Friday, February 3, 2023
Friday, February 3, 2023

కుంచించుకుపోతున్న పార్లమెంట్‌ ప్రతిష్ఠ

మన పార్లమెంటు భవన వైభవాన్ని, ముందు వేపు కనిపించే వరస స్తంభాలు చూస్తే మన ప్రజాస్వామ్య ప్రధాన సౌధం అదేనని అనిపిస్తుంది. మోదీ ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఆ భవనం త్వరలో చరిత్రలో భాగం అయిపోతుంది. అంతకన్నా ముందే విధుల రీత్యా పార్లమెంటు దిగదుడుపుగా తయారవుతోంది. ఇప్పుడు పార్లమెంటు ప్రజా సమస్యలు, శాసనాలు, దేశ పరిస్థితులు మొదలైన వాటి మీద చర్చకు, సంవాదాలకు నెలవు కాకుండా పోయింది. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా జరగపోవడానికి కారణం ప్రతిపక్షాలేనని ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆరోపించడం మామూలైంది. కానీ సమావేశాలు సవ్యంగా జరగకపోవడానికి అధికారపక్షం పాత్ర ఎంతో మాత్రం పట్టించుకోరు. పార్లమెంటులో ఎప్పుడు రగడ జరిగినా నింద ప్రతిపక్షాల మీదే వేస్తారు. కానీ ప్రతిపక్షాలు హద్దు మీరి ప్రవర్తించడానికి కారణాలేమిటో మాత్రం ఆలోచించరు. పార్లమెంటు సమావేశాలకు, ఏ పార్టీ అధికారంలో ఉందన్న విషయానికి సంబంధం ఉండకూడదు. రాజ్యసభలో ప్రతిపక్షాల తీరుచూసి ఆ సభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నిజమే ఉత్తమ పార్లమెంటేరియన్లకు సభ లోపల జరగకూడనివి జరిగితే క్షోభ ఉంటుంది. సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోనూ, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, సోషలిస్టు పార్టీ, వామపక్షాలలో దిగ్దంతలైన పార్లమెంటేరియన్లు ఉండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం లేనందువల్ల ఆ శోభ ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. తెలిసిందల్లా పార్లమెంటులో చర్చలకన్నా రగడే ఎక్కువనే. పార్లమెంటులో గట్టి మెజారిటీఉండడం ప్రతిపక్షాన్ని అణగదొక్క డానికి కాదన్న స్పృహ నానాటికీ క్షీణిస్తోంది. అధికారపక్షం కత్తిగట్టినట్టు ప్రవర్తిస్తున్న సందర్భాలు నిత్యకృత్యం అయిపోయింది. ప్రజల గోడు పార్లమెంటు పట్టించుకోకపోతే ఏం జరుగుతుందో ఇటీవల ముగిసిన వర్షాకాల సమావేశాలు నిరూపించాయి. ఎనిమిది నెలలనుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలియజేస్తున్న రైతులు సమాంతర పార్లమెంటు నిర్వహించారు. అందులో మరో విశేషం ఏమిటంటే ప్రత్యేకంగా మహిళలు నిర్వహించినవి కూడా ఉన్నాయి. ఇది కేవలం నిరసన కాదు. పార్లమెంట్‌ పట్టించుకోనితనాన్ని ప్రజలకు తెలియజెప్పడం. పార్లమెంటులో ఉత్తమ సంప్రదాయాలు నెలకొల్పేది అధికార పక్షమే కాదు. గతంలో అనేక మంది ప్రతిపక్షనాయకులు మహోన్నతమైన సంప్రదాయాలు నెలకొల్పారు. అంతెందుకు కమ్యూనిస్టులు అంటే ఏ మాత్రం సరిపడని వాజపేయి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి రోజూ సీపీఐ నాయకుడు భూపేశ్‌ గుప్తా కూర్చున్న చోటికి వెళ్లి శిరసు వంచి నమస్కరించి తన స్థానంలో ఆశీనులయ్యేవారు. విదేశాంగ మంత్రి అయిన తరవాత కూడా వాజపేయి ఈ పనిచేశారు. హిరేన్‌ముఖర్జీనో, భూపేశ్‌గుప్తానో పార్లమెంటులో మాట్లాడుతున్నారని గ్రహించగానే అప్పటి ప్రధాని నెహ్రూ ఎక్కడున్నా పరుగుపరుగున సభలోకి వేచ్చేవారు. ఇప్పుడు ప్రధాని సభకు రావడమే అపురూపం. పీలూమోది లాంటి సోషలిస్టు నాయకులు సభలో నవ్వులు విరబూయించేవారు. వాక్చాతుర్యమేకాక, చమత్కారంగా మాట్లాడే సామర్థ్యం ఉన్న నాయకులు ఎంతో మంది ఉండేవారు. అప్పుడప్పుడూ సభలో సాహితీ సౌరభాలూ వెదజల్లేవారు. ఇప్పుడు మాటకు మాట సమాధానం ఇవ్వడంలో దూషణ పాళ్లే ఎక్కువ. రచ్చబండే పార్లమెంటుకన్నా మేలు అంటే ఆగ్రహించే వారు ఉండవచ్చు. పరిస్థితి మాత్రం అలాగే ఉంది. ప్రత్యక్ష ప్రసారాలు మొదలైనప్పటినుంచి ఎన్నడూ సభలో నోరు విప్పని వెనక బెంచీల వారు సభ మధ్యలోకి దూసుకు వస్తున్నారు. ఈ ప్రతాపం తమ నియోజకవర్గ ప్రజలు చూడాలనుకుంటున్నారేమో. బల్లలు చరచడమే కాక వాటి మీద ఎక్కి నానా యాగీ చేస్తారు. పగబట్టినట్టు కొన్ని ప్రతిపక్షాల వారిని సభ నుంచి సస్పెండ్‌ చేస్తుంటారు.
