గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీల, దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో పోటీ పడ్డ బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు ఊరట కలిగించాయి. గుజరాత్లో మునుపు 99 సీట్లకు పరిమితమైన బీజేపీ ఈసారి ఏకంగా 156 స్థానాలు సంపాదించడం అఖండ విజయం కిందే లెక్క. హిమాచల్ ప్రదేశ్‌లో 1985 నుంచి ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి వరసగా రెండోసారి అధికారం దక్కని సాంప్రదాయం కొన సాగింది. కానీ ఈసారి అక్కడ విజయం కాంగ్రెస్‌కు ఊపిరి తీసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను కైవశం చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ మరింత బలపడిరది. మొత్తంమీద ఈవారం అంతా రాజకీయ హడావుడి బాగా కనిపించింది. తన పార్టీని అంతకంతకూ విస్తరించుకోవడానికి ఆరాటపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో 13శాతం ఓట్లు సంపాదించడమే కాక జాతీయపార్టీ స్థాయికి ఎదిగారు. గుజరాత్లో విజయం సాధించింది అక్కడి బీజేపీ కాదు. ఆ గెలుపు కచ్చితంగా మోదీ ఖాతాలోనే పడ్తుంది. ఎందుకంటే నాకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అని ఆయన మొహమాట పడకుండా చెప్పారు. కానీ హిమాచల్ ప్రదేశ్, దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ పరాజయం కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని గానీ, ఎన్నికల ప్రచార హోరులో ఆమ్ఆద్మీ పార్టీ మీద విరుచుకుపడిన తీరు చూసినా బీజేపీ లక్ష్యం నెరవేరలేదు. ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ ఆమ్ఆద్మీ పార్టీ మీదే ఎక్కువ విమర్శలు గుప్పించారు. అయినా అసలు పోటీ బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్యే ఉంటుందన్న మోదీ మాట నిజమైంది. కాంగ్రెస్ కిందటిసారి 77స్థానాలు గెలిచి బీజేపీకి సవాలు విసిరింది. ఈసారి కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 2017లో గుజరాత్లో 49శాతం ఓట్లే సంపాదించింది. ఈసారి అది 52శాతానికి పెరగడంతో మరో 57 సీట్లు అదనంగా సంపాదించగలిగింది. కానీ గుజరాత్లో కేజ్రీవాల్ పార్టీ 13శాతం ఓట్లు సంపాదించడం చెప్పుకోదగ్గ విశేషమే. నిజానికి ఈ ఎన్నికలలోనే గుజరాత్లో విజయం సాధిస్తామన్న ధీమా కేజ్రీవాల్‌కు లేదు. ఆయన దృష్టి అంతా 2027 ఎన్నికల మీదే. హిమాచల్ ప్రదేశ్‌లో మొదట పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నట్టుగా కనిపించిన ఆమ్ఆద్మీ పార్టీ చివరకు మందకొడి ప్రచారానికి పరిమితమైంది. గుజరాత్లో కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టి కేజ్రీవాల్ బీజేపీ విజయానికి ఊతమిచ్చారు. హిమాచల్‌లో ఆప్ ఉధృతంగా ప్రచారం చేయనందువల్ల ముఖాముఖి పోటీ కాంగ్రెస్‌కు ఉపకరించింది. అయితే ముందు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ను మరింత కుంగదీయవచ్చు. గుజరాత్ ఎన్నికల ప్రచారం తుదిఘట్టంలో అమిత్‌షా హిందుత్వగానం ఎత్తుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో హిందువుల సంఖ్యే అధికం. అయినా అక్కడ హిందుత్వ మంత్రం పారలేదు. మొన్నటిదాకా అధికారంలో ఉన్నందువల్ల ప్రజలలో గూడుకట్టుకున్న వ్యతిరేకతను కూడా బీజేపీ తగ్గించలేకపోయింది. గుజరాత్లో తిరుగుబాటు అభ్యర్థులవల్ల బీజేపీ, కాంగ్రెస్ కూడా నష్టపోయాయి. తిరుగుబాటు దార్లవల్ల బీజేపీ 8 స్థానాల్లో ఇబ్బంది పడ్తే కాంగ్రెస్ 12 చోట్ల పరాజయం పాలైంది. మొత్తం 99మంది ఇండిపెండెంట్లు పోటీచేస్తే అందులో 28 మంది తిరుగుబాటుదార్లే.
