Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

ఏకోన్ముఖ పోరాట దిశలో మరో అడుగు

ఆది, సోమవారాల్లో దిల్లీలో జరిగిన రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి) సదస్సులో ఆ పార్టీలో ఉన్న లుకలుకలు కొన్ని బయట పడినప్పటికీ అంతిమంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చేసిన ప్రతి పాదన ఒక పెద్ద చిక్కుముడి విప్పడానికి ఉపకరిస్తుందనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదిన్నరపైగానే సమయం ఉన్నప్పటికీ ప్రతిపక్షాల ఐక్యతకోసం రెండు మూడు దిశల నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలలోనే ప్రతిపక్షాలను ఐక్యం చేయడానికి ఓ ప్రయత్నం జరిగింది. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంతి కె.చంద్ర శేఖర రావు లాంటి వారు ప్రతిపక్షాల ఐక్యత గురించి వారి ప్రయత్నాలు వారు చేశారు. బిహార్‌లో నితీశ్‌ కుమార్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకుని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఆర్‌.జె.డి.తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరవాత ప్రతిపక్షాల ఐక్యతా యత్నాలు మరో వేపు నుంచి ఊపందు కున్నాయి. ఈ ప్రయత్నాలేవీ ఇప్పటికీ ఓ కొలిక్కి వచ్చి ఉండక పోవచ్చు. ప్రతిపక్షాలన్నీ ఏకమైతే తప్ప మోదీ నాయకత్వంలోని బీజేపీని ఓడిరచడం సాధ్యం కాదన్నది వాస్తవం. గతంలో కాంగ్రెస్‌ను గద్దె దించి నేషనల్‌ ఫ్రంట్‌, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు ఏర్పడి నప్పుడూ ముందుగా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో నిర్ణయించలేదు. ప్రతిపక్షాల ఐక్యత కోసం పాటుపడ్తున్న నితీశ్‌ కుమార్‌కు ప్రధాని కావలన్న ఆశ ఉందన్న వార్తలు వచ్చినా వాటిని ఆయనే తోసిపుచ్చారు. ప్రతిపక్షాల ఐక్యతకు ఇప్పటిదాకా ఉన్న ప్రధానమైన అడ్డంకి కాంగ్రెస్‌ పాత్ర గురించి స్పష్టత కొరవడడమే. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి: ఎంత బలహీనపడ్డా ఇతర పార్టీలను వెంట తీసుకుపోయే తత్వం కాంగ్రెస్‌కు ఇప్ప టికీ అలవడలేదు. అయితే ఉన్నంతలో దేశవ్యాప్తంగా గుర్తింపు, అస్తిత్వం ఉన్న పార్టీ కాంగ్రెసే అన్నది నిర్వివాదం. రెండు: బీజేపీయేతర పార్టీలను ప్రతిపక్షాలుగా పరిగణిస్తున్నాం. కానీ ఈ పక్షాలు రాష్ట్రాల దగ్గరకొచ్చే సరికి కాంగ్రెస్‌తో తలపడక తప్పని పరిస్థితి ఉంది. అందువల్ల ప్రతిపక్ష కూట మిలో కాంగ్రెస్‌ను అంగీకరించలేని స్థితిలో ప్రతిపక్షాలు ఉండవచ్చు. తమ అస్తిత్వానికి ముప్పు ఎక్కడ వస్తుందోనన్న భయం కూడా ప్రాంతీయ పార్టీలలో ఉంది. కానీ ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించవలసింది బీజేపీని ఓడిర చడం మీద కనక పార్లమెంటు ఎన్నికల మేరకు కచ్చితమైన అవగాహన కుదుర్చుకోవడం అసాధ్యం ఏమీ కాదు. మోదీని వ్యతి రేకించడంలో, మోదీ మీద దుమ్మెత్తి పోయడంలో ఎక్కడలేని ఉత్సాహం ప్రదర్శిస్తున్న కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ వైఖరి పరి మితంగానైనా ప్రతిపక్షాల ఐక్యతకు విఘాతం కలిగించే అవకాశం ఉంది. ఈ పరిస్థితి కొన్ని రాష్ట్రా లలో ఎదురుకాక తప్పదు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఆ పార్టీ భాషలోనే మాట్లాడాలని కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన మోదీ మీద ఒంటి కాలి మీద లేస్తున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్‌ దృష్టి ఈ ఏడాది చివరలో జరగవలసి ఉన్న గుజరాత్‌ ఎన్నికల మీద కనక దూకుడు మరింత పెంచారు. మోదీ, బీజేపీ మీద ఆయన విమర్శలు ఎంత విన సొంపుగా ఉన్నప్పటికీ ముక్కోణ, చతుష్కోణ పోటీలు అనివార్యం అవు తాయి. ఇంతకన్నా ప్రధానమైన సమస్య ఏమిటంటే అస్తిత్వ పోరాటంలో భాగంగా కేజ్రీవాల్‌ హిందుత్వ వాదనను తలకెత్తుకుంటున్నారు. ఒకవేళ ఆయన గుజరాత్‌లోనో మరో చోటో బీజేపీని నిలువరించగలిగినా మరో రూపంలో హిందుత్వ వాదనకు అవకాశం పెరుగుతుంది. ఈ వైఖరి అంతి మంగా బీజేపీకే మేలు చేస్తుంది. చాలా ప్రాంతీయ పార్టీలు పేరుకే ప్రతి పక్షాలు కానీ వాటి చర్యలు బీజేపీకి అనుకూలించే ప్రమాదం పొంచే ఉంది.
