Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

కె.సి.ఆర్‌. దృష్టి విశాలం పరిధి పరిమితం

భక్తి విశ్వాసాలు ఉన్నవారు తాము మంచి పనులు అనుకున్నవి సాధారణంగా విజయదశమి రోజు ప్రారంభిస్తారు. భక్తి, విశ్వాసం రెండూ మెండుగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌.)ని భారత రాష్ట్ర సమితి (బి.ఆర్‌.ఎస్‌.) గా మార్చేశారు. అంటే ఇక మీదట మొన్నటిదాకా ప్రాంతీయ పార్టీగా ఉన్న టి.ఆర్‌.ఎస్‌. ఆ పార్టీ వ్యవస్థాపకుడి దృష్టిలో జాతీయ పార్టీ అయిపోయినట్టే. కె.సి.ఆర్‌.కు జాతీయ రాజకీయాల మీద దాదాపు ఏడాదిగా దృష్టి పెరిగింది. వివిధ చోట్లకు వెళ్లి ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసు కుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నాయకులు కూడా హైదరాబాద్‌ వచ్చి కె.సి.ఆర్‌.తో ముచ్చటిస్తున్నారు. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మలచాలన్న కె.సి.ఆర్‌. లక్ష్యానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి: జాతీయ రాజకీయాలలో తాను కీలక పాత్ర పోషించడం. వీలు కుదిరితే ప్రధానమంత్రి అయిపోవడం. రెండు: 2024లో ఎలాగైనా సరే మోదీ నాయకత్వంలోని బీజేపీ వరసగా మూడో సారి అధికారంలోకి రాకుండా చూడడం. బీజేపీని అడ్డుకోవడంలో కె.సి.ఆర్‌.కు ప్రాంతీయ దృష్టి కూడా లేకపోలేదు. తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ తీవ్రంగానే కృషి చేస్తోంది. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీ సాధించింది ఒక్క స్థానమే అయినా దుబ్బాక, హుజూరాబాద్‌ స్థానాలను ఉప ఎన్నికలలో బీజేపీ కైవశం చేసుకుంది. హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో బీజేపీ గణనీయమైన స్థానాలు సాధించింది. దీనితో తెలంగాణాలో అధికారం సంపాదించాలన్న ఆశ ఆ పార్టీలో బాగా పెరిగింది. బీజేపీ ఎదుగుదల కె.సి.ఆర్‌.కు అనుకూలమైన అంశం కాదు. మోదీని వ్యతిరేకించడంలోనూ టి.ఆర్‌.ఎస్‌. వైఖరికి ప్రధాన కారణం ప్రాంతీయ రాజకీయాలే. ప్రస్తుతానికి తెలంగాణాలో టి.ఆర్‌.ఎస్‌. ఎదురులేకుండానే ఉంది. ఇదే శక్తిని జాతీయ స్థాయిలో ప్రదర్శించాలని కె.సి.ఆర్‌. సంకల్పించడంలో అభ్యంతరపెట్టాల్సింది ఏమీ లేదు. కె.సి.ఆర్‌. వేసే ప్రతి అడుగు వెనక ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది. ప్రత్యేక తెలంగాణ సాధించడంలో కూడా ఆయన నడిపిన ఉద్యమం కన్నా అనుసరించిన వ్యూహమే ప్రధానమైంది. అప్పుడు ఆయన లోకసభ సభ్యుడిగా ఉండేవారు. కొంత కాలం కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు. దిల్లీలో మకాం వేసే అవకాశాన్ని లోకసభలో ప్రాతినిధ్యం ఉన్న వివిధ పార్టీలకు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఎంత ఆవశ్యకమైందో వివరించడానికి ఆయన బాగా వినియోగించుకున్నారు. రాష్ట్ర విభజన బిల్లుకు పార్లమెంటు ఆమోదం కావాలిగనక ఆయన అనేక పార్టీల నాయకుల మద్దతు కూడగట్టగలిగారు. కె.సి.ఆర్‌. వ్యూహ రచనా నైపుణ్యం మోదీని సైతం భయపెట్టగలిగేంత సమర్థమైంది. నిజానికి తెలంగాణలో ఉన్న మొత్తం 17 లోకసభ స్థానాలూ టి.ఆర్‌.ఎస్‌. గుప్పెట్లోనే ఉన్నా అది కె.సి.ఆర్‌. ప్రధానమంత్రి కావడానికి ఎందుకూ కొరగాదు. కె.సి.ఆర్‌.కు ఇతర పార్టీల మద్దతు సమకూరితే ఆయన ప్రధాని కావడానికి మార్గం ఉండకపోదు. ఏడాది కాలంగా కె.సి.ఆర్‌. ప్రధానమంత్రి మోదీని, ఆయన విధానాలను తీక్షణమైన భాషలో తప్పు పడ్తున్నారు. అంతటితో ఆగకుండా అధికార మర్యాదలను కూడా లెక్క చేయకుండా ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్‌ వచ్చినా కె.సి.ఆర్‌. ఆయనకు స్వాగతం చెప్పకపోగా ఏదో కారణం చూపి మోదీని కలవకుండా జాగ్రత్త పడ్డారు. కె.సి.ఆర్‌. చాలా చతురుడైన రాజకీయ నాయకుడు. తాను ఎంచుకున్న లక్ష్యం సాధించి తీరతారన్న పేరు ఆయనకు ఉంది. ప్రత్యేక తెలంగాణ సాధించడమే దీనికి మంచి ఉదాహరణ. అయితే కె.