Friday, February 3, 2023
Friday, February 3, 2023

కోషియారీ కలహ ప్రియత్వం

గవర్నర్ల వ్యవస్థే అనవసరం అన్న వాదనలకు క్రమంగా బలం చేకూరుతున్న సమయంలో బీజేపీయేతర రాష్ట్రాలలో గవర్నర్లుగా ఉన్న బీజేపీ నాయకులు అదనపు ఆజ్యం అందిస్తున్నారు. రాజకీయ నిరుద్యోగులకు రాజ్‌ భవన్లు నిలయాలుగా మారాయని ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌ కుదురునుంచి వచ్చిన మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ కొత్త వివాదానికి తెరలేపారు. ఔరంగాబాద్‌ లో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి గౌరవ డాక్టొరేట్‌ ప్రదానంచేసిన సభలో పాల్గొన్న కోషియారీ శివాజీ గతకాలంలో ఎప్పుడో ఆరాధ్యుడు అయితే ఇప్పుడు మహారాష్ట్రలో అనేకమంది ఆరాధ్యులున్నారని అనడం పెద్ద వివాదానికి దారితీసింది. శివాజీ గత కాలానికి వీరుడని ఊరుకోకుండా ఈ కాలంలో ఆరాధ్యులు అంబేద్కర్‌ అన్నారు. అక్కడితోనూ ఆగలేదు కేంద్ర మంత్రి నితిత్‌ గడ్కరీని ఆకాశానికెత్తారు. అదే సభలో శరద్‌ పవార్‌నూ ప్రశంసలతో ముంచెత్తారు. అంటే కోషీయారీ ఎవరినైనా పొగిడినా వివాదమే అవుతుందన్నమాట. ఛత్రపతి శివాజీని మహారాష్ట్రలో విపరీతంగా ఆరాధిస్తారు. వీరుడు అంటారు. అలాంటి వ్యక్తి మీద కోషియారీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోయినా ఆయన ఇదివరకెప్పుడో ఆరాధ్యుడుఅనడం దుమారంరేపింది. మహారాష్ట్రలో ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్‌ నాయకుడు అజిత్‌ పవార్‌ కోషియారీ మీద మండిపడ్డారు. శివాజీని గవర్నర్‌ అంత మాట అంటే అధికారంలో ఉన్న ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలోని శివసేన ఎందుకు నోరువిప్పడం లేదని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం నాయకుడు, ఉద్ధవ్‌కు సన్నిహితుడు అయిన సంజయ్‌ రౌత్‌ విమర్శలు గుప్పించారు. ఒక ఏడాదికాలంలో గవర్నర్‌ శివాజీని నాలుగుసార్లు అవమానించారు అని రౌత్‌ లెక్కలుకూడా తీసి చెప్పారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శివాజీని అమితంగా ఆరాధిస్తారని, బీజేపీ అధికార ప్రతినిధి శివాజీ ఔరంగజేబ్‌కు అయిదుసార్లు క్షమాపణలు చెప్పారని బీజేపీ అధికార ప్రతినిధే చెప్పారని, అలాంటప్పుడు ఇదేనా బీజేపీ వైఖరిఅని రౌత్‌ నిలదీశారు. అయితే ప్రతిపక్ష నాయకుడు అజిత్‌పవార్‌ గవర్నర్‌ కోషియారీ ఆ పదవిలో కొనసాగాలో లేదో ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీ శివాజీని అపారంగా ఆరాధిస్తుంది. కోషియారీ గతంలో ఆ పార్టీ నాయకుడే. ప్రతిపక్షం విమర్శలు తీవ్రమైన తరవాత అధికారపక్షం కూడా రంగంలోకి దిగింది. సూర్యచంద్రులు ఉన్నంతకాలం శివాజీ ఆరాధ్యుడిగానే ఉంటారని ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ వ్యాఖ్యానించారు. పైగా శివాజీ ఒక్కడే ఆరాధ్యుడు అనే దాకా వెళ్లారు. అధికార పక్షమైన షిండేవర్గం శాసనసభ్యుడు సంజయ్‌ గైక్వాడ్‌ గవర్నరును తొలగించాలని కేంద్ర బీజేపీ నాయకులను కోరారు. శివాజీ ఆదర్శాలు ఎన్నటికీ కాలదోషం పట్టవని, ఆయనను ప్రపంచంలోని ఏ గొప్ప వ్యక్తితోనూ పోల్చడానికి వీలేలేదని గైక్వాడ్‌ చెప్పారు. గవర్నర్‌ కోషియారీకి ఈ ప్రాంత చరిత్ర తెలియదని, అలాంటి వ్యక్తిని గవర్నరుగా ఉంచకూడదని గైక్వాడ్‌ వాదించారు. కావాలంటే కోషియారీని మరే రాష్ట్రానికైనా పంపండి అని గైక్వాడ్‌ కేంద్ర బీజేపీ నాయకులను కోరారు. ప్రతిపక్షం గవర్నర్‌ తప్పుకోవాలంటే అధికారపక్షం శాసనసభ్యుడు గవర్నరును తొలగించానడం పోటీ రాజకీయా లకు పరాకాష్ఠ. నితిన్‌ గడ్కరి కూడా రెండురోజుల తరవాత పెదవి విప్పారు. ‘‘శివాజీ మహారాజ్‌ మా దేవుడు. మా తల్లిదండ్రులను ప్రేమించిన దానికన్నా ఎక్కువగా శివాజీని ఎక్కువ ఆరాధిస్తాం’’ అన్నారు. ఇది సమస్య సమస ిపోయేలా చేయడానికి బీజేపీ చేసిన ప్రయత్నమే అనుకోవాలి.
