Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఓట్లు రాల్చే తిట్లు

రాజకీయాలలో మర్యాద, మన్నన లాంటి మానవీయ లక్షణాలు అంతరించి దశాబ్దాలు గడుస్తోంది. ఎన్నికల సమయంలో చాలా రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పక్షం నాయకులను దూషిస్తూనే ఉన్నాయి. ఎవరు ఎవరిని ఎన్నిసార్లు ఏమని తిట్టారో తిట్టిన వారి దగ్గర లెక్కలు లేకపోవచ్చు. కానీ మోదీ మాత్రం తనను కాంగ్రెస్‌ నాయకులు 91 సార్లు దూషించారని లెక్క తేల్చారు. రాజకీయాలలో అనాగరికంగా ప్రవర్తించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం ఎప్పుడు మొదలైందో కచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాన ప్రత్యర్థి పక్షాలు మర్యాద విస్మరించి తిట్లు లంకించుకోవడం మాత్రం సర్వసాధారణం అయిపోయింది. ఇందులో ఏ రాజకీయ పక్షం ఎక్కువ, ఏ రాజకీయ పక్షం తక్కువ అన్ని చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. అయితే మోదీ, ఆయన నాయకత్వం వహిస్తున్న బీజేపీలోని ఐ.టి. విభాగం మోదీని ప్రతిపక్ష నాయకులు తిట్టిన తిట్లన్నింటినీ లెక్క రాస్తున్నట్టుంది. అందుకే 91సార్లు దూషించారు అని మోదీ చెప్పగలుగుతున్నారు. తనను దూషించడానికి కాంగ్రెస్‌ నాయకులు పోటీ పడ్తుంటారు అని కూడా మోదీ అంటున్నారు. అయితే తిట్ల దండకంలో మోదీ ప్రతిభ తక్కువేమీ కాదు. సోనియా గాంధీని ఆయన జెర్సీ ఆవు అన్నారు. కానీ తాను తిట్టిన తిట్ల లెక్క మోదీ దగ్గర కానీ, బీజేపీ దగ్గర కానీ ఉండకపోవచ్చు. కర్నాటక శాసనసభ ఎన్నికలు దగ్గర పడ్తున్న కొద్దీ ఈ తిట్ల పురాణం జీళ్ల పాకంలా సాగిపోతోంది. విచిత్రం ఏమిటంటే కర్నాటక ఓటర్లను ఆకట్టుకోవడానికి మోదీ దగ్గర ఉన్న ఉపాయాలన్నీ అయిపోయినట్టున్నాయి. అందువల్ల తనను ఏమేం తిట్టారో లెక్కకట్టి ఆ తిట్లనే ప్రధానాంశంగా మార్చి కాంగ్రెస్‌ నాయకులు అమర్యాదకరంగా మాట్లాడతారు అని కన్నడ ప్రజలను నమ్మించి ఓట్లు దండుకోవాలని మోదీ తాపత్రయ పడ్తున్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. గత డిసెంబర్‌లో గుజరాత్‌ ఎన్నికలు జరిగినప్పుడూ ఈ తిట్ల దండకం గట్టిగానే వినిపించింది. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌ ద్వారా సాగుతున్నప్పుడు కాంగ్రెస్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖడ్గే ప్రధానమంత్రి మోదీని రావణుడు అన్నారట. ఈ తిట్లకు మోదీ వడ్డీతో సహా సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ నాయకులకు శ్రీరాముడి మీద ఎన్నడూ విశ్వాసంలేదు అని రావణుడు అన్న మాటను హిందుత్వ రాజకీయాలకు ఆయుధంగా మలుచుకున్నారు. గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా మోదీని మర్యాద తప్పి దూషించడం తప్పే అనుకున్నా వాస్తవానికి ఆ తిట్లన్నీ మోదీకి, బీజెపీకి దీవెనలుగా పనిచేసినట్టున్నాయి. గుజరాత్‌లో బీజేపీ అఖండ విజయం సాధించింది. కొంతమంది నన్ను రాక్షసుడు అంటారు, మరికొంతమంది బొద్దింక అంటారు అని మోదీ చెప్పుకున్నారు. రావణుడు, రాక్షసుడు అన్న అభిప్రాయం జనంలో విస్తారంగా ఉంది కనక ఖడ్గే రావణుడు అనడాన్ని మోదీ వాటంగా తనను రాక్షసుడు అన్నారని ప్రచారం చేసుకున్నారు. ఏ సందర్భంలో ఖడ్గే ప్రధాన మంత్రిని రావణుడు అన్నారో మాత్రం చెప్పరు గాక చెప్పరు. ఎక్కడ ఎన్నికల ప్రచారం జరిగినా మోదీ ప్రత్యక్షం అవుతారు ఆయనకేమైనా వంద తలలున్నాయా అని ఖడ్గే ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం బీజేపీ ప్రధానంగా ఆధారపడేది మోదీ మీదే. రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరిగినా నా మొహం చూసి ఓటేయండి అని మోదీ స్వయంగా చెప్తుంటారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడి స్థానిక నాయకులకు ఎలాంటి ప్రాధాన్యతా ఉండదు. మోదీ ఒక్కరే సర్వాంతర్యామిలా మూలమూలలకెళ్లి ప్రచారం చేస్తుంటారు. శాసనసభ ఎన్నికలలో మోదీ ప్రచారంలో నిమగ్నమైనంతగా ఏ ప్రధాని అయినట్టు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘‘మీకు ఏమైనా వంద తలలున్నాయా? మీరేమైనా రావణాసురుడా?’’ అని ఖడ్గే ప్రశ్నించారు. రావణుడికి ఉన్న పది తలలు కాస్తా పరస్పర దూషణ పర్వంలో వంద తలలుగా మారిపోయాయి.
