ష్యంగా పెట్టుకున్న మోదీ, అమిత్‌షాలు జన సామాన్యాన్ని పట్టించుకోకుండా ఇంకా ఎక్కువమంది కుబేరులను తయారుచేస్తుంటే సామాజిక అలజడులు పెరగవచ్చు. ప్రభుత్వం నిజంగా జనరంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పేదరికం మరింత పెరగకుండా నివారించవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img