Monday, February 6, 2023
Monday, February 6, 2023

కులగణన ప్రాధాన్యత

బిహార్‌లో కులగణన ప్రారంభం అయింది. కులగణన జరగాలని మొట్ట మొదట కోరింది బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌. చివరకు ఆయనే కులగణనకు శ్రీకారం చుట్టారు. కులగణన ప్రతిపాదనను శాసనసభలో బీజేపీ కూడా సమర్థించింది కనక ఆ పార్టీ సైతం నితీశ్‌ ప్రయత్నాన్ని ఎదిరించే స్థితిలో లేదు. ఎన్నికల దృష్టితో చూస్తే కులగణనవల్ల నితీశ్‌ కుమార్‌ కు కలిగే పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహించే సామాజిక వర్గం కేవలం రెండు శాతం మాత్రమే. గత కొద్ది సంవత్సరాలుగా కులగణన జరగాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. దీనికోసం ఒత్తిడి క్రమంగా పెరుగుతూనే ఉంది. మండల్‌ రాజకీయాల మీద ఆధారపడే వారు ప్రధానంగా కులగణన కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇతర వెనుకబడిన కులాల వారు, గిరిజనులు, దళితులు బీజేపీకి మద్దతు ఇవ్వడం ప్రారంభమైన తరవాత కులగణన కోసం అడిగే వారు పెరిగిపోయారు. ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో తేలితే సామాజిక న్యాయం అందజేయడం మరింత సులభం అవుతుందని కులగణన కోరే వర్గాలు వాదిస్తున్నాయి. దీనివల్ల అభివృద్ధి లక్ష్యాలు మరింత విస్తృతం అవుతాయన్న ఆలోచన వీరికి ఉంది. కులాల వారీ లెక్కలు తేలితే వివిధ రంగాలలో తగిన ప్రాతినిధ్యం లేని వారు తమ పాత్రను మరింత సమర్థంగా నిర్వహించగలుగుతారన్న అభిప్రాయం ఉంది. ఆర్థిక, రాజకీయ రంగాలలో వివిధ కులాల వారు మరింత చురుకుగా, విస్తృతంగా పాల్గొనే అవకాశం ఉంటుందన్న వాదనా ఉంది. అయితే కులగణన కావాలంటున్న వారి వాదనలో పైకి కనిపించే లక్ష్యానికి మించిన లక్ష్యం ఉందని అనే వారికీ కొదవ లేదు. మండల్‌ కమిషన్‌ నివేదిక సమర్పించిన తరవాత ఇతర వెనుకబడిన తరగతుల వారిలో రాజకీయ చైతన్యం పెరిగిన మాట వాస్తవం. ఇతర వెనుకబడిన తరగతుల వారు ఉత్తర భారతంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం చూస్తూనే ఉన్నాం. 1990 ల నుంచి ఇతర వెనుకబడిన కులాల వారు తమ హక్కులకోసం, వనరుల్లో తగిన వాటా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా ఉత్తేజితులై రాజకీయ చైతన్యం పెంపొందించుకున్న వర్గాలు రాజకీయాల్లో కేంద్ర స్థానం లోకి రావడం ఒక రకంగా బీజేపీ అనుసరించే కమండల రాజకీయాలకు పెద్ద సవాలుగా తయారైంది. బాబరీ వివాదం, దాని పర్యవసానంగా ఆ చారిత్రక కట్టడం మన బహుళ సంస్కృతికి తీవ్ర విఘాతం కలిగించి ఉండవచ్చు కానీ కమండల రాజకీయాలు బీజేపీకి అధికారం దక్కేట్టు చేశాయి. ఇది సామాజిక న్యాయం కోసం పోరాడే పక్షాలను చైతన్యవంతులను చేసింది. కమండల రాజకీయాలను ఎదుర్కునే శక్తి మండల్‌ రాజకీయాలు అనుసరించే వారికే ఉంటుందని రుజువైంది. సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్‌లోని భిన్న పక్షాలు మండల్‌ రాజకీయాల నేపథ్యంలో అవతరించి బలపడ్డేవే. ములాయం సింగ్‌ యాదవ్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ లాంటి వారు ఆ క్రమంలోనే బలమైన రాజకీయ నాయకులుగా ఎదిగారు. మండల రాజకీయాలు హిందుత్వ రాజకీయాలను నిలవరించడానికి ఉపకరించిన మాట వాస్తవమే కానీ ఈ క్రమంలోనే కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల కాళ్ల కింది నేల జారిపోయిన మాట కూడా వాస్తవమే. ఈ ప్రభావం ప్రధానంగా బిహార్‌, ఉత్తరప్రదేశ్‌లో ప్రస్ఫుటంగా కనిపించింది. 

