Friday, September 30, 2022
Friday, September 30, 2022

కేజ్రీవాల్‌ మాయా యుద్ధం

వచ్చే సార్వత్రిక ఎన్నికలలోగా ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదని నిర్దారించుకున్న ప్రధానమంత్రి మోదీ ఎందుకైనా మంచిదని తానే ఓ ప్రత్యర్థిని ఎంపిక చేసుకున్నారు. ఆయనే ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల మీద లేదా ఇతర నాయకుల మీద కసి తీర్చుకోవాలనుకున్నప్పుడు మోదీ సర్కారు ఓ విశిష్టమైన పద్ధతి అనుసరిస్తోంది. కేజ్రీవాల్‌ మీద విమర్శలకు మాత్రమే పరిమితం అవుతూ ఆయన తరవాతి స్థానంలో ఉన్న మనీశ్‌ సిసోడియా మీద సీబీఐ చేత దాడులు చేయించింది. దిల్లీ ప్రభుత్వ ఆబ్కారీ విధానంలో అవకతవకలు, అక్రమాలు ఉన్నాయన్న కారణం చూపి సీబీఐని దాడులకు పురి కొల్పారు. సీబీఐ కాకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ను ప్రయోగించడం పరిపాటి అయిపోయింది. అంతమాత్రం చేత మనీశ్‌ సిసోడియా రూపొందించిన ఆబ్కారీ విధానం లోపరహితమైందని కాదు. ఏ రాష్ట్రంలోనూ ఆబ్కారీ విధానం నిష్కల్మషంగా ఉండదు. ఇదివరకే మరో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేంద్ర జైన్‌ ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. అవినితి వ్యతిరేక ఉద్యమ కెరటాల ఆసరాగా అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా అవినీతికి అతీతం కాదు అన్న అభిప్రాయం కలిగించడమే మోదీ సర్కారు ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది నవంబర్‌ లో హిమాచల్‌ శాసనసభకు డిసెంబర్‌ లో గుజరాత్‌ శాసన సభకు జరగనున్న ఎన్నికలలో పోటీ చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ సిద్ధం అవుతోంది. పంజాబ్‌ శాసనసభ ఎన్నికలలో సాధించిన విజయం ఆమ్‌ ఆద్మీ పార్టీలో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించగలమన్న ఆత్మ విశ్వాసం పెంచింది. 2024 ఎన్నికలలోనూ మళ్లీ అధికారంలోకి రాగలమన్న ధీమా బీజేపీలో బలంగానే ఉంది. కానీ మోదీ పరిపాలనా విధానంపై విమర్శలకూ కొదవలేదు. ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు మోదీని నిరంతరంగా తూర్పారబడ్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు కూడా మోదీ ఏలుబడిపై అసంతృప్తి ఇంతకన్నా ఎక్కువే వ్యక్తమైంది. అప్పుడు బీజేపీ అధికారంలోకి రావడం కష్టం అన్న మాటా వినిపించింది. కానీ అనూహ్యంగా బీజేపీ 2014 కన్నా మెరుగైన ఫలితాలు సాధించడమే కాకుండా సొంతంగానే మెజారిటీ సాధించింది. ప్రతిపక్షాల అనైక్యతే దీనికి కారణం కావచ్చు. ఇప్పుడూ అలాంటి పరిస్థితే ఉంది. ఒక వేపు మోదీ పాలనపైనే గాక ఆయన అనుసరిస్తున్న విచ్ఛిన్నకర విధానాల మీద జన బాహుళ్యం అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రజాభిప్రాయాన్ని మలచగల సామర్థ్యం ఉన్న వారిలో మాత్రం అసంతృప్తి మెండుగా ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నిశ్చేష్ట స్థితి నుంచి బయట పడలేక పోతోంది. నిజానికి ఆ ఉద్దేశమే ఉన్నట్టు లేదు. మిగతా ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేసే ఉద్దేశమే కాంగ్రెస్‌ కు లేదు. పైగా ఆ పార్టీలో అసమ్మతి రాగాలు మళ్లీ ఊపందుకున్నాయి. మిగతా ప్రతిపక్షాలు ఐక్యత కోసం ప్రయత్నిస్తున్నా అవి ఏకోన్ముఖంగా లేవు. ఇద్దరు ముగ్గురు ప్రతిపక్ష నాయకులు తామే ప్రతిపక్ష శిబిరానికి నాయకులం కావాలన్న దృష్టితోనే ప్రయత్నిస్తున్నారు. మమతా బెనర్జీ, కె.చంద్రశేఖరరావు వేస్తున్న అడుగులు నాయకత్వం తమదేనన్న రీతిలో ఉన్నాయి. అయితే ఈ ఇద్దరు నాయకులూ దేశవ్యాప్తంగా ఆమోద యోగ్యులవుతారన్న భరోసా లేదు. పైగా ఈ ఇద్దరు నాయకులకూ అధికారం ఉన్నది తమ రాష్ట్రాలలోనే. విస్తరించడానికి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇటీవల కొన్ని రాష్ట్రాలలో లాంఛన ప్రాయంగా పోటీ చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు. కె.