Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

కబోది ప్రభుత్వం

భారత మల్ల యోధుల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తమను లైంగిక వేధింపులు గురి చేస్తున్నాడన్న ఆరోపణతో దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్నా ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే సూచన కనిపించడం లేదు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తప్ప బ్రిజ్‌ భూషణ్‌ పై ఎఫ్‌.ఐ.ఆర్‌. కూడా నమోదు కాలేదు. పతకాలు సాధించి జాతీయం గానూ, అంతర్జాతీయంగాను భారత కీర్తి పతాకం ఎగురవేసిన మహిళా మల్లయోధులు వీధులకెక్కి నిరసన తెలియ జేయవలసిన పరిస్థితి రావడమే విచారకరం. ఈ మల్ల యోధుల్లో ఎక్కువమంది రైతు బిడ్డలే. అందువల్ల వివిధ రైతుసంఘాల వారు మల్లయోధుల పోరాటానికి మద్దతు తెలిపారు. 13 నెలల పాటు దిల్లీ పొలిమేరల్లో జరిగిన రైతుల ఆందోళనకు నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా ఆ ఆందోళన ముగిసిన తరవాత ముక్కలైంది. అయినా అన్ని రైతుసంఘాలు మల్ల యోధులకు మద్దతు ఇచ్చారు. సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకుడు రాకేశ్‌ తికైత్‌ అందరికన్నా ముందు జంతర్‌ మంతర్‌ వెళ్లి ఆందోళన చేస్తున్న వారికి మద్దతు ప్రకటించారు. ఆ తరవాత రైతు సంఘాలన్ని కదిలాయి. ఆది, సోమవారాల్లో అనేక రైతు సంఘాల వారు జంతర్‌ మంతర్‌ చేరుకుని సంఫీుభావం ప్రకటించారు. రైతులు దిల్లీకి చేరుకోకుండా ఉండడానికి దిల్లీ పోలీసులు దిల్లీకి చేరుకునే మార్గాలన్నింటినీ మూసివేశారు. అయినా రైతులు బారికేడ్లను తోసుకుని జంతర్‌ మంతర్‌ చేరుకున్నారు. వీరిలో చాలా మంది మహిళలు ఉండడం మల్లయోధులకు స్ఫూర్తి కలిగిస్తుంది. ఆదివారం సాయంత్రం ఆందోళన చేస్తున్న వారు కొవ్వొత్తుల ప్రదర్శన కూడా నిర్వహించారు. దాదాపు 250 ఖాప్‌ పంచాయితీలు మల్లయోధుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. ఈ పోరాటాన్ని కొనసాగించాలని, రైతు సంఘాల వారు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానాకు చెందిన రైతు సంఘాల వారే ఆదివారం జంతర్‌ మంతర్‌లో ఎక్కువగా కనిపించారు. అయితే దేశ వ్యాప్తంగా రైతులు మల్లయోధుల ఉద్యమానికి మద్దతివ్వాలని పిలుపు ఇచ్చారు. అంటే ఈ ఉద్యమం పరిష్కారం అయ్యే దాకా రైతులు మల్ల యోధులకు అండగా నిలుస్తారని అనుకోవచ్చు. బ్రిజ్‌ భూషణ్‌ శారణ్‌ స్వగ్రామానికి చెందిన వారు కూడా జంతర్‌ మంతర్‌ చేరుకుని బ్రిజ్‌ భూషణ్‌ చేష్టలను ఖండిరచారు. దీన్నిబట్టి బ్రిజ్‌ భూషణ్‌ ఎంత బలవంతుడైనా, ఎంతగా బీజేపీ రాజకీయ ప్రాపకం ఉన్నా ఆయన అకృత్యాలను జనం సహించే అవకాశం కనిపించడం లేదు. ప్రతిరోజూ ఒక ఖాప్‌ పంచాయత్‌కు చెందిన వారు జంతర్‌ మంతర్‌లో బైఠాయించాలని నిర్ణయించారు. పోరాటానికి దిశా నిర్దేశం చేయడానికి మల్లయోధులు రెండు కమిటీలు ఏర్పాటు చేశారంటే ఈ పోరాటం సుదీర్ఘ కాలం కొనసాగించవలసిందేనని వారు నిర్ధారణకు వచ్చినట్టే. బ్రిజ్‌ భూషణ్‌ను భారత మల్లయోధుల సంఘాల సమాఖ్య అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలన్న డిమాండ్‌ నెరవేరితే తప్ప ఈ ఉద్యమం ఆగకపోవచ్చు. అయితే బ్రిజ్‌ భూషణ్‌ మాత్రం తన మీద ఆరోపణలు ఉన్నాయి కనక ఆ మచ్చ ఉన్నంతకాలం రాజీనామా చేసే ప్రసక్తి లేదని వాదిస్తూ తాను గొప్ప నైతిక విలువలు ఉన్నవాడినని నిరూపించుకోవడానికి నానా యాతన పడ్తున్నారు. రైతు సంఘాల మద్దతు తమకు లభించినందువల్ల తమ పోరాటం సఫలం అవుతుందన్న ఆశ మాత్రం ఆందోళనకారుల్లో