Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య ఛాయలు

కాంగ్రెస్‌లో మళ్లీ అంతో ఇంతో ప్రజాస్వామ్య ఛాయలు అంకురిస్తున్న అనుమానాలు వస్తున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్‌ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సోనియా గాంధీ 1998 నుంచి 2017 దాకా, ఆ తరవాత 2019 నుంచి ఇప్పటి(2022)దాకా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా కొనసాగారు. అయితే ఈ చివరి మూడేళ్లూ ఆమె తాత్కాలిక అధ్యక్షురాలే. 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోర పరాజయం నేపథ్యంలో 2017 నుంచి 2019 వరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ గాంధీ రాజీనామా చేయడంతో సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించారు. అంతకు ముందు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్నంత కాలం ఆమే కొనసాగుతూ వచ్చారు. ఒక్కసారి మాత్రం రాజేశ్‌ పైలెట్‌ నామినేషన్‌ వేసినా చివరకు పోటీ నుంచి విరమించుకున్నారు. కాంగ్రెస్‌ను ప్రధానంగా రెండు రుగ్మతలు పీడిస్తున్నాయి. ఒకటి: ఆ మహా సంస్థపై ఇందిరాగాంధీ కుటుం బం ఉడుంపట్టు. ఆ కుటుంబం అండ లేకపోతే అసలు కాంగ్రెస్‌ మనుగడే కష్టం అన్న అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో బలంగా వేళ్లూనుకుంది. రెండు: సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగినందు వల్ల అధికారం లేకపోతే మనలేమన్న భావన కాంగ్రెస్‌ నాయకుల్లో పాతుకు పోయింది. ఇందిరా గాంధీ కుటుంబం ఆసరా లేకపోతే కాంగ్రెస్‌ ఈ మాత్రం కూడా ఉండదని చాలామంది సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులే భావిస్తారు. ఇందిరా గాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌లో ఏకోశ్వరో పాసన సాగుతోంది. ప్రస్తుతం త్రిమూర్తుల ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ త్రిమూర్తులు సోనియా, రాహుల్‌, ప్రియాంక. నిజానికి నిర్ణయాలన్నీ రాహుల్‌ నోటే వెలువడుతుంటాయి. ఈ నేపథ్యంలోంచి అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి జరగనున్న ఎన్నికలను చూడాలి. సోనియా గాంధీ ఇక ఆ స్థానంలో కొనసాగే అవకాశం కని పించడం లేదు. ఆమె అనారోగ్యం ఒక కారణం అయి ఉండొచ్చు. రాహుల్‌ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలా వద్దా అన్న సందిగ్ధం నుంచి ఇంకా బయటపడ్డట్టు లేదు. ఆ కుటుంబం లేకపోతే ఎలా అనుకునే వారికి కొదవలేదు. అందుకని రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలు మళ్లీ చేపట్టాలని పది రాష్ట్రాల పి.సి.సి.లు తీర్మానాలు చేశాయి. ఈ పీసీసీలు సైతం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైనవి ఏమీ కాదు. కానీ రాహులే ఉండాలన్న బృందగానం మాత్రం వినిపిస్తూనే ఉంది. ఏమైతేనేమి ఇందిరా గాంధీ కుటుంబం, కచ్చితంగా చెప్పాలంటే సోనియా గాంధీ కుటుంబం అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరపడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టుంది. సీనియర్లతో సహా అనేక మంది కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం, కాంగ్రెస్‌పై వంశపారంపర్య పాలన బిగిసి పోయి ఉందన్న తీవ్ర ఆరోపణలు రావడం, 23 మంది సీనియర్‌ నాయకులు (జి23) సోనియా గాంధీకి లేఖ రాసే సాహసం చేయడం మొద లైన కారణాలు కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించాలనుకోవ డానికి దారి తీసి ఉండొచ్చు. సోనియా కుటుంబానికి చెందని వారిని పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకోండి చూద్దాం అని మోదీ సవాలు విసరడం కూడా ఎన్నికలు నిర్వహించడానికి కారణం కావొచ్చు. మొత్తం మీద దాదాపు రెండు దశాబ్దాల తరవాత కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగడం ఖాయమనిపిస్తోంది. గురువారం నుంచి ఈ నెలాఖరు దాకా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అవసరమైతే అక్టోబర్‌ 17న ఎన్నిక జరుగుతుంది. ఆ తరవాత అధ్యక్షులు ఎవరో ప్రకటిస్తారు.