దిల్లీలో జరిగిన ఆర్‌.జె.డి. జాతీయ సదస్సులో లాలూ ప్రసాద్‌ ప్రతి పక్షాల ఐక్యతకు సంబంధించిన ఒక జటిల సమస్యకు ముగింపు పలికారు. కాంగ్రెస్‌ నాయకత్వంలోనే ప్రతిపక్షాలు ఐక్య పోరాటం చేయక తప్పదని లాలూ తేల్చేశారు. కాంగ్రెస్‌ను మినహాయించే ప్రతిపక్ష పార్టీల ఐక్యత వ్యర్థం అని లాలూ చెప్పిన మాట ఆయన రాజకీయ దూరదృష్టికి, రాజనీతిజ్ఞతకు తార్కాణం. ఈ విషయంలో ఆయన సూత్రబద్ధమైన వైఖరి అనుసరించారు. దీనివల్ల ప్రతిపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని ఊహించ డానికి నానా తంటాలూ పడకతప్పదు. ఇప్పుడే ప్రతిపక్షాల తరఫు ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించడంలో మరో సమస్య ఉంది. ఆ వ్యక్తిని అపఖ్యాతి పాలు చేయడానికి లేదా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టొరేట్‌ లాంటి సంస్థలను ప్రయోగించి భ్రష్టు పట్టించడానికి కావలసిన సరంజామా బీజేపీకి అప్పనంగా అందించినట్టు అవుతుంది. రెండోవేపు తొందరపడి నితీశ్‌ కుమారే ప్రతిపక్షాల తరఫు ప్రధానమంత్రి అభ్యర్థి అనిగానీ, కాంగ్రెస్‌ లో ఫలాన వ్యక్తి ప్రధానమంత్రి అభ్యర్థి అనిగానీ లాలూ చెప్పకపోవడం చాలా వివేకవంతమైన చర్య. కాంగ్రెస్‌ నిష్క్రియాపరత్వంవల్ల కోల్పోయిన బలాన్ని కూడదీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగమే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పాద యాత్ర. ఈ యాత్ర ప్రారంభమైన నెల రోజు ల్లోనే సానుకూల ప్రభావం కనిపిస్తోంది. కొన్ని చోట్ల రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్న వారు లక్షల్లో కూడా ఉంటున్నారు. ఇది కాంగ్రెస్‌ బలాన్ని చూసి కాకపోవచ్చు. మతతత్వాన్ని, విద్వేష రాజకీయా లను భరించి విసుగెత్తి ఉన్న వారు స్వచ్ఛందంగానే రాహుల్‌తో బుజం బుజం కలిపి నడుస్తున్నారు. విష పూరిత వాతావరణం నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్న వారికి రాహుల్‌ యాత్ర ఒక అవకాశం కల్పిం చింది. వారిలో రాహుల్‌ మీదో, కాంగ్రెస్‌ మీదో అభిమానం పొంగిపోవడమే వారు కలిసి రావడానికి కారణం అనుకోనక్క ర్లేదు. బీజేపీకి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశం ఉన్న వారికి అది ప్రస్తుతానికి ఓ మార్గంగా కనిపిస్తోంది. బీజేపీని ఎదుర్కోవదానికి, 2024 ఎన్నికలలో ఆ పార్టీకి అధికారం దక్కకుండా చూడడానికి ప్రతిపక్ష ఐక్యత అత్యావశ్యకమని ఆర్‌.జె.డి. జాతీయ సదస్సులో తీర్మానం కూడా ఆమోదించారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రతిపక్ష పార్టీల ఐక్యత సాధించే ప్రయత్నాలకు సహకరించని వారిని బీజేపీ విద్వేషపూరిత పాలనలో నలిగి పోతున్నవారు క్షమించరు అని గుర్తించే దశ రావాలి. ప్రాంతీయ పార్టీలు మరో ప్రాంతీయ పార్టీకి నాయకత్వ స్థానం వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. కానీ ఆ పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీల ఐక్యతకోసం తాపత్రయ పడ్తూనే ఉన్నాయి. స్థానికంగా ప్రాంతీయ పార్టీల పలుకుబడిని తగ్గించకుండా జాగ్రత్త తీసుకుంటే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని నిలువరించడం అసాధ్యం కాదు. 2019లోనూ మోదీకి ప్రతికూల వాతావరణమే కనిపించినా 2014 కన్నా ఎక్కువ స్థానాలు సాధించ గలగడానికి ప్రధాన కారణం ప్రతిపక్షాల బలహీనతే. అది ఎంతమాత్రం బీజేపీ బలానికి సంకేతం కాదు. ఏమైనా లాలూ ప్రకటనతో ఏకోన్ముఖ పోరాట దిశగా మరో అడుగు పడడం మంచిదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img