ఇలాంటి స్థితిలో బుధవారం నాడు వర్షాకాల సమావేశాలకు రెండు రోజుల ముందుగానే ముగియడం ఆశ్చర్యమేమీ కాదు. సమావేశాల కాలం కురచబారడమూ మోదీ పాలనకే పరిమితమైన అంశమూ కాదు. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో కూడా ఇంతకన్నా మెరుగైన పరిస్థితి ఏమీ లేదు. సుష్మా స్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ లాంటి నేతలే సమావేశాలు ప్రారంభమైనా కాకముందే సభ జరగనివ్వం అని ప్రకటించిన విషయాన్ని విస్మరించలేం. ఏ అంశం మీదైనా చర్చకు సిద్ధం అని ఈ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రకటించిన అధికారపక్షమైన బీజేపీ తీరా జులై 19న సమావేశాలు మొదలు కాగానే పెగాసస్‌, రైతుల ఆందోళన, నిరంతరం పెరుగుతున్న పెట్రోల్‌, డీజల్‌ధరలవంటి అంశాలు చర్చించ డానికి నిరాకరించాయి. ఓబీసీల కోటాకు సంబంధించిన 127వ రాజ్యాంగ సవరణ విషయంలో మాత్రం అన్ని పక్షాలూ ఒకే బాణీలో మాట్లాడాయి. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే అది ఓటర్లను ఆకట్టుకునే ఆయుధం. కొత్తగా అందుబాటులోకి వచ్చే కొత్త ప్రభుత్వోద్యోగాలెన్ని అన్న విషయం ప్రస్తావనకే రాదు. ప్రతిరోజూ రగడ తప్పకపోయినా ఉభయ సభలు కలిసి ఇరవై బిల్లులు ఆమోదించేశాయి. ఏ బిల్లు మీదా పట్టుమని పది నిమిషాలైనా చర్చ జరగలేదు. కొన్ని బిల్లుల మీద చర్చే లేదు. మరో విచిత్రం ఏమిటంటే లోకసభ టీవీలో ప్రతిపక్షాల ఆందోళన ఊసే లేదు. ఈ తడవ లోకసభ 96 గంటల పాటు జరగాల్సి ఉంటే 21 గంటల 14 నిముషాలు, రాజ్యసభ 97 గంటలు జరగాల్సి ఉండగా కేవలం 17 గంటలు మాత్రమే సాగింది. లోకసభ 20 బిల్లులను ఆమోదిస్తే రాజ్యసభ 19 బిల్లులను ఆమోదించింది. ఇంత రగడ మధ్యా బిల్లులు ఆమోదించిన తీరు పార్లమెంటు కర్తవ్యాన్ని ప్రహసన ప్రాయం చేసింది. రాజ్యసభలో ఆడా మగ కలిసి 40 మంది మార్షళ్లను నియోగించడం మునుపెన్నడూ లేనిదే. పురుష ఎంపీలున్న చోట మహిళా మార్షళ్లను, మహిళలు ఉన్న చోట పురుష మార్షళ్లను నియమించడం కొత్త ఎత్తుగడే. గత ఇరవై ఏళ్ల సభా కార్యకలాపాలను పరిశీలిస్తే ఇంతకన్నా ఎక్కువ కాలం సభా సమయం వృథా అయిన సందర్భాలు 2012, 2013 లోనూ ఉన్నాయి. యు.పి.ఎ అధికారంలో ఉన్నప్పుడు 2010లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొత్తం తుడిచి పెట్టుకు పోవడానికి అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ పాత్ర లేదంటే ఎలా! 2జి లైసెన్సుల కేటాయింపులో అవకతవకల గురించి కాగ్‌ నివేదిక వెలువడిన నేపథ్యంలో బీజేపీ అసలు సభే జరగనివ్వలేదు. అప్పుడు రాజ్యసభ చేయవలసిన పనిలో చేసింది కేవలం రెండు శాతం. లోకసభే కొంత మెరుగు. ఆరు శాతం పని జరిగింది. ఇప్పటి అధికారపక్షమే అప్పటి ప్రతిపక్షం అని గమనిస్తే సభకు భంగం కలిగించడం ఏ ఒక్క పార్టీకో ప్రత్యేకమైంది కాదని స్పష్టం అవుతోంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే ఆగడాలకు పాల్పడినట్టు చిత్రించడం వాస్తవాన్ని వక్రీకరించడమే. ప్రతిపక్షాలను నోరెత్తనివ్వక పోవడం మోదీ ప్రభుత్వ ప్రత్యేకత!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img