అధ్యక్ష స్థానానికి ఎన్నికలు అనగానే కేరళకు చెందిన లోకసభ సభ్యుడు శశి థరూర్‌ పోటీకి సిద్ధమై పోయారు. అధిష్ఠానం తమ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తుందో తెలియదు కానీ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ పేరు గట్టిగా వినిపిస్తోంది. గెహ్లాట్‌కు కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానం స్వీకరించడంపై అయిష్టత లేకపోవచ్చు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలెట్‌ను ఎక్కడ నియమిస్తారోనన్నది ఆయన భయం. అందుకే మంగళవారం శాసనసభ్యుల సమావేశం ఏర్పాటు చేసి ‘‘నేను ఎక్కడికీ వెళ్లను. చింతించకండి’’ అని అనునయించారు. దీనర్థం ఆయన కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానం చేపట్టడానికి సిద్ధంగా లేరని కాదు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా కూడా తానే ఉండాలన్న బలమైన ఆకాంక్ష ఆయన ఈ రకంగా వ్యక్తం చేశారు. బహుశా సోనియా గాంధీ అలాంటి వరం ఏమైనా ఇచ్చారేమో! రాహుల్‌ గాంధీ తాను అధ్య క్షుడిగా ఉండకూడదన్న మాట మీద నిలబడితే అశోక్‌ గెహ్లాట్‌, శశి థరూర్‌ మధ్య పోటీ జరగొచ్చు. కాంగ్రెస్‌ వ్యవహారాల గురించి తెలిసిన వారు ఎవరైనా ఫలితం ఎలా ఉంటుందో సులభంగానే ఊహించగలరు. అయితే పోటీ జరిగిందన్న తృప్తి మాత్రం మిగులుతుంది. శశి థరూరు పోటీకి దిగ డాన్ని ఆయన సొంత రాష్ట్రం వారే మెచ్చుతున్నట్టు లేరు. సోనియా కుటుంబానికి చెందని వారు కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానంలోకి వచ్చినా వారు సర్వ స్వతంత్రంగా వ్యవహరించే వీలుంటుందని అనుకోవడమూ కష్టమే. అసలు బీగాలు సోనియా కుటుంబం గుప్పెట్లోనే ఉండొచ్చు. అంతర్గత ప్రజాస్వామ్యం కోసం వెతుకులాటలోనే అప్రజాస్వామిక లక్షణాలు దాగి ఉన్నాయి. అధిష్ఠానం ఆశీస్సులు ఉన్న అభ్యర్థే గెలుస్తారన్న అంచనాలకు ఇదే కారణం. మరో వేపు పోటీకి సాహసించిన శశి థరూర్‌ను వెనక్కు లాగే ప్రయత్నం చేయడం. థరూర్‌ కూడా సోనియాను కలిసి తాను పోటీ చేయా లనుకుంటున్నట్టు నివేదించారు. ఆమె సరేనని తాను తటస్థంగా ఉంటానని కూడా చెప్పారు. 1978లో ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్‌ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగడం ఆగిపోయింది. అసలు కాంగ్రెస్‌ అధ్యక్షులు, ప్రధానమంత్రి ఒక్కరే ఉండాలన్న పంతమూ ఇందిరా గాంధీ హయాంలో వచ్చిందే. ఆ తరవాత రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావు ఇదే పద్ధతి అనుసరించారు. సోనియా హయాంలో 2006లో హైదరా బాద్‌లో జరిగిన ఎ.ఐ.సి.సి. పూర్తి స్థాయి సమావేశమే ఆఖరుది కావచ్చు. పార్టీ నాయకత్వ స్థానాలకు పోటీ అనుమతించడంవల్ల స్పర్థలు పెరిగిపోతాయన్న భావనతో ఏకాభిప్రాయానికి ప్రయ త్నించే సందర్భాలు అనేకం కనిపిస్తాయి. అసలు సంస్థాగత ఎన్ని కలే నిర్వహించకుండా దశాబ్దాల తరబడి గడిపేసిన పార్టీ కాంగ్రెసే కావచ్చు. బీజేపీ, వామపక్ష పార్టీలలో నియమబద్ధంగా పార్టీ మహాసభలు జరుగుతాయి. కొత్తవారికి స్థానం కల్పించడమూ ఉంది. అయితే ఈ పార్టీలు కూడా ఏకాభిప్రాయం కోసం ప్రయత్నించడం రివాజై పోయింది. అధికారంలోకి రాగలిగే అవకాశం ఉన్న పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం పూజ్యమైతే ఆ పార్టీలు ప్రజాస్వామ్య నియమాల ప్రకారం పరిపాలన కొనసాగిస్తాయను కోవడం భ్రమే. కాంగ్రెస్‌కు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగితే మంచిదే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img