2024లో మోదీని ఓడిరచడానికి ప్రతిపక్షాలన్నీ ఐక్యం కావాలన్న మాట ఈ మూడు తాజా ఎన్నికల్లో ఎక్కడా వినిపించలేదు. నిజానికి కేజ్రీవాల్ ప్రతిపక్షాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన హిందుత్వ పరిభాషను పుక్కిటపట్టే మేరకే బీజేపీకి సవాలు విసురుతున్నారు. మోదీని సవాలు చేయగలిగింది రాహుల్ గాంధీయే అన్నమాట కూడా ఈసారి చెల్లుబాటు కాలేదు. గుజరాత్లో ఆయన ప్రచారం ఉదాహరణ ప్రాయంగానే సాగింది. హిమాచల్ ప్రదేశలో ప్రియాంకా గాంధీ చెమట ఓడ్చినందుకు ఫలితం దక్కింది. మోదీ మునుపుఎన్నడూ లేనట్టుగా ఎన్నికల ప్రచారం జరిగినంతకాలం దాదాపు గుజరాత్‌లోనే గడిపారు. రాష్ట్రమంతటినీ చుట్టబెట్టారు. రోజూ రెండునుంచి మూడు ర్యాలీల్లో పాల్గొన్నారు. బీజేపీ కొమ్ముకాస్తున్న అదానీ లాంటి బడా పెట్టుబడి దారులకు గుజరాత్ నెలవు. ఒకవేళ గత ఎన్నికల్లో బీజేపీకి దక్కినన్ని స్థానాలే ఈసారీ దక్కినా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేవారేమో కానీ షేర్ మార్కెట్ కుప్పకూలేది. అప్పుడు ఎక్కువ నష్టపోయేదీ అదానీనే. అందువల్ల మోదీ, అమిత్ షా సర్వశక్తులు ఒడ్డారు.
హిమాచల్ విజయంతో కాంగ్రెస్‌లో కొత్త ఆశలు చిగురించవచ్చు. కానీ కాంగ్రెస్ అంతర్గత కలహాలు కొనసాగినన్నాళ్లు నష్టాలు భరించక తప్పదు. ఛత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలలో విజయం సాధించాలంటే కాంగ్రెస్ సొంత ఇంటిని ముందు చక్క దిద్దుకోవాలి. కర్నాటక ఎన్నికలూ దూరంగా లేవు. ప్రతిపక్షాల ఐక్యతకు మొన్నటిదాకా రకరకాల స్వరాలు వినిపించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ బీజేపీ నాయకుడు, గతంలో కేంద్ర బీజేపీ మంత్రి అయిన యశ్వంత్ సిన్హా ఆ ఎన్నికలు ముగిసే దాకా ప్రతిపక్ష ఐక్యతను భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ఆయన మాటే వినిపించడం లేదు. బిహార్‌లో నితీశ్ కుమార్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని రాష్ట్రీయ లోక్‌దళ్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన నేపథ్యం లోనూ ప్రతిపక్షాల ఐక్యతకోసం కృషి జరుగుతోందనిపించింది. ఇప్పుడు ఆ ఊసూ లేదు. బీజేపీ కేజ్రీవాల్ పార్టీ మీద విమర్శలు గుప్పించడం కాంగ్రెస్‌కు వినసొంపుగా ఉండొచ్చు. దాని ఫలితం మాత్రం శూన్యం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీలకు అస్తిత్వం లేకుండా చేయాలని చూస్తున్నారు. అతి పెద్ద ప్రతిపక్షపార్టీ అయిన కాంగ్రెస్ ప్రతిపక్ష ఐక్యత మీద ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కారుపై విముఖత పెరుగుతోంది. కిందటిసారి బీజేపీ తొండిచేసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అక్కడ కొంత మేర బలంగానే ఉన్నా బలం పెంచుకోవడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు. మోదీ విజయ పథం ఆ పార్టీకి గర్వ కారణం కావొచ్చు. కానీ ఆయన సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, విచ్ఛిన్నకర రాజకీయాలను ఎదుర్కోవడం ఏ ఒక్క పార్టీకి సాధ్యం కాదు కనక ప్రతిపక్ష ఐక్యత తప్పని సరి. ప్రతిపక్షాల లక్ష్యం ఇదే అయి ఉండాలి. లోపమంతా అక్కడే ఉంది. గుజరాత్లో ప్రాంతీయ పార్టీల ప్రమేయం తక్కువ. కానీ అనేక చోట్ల అవి కీలక స్థానంలో ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రహించనంత కాలం మోదీ జైత్ర యాత్ర అప్రతిహతంగా కొనసాగుతుంది.