Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

ఓట్లు తప్ప జనం పట్టని మోదీ

జమ్మూ కశ్మీర్‌లోని రజౌరీ జిల్లాలో శుక్రవారం తీవ్రవాదులు అయిదుగురు జవాన్లను మట్టుబెట్టారు. గత నాలుగు నెలల కాలంలో జమ్మూ డివిజన్‌లోని పీర్‌ పంజాల్‌ ప్రాంతంలో వరసగా తీవ్రవాదులు దాడి చేయడం ఇది మూడవసారి. ఈ దాడుల్లో మొత్తం ఏడుగురు పౌరులు వీరిలో ఇద్దరు ఈడురాని బాలలు, పదిమంది సైనికుల ప్రాణాలు పోయాయి. ప్రధాన మంత్రి ఎప్పుడూ ‘‘డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌’’ గురించే మాట్లాడు తుంటారు. అంటే కేంద్రంలో అధికారంలోఉన్న పార్టీయే రాష్ట్రంలో కూడా ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన ప్రచారం చేస్తుంటారు. ఇది ఒక రకంగా ఏకఛత్రాధిపత్యం మాత్రమే ఉండాలని కోరుకోవడం. మణిపూర్‌లో ఏడాది కిందట బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. అయినా అక్కడ శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయి. మణిపూర్‌లో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న మీటీ సామాజికవర్గం వారు తమనుకూడా గిరిజనులుగా పరి గణించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. మీటీలకు, గిరిజనులకు మధ్య నాలుగు రోజులుగా జరుగుతున్న కలహాలలో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు ఉన్న చోట కలహాలు ఎందుకు చెలరేగుతున్నాయో తెలియదు. ఇంకో వేపు దిల్లీలోని జంతర్‌ మంతర్‌లో దాదాపు గత రెండు వారాలుగా తమను లైంగిక వేధింపులకు గురిచేసిన భారత మల్ల యోధుల సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ మీద కేసు నమోదు చేయించాలని మల్ల యోధులు నిరసనకు దిగారు. వారు సుప్రీంకోర్టుకు వెళ్తే తప్ప ఆయన మీద కనీసం ఎఫ్‌.ఐ.ఆర్‌. కూడా నమోదు కాలేదు. ఆయన బీజేపీ అభ్యర్థిగా లోకసభకు ఎన్నికయ్యారు కనకే దిల్లీ పోలీసులు ఆయనను అరెస్టు చేయడం లేదు. అంటే దేశవాసులను కలవరపెడ్తున్న మూడు కీలకాంశాలపై ప్రధానమంత్రి మోదీ ఇప్పటిదాకా పెదవి విప్పనేలేదు. ఆయన సామాజిక మాధ్యమాలలో చురుకుగానే ఉంటారు. ఆ మాధ్యమాలలోనూ వీటి ప్రస్తావనే లేదు. ప్రజా సమస్యల మీద స్పందించే అలవాటు ఆయనకు ఎటూలేదు. మోదీ ట్విట్టర్‌ ఖాతాను విరివిగానే వినియోగిస్తున్నారు. కర్నాటకలో తన ఎన్నికల ప్రచార విశేషాలను తెలియజేస్తూనే ఉన్నారు. ఆయన ట్విట్టర్‌ ఖాతాలో కనీసం 30 సందేశాలు కనిపిస్తాయి. గత బుధవారం నుంచి కనీసం డజనుసార్లు ట్విట్టర్‌లో కాంగ్రెస్‌, జనతాదళ్‌(ఎస్‌) మీద దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ప్రజా సమస్యల మీద స్పందించే తీరిక మాత్రం ఆయనకు ఉన్నట్టులేదు. ఎందుకంటే అది ఆయన తత్వం కాదు.
