Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

కర్నాటకలో బీజేపీ ఎదురీత

కర్నాటక శాసనసభ ఎన్నికల మీద అందరి దృష్టీ ఉంది. మరో నలభైరోజుల్లో అక్కడ మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో తేలిపోతుంది.’’మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే’’ అన్న మాట కర్నాటక ఎన్నికలలో కుదిరేట్టు లేదు. కర్నాటకలో ముక్కోణ పోటీ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్‌, జనతా దళ్‌ (ఎస్‌) పోటీలో ఉంటాయి. అయితే ఎన్నికల తరవాత అవకాశం వస్తే కాంగ్రెస్‌, జె.డి.ఎస్‌. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంగీకారానికి రావచ్చు. ముక్కోణపు పోటీ సంప్రదాయం ఆ రాష్ట్రంలో చాలా కాలం నుంచే ఉంది. 2013లో మాత్రం ఎడ్యూరప్ప బీజేపీ మీద తిరగబడి సొంతంగా ఓ పార్టీ పెట్టుకున్నప్పుడు చతుష్కోణ పోటీ జరిగింది. ఆ తరవాత ఎడ్యూరప్ప మళ్లీ బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయనే బీజేపీ ప్రధాన ప్రచారకుడిగా ఉన్నారు. బీజేపీ గెలిచినా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే లేవు. కాని తన కుమారుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలన్నది ఆయన చిరకాల వాంఛ. 2018లో ముక్కోణపు పోటీ జరిగినప్పుడు మొత్తం 224 స్థానాలున్న శాసనసభలో బీజేపీ 104 సీట్లు సంపాదించింది. కాంగ్రెస్‌ కు 80 దక్కాయి. జె.డి.(ఎస్‌) కు 37 స్థానాలు వచ్చాయి. కానీ అతి పెద్దపార్టీగా అవతరించిన బీజేపీకన్నా కాంగ్రెస్‌ కు సమకూరిన ఓట్ల శాతం ఎక్కువ. బీజేపీకి 36.4 శాతం ఓట్లు వస్తే కాంగ్రెస్‌ కు 38.1 శాతం ఓట్లు వచ్చాయి. జె.డి.(ఎస్‌) 18.3 శాతం ఓట్లు సాధించింది. ఏ పార్టీకి మెజారిటీరాని స్థితిలో గవర్నర్‌ మద్దతుతో మెజారిటీ లేకపోయినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మెజారిటీ నిరూపించుకోలేనందువల్ల ఆ ప్రభుత్వం నిలబడ లేదు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఆ తరవాత కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికి జె.డి.(ఎస్‌) నాయకుడు హెచ్‌.డి.కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మాజీ ప్రధాని హెచ్‌.డి. దేవెగౌడ కుమారుడు. కానీ కొన్ని నెలల్లోనే షరా మామూలుగా ‘‘ఆపరేషన్‌ లోటస్‌’’ ద్వారా కాంగ్రెస్‌, జె.డి.(ఎస్‌) శాసనసభ్యులను ప్రలోభ పెట్టి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్నాటకలో ప్రస్తుత పరిస్థితిని, బీజేపీ ప్రభుత్వంపై రగులుతున్న అసమ్మతినిబట్టి చూస్తే బీజేపీ అధికారం నిలబెట్టుకోలేదేమో అన్న అభిప్రాయం కలుగుతోంది. అంతర్గతంగా బీజేపీ కలహాలు ఎదుర్కుంటోంది. ప్రభుత్వ పని తీరు మీద జనంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఒక వేళ బీజేపీ ఓడిపోతే జె.డి.(ఎస్‌) కింగ్‌ మేకర్‌ పాత్ర నిర్వహించవచ్చు. ఉన్న పరిస్థితినిబట్టి కాంగ్రెస్‌ కు విజయావకాశాలు ఎక్కువే. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర అనుకూలంశం కావచ్చు. అధికారం నిలబెట్టుకోవడానికి తంటాలు పడ్తున్న బీజేపీ ఎడ్యూరప్పను తప్ప స్థానిక నాయకులను పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రచార బాధ్యతను మోదీ తలకెత్తుకుంటే వివిధ రకాల సమీకరణలు కుదర్చడానికి అమిత్‌ షా కృషి చేస్తున్నారు. అయితే ఆర్‌.ఎస్‌.ఎస్‌. కర్నాటకలో బలంగానే ఉంది. స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడం అననుకూలంగా పరిణమించవచ్చు. కాంగ్రెస్‌ కు మాత్రం సిద్ధ రామయ్య, డి.కె.శివకుమార్‌ బలమైన నాయకులే. కానీ వారిద్దరి మధ్య విభేదాలున్నాయి. అయితే ఇప్పుడు అధికారం సంపాదించడం కీలకం కనక తాత్కాలికంగా సంధి కుదుర్చుకోవచ్చు. జె.