Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

కొడిగడ్తున్న బీజేపీ దీపం

దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ, రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌, మిజోరంతో పాటు మధ్య ప్రడేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరగవలసిఉంది. మిగతా రాష్ట్రాల మాట ఎలాఉన్నా మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగక ముందే బీజేపీ ఓటమి అంగీకరిస్తున్నట్టు కనిపిస్తోంది. నరేంద్ర మోదీ ఆఖరి పోరాటానికి సిద్ధమవుతూనే ఉన్నారు. గత ఆరు నెలల కాలంలో మోదీ ఏడుసార్లు మధ్యప్రదేశ్‌లో పర్యటించారు. మధ్యప్రదేశ్‌లో అమలు చేయబోయే పథకాల గురించి మోదీ భారీ వాగ్దానాలు చేస్తూ ఓటర్లకు వలవిసురుతున్నారు. ఎన్నికలు దగ్గర పడ్తున్నకొద్దీ మోదీ పర్యటనలు మరింత పెరుగుతాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తరచుగా మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తూనే ఉన్నారు. బీజేపీ యంత్రాంగం అంతా మధ్యప్రదేశ్‌ మీదే దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఇతరులు మధ్యప్రదేశ్‌ చుట్టే తిరుగుతున్నారు. యుద్ధ తంత్రం రూపొందించడంలో నిమగ్నమై ఉన్నారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సుదీర్ఘకాలంగా మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనా లెక్కలేనన్ని కొత్త పథకాలు నిర్విరామంగా ప్రకటిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ఎన్నికల మీదే దృష్టి కేంద్రీకరించే బీజేపీ ఎన్నికల కోడికూయకముందే నెల కిందట 39 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. సోమవారం సాయంత్రం పొద్దు పోయిన తరవాత మరో 39 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అయితే ఈ 78 స్థానాల్లో మూడిరట్లో మినహా మిగతా చోట్ల గత ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే వారికి ప్రచారం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. కానీ ఈ పద్ధతి టికెట్లు ఆశించి భంగపడినవారి అసంతృప్తికి కూడా ఆజ్యం పోస్తోంది. బీజేపీ సోమవారం సాయంత్రం 39స్థానాలకు విడుదలచేసిన అభ్యర్థుల జాబితాలో ఉన్న పేర్లుచూస్తే బీజేపీని ఓటమిభయం విపరీతంగా పీడిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ఈ జాబితాలో మొత్తం 11మంది లోకసభ సభ్యులున్నారు. అందులో ముగ్గురు కేంద్ర మంత్రులు. నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే ఉన్నారు. నరేంద్ర సింగ్‌ తోమార్‌ మధ్యప్రదేశ్‌ ఎన్నికల కమిటీ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తారు. ఈ మంత్రులతోపాటు పార్లమెంటు సభ్యులైన రాకేశ్‌ సింగ్‌, గణేశ్‌ సింగ్‌, రీతీ పాఠక్‌, ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌ కూడా ఉన్నారు. బీజేపీ పోటీకి దింపుతున్న పార్లమెంటు సభ్యులలో నలుగురు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నవారే. బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ కూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే దాదాపు 33 ఏళ్ల తరవాత శాసనసభకు పోటీ చేస్తున్నారు. నరేంద్ర సింగ్‌ తోమర్‌ 2014 నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన 15 ఏళ్ల తరవాత శాసనసభ బరిలోకి దిగుతున్నారు. అయిదుసార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ మొదటిసారి శాసనసభకు పోటీచేస్తున్నారు. కైలాశ్‌ సింగ్‌ విజయవర్గీయ కూడా పదేళ్ల తరవాత శాసన సభ్యుడిగా ఎన్నిక కావాలని ప్రయత్నిస్తున్నారు. దిగ్గజాల్లాంటి ఈ నాయకులందరూ షరా మామూలుగా పార్టీ ఆదేశాన్ని పాటించవలసి వస్తోందంటున్నారు. ఇదంతాచూస్తే ఓటమి భయం బీజేపీలో ఎంతగా గూడు కట్టుకుందో రుజువు అవుతోంది. ఈ హడావుడిలో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేరు మాత్రం ఎక్కడా వినిపించడం లేదు. ఇంకా అనేక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించవలసి ఉన్న మాట వాస్తవమే అయినా ఆయనకు శాసనసభకు పోటీచేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అత్యంత ప్రీతి పాత్రంగా లాడ్లీ బాలిక పథకం ప్రవేశ పెట్టారు. సోమవారం మోదీ మధ్యప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహించినప్పుడు ఈ పథకం పేరైనా ప్రస్తావించకపోవడం చూస్తే శివరాజ్‌ సింగ్‌ మీద బీజేపీ కేంద్ర నాయకత్వానికి విశ్వాసం తగ్గుతోందనే అనిపిస్తోంది. మోదీ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తాము ప్రవేశపెట్టిన బిల్లు గురించి, ఇంకా అనేకానేక కేంద్ర పథకాల గురించి దండోరా వేసుకున్నారు తప్ప శివరాజ్‌ సింగ్‌ పథకాల ప్రస్తావనే తీసుకురాలేదు.