సి.ఆర్‌.కు మరో సమస్య ఉంది. ఆయన బీజేపీ వ్యతిరేకి మాత్రమే కాదు. కాంగ్రెస్‌ను కూడా దరి చేరనివ్వరు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడన్నా కె.సి.ఆర్‌.కు కిట్టదు. అంటే ఆయన రాష్ట్ర స్థాయిలో ఈ మూడు పార్టీలను నిలువరించవలసిందే. దీని ప్రభావంవల్ల జాతీయ స్థాయిలోనూ ఈ మూడు పార్టీల మద్దతు భారత రాష్ట్ర సమితికి దక్కదు. మోదీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఐక్యం కావాలన్న ఆలోచన కె.సి.ఆర్‌.కు చాలా స్పష్టంగానే ఉంది. టి.ఆర్‌.ఎస్‌.ను అమాంతం జాతీయ పార్టీగా మార్చడంవల్ల మౌలికమైన ఈ ప్రాతిపదిక ఏమీ సమకూరదు.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. మొదటిది కనీసం నాలుగు రాష్ట్రాలలో కె.సి.ఆర్‌. పార్టీకి రాష్ట్ర పార్టీగానైనా గుర్తింపు ఉండాలి. కె.సి.ఆర్‌. ఇంతవరకు మరే రాష్ట్రంలోనూ పోటీ చేసే సాహసం చేయలేదు. అలాగే జాతీయ పార్టీగా పరిగణనలోకి రావాలంటే నాలుగు రాష్ట్రాలలో ఆరు శాతం ఓట్లు రావాలి. నాలుగు లోకసభ స్థానాలు ఉండాలి. లేదా మూడు రాష్ట్రాలలో లోకసభ ఎన్నికలలో మూడు శాతం ఓట్లు సంపాదించాలి. బి.ఆర్‌.ఎస్‌.గా మారిన మునుపటి టి.ఆర్‌.ఎస్‌.కు ఒక్క తెలంగాణాలోనే ప్రాతినిధ్యం ఉంది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి ప్రయత్నించడానికైనా కె.సి.ఆర్‌. కనీసం 2023లో కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల దాకా ఆగాల్సిందే. ఆ రాష్ట్రాలలో ప్రాతినిధ్యం సాధించాల్సిందే. అంటే అక్కడి స్థానిక పార్టీలు కె.సి.ఆర్‌. కు సహకరించాలి. మోదీని గద్దె దించడానికి కె.సి.ఆర్‌. మొన్నటి దాకా రకరకాల ప్రయత్నాలు చేశారు. ప్రతిపక్షాల ఐక్యతకోసం ప్రయత్నించారు. అయితే ఆయన దృష్టిలో ప్రతిపక్షాల ఐక్యత అంటే బీజేపీయేతర పార్టీల లేదా ప్రతిపక్ష పార్టీలుగా పరిగణనలోకి వచ్చే పార్టీల ఐక్యత కాదు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ఆయన ఇదివరకు చేసిన ప్రయత్నాన్ని విస్మరించకూడదు. కె.సి.ఆర్‌. దృష్టిలో ఉన్న ప్రతిపక్ష ఐక్యతలో లేదా ప్రతిపక్ష ఫ్రంట్‌లో కాంగ్రెస్‌ కు స్థానం ఉండదు. ఎంత బలహీనపడినా దేశమంతటా కనీస ఆనవాళ్లు ఉన్న పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటే. కాంగ్రెస్‌ను దూరం పెట్టి మోదీని గద్దె దించగలరా అన్నది లక్ష వరహాల ప్రశ్న. కె.సి.ఆర్‌. మదిలో బీజేపీ వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో కాంగ్రెస్‌ అంటే విముఖత సైతం అంతకన్నా తీవ్రంగానే ఉంది. పార్లమెం టులో టి.ఆర్‌.ఎస్‌. సభ్యుల నడవడిక, వివిధ బిల్లులు, తీర్మానాలపై టి.ఆర్‌.ఎస్‌. సభ్యులు ఎటు వేపు నిలబడ్డారు అని ప్రశ్నించుకుంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీకి అనుకూల వైఖరి అనుసరించిన సందర్భాలు కొల్లలు. అలాంటప్పుడు ఇతర ప్రతిపక్షాలు బి.ఆర్‌.ఎస్‌.ను ఎందుకు సమర్థిస్తాయి, అసలు ఎందుకు సమర్థించాలి అన్న ప్రశ్న ఎదురుకావడం సహజం. ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం కనిపించదు. దసరా రోజు కె.సి.ఆర్‌. భారత రాష్ట్ర సమితికి శ్రీకారం చుట్టినప్పుడు కర్నాటకలో జనతా దళ్‌ (సెక్యులర్‌) నాయకుడు కుమార స్వామి వచ్చారు. కొంత మంది రైతు నేతలూ వచ్చారు. తమిళనాడు నుంచి అంత ప్రాచుర్యం లేని పార్టీల నేతలు వచ్చారు. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టడానికి కె.ఎస్‌.ఆర్‌.కన్నా తీవ్రమైన ప్రయత్నమే చేస్తున్నారు. కె.సి.ఆర్‌. దృష్టి విశాలమైంది అయినా పరిధి పరిమితమైంది. మోదీని గద్దె దించడానికి తక్షణావసరం మరో జాతీయ పార్టీ కాదు. విశాల ప్రాతిపదికపై ప్రతిపక్షాల ఐక్యత.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img