డి.(ఎస్‌) రంగంలో లేకపోతే కర్నాటకలో బీజేపీకి, కాంగ్రెస్‌ కు మధ్య మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌ లో లాగా ముఖా ముఖి పోటీ జరిగేది. పాత మైసూరు ప్రాంతంలో జె.డి.(ఎస్‌)కు పలుకుబడి ఉంది. కర్నాటక రాజకీయాలు ఆ రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల రాజకీయ స్వరూపం మీద ఆధారపడి ఉన్నాయి. కర్నాటకను ముందు హైదరాబాద్‌ సంస్థానంలో ఉన్న కర్నాటక, ముంబైతో సంబంధం ఉన్న కర్నాటక, మధ్య కర్నాటక, కోస్తా కర్నాటకగా విభజించ వచ్చు. ఇందులో ముంబైతో సంబంధం ఉన్న కర్నాటకలో, మధ్య కర్నాటకలో, కోస్తా కర్నాటకలో బీజేపీకి పట్టుఉంది. మిగతా ప్రాంతా లలో ఇదివరకటి కన్నా ఎక్కువ సీట్లు సంపాదిస్తే తప్ప బీజేపీ అధికారం లోకి వచ్చే అవకాశం లేదు. 2018 ఎన్నికలలో పాత మైసూరులో ఒక్కలిగ ఓట్లను కాంగ్రెస్‌, జె.డి.(ఎస్‌) సాధించాయి. ఆ రెండు పార్టీలకు రెండంకెల స్థానాలు దక్కాయి. 2004 నుంచి 2018 దాకా జరిగిన ఏ ఎన్నికలలోనూ బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం ఎప్పుడూ కాంగ్రెస్‌ కన్నా అధికంగా లేదు. కాంగ్రెస్‌ కు సీట్లు తక్కువ వచ్చి ఉండొచ్చు. ఇది ఎవరు ముందు గీత దాటితే వారే విజేతలు అన్న మన ఎన్నికల విధానంలో ఉన్న లోపం. ఈ పద్ధతిలో ఓట్ల శాతానికి, సీట్లకు పొంతన ఉండదు.
బీజేపీ ఇప్పటిదాకా ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మైని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. కానీ ఎన్నికల ప్రచార కమిటీకి ఆయనే నాయకుడు. కానీ ప్రచారంలో ప్రధాన పాత్ర ఎడ్యూరప్పదే. రెండు మూడేళ్లుగా బీజేపీ ఎడ్యూరప్పను, ఆయన కుటుంబాన్ని అంతగా పట్టించుకోలేదు. కాని ఇటీవలి కాలంలో అమిత్‌ షా, మోదీ కలిసి ఎడ్యూరప్పను బుజ్జగించే ప్రయత్నం చేసి సఫలమైనట్టున్నారు. ఎడ్యూరప్ప లింగాయత్‌ లకు ప్రతినిధి. కానీ ముఖ్యమంత్రి పదవి ఫలానా వారికి ఇస్తామని బీజేపీ ఈ దశలో ప్రకటించక పోవడానికి ప్రధాన కారణం బలమైన ఒక్కలిగ లాంటి సామాజిక వర్గాలను దూరం చేసుకునే స్థితిలో లేదు. కర్నాటక ప్రజలు సహజంగానే అనేక సమస్యలు ఎదుర్కుంటు న్నందువల్ల ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. నిరుద్యోగ సమస్య, అధిక ధరలు, ద్రవ్యోల్బణం మొదలైన సమస్యలు దేశమంతటా ప్రభావం చూపుతున్నట్టుగానే కర్నాటకలో కూడా ఆ ప్రభావం తప్పదు. అయితే సమాచార సాంకేతికతకు కేంద్రమైన కర్నాటకను మన సిలికాన్‌ వ్యాలీ అంటారు. కానీ ఈ రంగంలోని వారి ఉద్యోగాలు వేల సంఖ్యలో ఊడుతున్నాయి. ఇది బెంగళూరులో మాత్రమే ఉన్న సమస్య కాదు.
రిజర్వేషన్ల విధానాన్ని కర్నాటక ప్రభుత్వం ఇటీవలే సవరించింది. కొన్నివర్గాలకు వర్తించే రిజర్వేషన్లు పెంచింది. ఈ క్రమంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగించి ఆర్థికంగా వెనుకబడిన రిజర్వేషన్లు పెంచింది. ఈ మార్పులవల్ల రిజర్వేషన్లు తగ్గిపోతాయన్న భయంతో ఇటీవలే బంజారాలు ఆందోళనకు దిగి ఎడ్యూరప్ప ఇంటిమీద రాళ్లు విసిరేదాకా వెళ్లాయి. ముస్లింల రిజర్వేషన్లను పూర్తిగా తొలగించడం అంటే హిందుత్వ రాజకీయాలను ఒక అడుగు ముందుకు తోయడమే. మోదీ, అమిత్‌ షా సర్వాంతర్యాములుగా మారిపోయారు. అందుకే ఒకప్పుడు బీజేపీలో సమర్థ నాయకులున్నా ఇప్పుడు వారందరూ పక్కకు తొలగిపోయేట్టు చేశారు. 1985 తరవాత అధికారంలో ఉన్న ఏ పక్షమూ కర్నాటకలో రెండో సారి గెలవలేదు. 2004 తరవాత మూడు సార్లు ఏ పక్షానికీ మెజారిటీ రాలేదు. ఈ అంశాలన్నీ బీజేపీకి ప్రతికూలమైనవే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img