ప్రస్తుతం జరుగుతున్న కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఖడ్గే మోదీని విషనాగు అన్నారట. ఇంకేం మోదీకి బ్రహ్మాండమైన ఆయుధం దొరికింది. బీజేపీ మునుపటి ఎత్తులేవీ ఈ సారి కర్నాటక ఎన్నికలలో పనిచేసేట్టు లేవు. అనేక సర్వేలు మొదట్లో బీజేపీ ఓటమి పాలు కావచ్చు అనే తేల్చాయి. పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ ఓడిపోతుందనే కాక కాంగ్రెస్‌ విజయం సాధిస్తుంది అని ఈ సర్వేలు ఘోషిస్తున్నాయి. కుల రాజకీయాలను, మత రాజకీయాలను రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వినియోగించుకోవడం మొదటి నుంచి ఉంది. అయితే ఈ సారి అవీ బీజేపీని గట్టెక్కించేట్టు కనిపించడం లేదు. పైగా ఈ మధ్య కాలంలో మోదీ తాను బాధితుడిని అని చెప్పుకోవడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్నారు. నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను గనుకనే నాపైన ప్రతిపక్షాలు దూషిస్తున్నారని మోదీ పదేపదే అంటున్నారు. పార్లమెంటులో మాట్లాడుతూ ‘‘నేను ఒక్కడిని, వారు అనేకమంది. నా మీద నిందలు వేస్తున్నారు’’ అని వాపోయారు. కేంద్ర ప్రభుత్వంలోనూ, బీజేపీలోనూ మోదీ ఏకపాత్రాభినయమే కొనసాగుతోంది కనక పొగడ్తలైనా, విమర్శలైనా, కడకు తిట్లయినా మోదీ ఖాతాలోనే పడతాయిగా! దొంగలందరికీ మోదీ అన్న ఇంటి పేరు ఎందుకు ఉంటుంది అని రాహుల్‌ గాంధీ అడిగినందుకు వెనుకబడిన తరగతుల వారిని దూషించారన్న దుమారం రేపారు. కానీ రాహుల్‌ ముగ్గురు మోదీల పేర్లు ప్రస్తావిస్తే అందులో వెనుకబడిన తరగతికి చెందింది నరేంద్ర మోదీ ఒక్కరే. అంటే ఏ అవకాశం వచ్చినా తన ప్రతిష్ఠను పెంచుకోవడం మీదే మోదీ దృష్టి ఉంటుంది. బీజేపీ చేసే టీకా టిప్పణికి గోదీ మీడియా విశేషమైన ప్రచారం ఇస్తుంది. మోదీ వ్యవహారసరళి చూస్తే ఎప్పుడు తనను దూషిస్తారా, ఆ దూషణలను ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకుందామా అన్నట్టుగానే ఉంటుంది. గత రెండు మూడు రోజులుగా మోదీ పదే పదే ఖడ్గే నన్ను విష నాగు అన్నారన్న మాటనే వల్లిస్తున్నారు. ఏ మాటకు ఆ మాట మోదీ తనను తాను విపరీతంగా ప్రేమిస్తారు. ఆయనకు ఎప్పుడు తన ప్రతిష్ఠ మీదే ధ్యాస. ఆయన ధరించే వస్త్రాలు, మాట్లాడే మాటలు, తిట్లను, దీవెనలుగా మలచుకునే చాతుర్యం మొదలైనవన్నీ తన ప్రతిష్ఠ పెంచుకోవడానికి ఉపకరించే సామాగ్రే. అమిత్‌ మాలవియా నాయకత్వంలోని బీజేపీ ఐ.టి.విభాగం ఈ తిట్లలో రకాలను కూడా విశ్లేషించి చూపుతుందేమో. ఇతరులు తనను తిట్టే తిట్లు ఓట్లు రాలుస్తాయని మోదీ గట్టిగా నమ్ముతారు. కానీ తాను తిట్టే తిట్లు ఆ తిట్లకు గురైన వారి మనసులను ఎంతగా గాయపరుస్తాయో మాత్రం ఆయన పట్టించుకోరు. ఎందుకంటే మోదీ ఎవరి మాటా వినరు. ఆయన మాటే అందరూ వినాలి. దూషణలు ఏ పక్షం వారు చేస్తున్నారు అన్నదానికన్నా రాజకీయ నాయకులలో మర్యాదగా మాట్లాడే సంస్కారం తగ్గడం దారుణం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img