Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

కడప ఉక్కు కోసం కడదాకా పోరు

కడపజిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీపీఐ మలిదశ ఉద్యమం శుక్రవారం ప్రారంభమైంది. తక్షణం ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ జిల్లాలో ఐదురోజుల పాదయాత్రను ప్రారంభిం చారు. కన్యతీర్థంలోని ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ప్లాంట్‌కు శిలాఫలకం వేసినచోటు నుంచి పాదయాత్ర మొదలైంది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఉక్కు పరిశ్రమను నిర్మించవలసిన బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసగించింది. అదేసమయంలో కేంద్రంపై పోరాడి అయినా, ఇచ్చిన హామీలను సాధించేందుకు రాష్ట్రంలోని వైసీపీ నాయకత్వంలోని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బహుళార్థక ప్రాజెక్టు పోలవరం కూడా సకాలంలో పూర్తి చేయడంలోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర అలక్ష్యం చూపింది. ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రజా ద్రోహానికి పాల్పడిరది. ఎంతసేపు ఎన్నికల చుట్టూ తిరిగే మోదీ, కడప ఉక్కు ఫ్యాక్టరీలాంటి ఫ్యాక్టరీని పట్టించుకోకుండా సంక్షేమ పథకాలే తిరిగి తనను గెలిపిస్తాయన్న ధీమాతో జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాయల సీమలో అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటులో విఫలమయ్యారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపనచేసి చేతులు దులుపుకున్నారు. తొలుత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా 2007 జూన్‌ 10న, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తన పదవీకాలం ముగియడానికి నాలుగైదునెలలు ముందుగా 2019లో, జగన్మోహనరెడ్డి 2019 డిసెంబరు 23న శంకుస్థాపన చేశారు. శిలా ఫలకాలు వేస్తే ఒక పనిఅయిపోతుందనుకునే పాలకులు ప్రజల సంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనల విషయంలో హమీలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని కడప ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం వ్యవహారం రుజువు చేస్తోంది.
ప్రజా సమస్యలు, రైతుల, కార్మికుల సమస్యలు, యువతకు ఉద్యోగుల లభ్యతకోసం పోరాటంలో అగ్రభాగాన నిలిచే సీపీఐ చాలాకాలంగా ఉక్కు పరిశ్రమకోసం డిమాండ్‌ చేస్తోంది. ఉక్కు ఫ్యాక్టరీకోసం పరిశీలనకాదు కావలసింది, నిర్మాణం చేపట్టాలని ఉద్యమం చేసింది సీపీఐ. జిల్లాలో లక్షల సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది పార్టీ. అఖిలపక్ష సమావేశంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆయినప్పటికీ కేంద్రంలో ఏమాత్రం కదలికలేదు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇతర పార్టీలతోకలిసి ఉద్యమంచేసి సాధించవలసిన ఉక్కుఫ్యాక్టరీని గురించి సీరియస్‌గా ఏనాడూ పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడుసైతం ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి తోడ్పడుతుందని భావించి పదవినుండి వైదొలగే ముందు శంకుస్థాపన చేయడం ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించినట్టే అయింది.
ఈ నేపధ్యంలో సీపీఐ మలిదశ ఉద్యమానికి సమాయత్తమై బాధ్యతగల ప్రతిపక్షంగా నిరూపించుకుంది. దీనికి తోడ్పాటు ఇవ్వవలసిన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. రామకృష్ణ పాదయాత్రకు జిల్లాలో పోలీసులు అనుమతించకపోవడం దారుణం. చివరకి హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకోవలసిన దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వ అనుకూల సంఘాలకు, అధికార పార్టీ సభలకు ఆఘమేఘాల మీద అనుమతిచ్చి, భద్రతకు వేలాదిమంది పోలీసుల ‘సేవలను’ సమకూరుస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం దానికోసమే ఉద్యమిస్తున్న సీపీఐకి ఎందుకు అనుమతివ్వరు? ప్రతిపక్షం ఉద్యమంపై ఉలికి పాటెందుకు? రాజశేఖరరెడ్డి హయాంలో గాలి జనార్థనరెడ్డికి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి 10వేల ఎకరాలు, నాలుగువేల ఎకరాలు విమానాశ్రయంకోసం కేటాయిస్తూ జీఓ జారీ చేశారు. గాలిజనార్థనరెడ్డి ఫ్యాక్టరీ నిర్మించకుండా తూతూమంత్రంగా గోడలు కట్టి సరిపుచ్చుకున్నాడు. ఉక్కు ఫ్యాక్టరీకి సరఫరా చేయడానికి అనంతపురం జిల్లాలోని ముడిఇనుము కేటాయించేపేరుతో గాలి జనార్థనరెడ్డి చైనా, జపాన్‌లకు కృష్ణపట్నం ఓడరేవు ద్వారా ముడిఇనుము తరలించాడు. ఓడరేవుకు సరైన రోడ్లులేకపోయినా తరలించినప్పుడు భారీవాహనాల కిందపడి అనేకమంది చనిపోయారు. ముడిఇనుము తరలింపులో 16వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జనార్థనరెడ్డి యాక్సిస్‌ బ్యాంకు నుంచి 300 కోట్లు రుణం తీసుకుని దుర్వినియోగం చేశాడు. అంతేకాదు కేంద్రం నుండి వైఎస్‌ పదివేలకోట్లు అప్పు ఇప్పించాడు. 2009లోపు ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించకపోతే కేటాయించిన భూమిని తరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఒప్పందంలో పొందుపరిచారు. ఈ జీఓను కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. వేల కోట్లు దోచుకోవడమేగాకుండా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పట్టించుకోకుండా వదిలేసిన గాలి జనార్థనరెడ్డి తప్పుచేయలేదని దర్యాప్తు సంస్థ తేల్చింది. ఇంతకంటే దుర్మార్గమేముంటుంది. ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సీపీఐ 2011లో ఉద్యమం చేపట్టింది. ఇతర ప్రతిపక్షపార్టీలను కలుపుకొని అఖిలపక్ష సమావేశాలు నిర్వహించింది. చంద్రబాబుహయాంలో సీఎం రమేష్‌ నిరాహారదీక్ష చేశారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 1967`68లలో ఉవ్వెత్తున సాగిన ఉద్యమంలో సీపీఐ కీలకభూమిక పోషించింది. ఆంధ్రుల ఉద్యమానికి తలవంచి ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీని ప్రకటించింది. ఇప్పడదే ప్రాజెక్టును ప్రైవేటు వ్యక్తులపరం చేయడానికి మోదీ ప్రభుత్వం తలపెట్టింది. విక్రయాన్ని అడ్డుకునేందుకు 600 రోజులకుపైగా జరుగుతున్న ఉద్యమంలోనూ సీపీఐ కీలకపాత్ర వహిస్తోంది. రామకృష్ణ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావడానికి అన్ని పార్టీలు, ప్రజలు సహకరించి ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు పెద్ద ఎత్తున పోరాటం సాగించాలి. పోరాటాలు లేకుండా ఏ ప్రభుత్వమైనా అడిగిన వెంటనే అంగీకరించిన చరిత్రలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img