Friday, March 31, 2023
Friday, March 31, 2023

కొత్తసీసాలో చీప్‌లిక్కర్‌

కడతేరని కష్టాలెన్ని ఉన్నా..రాష్ట్రం పీకల్లోతు ఊబిలో కూరుకుపోయినా..అప్పులోళ్లు ఊపిరిసలపని విధంగా నెత్తిపై కూర్చొని నాట్యమాడుతున్నా…ముఖంపై బలవంతంగా నవ్వు పులుముకొని బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిదే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రబడ్జెట్‌ను నాలుగేళ్లలో ఐదో బడ్జెట్‌ను ఐదోసారి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఘనుడాయన. అదృష్టవశాత్తు, స్పీకర్‌ తమ్మినేని సీతారాం శాసనసభ వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారాలను మధ్యలో అధికారికంగా ఆపివేశారు కాబట్టి బతికిపోయాం. లేకుంటే, ‘బుగ్గన లెక్కలుజగన్‌ నవ్వులు’ ఆసాంతం తనివితీరా ఆంధ్రా ప్రజలు ఆస్వాదించలేక చచ్చేవాళ్లు. బడ్జెట్‌లో ఎక్కడా కొత్తదనం కన్పించదు, అంతా అంకెలగారడీ, గణాంకాల మాయ.. అసత్యాల చిట్టా..నాలుగేళ్లూ చెప్పిందేచెప్పి చెప్పిందేచెప్పి విసిగించి జనం ప్రాణాలు తోడేస్తున్నా..ముఖ్యమంత్రి వెనుక కూర్చున్న ఎమ్మెల్యేలు మాత్రం బల్లలు చరుస్తూనే వున్నారు. ఎందుకు చరుస్తున్నారో ఎవరికీ అర్థం కాదు, వారి రాక్షసానందం ఏంటో అంతుపట్టదు. బడ్జెట్‌లో ఏమీ లేదను కున్నప్పుడు పాతసీసాలో కొత్తసారాఅని చెపుతూవుంటారు. కానీ ఈసారి జగన్‌ ప్రభుత్వం ఎంతో భిన్నంగా సీసామార్చింది. కాకపోతే అందులో చీప్‌లిక్కర్‌ పోసింది. స్థూలంగా ఇదీ మన రాష్ట్రబడ్జెట్‌ 202324.
పాపం బుగ్గనకు అమరావతి ఎప్పుడూ కొత్తే. ఎందుకంటే ఆయన అసెంబ్లీ సమావేశాల సమయంలో, ముఖ్యంగా బడ్జెట్‌ సమయంలో తప్ప మిగతా కాలంలో దిల్లీ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ వుంటారు. ఇంత చేసి 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోగేసినా, ఈసారి రూ.2,79,279 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు ఆనందపడాలా? అప్పులో ఇంకా 6 లక్షల కోట్లు మిగిలిపోయినందుకు బాధపడాలా? జగన్‌ సర్కారు లోని మంత్రులంతా అబద్దాలను అందంగా చెప్పడంలో ఆరితేరిపోయారు. పైగా బుగ్గన గారు ఒకడుగు ముందుకేసి ‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు..నిద్రపోకుండా చేసేది’ అంటూ కలాం గారి కొటేషన్‌ను సభలో చెప్పి బీభత్సంగా చప్పట్లు కొట్టించుకున్నారు. 2022`23లో ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క ప్రాజెక్టులోనైనా కనీసం ఒక్క పార మట్టి ఎత్తిపోయలేదు, ఒక్క కాలేజీ కట్టలేదు, ఒక్క ఆసుపత్రి బాగుచేయలేదు, ఒక్క ఉద్యోగికీ సకాలంలో జీతం ఇవ్వలేదు. ఆ సమయంలో రెవిన్యూ లోటు రూ.29,107 కోట్లు, ద్రవ్యలోటు రూ.47,716 కోట్లు. ఇబ్బడి ముబ్బడిగా తెచ్చిన అప్పులేమైనట్లు? రాష్ట్ర ఆదాయం ఏమైనట్లు? పోనీ నవరత్నాలకేమైనా భారీగా ఖర్చుపెట్టారా అంటే అందులో ఐదు రత్నాలే నవనవలాడు తున్నాయి. మిగిలిన నాలుగు రత్నాలు పేలవంగా మారి, మసకబారి పోయాయి. పది వైఎస్సార్‌ పథకాలకు, మరో పది జగనన్న పథకాలకూ సుమారు 55 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ఇప్పటికే అమ్మఒడిని, ఆసరాను, కళ్యాణమస్తులను ఒక ఏడాది చొప్పున మింగేశారు. ఈ పథకాల లబ్ధి ఈసారి కొందరికైనా చేరుతుందని ఆశించాలి. అది కూడా ప్రభుత్వం విధించిన షరతులన్నింటినీ పాసవ్వాలి. సరికదా, ఈ నిధులను డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారులకే డబ్బులు ఇస్తున్నామని ఎన్నేళ్లు చెపుతారు? అసలు అందులో చాలా రంగాలకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఆ నిధుల శాతాన్ని వీరి లెక్కల్లో చూపించే నైతికత ప్రభుత్వానికి వుందా? కేంద్ర నిధులను దారిమళ్లించి, ‘వైఎస్సార్‌, జగనన్న’ పథకాల్లోకి నెట్టేసి జనం మనోభావాలతో ఎన్నాళ్లు ఆడుకుంటారు? మోదీకి మొక్కీమొక్కీ మ్యాచింగ్‌ గ్రాంట్లకు దిక్కేలేకుండా చేశారు.