Friday, March 24, 2023
Friday, March 24, 2023

కుమ్మరి ఆవంలా ఇరాన్‌

ఇరాన్‌లో పరిస్థితి గత కొన్ని నెలలుగా అల్లకల్లోలంగా ఉంది. వచ్చే శనివారం నాటికి ఇరాన్‌లో రాజరికం కుప్పకూలి ఇస్లామిక్‌ ప్రభుత్వం ఏర్పడి 44 ఏళ్లు పూర్తవుతుంది. 1979లో ఇరాన్‌ రాజు షా మహమ్మద్‌ రెజా పెహ్లవీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇందులో అమెరికా హస్తం భారీగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఎగుమతి చేయాలన్న అమెరికా ప్రయోగం విఫలంఅయి అక్కడ అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్‌ ప్రభుత్వం ఏర్పడిరది. ఇది రాజరికం కన్నా ఏ మాత్రం మెరుగైంది కాదని గత 44 ఏళ్ల చరిత్ర నిరూపించింది. గత నాలుగైదు నెలలుగా ఇరాన్‌లో ఎక్కడ చూసినా నిరసన ప్రదర్శనలే కనిపిస్తున్నాయి. ఈ సారి నిరసనలు ఇస్లామిక్‌ పాలకుడు ఇబ్రహిం రైసికి వ్యతిరేకం కావడం సానుకూల పరిణామం అనుకోవచ్చు.  మహసా అమీనీ అనే అమ్మాయి హిజాబ్‌ సవ్యంగా ధరించలేదని అరెస్టు చేశారు. ఆమె పోలీసు నిర్బంధంలో మరణించిన తరవాత 2022లో సెప్టెంబర్‌ 16న నిరసనోద్యమం మొదలైంది. ఇరాన్‌లో ఇస్లామిక్‌ పాలనలో హిజాబ్‌ ధరించి తీరాలన్న చట్టం ఉంది. గత సెప్టెంబర్‌లో మొదలైన నిరసన జ్వాలలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. పౌరుల్లో అశాంతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అమీనీ నివసించే సఖెజ్‌లో ప్రారంభమైన నిరసన క్రమంగా దేశవ్యాప్తమైంది. ఈ ఆందోళనలను అణచడానికి ఇరాన్‌ ప్రభుత్వం అంతర్జాల సదుపాయం లేకుండా చేసింది. దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలను వినియోగించడంపై ఆంక్షలు విధించింది. పోలీసుల దమనకాండ నిత్యకృత్యమైంది. హిజాబ్‌ ధరించా లన్న చట్టబద్ధ నిబంధనను విద్యార్థినులు బాహాటంగా ఉల్లంఘిస్తున్నారు. ‘‘మహిళల జీవితం మహిళలదే, మహిళలకు స్వేచ్ఛ కావాలి,’’ ‘‘నియంత నశించాలి’’ అన్న నినాదాలు విద్యాసంస్థలలో సర్వవ్యాప్తమైనాయి. అయతుల్లా అలీ ఖొమేనీని ధిక్కరించడం విపరీతంగా పెరిగిపోయింది. మానవ నిర్మిత చట్టాలకన్నా భగవంతుడి శాసనం ప్రధానమైంది అన్న వాదనను నిరసనకారులు బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. గత అక్టోబర్‌ 8న అల్‌జహ్రా విశ్వవిద్యాలయంలో అయితే దేశాధ్యక్షుడు ఇబ్రాహిం రైసి పర్యటన సందర్భంగా ‘‘మత నాయకులారా అడ్డు తొలగండి’’ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ఇరాన్‌ ప్రభుత్వం మహిళలను రెండవ శ్రేణి పౌరులుగా పరిగణించడాన్ని మహిళాలోకం అంగీకరించడం లేదు. వారిని పాలకులు చదువుకోనివ్వడం లేదు. ఇష్టమైన వారిని పెళ్లాడనివ్వడం లేదు. విడాకులు తీసుకోనివ్వడం లేదు. ఇష్టానుసారం తిరగడానికి కూడా అనుమతించడంలేదు. తలమీద ఆచ్ఛాదనలేని మహిళలను వేధిస్తున్నారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్ల ఆంక్షలను మహిళలు గడిచిన 14 నెలలుగా ప్రతిఘటిస్తున్నట్టే ఇరాన్‌ మహిళలు కూడా తమ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం గళమెత్తుతున్నారు. వారి దీక్ష మార్పు అనివార్యం అన్న సంకేతాలిస్తోంది. 

