Monday, September 26, 2022
Monday, September 26, 2022

కుబేరుడిని తలదన్నే అదానీ

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త గౌతం అదానీ తాజాగా ప్రపంచంలో కెల్లా రెండవ సంపన్నుడైపోయారు. గత ఆగస్టులో కూడా ఆయన ప్రపంచంలోని సంపన్నుల్లో మూడవ వాడిగా ఉండేవారు. కానీ తాజా లెక్కల ప్రకారం ఆయన రెండవ అత్యంత సంపన్నుడైపోయా రట. లూయీ విట్టన్‌ వ్యాపార బృందం అధినేత అర్నాల్ట్‌ను దాటేసి గత ఆగస్టులో ప్రపంచంలోకెల్లా మూడవ అత్యంత సంప న్నుడు అయిపోయిన అదానీకి రెండవ స్థానానికి చేరుకోవడానికి ఇరవై రోజులు కూడా పట్టలేదు. కూడినవాడికే కూడుతుంది కుంటి లక్ష్మి అన్న నానుడిని అదానీ నిజం చేసేస్తున్నారు. తాజాగా ఆయన అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ను మూడో స్థానంలోకి నెట్టేసి రెండవ అత్యంత సంపన్నుడు అయిపోయారు. ఇప్పుడు ఆయన సంపద 273.5 బిలియన్‌ డాలర్లకు చేరిందట. ఫోబ్స్‌ తాజా పరిశీలనలో ఈ విషయం తేలింది. అదానీ మూడో స్థానానికి చేరినప్పుడు ఆసియాకు చెందిన వ్యక్తి ఆ రికార్డు సాధించడం చాలా గొప్ప అని చర్చించుకున్నారు. కళాశాల చదువు మధ్యలో మానేసి వ్యాపారంలోకి దిగిన అదానీ అంచెలంచెలుగా అయినా అతి వేగంగా సంపద పెంచుకుంటున్నారు. అంబానీ కూడా కాలేజీ చదువు మానేసిన వారే. అదానీ గ్రూపు సంస్థలు ప్రధానంగా బొగ్గు గనుల తవ్వకం, సహజ వాయువు పంపిణీలో నిమగ్నమై ఉండేవి. తరగని ఇంధన వనరుల రంగంలోనూ ఆయన ప్రవేశించారు. రేవులు, సిమెంట్‌, ఆహార పదార్థాలు కూడా ఆయన వ్యాపారాల్లో ప్రధానమైనవే. ఇన్ని చేసిన వ్యక్తి మీడియా గుప్పెట్లో లేకపోతే ఎలా అనుకుని ఎన్‌.డి.టి.వి.లో గణనీయమైన వాటాలు చేజిక్కించుకున్నారు. అయితే ఈ వాటాలు ఆయన నేరుగా ఎన్‌.డి.టి.వి. యజమానులైన ప్రణయ్‌ రాయ్‌, రాధికా రాయ్‌ నుంచి కొన లేదు. ఏదో సంస్థ దగ్గర ఎన్‌.డి.టి.వి. యాజమాన్యం దాదాపు రూ. 400 కోట్ల అప్పు చేసిందట. ఆ సంస్థకు అంబానీలతో సంబంధం ఉంది. అంటే అదానీ అంబానీల దగ్గర నుంచి ఎన్‌.డి.టి.వి. వాటాలు స్వాధీనం చేసుకున్నట్టు. అయితే ఈ వ్యవహారం ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. కానీ ఏలిన వారి దయ ఉంది కాబట్టి కొలిక్కి రాక తప్పదు. ఎన్‌.డి.టి.వి.లో మెజారిటీ షేర్లు దక్కించుకోవాలన్న సంకల్పంతో అదానీ ముందుకు సాగు తున్నారు. అంబానీలకు మీడియాలో ప్రవేశం ఉన్నప్పుడు తమకు లేకపోతే ఎలా అనుకున్నట్టున్నారు. ప్రజల పక్షాన నిలబడే మీడియా సంస్థలు కూడా ఈ మార్గంలో గోదీ మీడియాలో భాగం అయిపోతాయి. ప్రపంచంలో అత్యంత సంపన్నులైన పది మంది జాబితాలో చేరడానికి అదానీకి ఆట్టే సమయం పట్టలేదు. ఈ ఎదుగుదల నిజానికి ఓ అధివాస్తవికత. రెండేళ్ల కింద కూడా అదానీ సంపత్తి 10 బిలియన్‌ డాలర్లు దాటలేదు. అది కాస్తా 2022 జూన్‌ నాటికి ఆ సంపద 105 బిలియన్‌ డాలర్లకు చేరింది. మన దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీని దాటడానికి రెండేళ్ల యినా పట్టలేదు. ఇదే పెద్ద రికార్డు. అదానీ మొట్టమొదట ముంబైలో వజ్రాల వ్యాపారంలోకి దిగారు. కానీ వెంటనే తన సోదరుడు చేస్తున్న ప్లాస్టిక్‌ వ్యాపారంలో సహకరించడానికి తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌ చేరారు. 1988లో అదానీ తన సొంత కంపెనీ అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ ప్రారంభించారు. అది ఇప్పుడు చేయని వ్యాపారమే లేదు. ఒకప్పుడు టాటాలు గుండు సూది నుంచి అన్ని వస్తువులను తయారు చేస్తారని అనేవారు. అంబానీల వ్యాపారం వెనకపడ్డ తరవాత టాటాలు కనీసం ప్రచారంలోనైనా వెనుకపడ్డారు.