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి 7శాతం దాటిన పాపానపోలేదు. కానీ దాదాపు 14శాతం జీఎస్‌డీపీని చూపించుకుంటూ వున్నారు. అప్పులు పుట్టించు కోవడానికి ఇంతకు బరితెగించాలా? అసలు అప్పుల్లో ప్రత్యక్షమెంత? పరోక్షమెంత? వాటిపై శ్వేతపత్రం ప్రకటించే దమ్ము సర్కారుకుందా? ప్రతియేటా పేరుకే లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయింపులు ప్రకటించడం, వాస్తవానికి నాలుగవ వంతు కూడా ఖర్చుపెట్టకుండా ఉండటం జనాన్ని మోసం చేయడం కాదా? 6,81,000 ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటించి జబ్బలు చరుచుకున్నారు. నలుగురూ నవ్విపోరా! నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? గ్రామ సచివాలయ సిబ్బంది తప్ప! పేదలందరికీ ఇళ్లు పథకం కింద రూ.5,600 కోట్లు కేటాయించారు. చాలా సంతోషం! గత నాలుగేళ్లూ అటుఇటుగా ఇవే లెక్కలు చూపించారు. రాష్ట్రంలో ఒక్క లబ్దిదారుడైనా సొంత ఇంటిలోకి అడుగుపెట్టి, గృహప్రవేశం పేరుతో నలుగురికి పప్పన్నం పెట్టి సంబరం చేసుకున్న సందర్భం వుందా? ఈ స్కీము అతిపెద్ద స్కాము అని ఏనాడో అర్థమైపోయింది.
కులాల పేరుతో 54 కార్పొరేషన్లను ఏర్పాటు చేశామని హర్షధ్వానాల నడుమ అసెంబ్లీలో చెప్పుకున్నారు. ఇదంతా ‘పదవుల పందేరం’లో జరిగిన ఒక తంతు తప్ప ఆ కార్పొరేషన్ల కింద ఒక్కరికైనా స్వయం ఉపాధి కల్పించిన దాఖలాలు వున్నాయా? ఈ కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రబుగ్గ కార్లేసుకొని దందాలు చేసుకోవడం తప్ప తమ కులపోళ్లకు ఒక్క పైసా అయినా మంజూరు చేయించారా? ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ ప్రశ్నలకు బడ్జెట్‌లో ఒక్క సమాధానం కూడా లేదు.
సాధారణ బడ్జెట్‌ నుంచి వ్యవసాయ బడ్జెట్‌ను వేరుగా ప్రతిపాదించడం గొప్ప కాదు. మంచి కేటాయింపులతో, అభివృద్ధి చూపించి మీసం మెలేస్తే జగన్‌ ప్రభుత్వాన్ని చూసి హర్షించేవారు. రూ.41436.29 కోట్లతో వ్యవసాయ అనుబంధ బడ్జెట్‌ను అరకొరగా ప్రతిపాదించి, చేతులు దులిపేసుకున్నారు. నీటి వనరుల అభివృద్ధికి కేవలం రూ.11,908 కోట్లు మాత్రమే కేటాయించి వ్యవసాయాన్ని, సాగునీటి రంగాన్ని మరోసారి అవమానించారు. బడ్జెట్‌లో కనీసం 15శాతం నిధులను నీటిపారుదల రంగానికి కేటాయిస్తే, పోలవరం సహా పెండిరగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో కాస్తయినా కదలిక వుండేది. కానీ ఈనాడు కేవలం 5శాతం నిధులు కేటాయించి, ఆ రంగంపై జగన్‌ నిర్లక్ష్య ధోరణిని మరోసారి ప్రదర్శించారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు కేటాయించారు. గతంలోనూ ఇదే జరిగింది. కానీ ధరలు సామాన్యుడి నడినెత్తిన నరకం చూపిస్తున్నాయి. అంటే ఇవన్నీ కాగితాలకే పరిమితమన్నది విస్పష్టం. అవసరంలేని గడప గడప కార్యక్రమానికి రూ.530 కోట్లు ఎందుకు కేటాయించారో సర్వవిదితమే.
కొసమెరుపు ఏమిటంటే, బడ్జెట్‌ సమావేశాల్లో మీడియాకు బడ్జెట్‌కు సంబంధించిన ముద్రిత ప్రతులను ఇచ్చేవారు. ఈసారి చేతులెత్తేశారు. అంతేకాదు, బడ్జెట్‌ ప్రసంగానికి సంబంధించిన తెలుగు, ఆంగ్ల విభాగాలను ఒకే పుస్తకంలో కలిపి సమగ్ర విశ్లేషణ కోసం అందరికీ పంపిణీ చేసేవారు. ఈసారి ఒకే పుస్తకాన్ని రెండుగా, బహిరంగంగానే చించి ముక్కలు చేసి తెలుగు మీడియాకు తెలుగు పేజీలను, ఆంగ్ల మీడియాకు ఆంగ్ల పేజీలను అందజేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దౌర్భాగ్య పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు. హ్యాట్సాఫ్‌ టు జగన్‌ సర్కార్‌!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img