వివాదాలు రేపడం కోషియారీకి కొత్త కాదు. 2019లో మహారాష్ట్ర గవర్నరు అయినప్పటినుంచి ఆయన ఏదో ఓ వివాదానికి కారకులవు తున్నారు. మొన్నటి దాకా బీజేపీతో సరిపడని శివసేన, కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌తో కూడిన ఐక్య సంఘటన అధికారంలో ఉంది కనక, తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాలలో ప్రత్యర్థి పక్షాల ప్రభుత్వాలను ఇరుకున పెట్టడానికి గవర్నర్లు గీత దాటి మాట్లాడుతున్నారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి. నిజం చెప్పాలంటే ప్రభుత్వాధినేత ఏక్‌నాథ్‌ షిండే కావచ్చు. ఆయన నాయకుడైనా ఆధిపత్యం చెలాయిస్తున్నది బీజేపీనే. ఇలాంటి సందర్భంలో కూడా కోషియారి పదే పదే వివాదాలు రేకెత్తించడం ఆయన స్వభావం అనుకోవాలి. ఆయన కలహ ప్రియత్వ చిట్టా సుదీర్ఘమైంది. మహారాష్ట్ర నుంచి గుజరాతీలని, మార్వాడీలను తొలగిస్తే ముంబై దేశ ఆర్థిక రాజధానిగా మనలేదని కోషియారీ అనడం విమర్శలకు తావిచ్చింది. దీన్ని ఏకమొత్తంగా మహారాష్ట్రీయులను అవమానించడమే అన్నవారు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలోనే జ్యోతీబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే బాల్య వివాహం చేసుకున్నారనీ అప్పుడు సావిత్రిబాయి వయస్సు పదేళ్లనీ, ఫూలే ఆమెకన్నా పదమూడేళ్లు పెద్ద అనడం తీవ్ర విమర్శలకు గురైంది. అంతకు ముందు ఫిబ్రవరిలో ఛత్రపతి శివాజీకి సమర్థ రామదాసు గురువు అని కోషియారీ అనడం చాలా మందిని నొప్పించింది. శివాజీని పల్లెత్తు మాట అన్నా మహారాష్ట్రీయులు సహించరు. కరోనా సమయంలో గుళ్లు, గోపురాలు తెరిపించాలని అప్పటి ఠాక్రే ప్రభుత్వం మీద కోషియారీ ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది ఆయన మతతత్వ వాదనకు ప్రతీక. తాజాగా గడ్కరీని పొగిడే క్రమంలో ఆయన బీజేపీ నాయకత్వాన్నే ఇరుకున పెట్టారు. కిందటి సంవత్సరం ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లను నియమించడానికి గవర్నరుకు ఉన్న అధికారాలకు కత్తెరవేసింది. కేరళలో ఈ విషయంలో బిల్లులు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కోషియారీ అనుభవ శూన్యుడూ కాదు. ఆయన 2001-02లో ఉత్తరాఖండ్‌ రెండవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు మంత్రిగా పనిచేశారు. కొంతకాలం ఉత్తరాఖండ్‌ బీజేపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆరేళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు పిటిషన్ల కమిటీ చైర్మన్‌గా సైనికులకు సంబంధించి ‘‘ఒకే ర్యాంకు, ఒకే పింఛన్‌’’పై ఆయన నాయకత్వంలోనే నివేదిక సమర్పించింది.
హిమాలయ పర్వతశ్రేణుల్లోని రాష్ట్రాలలో రైలుమార్గాల గురించి పార్లమెంటుకు నివేదిక సమర్పించింది కూడా కోషియారీ నాయకత్వంలోనే. శివాజీ గురించి కోషియారీ వ్యక్తంచేసిన అభిప్రాయాన్ని శివాజీ వారసుడు, రాజ్యసభ సభ్యుడు ఛత్రపతి సంభాజీ రాజే కూడా దుయ్యబట్టారు. కోషియారీని గవర్నరుగా తొలగించాలని మోదీకి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను అని సంభాజీ తీవ్రంగానే స్పందించారు. తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండవలసిన గవర్నర్లు ఈ మధ్యకాలంలో విపరీత వైఖరి అనుసరిస్తున్నారు. ఇందులో కోషియారీ ఒంటరికాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img