మరో వేపున నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ హిందుత్వ రాజకీయాలకు ఒక వేపున పదును పెడ్తూనే ఇతర వెనుకబడిన కులాల వారిని, దళితులను సమీకరించడానికి కొత్త ఎత్తులు ఎత్తుతూనే ఉంది. మండల్‌ రాజకీయాలు నడిపిన ములాయం సింగ్‌ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, లాలూప్రసాద్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌.జె.డి.) యాదవులకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాయని బీజేపీ ప్రచారం చేయడం మండల్‌ రాజకీయాలు అనుసరించే రాజకీయ పక్షాలకు విఘాతం కలిగించింది. మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ వల్ల కూడా దళితుల్లో జాతవులకే ఎక్కువ ప్రయోజనం కలిగిందన్న వాదనా ఉంది. ఈ సహస్రాబ్ది ఆరంభం నుంచి నితీశ్‌ కుమార్‌ యాదవేతర ఇతర వెనుకబడిన వర్గాలను సమీకరించడంలో సఫలమయ్యారు. దళితులను కూడా ఆయన చేరదీయగలిగారు. బిహార్‌ లో ఒక దశలో లాలూ ప్రాభవం తగ్గడానికి నితీశ్‌ కుమార్‌ అనుసరించిన ఈ పంథానే కారణం. ఇంకో వేపు బీజేపీ తన పలుకుబడి విస్తరించుకోవడానికి కుల సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చింది. అదే సమయంలో అవసరమైనప్పుడల్లా హిందుత్వ రాజకీయాలను మరింతగా ఆశ్రయించింది. ప్రస్తుతం నితీశ్‌ కుమార్‌ లాలూ నాయకత్వంలోని ఆర్‌.జె.డి.తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉండొచ్చు. దీనికి విభిన్నమైన కారణాలు ఉన్నాయి. రాజకీయాలలో ఏ పంథా శాశ్వతం కాదని బీజేపీతో తెగతెంపులు చేసుకుని నితీశ్‌ నిరూపించారు.
నితీశ్‌ కుమార్‌ కులగణనకు ప్రాధాన్యం ఇవ్వడానికి, ఈ లెక్కలు సేకరించడానికి భారీగా నిధులు కేటాయించడానికి కారణం మండల్‌ రాజకీయాలు అనుసరించే వారు ఒకే కులానికి ప్రాముఖ్యత ఇచ్చే వారు కాదని నిరూపించడానికే. కులాల లెక్క తేలితే మరిన్ని కులాలను తమ పరిధిలోకి తీసుకొచ్చి సామాజిక న్యాయం కోసం మరింతగా పాటుబడే అవకాశం ఉంటుందన్నది నితీశ్‌ కుమార్‌ అంచనా కావచ్చు. వీలైనన్ని కులాలను సమీకరిస్తే తప్ప బీజేపీని ఎదిరించడం సాధ్యం కాదన్న అభిప్రాయం నితీశ్‌కుమార్‌కు ఉన్నట్టుంది. బీజేపీ ఓట్ల కోసం వివిధ కులాల మద్దతు సంపాదించడానికి పాట్లు పడుతూ ఉండొచ్చు. కానీ సామాజిక న్యాయాన్ని బీజేపీ పట్టించుకున్న సందర్భాలు తక్కువ. ఆ అంశం ఆధారంగానే కులగణన ద్వారా మరింత పకడ్బందీ రాజకీయ వ్యూహాలు పన్నాలన్నది నితీశ్‌ అంచనా అయి ఉంటుంది. నితీశ్‌ కుమార్‌ దృష్టి ప్రధానంగా సామాజిక న్యాయం మీదే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకే కుల బలం మీద ఆధారపడ్డ చిన్న చిన్న రాజకీయ పార్టీలు ఉత్తరాదిలో కులగణన అవసరాన్ని ముందుగా నొక్కి చెప్పాయి. ఇతర వెనుకబడిన కులాల వారిలో సంఖ్యాబలం, ఆధిపత్యం ఉన్న కులాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పార్టీలను నిలవరించడానికి ఈ చిన్న పార్టీలు కులగణన కోసం ఒత్తిడి చేశాయి. ఇతర వెనుకబడిన కులాల వారిలోనూ రాజకీయ ఆధిపత్యం చెలాయించగలిగిన స్థితిలో ఉన్న వర్గాలకే ఎక్కువ ప్రయోజనం కలిగిన మాట వాస్తవం. సంక్షేమ పథకాల ప్రయోజనం ఆధిపత్యం చెలాయించే సామాజిక వర్గాలకే దక్కింది. రిజర్వేషన్ల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందింది కూడా ఈ సామాజిక వర్గాలే. ఒక కులానికే ప్రాతినిధ్యం వహించే పార్టీలు రాజకీయాలలో, రిజర్వేషన్లలో వాటా కోసం కులగణన కావాలనుకుంటున్నాయి. వీరి ఆకాంక్షలకు నితీశ్‌ బలమైన వాణిగా నిలిచారు. ఎవరి జనాభా ఎంతో ఆ దామాషా ప్రకారమే తగిన వాటా దక్కాలన్న కాన్శీరాం మాట నెరవేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img