ముంబైలోని తాజ్‌ హోటల్‌ మీద తీవ్రవాదులు దాడి చేసినప్పుడు అదానీ ఆ హోటల్లోనే ఉన్నారు. అదానీ సంపద శరవేగంతో పెరగడానికి కచ్చితమైన కారణం ఇదీ అని చెప్పలేం కానీ ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అండదండలు ఉన్నందువల్లే ఆయన అత్యంత వేగంగా లాభాలు సంపాదిస్తున్నారని వార్తలు చాలానే ప్రచారంలోకి వచ్చాయి. ఆర్థిక వేత్తలు ఆర్థికాంశాల సారమే రాజకీయాలు అనడానికి కళ్ల ముందు కదులుతున్న ప్రధాన కారణం ఇదే. మోదీ, షా అధికారంలో ఉన్నంత కాలం అదానీ ఎదుగుదలకు ఏ ఆటంకమూ ఉండకపోవచ్చు. ఈ మాట అంటున్నది రాజకీయ నాయకులో, ఆర్థిక వేత్తలో మాత్రమే కాదు ఐ.ఐ.ఎఫ్‌.ఎల్‌. సెక్యురిటీస్‌ అధిపతి సంజీవ్‌ భాసిన్‌ స్వయంగా ఈ వ్యాఖ్య చేశారు. మోదీ వాగ్దానాల ద్వారా మభ్యపెట్టినట్టే అదానీ ఆశలనూ అమ్మ గలరు. ఉదాహరణకు తరగని ఇంధన రంగంలోకి ప్రవేశించిన అదానీ 2025 కల్లా 25 గిగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగలమని ఆశలు కల్పిస్తు న్నారు. ప్రస్తుతం అదానీ గ్రూపు 20.3 గిగావాట్ల తరగని ఇంధనాన్ని గుప్పెట్లో పెట్టుకుంది. మరో 15 గిగావాట్ల ఇంధనం ఉత్పత్తి చేసే పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. గత కొద్ది నెలలుగా అదానీ తన వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరిస్తున్నారు. హోలిసిం నుంచి ఎ.సి.సి., అంబుజా సిమెంట్‌ కంపెనీలను కొనేశారు. ఎ.ఎం.జి. మీడియాను స్వాధీనం చేసు కోవడంతో ఈ రంగంలో జాంబవంతుడి అంగ వేశారు. అదానీ కంపెనీల షేర్ల విలువ 2019-2022 మధ్యలో వెయ్యి శాతం పెరిగింది. కోవిడ్‌ మహ మ్మారి జనాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో అదానీ షేర్ల విలువ 500 నుంచి 5,100 శాతం పెరిగాయి. దీనివల్ల అదానీ ఎనర్జీ సంస్థ శిఖరాగ్రానికి చేరింది. ఈ కంపెనీ ఒక్కో షేరు 2019లో రూ.46.32 ఉంటే 2022 నాటికి ఇది రూ.2,411కు ఎగబాకింది. 2022 జూన్‌ 30 నాటికి షేర్‌ మార్కెట్లో నమోదైన అదానీ కంపెనీల లాభాలు 155 శాతం పెరి గాయి. అదానీ సంపద దిగ్భ్రమ కలిగించినట్టుగానే ఆయన అప్పులు మామూలు జనం మూర్ఛపోయేట్టు చేస్తాయి. అదానీ గ్రూపు కంపెనీల వార్షిక ఆదాయంకన్నా అప్పులు ఆరు రెట్లు ఎక్కువ. ఈ అప్పులు త్వరలో 2.6 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. మోదీ ప్రధానమంత్రి కాక ముందు అదానీ సంపద కేవలం రూ. 17.000 కోట్లు. వామనుడిలా ఇంతితై, వటుడిరతై అన్నట్టుగా ఇప్పుడు అది ఎంతకాదన్నా అదానీ సంపద రూ. 10 లక్షల కోట్ల పై మాటే. అయితే 2016లో అదానీ అప్పులు ఒక లక్ష కోట్లు అయితే ఇప్పుడు అప్పుల మొత్తం రూ. 2.6 లక్షలకు చేరనుందని గోదీ మీడియా కూడా ఘోషిస్తోంది. దేవలోక అధిపతి అయిన ఇంద్రుడి కొలువులో ఉన్న కుబేరుడు అత్యంత సంపన్నుడు అని మన పురాణాలు చెప్తాయి. అదానీ సంపద చూసి కుబేరుడు సైతం సొమ్మసిల్లి పడిపోవల సిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img