ఇప్పటిదాకా సి.ఎస్‌.డి.ఎస్‌., సి.-ఓటర్‌, ఈ దిన విడుదల చేసిన ఎన్నికల సర్వేల్లో కర్నాటకలో ఈసారి బీజేపీ ఓడిపోతుందని తేలింది. ఈ మాట మోదీకీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు వణుకు పుట్టిస్తున్నట్టుంది. అందుకే వారు కర్నాటక మీదే దృష్టి కేంద్రీకరించారు. తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. ఇది మోదీకి పదునైన ఆయుధంగా ఉపకరిస్తోంది. సంఫ్‌ు పరివార్‌లో భాగమైన బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ అంటే మోదీ వక్రీకరించారు. హనుమంతుడిని నిర్బంధిస్తామని కాంగ్రెస్‌ అంటోందని మోదీ అసలు మాటల అర్థాన్ని అద్వానపు అడవిలో వదిలేసి బజరంగ్‌ దళ్‌ను హనుమంతుడితో సమానం చేసేశారు. కాంగ్రెస్‌ బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామని చెప్పినప్పటి నుంచి మోదీ ఎన్నికల ప్రచార సభలన్నింటినీ ‘‘జై బజరంగ్‌ బలీ’’ అన్న నినాదంతోనే ముగిస్తున్నారు. ఓటు వేసేటప్పుడు ‘‘జై బజరంగ్‌ బలీ’’ అని నినదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బజరంగ్‌ దళ్‌ను బజరంగ్‌ బలీ (హనుమంతుడు) తో సమానంచేసి హనుమంతుడి పేరును మోదీ వాటంగా ప్రచారాస్త్రం కింద మార్చేశారు. ఇలాంటి విషయాలలో మోదీ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోదీ దృష్టిలో బీజేపీ రాజకీయ పార్టీ మాత్రమే కాదు. నిజానికి ఆయన దృష్టిలో బీజేపీ అంటే ఎన్నికల్లో గెలిచే పటిష్ఠమైన యంత్రాంగం. హిందూ ‘‘దేవతల’’ పేర్లు ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం ఎన్నికల నియమావళికి విరుద్ధం. కానీ స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల కమిషన్‌ను కూడా మోదీ కేంద్ర ప్రభుత్వ పరిచారికగా మార్చేసి చాలాకాలం అయింది. ఆయన మీద నిబంధనలకు అనుగుణంగా చర్య తీసుకునే సాహసం ఎన్నికల కమిషన్‌ చేయలేని స్థితిలోనేఉంది. గతంలో కూడా ఎన్నికల ప్రచారక్రమంలో మోదీ పాల్పడ్డ నియమోల్లంఘన ఉదంతాలను ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లినా కమిషన్‌ అధిపతులు మౌన ముద్రాంకితులుగానే ఉండి పోయారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ మోదీ హిందూ దేవతలను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోదీ మీద కమిషన్‌ చర్య తీసుకుంటుందని ఊహించనైనా లేం. చిన్నా చితక నాయకుల మీద అయితే ఎన్నికల కమిషన్‌ లాంఛనంగా సంజాయిషీ నోటీసులైనా ఇస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖడ్గే కుమారుడు ప్రియాంక్‌ ఖడ్గే మోదీని అసమర్థుడు అన్నాడని బీజేపీ ఫిర్యాదు చేస్తే ఎన్నికల కమిషన్‌ నోటీసు జారీ చేసింది. అలాగే బీజాపూర్‌ నగర నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బసనగౌడ ఆర్‌.పాటిల్‌కు కూడా నోటీసు జారీ చేసింది. ఆయన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విషకన్య అన్నారట. రెండు పక్షాల వారికి నోటీసు ఇచ్చాం గదా అని నమ్మించి ఎన్నికల కమిషన్‌ తన నిష్పాక్షికతను రుజువు చేసుకోవాలను కుంటున్నట్టుంది.
ఎన్నికల ప్రచారస్థాయి నానాటికి దిగజారుతోందని ఎన్నికల కమిషన్‌ వ్యాఖ్యానించింది కూడా. ఇలా దిగజార్చడంలో మోదీ పాత్ర కూడా ఉందన్న వాస్తవాన్ని మాత్రం ఎన్నికల కమిషన్‌ చూసీ చూడనట్టు వదిలేస్తుంది. కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మత కలహాలు చెలరేగుతాయని అమిత్‌ షా అన్నా పట్టించుకున్న నాథుడే లేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖడ్గే కూడా మోదీని విషసర్పం అన్నారు. కానీ ఆయన తరవాత ఆ మాటను ఉపసంహరించుకున్నారు. బజరంగ్‌ దళ్‌ను బజరంగ్‌ బలీని ఒకే గాట కట్టడంద్వారా హిందూ దేవతల పేర్లు దుర్వినియోగం చేస్తున్నారని, తద్వారా మోదీ హనుమంతుడి భక్తులైన హిందువుల మనోభావాల్ని దెబ్బ తీశారని కాంగ్రెస్‌ గొంతు చించుకుంటున్నా ప్రయోజనం ఏమీ కనిపించలేదు. మోదీ ప్రయత్నమల్లా కాంగ్రెస్‌ హిందువులకు వ్యతిరేక పార్టీగా నిరూపించడమే. బజరంగ్‌ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ వాగ్దానం చేయడం హిందుత్వ ఉచ్చులో పడడానికే పనికొస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img