చంద్ర శేఖర్‌ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్‌.ఎస్‌.) అసలు ఇతర రాష్ట్రాలలో పోటీ చేయాలన్న ఆలోచనలోనే లేదు. కేంద్రంలో చక్రం తిప్పాలన్న ఆతృత మాత్రం చంద్రశేఖరరావులో నిండుగా ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండు చోట్ల అధికారంలో ఉంది కనక మోదీని నిలవరించగలనన్న అభిప్రాయం కేజ్రీవాల్‌ లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆయన నిలవరించగలరో లేదో కానీ మోదీ మాత్రం కేజ్రీవాల్‌ నే తన ప్రధాన ప్రత్యర్థిగా జమకడ్తున్నట్టున్నారు. ప్రతిపక్ష నాయకులందరూ అవినీతిపరులేనన్న అభిప్రాయం కలగజేస్తే తనకు తిరుగు ఉండదని మోదీ గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను అవినీతిపరుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ మీద కేజ్రీవాల్‌ విమర్శలు తీవ్రంగానే గుప్పిస్తున్నా అనునిత్యం మాటకు మాట జవాబిస్తూ మీడియా స్థలాన్ని ఆవరిస్తున్నా అసలు శక్తి ఏమిటో రుజువు కావలసే ఉంది. ఏమైతేనేం మోదీ, కేజ్రీవాల్‌ మధ్య మాటల యుద్ధం రణగొణ ధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయి.
అవినీతిని ఎవరు వ్యతిరేకించినా ఆహ్వానించవలసిందే. ఎన్ని అవకతవకలు జరిగినా ఉదాహరణ ప్రాయంగానైనా మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద గానీ, బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వాల మీద గానీ ఎన్ని ఆరోపణలొచ్చినా స్పందించదు. నామమాత్రంగానైనా దర్యాప్తుకు సమ్మతించదు. తాను బీజేపీలో చేరితే ఉన్న కేసులన్నీ మూసేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయని సిసోడియా అంటున్నారు. ఈ వాదనలో నిజం ఉన్నా లేకపోయినా బీజేపీలో చేరే అవినీతిపరులు అమాంతం పరమ పవిత్రులుగా, కడిగిన ముత్యంలా మారిపోతున్న మాట వాస్తవం. ప్రత్యర్థుల మీద ముందు కళంకితులు అన్న ముద్ర వేసి తరవాత వారు బీజేపీలో చేరితే సర్వ పాపాల గరళాన్ని తన కంఠంలో దాచుకునే పరమశివుడిగా మోదీ మారిపోయారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టి వారి నోళ్లు మూయించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ తన అధికారాన్ని బాహాటంగానే దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా బీజేపీలో చేరిన వారిచేత పవిత్ర స్నానాలు చేయిస్తున్న బీజేపీ అవినీతి నిర్మూలనకు కంకణం కట్టుకుందని నమ్మే అమాయ కులు ఎవరూ లేరు. కానీ నియంతృత్వం కొనసాగుతున్న దశలో భిన్న స్వరాలకు విలువెక్కడ ఉంటుంది గనక! మోదీ పాలనలో అవినీతి ఒక్కటే సమస్య కాదు. రాఫేల్‌ కుంభకోణం మొదలుకుని ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటిని చాపకిందకు తోసేయగలిగిన సాహసం బీజేపీకి ఉంది. కేజ్రీవాల్‌ విరామం లేకుండా మోదీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉండొచ్చు. కానీ ఆయన పార్టీ బీజేపీకి భిన్నమైన పార్టీ ఏమీ కాదు. అన్నా హజారే 2011లో నిర్వహించిన అవినీతి పోరాటంవల్ల దిల్లీలో కేజ్రీవాల్‌, కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చారు. అప్పుడు ఇద్దరి ఎజెండా అవినీతి నిర్మూలనే. వారి దారులు వేరు కావడానికి అధికారానికి అంటిపెట్టుకుని ఉండాలన్న బలమైన కాంక్షే ప్రధాన కారణం. ప్రతిపక్ష నాయకులు నాయకత్వం తమకే దక్కాలన్న దుగ్ధతో ఉన్నారు తప్ప మోదీ వినాశకరమైన ఎజెండాను సవాలు చేసే సంకల్పం వారిలో లేదు. ఆ ధ్యాసే లేని వారిలో మొదటి వరసలో నిలిచేది కేజ్రీవాలే. కేజ్రీవాల్‌ ది మాయా యుద్ధం కావచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img