బలంగానే ఉంది. తమ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్న వారు శాంతి యుతంగా మెలగాలని లేకపోతే అసాంఘిక శక్తులు ఇందులో ప్రవేశించి మొత్తం ఉద్యమాన్నే భ్రష్టు పట్టించే అవకాశం ఉంటుందన్న తెలివిడి ఉద్యమకారులకు ఉంది. అది సానుకూల అంశమే. రైతుల ఉద్యమం సాగుతున్న దశలో కూడా ప్రభుత్వం అసాంఘిక వ్యక్తులను ఉద్యమ కారుల ఛద్మ వేషంలో ప్రవేశ పెట్టి ఆ ఉద్యమాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. ఉద్యమంలో పాల్గొన్న రైతులను ఖాలిస్థానీలని, తీవ్రవాదులని ముద్రవేసింది. కానీ రైతుల పట్టుదల ముందు ఈ పాచికలేవీ పారలేదు. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తప్పు బహిరంగంగా అంగీకరించి వివాదాస్పద వ్యవసాయచట్టాలను వెనక్కు తీసుకోవలసి వచ్చింది. ఇది కచ్చితంగా రైతుల సంఘటిత పోరాట ఫలితమే.
మల్లయోధుల పట్టుదల ఎంత ఉన్నప్పటికీ ఉద్యమాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి ప్రభుత్వం సకల ప్రయత్నాలూ చేస్తూనే ఉంది. ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేయాలని దిల్లీ పోలీసులను ఆదేశించిన సుప్రీంకోర్టు మిగతా వివాదాలను పరిష్కరించుకోవడానికి కింది కోర్టులను ఆశ్రయించాలని చెప్పింది. అప్పుడు మల్ల యోధుల అర్జీలో ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేయాలన్న డిమాండే ప్రధానంగా ఉంది కనక ఆ మేరకు సుప్రీంకోర్టు సానుకూలం గానే వ్యవహరించింది. అయితే విధిలేక దిల్లీ పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌ పై ఎఫ్‌.ఐ.ఆర్‌. అయితే నమోదు చేశారు కానీ ఆయనను అరెస్టు చేయడం అటుంచి కనీసం పిలిచి ప్రశ్నించిన దాఖలాలూ లేవు.
దిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పరిధిలోకి వస్తారు గనక కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే తప్ప తదుపరి చర్యలు తీసుకునేట్టు కనిపించడం లేదు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం దాకా కర్నాటక ఎన్నికల ప్రచారంలో తల మునకలై ఉన్నారు కనక మల్లయోధుల సమస్యను పట్టించుకోవడానికి వారికి తీరికే చిక్కలేదు. ఒక వేళ తీరిక దొరికినా తమ పార్టీ ఎంపీ మీద చర్య తీసుకుని చట్టబద్ధ పాలన అనుసరిస్తారన్న ఆశ ఎటూ లేదు. మోదీ ప్రభుత్వం అనేక విషయాల్లో అనుసరిస్తున్న మొండి వైఖరి తమ వారిని వెనకేసుకు రావడానికే ఉపకరిస్తోంది తప్ప చట్టం ప్రకారం నడుచుకునే ఉద్దేశం లేశ మాత్రం కూడా ఉన్నట్టు లేదు. ఫిర్యాదు చేసిన వారి వాంగ్మూలాలు కూడా పోలీసులు సేకరించలేదు.
సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు దిల్లీ పోలీసు కమిషనర్‌, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలుసుకోవాలని ఆలోచిస్తున్నారు. మల్ల యోధులు న్యాయవాదులను కూడా సంప్రదిస్తున్నారు. క్రీడా శాఖమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాత్రం మల్లయోధుల డిమాండ్లన్నీ అంగీకరించాం కనక వారు ఆందోళన విరమించి నిష్పాక్షిక దర్యాప్తుకు వీలు కల్పించాలని మెలిక పెట్టారు. మల్లయోధుల డిమాండ్లలో వేటిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందో ఆయనకే తెలియాలి. దిల్లీ పోలీసుల దర్యాప్తులో నిజం బయటపడ్తుందని ఆయన నమ్మబలుకు తున్నారు. నయాన్నో, భయాన్నో ఉద్యమం విరమించేట్టు చేస్తే ఆ తరవాత తమ సహజ శైలిలో ఉద్యమాన్ని నీరుగార్చవచ్చునన్నది ఆయన పథకం అయి ఉంటుంది. ఏమైతేనేం మోదీ ప్రభుత్వం కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img