నరేంద్ర మోదీ సాధారంగా ఆశ్చర్య చకితులను చేసే నిర్ణయాలు ప్రకటిస్తుంటారు. ఈ ప్రకటనలకు అమిత్‌ షా పక్క వాద్యకారుడి పాత్ర నిర్వహిస్తారు. కానీ అంతమంది పార్లమెంటు సభ్యులను శాసనసభకు పోటీ చేయించడం ఆశ్చర్యచకితం చేయడంకాదని, ఓటమి భయమే దీనికి ప్రధాన కారణం అనిపిస్తోంది. మోదీ ప్రకటించిన అనేక ఆశ్చర్యకర నిర్ణయాలు, విధానాలు అనేకసార్లు బోర్లా పడ్డాయన్నది వాస్తవం. బీజేపీ పోటీకి నిలబెడుతున్న ఎంపీల వారసులు కూడా శాసనసభలో పోటీచేయాలని ఉత్సాహం ప్రదర్శించిన వారే. వీరి ఆశల మీద బీజేపీ కేంద్ర నాయకత్వం నీళ్లు చల్లింది. మోదీ, అమిత్‌ షా తీసుకున్న నిర్ణయాన్ని తరచి చూస్తే పోటీకి నిలబెడుతున్న ఈ హేమా హేమీలు తమ ప్రాంతాల్లో తిరుగులేని నాయకులు కనక మీరు ముందు అక్కడ శాసనసభ ఎన్నికలలో గెలిచి చూపించండి అని సవాలు విసిరినట్టుగా ఉంది. వీరు సీనియర్‌ నాయకులు కనక తమ నియోజకవర్గాల నుంచి ఎన్నిక కావడమే కాక పొరుగునఉన్న అభ్యర్థుల విజయానికి కూడా పూచీ పడవలసి ఉంటుంది. ఎంపీలను పోటీ చేయించడం బీజేపీ బలాన్ని కాక ఆరిపోవడానికి ముందు దీపం మరింత ప్రకాశవంతంగా వెలిగడంలా ఉంది. ఇంకా విచిత్రం ఏమిటంటే ఇంతవరకు ప్రకటించిన 78 నియోజకవర్గాలలో గెలిచిన మూడుస్థానాలలో కూడా బీజేెపీ అభ్యర్థులను మార్చేసింది. సోమవారం ప్రకటించిన 39 మంది అభ్యర్థులలో గతంలో పోటీచేసి ఓడిపోయిన 31 మందికి ఈసారి అభ్యర్థిత్వం దక్కలేదు. కిందటి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన కొందరికిమాత్రం మరోసారి అవకాశం ఇచ్చారు. దాదాపు నెల కింద 39 మందితో మొదటి జాబితా ప్రకటించిన తరవాత బీజేపీలో పెద్దఎత్తున నిరసన ధ్వనులు వినిపించాయి. అవి దౌర్జన్యకరంగా మారిన సందర్భాలూ ఉన్నాయి. అందుకే 40 వేలకన్న ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన వారికి కూడా మళ్లీ అవకాశం కల్పించి అసమ్మతి సెగలను ఆపాలన్నది బీజేపీ వ్యూహం కావచ్చు. అంటే ఘోరంగా ఓడిపోయిన అభర్థుల నుంచి ఎదురయ్యే అసమ్మతిని ఎదుర్కునే సామర్థ్యం కూడా బీజేపీలో కనిపించడంలేదు. అందుకే ఈ అభ్యర్థుల జాబితా బీజేపీ దయనీయ స్థితినే సూచిస్తోంది. బెంగాల్‌లో పార్లమెంటు సభ్యులను అసెంబ్ల్ల్లీకి పోటీచేయించి భంగపడ్డా బీజేపీ గుణపాఠం నేర్చుకున్నట్టులేదు. కానీ శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను పక్కనపెట్టే ధోరణి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మోదీ ఏకపాత్రాభినయమే కొనసాగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img