Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

ఎన్‌.టి.ఆర్‌. పేరు తొలగించడం మహాపచారమే

ఇది పేర్ల మార్పు రుతువులా ఉంది. యోగీ ఆదిత్యనాథ్‌ నాయకత్వంలోని ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పేర్లు మార్చింది. పాత పేర్లు మార్చి తమ పార్టీ నాయకుల పేర్లు పెట్టారు. లేదా హిందుత్వను ప్రోత్స హించే విధంగా మరో పేరేదో పెట్టారు. ఇదే సంప్రదాయాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా అను సరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉండగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు బుధవారం వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చేశారు. శాసనసభలో దీనికి సంబంధించిన బిల్లు ప్రతిపాదించినప్పుడు తెలుగుదేశం సభ్యులు గొడవ చేస్తే వారిని సభనుంచి సస్పెండ్‌ చేసి మరీ పేరు మార్పును మూజువాణీ ఓటుతో శంఖంలో పోసేశారు. ఎన్‌.టి.ఆర్‌. ఆరోగ్య విశ్వ విద్యాలయానికి ఆ పేరు రావడానికి ఓ చరిత్ర ఉంది. ఎన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య విద్యకోసం ప్రత్యేకంగా విశ్వవిద్యా లయమే ఉండాలని భావించి 1986లో ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఎన్‌.టి.ఆర్‌. మరణించిన తరవాత తెలుగు దేశం ప్రభుత్వం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టింది. ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన 36 ఏళ్లకు పేరు మార్చవలసిన అవసరం ఏమిటని తెలుగు దేశం ప్రశ్నిస్తోంది. సీపీఐ, సీపీఎం, బీజేపీ కూడా ఎన్‌.టి.ఆర్‌. పేరు మార్చి వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి పేరు పెట్టినందుకు అభ్యం తరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రులుగా వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి, తెలుగు దేశం వ్యవస్థాపకుడు, ఆ ప్రాంతీయ పార్టీ తరఫున తొలి ముఖ్య మంత్రి అయిన ఎన్‌.టి. రామారావు ప్రజాభిమానం చూరగొన్న నాయకులే. వారి గౌరవార్థం విశ్వవిద్యాలయానికో, మరో సంస్థకో వారి పేర్లు పెట్టడం తప్పు కాకపోవచ్చు. కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారంలో ఉన్న రాజకీయ పక్షాలు తమకు అభిమాన పాత్రులైన వారి పేర్లు పెట్టడంతోనే తంటా వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలకు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ లాంటి పేర్లు తగిలించినప్పుడే ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌ గాంధీ పేరు పెట్టినప్పుడు తెలుగు దేశం పార్టీ ఎన్‌.టి. రామారావు పేరు పెట్టాలని గట్టిగా కోరింది. కాని విమానాశ్రయ నిర్మాణం జరుగుతున్న దశలో అధికారంలో ఉన్నది వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి కనక ఆయన మాటే చెల్లి అది రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అయింది. జగన్‌ ప్రభుత్వం సహజంగానే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఉన్న ఎన్‌.టి.ఆర్‌. పేరు తీసేసి రాజశేఖర్‌ రెడ్డి పేరు పెట్టడాన్ని సమర్థించుకుంటోంది. ఎన్‌.టి.ఆర్‌. మీద జగన్‌ కు అపారమైన గౌరవం ఉండబట్టే విజయవాడ జిల్లాకు ఎన్‌.టి.ఆర్‌. పేరు పెట్టారని ఉదాహరణ చూపి వాదిస్తున్నారు. ఆరోగ్య రంగానికి రాజశేఖర రెడ్డి చేసిన సేవకు గుర్తింపుగా ఎన్‌.టి.ఆర్‌. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి పేరు పెడ్తే తప్పేమిటి అంటు న్నారు. ఇక్కడ అభ్యంతరం వై.ఎస్‌.ఆర్‌. పేరు పెట్టడం మీద కాదు. ఉన్న పేరు తీసి ఆయన పేరు తగిలించడం మీద మాత్రమే.
ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసే ఇలాంటి సంస్థలకు ఫలానా రాష్ట్ర ప్రభుత్వం అని జోడిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఉదాహరణకు హైదరా బాద్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పుడు మొదట్లో దాన్ని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనే అన్నారు. ఆ తరవాత దాన్ని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్చి ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చారు. విభజన తరవాత బాపట్ల వ్యవసాయ కళాశాలకు విశ్వవిద్యాలయ హోదా కల్పించి కొత్త రూపు దాల్చిన వ్యవస్థకు ఆచార్య ఎన్‌.జి.రంగా పేరు పెట్టారు. ఇలాంటి వివాదాలు, ఉన్న పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టడం తెలుగునాట మాత్రమే ఉన్న వ్యవహారం కాదు. మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లో మరాఠ్వాడా విశ్వవిద్యాలయం ఉండేది. దీనికి డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ పేరు పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరగడమే కాక అది రక్తసిక్తమైంది. ఇప్పుడు మరాఠ్వాడా విశ్వవిద్యాలయం పేరు పూర్తిగా మార్చకుండా డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ మరాఠ్వాడా విశ్వవిద్యాలయం అంటున్నారు. వివిధ సంస్థ లకు, వ్యక్తులకు కీర్తి శేషులైన వారి పేరో లేదా సజీవంగా ఉన్న వారి పేరో పెట్టినప్పుడల్లా వివాదాలు రేకెత్తు తున్నాయి. మరణించిన వారి పేర సంస్థలు, వ్యవస్థలు నెలకొల్పడం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఉంది. ఉదాహరణకు లుముంబా విశ్వవిద్యాలయాన్నే చెప్పుకోవచ్చు. కానీ నాయకులు సజీవంగా ఉన్నప్పుడే ఉన్న పేరు తీసేసి కొత్త పేరు పెట్టడానికి భేషైన ఉదాహరణ గుజరాత్‌లోని క్రికెట్‌ స్టేడియంకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడం. వ్యక్తి ఆరాధనను ఆపడం సాధ్యం కాక పోవచ్చు. నాయకులు తాము సజీవంగా ఉండగానే వ్యక్తి ఆరాధనను ప్రోత్స హించడం విచిత్రమే కాదు వైపరీత్యం అవుతుంది. మోదీ సర్కారుకు నెహ్రూ పేరెత్తితే కంపరం పుట్టుకొస్తుంది. నెహ్రూ మరణం తరవాత ఇందిరా గాంధీ హయాంలో 1969 ఏప్రిల్‌ 22న జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె.ఎన్‌.యు.) నెలకొల్పారు. నెహ్రూ స్థాయికి తగ్గట్టే ఆ విశ్వవిద్యాలయం దేశంలోనే మేటి విశ్వవిద్యా లయంగా నిలిచింది. కానీ ఆ విశ్వవిద్యాలయం భిన్న భావాలు సంఘర్షించ డానికి అవకాశం ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. అది మోదీ సర్కారుకు నచ్చ లేదు. అందుకని ఆ విశ్వవిద్యాలయాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి చేయని ప్రయత్నమే లేదు. పేరులోన ఏమున్నది పెన్నిధి అని షేక్స్పియర్‌ అన్నా కొంతమందికి కొన్ని పేర్లు భూతంలా కనిపిస్తాయి. ఇంకోవేపు తమకు ఇష్టమైన వారి పేర్లు పెట్టడానికి అధికార పక్షాలు పడరాని పాట్లు పడ్తుంటాయి. జె.ఎన్‌.యు.కు అంతర్జాతీయ ఖ్యాతి నెహ్రూ పేరువల్ల రాలేదు. ఏ విశ్వవిద్యాలయంలోనైనా బోధన, పరిశోధన బలంగా ఉన్న ప్పుడే పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే వస్తాయి. అలాంటి విశ్వవిద్యా లయాల పేరు చూసి జడుసుకున్నట్టే కేవలం పేరు మార్పు వల్ల విశ్వవిద్యా లయం గొప్పదైపోదు. ఈ ఇంగితం ఆంధ్ర ప్రదేశ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రదర్శించలేక పోయారు. ఆయన హయాంలో ఒక్క కొత్త విశ్వ విద్యాలయం కూడా రాలేదు. ఉన్నవాటి పేర్లు మార్చి ఏదో సాధించామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్‌.టి.ఆర్‌. రాజకీయ నాయకుడు కాక ముందు విశేషంగా అభిమానులను సంపాదించుకున్న సినీ నటుడు. ఆయ నను అభిమానించేవారు ఆయన రాజకీయాల ఆధారంగా ఆ పని చేయడం లేదు. అందుకే ఎన్‌.టి.ఆర్‌. పేరు మార్చడం పెద్ద వివాదంగా మారింది. విశ్వవిద్యాలయాలను మెరుగు పరచడానికి వాటిలో ఖాళీలను భర్తీ చేయడం మీద ముఖ్యమంత్రి జగన్‌ దృష్టి పెట్టి ఉంటే మన్ననలు పొందే వారు. కానీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చే చిట్కా ప్రయోగించడం వల్ల విమర్శలకు అవకాశం కల్పించారు. చేసిన తప్పు దిద్దుకునే అలవాటు సాధారణంగా జగన్‌ లాంటి పాలకులకు ఉండదు. అదే పెద్ద విషాదం. కాదు మహాపచారం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img