Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కశ్మీర్‌లో మోసపూరిత ప్రశాంతత

సరిగ్గా రెండేళ్ల కింద మోదీ సర్కారు కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసింది. భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైన భారతీయ జనసంఫ్‌ు కూడా 370వ అధికరణం రద్దు తమ ఎజెండాలో ప్రధానాంశంగానే భావించింది. వాజపేయి నాయకత్వంలో ఎన్‌.డి.ఎ. ఆరేళ్ల పాలనలో ఈ అధికరణాన్ని రద్దు చేయలేకపోయారు. అప్పుడు ఎన్‌.డి.ఎ.లో బీజేపీ ప్రధాన భాగస్వామే గాని బీజేపీకి సొంతంగా మెజారిటీ ఉండేది కాదు. ఎన్‌.డి.ఎ. అధికారంలోకి రావడానికి సంఫ్‌ు పరివార్‌ ఆత్మకు ఇంపైన 370వ అధికరణాన్ని, ఉమ్మడి పౌర స్మృతిని, రామ మందిర నిర్మాణాన్ని వాజపేయి ప్రభుత్వం అటకెక్కించవలసి వచ్చింది. 2014 ఎన్నికలలో మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడమే కాక 2019లో రెండోసారి అధికారం చేపట్టే నాటికి సొంతంగా మెజారిటీ సాధించింది. ఇది మోదీ సర్కారుకు 370వ అధికరణం రద్దు చేయడానికి సాహసించేలా చేసింది. విచిత్రం ఏమిటంటే బీజేపీ అంతకు ముందు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీని దాదాపు తీవ్రవాదపార్టీగానే పరిగణించేది. కానీ అదే బీజేపీ మెహబూబా ముఫ్తీతోకలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తమకు అనువై నప్పుడు ఆ ప్రభుత్వాన్ని అస్థీకరించింది. ఆ తరవాత తన అమ్ముల పొదిలోంచి 370వ అధికరణం రద్దు అంశాన్ని వెలికి తీయడమే కాక ఏక పక్షంగా ప్రయోగించేసింది. జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని లాగేయడంతో పాటు రాష్ట్ర ప్రతిపత్తి కూడా లేకుండా చేసి 2019 ఆగస్టులో ఆ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయికి దిగజార్చింది. అసలు 370వ అధికరణమే కశ్మీర్‌లో తీవ్రవాదానికి ప్రధాన కారణమని సంఫ్‌ు పరివార్‌ ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ ఈ రెండేళ్ల కాలంలో కశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. స్థానిక తీవ్రవాదులు, సరిహద్దు ఆవలి నుంచి ఎగుమతయ్యే తీవ్రవాదులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. రెండేళ్ల కింద ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల తీవ్రవాద కార్యకలాపాలకు, వారి హత్యాకాండకు సంబంధించిన సమాచారం అంతగా వెలికి రావడం లేదు. సమాచార సేకరణ పంపిణీపై ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉండడం వల్ల, భారీ ఎత్తున భద్రతా దళాలను నియోగించినందువల్ల వాస్తవ పరిస్థితి లోకానికి తెలియడం లేదు. జైష్‌-ఎ-మహమ్మద్‌, హర్కత్‌-ఉల్‌-ముజాహిదీన్‌ లాంటి తీవ్రవాద సంస్థలు స్థానికులను ఇంకా తమ శ్రేణుల్లో చేర్చుకోవడం ఆగనే లేదు. ఈ రెండు సంస్థల కారణంగా కొనసాగుతున్న విధ్వంసక కార్యకలాపాల్లో దిగుమతి అయిన తీవ్రవాదుల పాత్రే ఎక్కువ అని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. స్థానికులను తీవ్రవాద కార్యకలాపాల వేపు ఆకర్షించడం శ్రీనగర్‌లో మరింత జోరుగా సాగుతోంది. దానికి తగ్గట్టుగానే ఈ సంవత్సరం తీవ్రవాద కార్యకలాపాలూ దండిగానే కొనసాగాయి. అంటే 370వ అధికరణం రద్దు చేసినంత మాత్రాన తీవ్రవాదం ఆగలేదని తేలిపోతోంది. ఈ ఏడాదిలో ఏడు నెలల కాలంలో 89 మంది తీవ్రవాదులను భద్రతా దళాలు అంతమొందించాయి. ఒక్క గత నెలలోనే 31 మంది తీవ్రవాదులను మట్టుబెట్టడం చూస్తే తీవ్రవాదం మాయం అయిపోలేదని, సరిహద్దు దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం, అడుగడుగునా భద్రతా దళాలను నియోగించడంవల్ల భీకరమైన విధ్వంసం జరిగినట్టు కనిపించడం లేదు. తీవ్రవాదం నివురుగప్పిన నిప్పులా కొనసాగుతున్న మాట వాస్తవం.
రెండేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం సంఫ్‌ు పరివార్‌ ఎజెండాను అమలు చేయడంతో పాటు ప్రధానమైన రాజకీయ కార్యకలాపాలకు అవకాశం లేకుండా చేసింది. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులైన ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీతో పాటు వేలాది మందిని నిర్బంధించి ఉక్కు పాదం మోపింది. ఆ తరవాత క్రమంగా కొంతమందిని విడుదల చేశారు. అయినా ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న వారు వెయ్యికి పైగానే ఉన్నారంటున్నారు. సుదీర్ఘ నిర్బంధం ఎప్పుడైనా తీవ్రవాద, వేర్పాటువాద ధోరణులను ప్రేరేపిస్తుంది. ప్రజాస్వామ్య విధానంలో విశ్వాసం ఉన్న, కశ్మీర్‌ రాజకీయాలకు ప్రతినిధులైన నాయకులను నిర్బంధించి మోదీ సర్కార్‌ సాధించింది ఏమైనా ఉంటే రాజ్యాంగంపై విశ్వాసం ఉన్న ఈ పార్టీలను, నాయకులను ‘‘హిరియత్‌’’ గాట కట్టడమే. మోదీ సర్కార్‌ ప్రచారం చేసినట్టు ‘‘నూతన కశ్మీర్‌’’ ఏర్పడనే లేదు. పైగా ఈ మాట పరిహాసంగా మారింది. అయితే కొంతకాలం తరవాత ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులతో సహా కొందరిని విడుదల చేయడంవల్ల ప్రజాగ్రహం కొంతైనా తగ్గడంతో పాటు రాజకీయ కార్యకలాపాలకు పరిమితంగానైనా అవకాశం వచ్చింది. కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్రప్రతిపత్తి కల్పిస్తామని బీజేపీ చేసిన వాగ్దానం నెరవేర్చే ఆశ సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. అయితే స్థానిక సంస్థలైన జిల్లా అభివృద్ధి మండళ్లకు ఎన్నికలు నిర్వహించడం కేంద్ర మంకుపట్టుదల కొంతైనా తగ్గిందనడానికి సంకేతం. అలాగే మోదీ సర్కారు పిడుగు పడ్డట్టు 370వ అధికరణాన్ని రద్దు చేయడం, జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్ర స్థాయిని కుదించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ప్రధాన రాజకీయ పార్టీలు ఏకం కావడానికి ఉపకరించింది. గుప్కార్‌ డిక్లరేషనే దీనికి నిదర్శనం. జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలలో ఈ రాజకీయ పార్టీలే, ముఖ్యంగా ఫరూఖ్‌ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్‌కాన్ఫరెన్స్‌ మంచి ఫలితాలు సాధించింది. ఇది రాజకీయ కార్యకలాపాలకు ఇంకా అవకాశం ఉందని నిరూపించింది. గుప్కార్‌ డిక్లరేషన్‌ పేర ఏకమైన రాజకీయ పార్టీలు సైతం రాజకీయ పరిపక్వత ప్రదర్శించి స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొన్నాయి.
ప్రభుత్వం దూకుడుగా తీసుకున్న చర్యలను సంపూర్ణంగా వెనక్కు తీసుకునేదాకా ఎన్నికలలో పాల్గొనబోమని భీóష్మించుకుని ఉంటే బీజేపీ, ఆ పార్టీకి మద్దతిచ్చే అప్నీ పార్టీ బలపడేవి. అది కశ్మీర్‌కు ఉన్న విశిష్టతను మరింత మంటగలిపేది. 2019 ఆగస్టు అయిదున కేంద్రం తీసుకున్న చర్య కశ్మీర్‌ ‘‘స్వయంప్రతిపత్తి’’ అన్న మాటనే తుడిచిపెట్టేసిన తరుణంలో రాజ్యాంగంమీద విశ్వాసం ఉన్న పార్టీల అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారినస్థితిలో నేషనల్‌కాన్ఫరెన్స్‌, పి.డి.పి. హేతుబద్ధంగా వ్యవహరించాయి. గత మూడు దశాబ్దాలుగా అసలు రాజకీయ పార్టీల మనుగడకే ముప్పు ఏర్పడినస్థితిలో ఈ పార్టీలు సంయమనంతో వ్యవహరించాయి. స్థానిక సంస్థల ఎన్నికలను, నియోజకవర్గాల పునర్విభజనపై ఏర్పాటు చేసిన సమావేశాలను, ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాలను గుప్కార్‌ కూటమి బహిష్కరించకపోవడం మేలైంది. ఫ్రధాన రాజకీయ పార్టీలను వేర్పాటు వాదుల జాబితాలో కట్టిపడేసే ప్రమాదం తప్పింది. 370వ అధికరణం పునరుద్ధరణ ప్రస్తుతానికి అసంభవంగానే కనిపిస్తోంది. పౌరులహక్కులను కాలరాయడం కొనసాగితే తీవ్రవాదాన్ని ఎగదోసినట్టేనని మోదీ సర్కారు గుర్తించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img