1979నాటి ఇరాన్‌ ఇస్లామిక్‌ విప్లవం వార్షికోత్సవం సందర్భంగా నెదర్లాండ్స్‌లోని గామాన్‌ సంస్థ ఇరాన్‌లో ప్రజాభిప్రాయం సేకరించింది. ఆ సర్వే ఫలితాలు ఆశ్చర్యకర పరిణామాలకు అద్దం పడ్తున్నాయి. ఇరాన్‌లోని 1,58,000 మంది, 132 ఇతరదేశాల్లోని 42,000 మంది అభిప్రాయాలను ఈ సర్వేలో క్రోడీకరించారు. అత్యధిక సంఖ్యాకులు ఇస్లామిక్‌ పరిపాలనను ఈసడిస్తున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. ఇరాన్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు ఆజ్యం పోస్తోంది అని ఇరాన్‌ ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. ఇందులో సౌదీ అరేబియా ప్రమేయం కూడా ఉంది అని ఇరాన్‌ ప్రభుత్వం వాదిస్తోంది. పర్షియన్‌ సింధు శాఖలో అరబ్బు దేశం కానిది ఇరాన్‌ ఒక్కటే అన్న వాస్తవాన్ని గ్రహిస్తే ఇరాన్‌ ప్రభుత్వం సౌదీ అరేబియాపై విరుచుకుపడడానికి కారణం ఏమిటో అర్థం అవుతుంది. 2010లో ఈజిప్ట్‌తో పాటు పశ్చిమాసియాలోని అనేక దేశాల్లో పెల్లుబికిన ప్రజోద్యమాలు 2019, 2020లో లెబనాన్‌, అల్జీరియా, ఇరాక్‌, సూడాన్‌లో ప్రభుత్వాలను గద్దె దించడానికి ఉపకరించాయన్న విషయాన్ని గుర్తు చేసుకుంటే ఇరాన్‌ మహిళలు ప్రస్తుతం కొనసాగిస్తున్న ఉద్యమ తీవ్రత లోతు తెలుస్తుంది. ఇరాన్‌లో తక్షణం సమూలమైన మార్పులు రావడానికి అవకాశం లేకపోవచ్చు కాని ఉద్యమ ప్రకంపనల ప్రభావం మాత్రం దీర్ఘకాలం కొనసాగేట్టే ఉంది. నెదర్లాండ్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇరాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా ఉండాలా లేదా అని అడిగితే 80.9 శాతం నిర్ద్వంద్వంగా ఒద్దు అని బదులిచ్చారు. విదేశాల్లో నివసిస్తున్న ఇరాన్‌ వాసుల్లో 99శాతం మంది ఇస్లామిక్‌ రిప్లబిక్‌ను ఏవగించుకుంటున్నారు. 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను సమర్థిస్తున్నారు. మార్పు అనివార్యం అని 67శాతం మంది విశ్వసిస్తున్నారు. 73 శాతం మంది ప్రజలు పశ్చిమ దేశాలు తమ నిరసనోద్యమాలను సమర్థించాలని కోరుకుంటున్నారు. నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక భావాలు ఒక నిర్మాణాత్మక రూపం తీసుకోవాలని 85శాతం మంది అభిప్రాయ పడ్తున్నారు. ప్రతిపక్ష శక్తులన్నింటినీ సంఘటితం చేయాలన్న ఆలోచన నిరసనకారుల్లో ఉంది. ఈ ప్రతిపక్ష సంఘటనలో విదేశాల్లో ఉంటున్న ఇరాన్‌ దేశస్థులకు కూడా భాగస్వామ్యం ఉండాలన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
కొంతమంది అయితే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం కొనసాగకూడదన్న భావన ఎంత బలంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయ వ్యవస్థ ఎలా ఉండాలి, ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ స్థానంలో ఎలాంటి వ్యవస్థ రూపుదిద్దుకోవాలి అన్న అంశం మీద మాత్రం ఎవరికీ నిర్దిష్టమైన అభిప్రాయం కనిపించడం లేదు. ఇరాన్‌లో ఉంటున్న వారిలో 28శాతం మంది, విదేశాల్లో ఉంటున్న ఇరాన్‌ వాసుల్లో 32శాతం మంది అధ్యక్ష తరహా పాలనవేపు మొగ్గు చూపుతున్నారు. ఇరాన్‌ పౌరుల్లో 22శాతం, ప్రవాసంలో ఉన్న వారిలో 25శాతం మంది రాజ్యాంగ బద్ధమైన రాచరికాన్ని కోరుకుంటున్నారు. అంటే వీరి అభిప్రాయం ప్రకారం, వర్జీనియాలోఉంటున్న మాజీరాజు షా మహమ్మద్‌ రెజాపహల్వీ కుమారుడు రెజా షా పహల్వీ పరిపాలనా బాధ్యతలు స్వీకరించాలను కుంటున్నారు. ఇరాన్‌ పౌరుల్లో 12 శాతం, విదేశాల్లోని ఇరాన్‌ జాతీయుల్లో 29శాతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మెరుగైందని అభిప్రాయపడ్తున్నారు.
సగటున 60 శాతం మంది అర్థవంతమైన మార్పు కనిపించాలంటే ప్రస్తుత ప్రభుత్వం గద్దె దిగాల్సిందేనని నమ్ముతున్నారు. అయితే ఇరాన్‌ రాజు కుమారుడు అధికారం చేపట్టే అవకాశాలు చాలా బలహీనంగానే ఉన్నాయి. ప్రజలలో పొడసూపుతున్న మనోభావాలకు, భవిష్యత్‌ మార్గ దర్శనం మధ్య ఉండవలసినంత సంయోగం ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఆలోచన అత్యధిక సంఖ్యాక ప్రజల్లో వ్యక్తమవుతున్నా భవిష్యత్‌ రాజకీయ స్వరూపం ఎలా ఉంటుంది, లేదా ఎలా ఉండాలన్న విషయంలో ఎక్కడా స్పష్టతా, ఏక సూత్రత ఉన్నట్టు లేదు. ప్రజోద్యమాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థవేపు నడిపించే నాయకత్వం లేకపోవడం ఇరాన్‌ విషాదం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img